సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఈసారి రికార్డు స్థాయి ఉత్తీర్ణత నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చాక ఎన్నడూ లేనివిధంగా 92.43% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇప్పటివరకు టెన్త్‌లో 90 శాతంలోపే ఉత్తీర్ణత నమోదవుతూ వచ్చింది. ఇంటర్ ఫలితాల్లో తప్పుల నేపథ్యంలో టెన్త్‌లో వ్యాల్యుయేషన్, ఫలితాల ప్రాసెసింగ్‌లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో పొరపాట్లు లేకుండా ఫలితాలను వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. జూన్ 10 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. సోమవారం సచివాలయం డీ బ్లాక్‌లో టెన్త్ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో పాఠశాల విద్య కమిషనర్ విజయ్ కుమార్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్, పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మార్చి 16 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగిన టెన్త్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,52,280 మంది విద్యార్థులు (రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు) దరఖాస్తు చేసుకోగా వారిలో 5,46,728 మంది పరీక్షలకు హాజరయ్యారు. అందులో రెగ్యులర్ విద్యార్థులు 5,06,202 మంది ఉండగా వారిలో 4,67,859 మంది (92.43 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 40,526 మంది పరీక్షలకు హాజరుకాగా వారిలో 22,910 మంది (56.53 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గతేడాది వార్షిక పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 5,01,732 మంది హాజరు కాగా అందులో 4,20,365 మంది (83.78 శాతం) పాసయ్యారు. ఇక ఈసారి పరీక్షల్లో బీసీ సంక్షేమ గురుకులాలు అత్యధిక ఉత్తీర్ణత సాధించాయి. రెండో స్థానంలో విద్యాశాఖ గురుకులాలు నిలవగా మోడల్ స్కూళ్లు మూడో స్థానాన్ని సాధించాయి. ప్రభుత్వ పాఠశాలలు చివరి స్థానంలో ఉన్నాయి.
బాలురకంటే బాలికలదే ఎక్కువ ఉత్తీర్ణత...
టెన్త్ పరీక్షల్లో ఎప్పటిలాగే బాలురకంటే బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో బాలురు 2,54,551 మంది పరీక్షలకు హాజరుకాగా 2,32,109 మంది (91.18%) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 2,51,651 మంది పరీక్షలకు హాజరవగా 2,35,750 మంది (93.68%) ఉత్తీర్ణులయ్యారు. గతేడాది బాలురు 82.46% ఉత్తీర్ణులవగా బాలికలు 85.14% మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థుల్లోనూ బాలికలే ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో బాలురు 25,457 మంది ఉండగా వారిలో 13,657 మంది (53.65%) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 15,069 మంది పరీక్షలకు హాజరుకాగా 9253 మంది (61.40%) పాసయ్యారు.
మళ్లీ జగిత్యాలే ఫస్ట్..
ఈసారి కూడా పదో తరగతి పరీక్షల్లో జగిత్యాల జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది. గతేడాది 97.56 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లానే మొదటి స్థానాన్ని సంపాదించింది. ప్రస్తుతం జరిగిన వార్షిక పరీక్షలకు జగిత్యాల జిల్లాలో 13,197 మంది హాజరవగా 13,162 మంది (99.73 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే 99.33 శాతంతో సిద్దిపేట రెండో స్థానంలో నిలవగా 98.38 శాతంతో కరీంనగర్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. అయితే హైదరాబాద్ జిల్లా మాత్రం 83.09 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానానికి పరిమితమైంది. హైదరాబాద్‌లో 70,173 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా అందులో 58,306 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
గురుకులాలు, మోడల్ స్కూళ్లు టాప్...
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో గురుకులాలు, మోడల్ స్కూళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల కంటే ప్రస్తుతం గురుకులాల సంఖ్య భారీగా పెరగడం, వాటిల్లోని విద్యార్థులు ఎక్కువ ఫలితాలను సాధించడంతో ఉత్తీర్ణత శాతం అధికంగా నమోదైందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉత్తీర్ణత శాతం పెరుగడంతో ఈసారి అధిక శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెబుతున్నారు. గతేడాది బీసీ సంక్షేమ గురుకులాలు 96.18 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా ఈసారి ఉత్తీర్ణత శాతం పెంచుకొని 98.78 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానాన్ని పదిలపరచుకుంది. గతేడాది విద్యాశాఖ గురుకులాలు 94 శాతం ఉత్తీర్ణత సాధిస్తే ఈసారి 98.54 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచాయి. ఇలా అన్ని గురుకులాలతోపాటు ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లోనూ ఉత్తీర్ణత శాతం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment