ఎన్నికల నేపథ్యంలో ముందుగా ప్రకటించే అవకాశం
నేటితో ముగియనున్న ఇంటర్ మూల్యాంకనం
నాలుగు రోజుల్లో పదోతరగతి పేపర్లు కూడా పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యార్థులపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉండకూడదన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి 30 వరకు నిర్వహించింది. వెంటనే విద్యాశాఖ అధికారులు మూల్యాంకనం చేపట్టారు. ఇంటర్మీడియట్‌లో రెండు సంవత్సరాల విద్యార్థులు మొత్తం 9,99,698 మంది పరీక్షలు రాశారు.
వీరి జవాబుపత్రాల మూల్యాంకనం కోసం సుమారు 23 వేలమంది అధ్యాపకులను ఇంటర్ విద్యామండలి నియమించింది. పదో తరగతి పరీక్షలను 6,30,633 మంది రాశారు. వీరికి సంబందించిన 47,88,738 జవాబుపత్రాల వేల్యూయేషన్ కోసం 25 వేలమంది ఉపాధ్యాయులను నియమించి 26 జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. గతంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించి ఈ ఏడాది మూల్యాంకనం కేంద్రంలో గరిష్టంగా 900 మంది వేల్యూయేటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు.
గతేడాది ఏప్రిల్ 26న ఇంటర్, మే 6న టెన్త్ ఫలితాలు
షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం గురువారంతో ముగియనుంది. తరువాత పునఃపరిశీలన, మార్కుల నమోదు వంటి ప్రక్రియ నిర్వహించనున్నారు. అనంతరం ఈనెల 12వ తేదీ నాటికి ఇంటర్మీడియట్ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభమైన పదో తరగతి మూల్యాంకనం కూడా ఈనెల ఎనిమిదో తేదీ నాటికి పూర్తికానుంది.
ఈ ఫలితాలను సైతం వారం, పదిరోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. మూల్యాంకన ప్రక్రియలో ఎక్కువమంది సిబ్బంది నియామకం, టెక్నాలజీ వినియోగం, ప్రతి మూల్యాంకన కేంద్రానికి బోర్డు నుంచి ప్రత్యేక అధికారుల పరిశీలన వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం ఇంటర్మీడియట్, టెన్త్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తారు. 2022–23 విద్యాసంవత్సరంలో జరిగిన వార్షిక పరీక్షలకు సంబంధించి ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 26న, టెన్త్ ఫలితాలను మే 6వ తేదీన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment