SSC Exam Results Andhra Pradesh On 7th August - Sakshi
Sakshi News home page

7లోగా టెన్త్‌ ఫలితాలు

Published Tue, Aug 3 2021 3:06 AM | Last Updated on Tue, Aug 3 2021 1:23 PM

Tenth class exam results Andhra Pradesh on 7th August - Sakshi

సాక్షి, అమరావతి: పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈనెల 7వ తేదీలోగా వెల్లడించేందుకు ఎస్సెస్సీ బోర్డు ఏర్పాట్లు చేసింది. 2020–21 విద్యార్థుల ఫలితాలు, గ్రేడ్‌లతోపాటు 2019–20 టెన్త్‌ విద్యార్థులకు గ్రేడ్‌లు కూడా ప్రకటించనుంది. కోవిడ్‌ కారణంగా ఈ రెండు విద్యాసంవత్సరాల్లో పబ్లిక్‌ పరీక్షలను నిర్వహించని సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ సిఫార్సుల మేరకు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించి ఫలితాలు విడుదల చేయనున్నారు. హైపవర్‌ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం జీవో 46ను విడుదల చేసింది. ఫలితాలను గణించడానికి అనుసరించనున్న విధివిధానాలను అందులో వివరించింది. గ్రేడ్ల విధానంలో విద్యార్థుల ఉత్తీర్ణతను ప్రకటించనున్నారు. 2019–20 విద్యార్థులు రాసిన మూడు ఫార్మేటివ్‌ పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ,  ఒక సమ్మేటివ్‌ పరీక్ష మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. మొత్తం 100 మార్కులుగా  పరిగణనలోకి తీసుకుని గ్రేడ్‌ ఇస్తారు. అన్ని సబ్జెక్టులకు ఇదే విధానం అనుసరిస్తారు. వొకేషనల్‌ కోర్సుల విద్యార్థులకు కూడా ఇదే విధానం. 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిలై ఆ తరువాత పరీక్షలకు హాజరైనవారికి వారి ఇంటర్నల్‌ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. 20 అంతర్గత మార్కులను 5తో రెట్టింపుచేసి 100 మార్కులుగా పరిగణించి గ్రేడ్‌ ఇస్తారు.

2020–21 విద్యార్థులకు..
ఈ విద్యార్థులకు వారి ఫార్మేటివ్‌ పరీక్షల్లోని స్లిప్‌ టెస్టు మార్కులకు 70 శాతం వెయిటేజీ, ఇతర మూడు కాంపొనెంట్ల మార్కులకు 30 శాతం వెయిటేజీ ఇచ్చి గ్రేడ్లు ప్రకటిస్తారు. ఎవరైనా ఒక్కటే ఫార్మేటివ్‌ పరీక్ష రాసి ఉంటే ఆ మార్కులను పరిగణనలోకి తీసుకొని గ్రేడ్‌ ఇస్తారు. పరీక్షలకు హాజరైనా మార్కులు అప్‌లోడ్‌ కాని విద్యార్థుల విషయంలో వారికి కనీస పాస్‌ గ్రేడ్‌లను ప్రకటిస్తారు. వొకేషనల్‌ విద్యార్థులకు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారు. గతంలో ఫెయిలై ఇప్పుడు పరీక్షలకు రిజిస్టర్‌ అయిన వారికి వారి టెన్త్‌ 20 అంతర్గత మార్కులను అయిదుసార్లు రెట్టింపు చేసి ఫలితాలను ప్రకటిస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement