శుక్రవారం సచివాలయంలో పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తున్న మంత్రి కడియం శ్రీహరి. చిత్రంలో రాజీవ్ రంజన్ ఆచార్య, కిషన్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే టాప్‌గా నిలిచారు. బాలురు 82.46 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 85.14 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ఈసారి 83.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక టెన్త్ ఫలితాల్లో సాంఘిక సంక్షేమ, విద్యాశాఖ గురుకులాలు, మోడల్ స్కూళ్లు అధిక శాతం ఉత్తీర్ణత సాధించాయి. పలు ఇతర ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మంచి ఫలితాలను సాధించాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం సచివాలయంలో పదో తరగతి పరీక్ష ఫలితాలను వెల్లడించారు.
తగ్గిన ఉత్తీర్ణత..
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 5,34,726 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో రెగ్యులర్ విద్యార్థులు 5,01,732 మందికాగా.. 32,994 మంది ప్రైవేటుగా పరీక్షలు రాశారు. రెగ్యులర్ విద్యార్థుల్లో మొత్తంగా 83.78 శాతం మంది ఉత్తీర్ణులుకాగా.. బాలురు 82.46 శాతం, బాలికలు 85.14 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. గతేడాది మొత్తం ఉత్తీర్ణత 84.15 శాతం కావడం గమనార్హం.
21 స్కూళ్లలో జీరో..
రాష్ట్రవ్యాప్తంగా 2,125 పాఠశాలలు ఈసారి 100 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. అందులో 1,225 ప్రైవేటు పాఠశాలలు ఉండగా.. మరో 900 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు, గురుకులాలు ఉన్నాయి. ఇక 21 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. అందులో 11 ప్రైవేటు పాఠశాలలు ఉండగా, 3 ఎయిడెడ్, 3 జెడ్పీ, 2 ఆశ్రమ పాఠశాలలు, ఒక ప్రభుత్వ, ఒక ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. మొత్తంగా రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు కలిపి ఫెయిలైన వారి సంఖ్య 1,07,898 కావడం గమనార్హం.
బీసీ గురుకులాల ముందంజ
టెన్త్ ఫలితాల్లో సాంఘిక సంక్షేమ గురుకులాలు 96.18 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత సాధించాయి. రెండో స్థానంలో విద్యాశాఖ గురుకులాలు, మూడో స్థానంలో మోడల్ స్కూళ్లు నిలిచాయి. గిరిజన సంక్షేమ గురుకులాలు మినహా అన్ని గురుకులాలు రాష్ట్ర సగటు కంటే అధిక ఉత్తీర్ణత సాధించాయి.
జగిత్యాల జిల్లా టాప్..
జిల్లాల వారీగా ఫలితాలను చూస్తే జగిత్యాల జిల్లా 97.56 శాతం అత్యధిక ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది కూడా 97.35 శాతంతో జగిత్యాల జిల్లాయే తొలిస్థానంలో నిలవడం గమనార్హం. ఇక ఈసారి 94.03 శాతం ఉత్తీర్ణతతో కరీంనగర్ రెండో స్థానంలో నిలిచింది. కేవలం 51.94 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది.
పది రోజుల్లో మార్కుల జాబితాలు
సబ్జెక్టుల వారీగా విద్యార్థుల మార్కుల వివరాలను సంబంధిత పాఠశాలకు పదిరోజుల్లో పంపిస్తామని అధికారులు వెల్లడించారు. ఉత్తీర్ణులైన విద్యార్థుల పాస్ సర్టిఫికెట్లను కూడా పంపిస్తామని.. ఆ సర్టిఫికెట్‌తో ఇంటర్‌లో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. కొందరు విద్యార్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టామని, వారికి సంబంధించి నిర్ణయాన్ని త్వరలో పాఠశాలలకు వివరిస్తామని చెప్పారు.
4,768 మందికి 10/10 జీపీఏ
టెన్త్ ఫలితాల్లో పదికి పది గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ)ను 4,768 మంది విద్యార్థులు సాధించారు. గతేడాది 2,427 మంది విద్యార్థులకే 10/10 జీపీఏరాగా.. ఈసారి అదనంగా 2 వేల మంది సాధించారు. మరో 7,115 మంది విద్యార్థులు 9.8 జీపీఏ సాధించగా, 9,042 మంది 9.7 జీపీఏ, 31 మంది 9.6 జీపీఏ, 10,720 మంది 9.5 జీపీఏ సాధించారు.
గత రెండేళ్లలో రెగ్యులర్ విద్యార్థుల ఫలితాలు..
వివిధ మేనేజ్‌మెంట్ల వారీగా టెన్త్ ఫలితాల తీరు..
గణితంలోనే ఎక్కువ మంది ఫెయిల్
టెన్త్ పరీక్షల్లో గతేడాదిలాగే ఈసారి కూడా గణితం సబ్జెక్టులోనే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. 4,43,256 మంది విద్యార్థులు గణితం పరీక్షలు రాయగా.. 88.37 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గణితం తర్వాత ఎక్కువ మంది సామాన్య శాస్త్రంలో ఫెయిలయ్యారు.
సబ్జెక్టుల వారీగా పరీక్షలకు హాజరైన వారు, ఉత్తీర్ణత శాతం
ఇంగ్లిష్ మీడియంలో అధిక ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో తెలుగు మీడియం విద్యార్థుల కంటే ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా పదో తరగతి ఉత్తీర్ణత 83.78 శాతంకాగా.. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు 88.96 శాతం, తెలుగు మీడియం విద్యార్థులు 75.37 శాతం ఉత్తీర్ణులయ్యారు. అంటే 13 శాతం అధిక ఉత్తీర్ణత నమోదైంది. ఇంగ్లిష్ మీడియంలో గతేడాది 88.33 శాతం ఉత్తీర్ణులుకాగా.. ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. అటు తెలుగు మీడియంలో గతేడాది 78.66 శాతం పాస్‌కాగా.. ఈసారి ఉత్తీర్ణతా శాతం తగ్గింది.
మీడియం వారీగా ఉత్తీర్ణత వివరాలు
Comments
Please login to add a commentAdd a comment