‘పది’ స్థానం మారేనా?  | Today Telangana Tenth Results | Sakshi
Sakshi News home page

‘పది’ స్థానం మారేనా? 

Published Mon, May 13 2019 8:27 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Today Telangana Tenth Results - Sakshi

పదో తరగతి ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. దీంతో జిల్లా స్థానం ఈసారైన ‘పది’లో మారనుందా లేదా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. రెండేళ్లుగా జిల్లా రాష్ట్రంలో చివరి స్థానంలో నిలువగా ఈసారైన స్థానం మార్చాలని విద్యాశాఖ అధికారులు మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఉపాధ్యాయుల కొరత, విద్యావలంటీర్లతో బోధన కొనసాగిస్తుండడం పది ఫలితాలపై ప్రభావం చూపుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఆదిలాబాద్‌టౌన్‌: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో జిల్లా వెనుకబడుతూనే ఉంది. గతేడాది రాష్ట్రంలో జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఈ సారైనా టాప్‌–10లోకి వస్తుందని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రు. 2017–18 సంవత్సరంలో 28వ స్థానం, 2016–17, 2014–15, 2013–14లో రాష్ట్రస్థాయిలో చివరి స్థానాల్లో నిలిచింది. 2015–16లో కొంత మెరుగుపడినా ఆ తర్వాత అవే ఫలితాలు వస్తున్నాయి. ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో కొంత మెరుగు పడుతున్నప్పటికీ ఎస్సెస్సీలో మాత్రం చివరి స్థానాలే దక్కుతున్నాయి. సోమవారం పదో తరగతి ఫలితా లను విద్య శాఖ కమిషనర్‌ ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నారు. దీంతో విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఈసారైనా మెరుగుపడేనా..
గతేడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లా అదమ స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే. 51.94 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 2016–17 సంవత్సరంలో 71.15శాతం కాగా, గతేడాది 19.21 శాతం ఉత్తీర్ణత తగ్గింది. సగం మంది విద్యార్థులు ఫెయిలైయ్యారు. గణితం, ఫిజికల్‌ సైన్స్‌లో 3వేలకు పైగా విద్యార్థులు ఫెయిలైయ్యారు. ఈసారి జిల్లాలో 13,576 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 10,098 మంది పరీక్షలకు హాజరుకాగా గతంలో ఫెయిలైన విద్యార్థులు 3,478 మంది పరీక్షలు రాశారు. అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్‌ జిల్లా చదువుల పరంగా వెనుకబడి పోతోంది. ప్రతియేడాది పాఠశాల ప్రారంభ సమయంలో, పరీక్షల కంటే ముందు విద్యశాఖ అధికారులు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చుతున్నారు. అయినప్పటికీ ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు.
 
ఖాళీల కొరతతోనే..
పదో తరగతి ఫలితాలు తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. టీఆర్‌టీ ఫలితాలు విడుదల చేసినప్పటికీ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడం లేదు. విద్యావలంటీర్లతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో విద్యార్థులకు సరైన విద్యాబోధన సాగడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొంతమంది ఉపాధ్యాయులు పాఠశాల విధులకు డుమ్మా కొట్టడం, పాఠశాలకు వచ్చినా విద్యాబోధన చేయకపోవడంతో ఈ ప్రభావం విద్యార్థుల చదువులపై పడుతోందనే ఆరోపణలు లేకపోలేదు. జిల్లాలోని 18 మండలాల్లో ఒక్కరు కూడా రెగ్యులర్‌ ఎంఈఓలు లేరు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలుగా అదనపు బాధ్యతలు అప్పజెప్పడంతో వారు ఎంఈఓ కార్యాలయానికే పరిమితం అవుతున్నారు. పాఠశాలల్లోని సీనియర్‌ ఉపాధ్యాయులకు హెచ్‌ఎం బాధ్యతలు అప్పగిస్తుండడంతో పాఠశాలల్లో విద్యా వ్యవస్థ గాడి తప్పుతోంది. ఉప విద్యాధికారులు కూడా రెగ్యులర్‌ లేరు. దీంతో పర్యవేక్షణ లోపంతో కొన్నేళ్లుగా ఫలితాలపై ప్రభావం చూపుతోంది. ఈసారైనా పది ఫలితాలు మెరుగుపడతాయో లేదో వేచి చూడాల్సిందే.

పడిపోతున్న ఫలితాలు..
జెడ్పీ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, కేజీబీవీ, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ముఖ్యంగా పదో తరగతి ఫలితాలు తగ్గుతూ వస్తున్నాయి. రెసిడెన్షియల్‌ పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లలో కొంత ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. గతేడాది జిల్లాలో కేవలం ఇద్దరు ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన విద్యార్థులు మాత్రమే పది జీపీఏ గ్రేడ్‌ సాధించారు. ఈసారి కనీసం 20 మంది అయినా పది జీపీఏ ఫలితాలు సాధిస్తారని విద్య శాఖాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తమ ఫలితాలు సాధిస్తాం...
గతంకంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తాం. జిల్లా రాష్ట్రస్థాయిలో టాప్‌–10లో ఉంటుందని భావిస్తున్నాం. పది ఫలితాలు మెరుగుపర్చేందుకు జూన్‌ నుంచే పది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాం. ఫెయిలైన విద్యార్థులు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దు. జీవితంలో మార్కులు ప్రామాణికం కాదు. పదో తరగతిలో తక్కువ మార్కులు సాధించిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర విద్యార్థులతో పిల్లల్ని మార్కుల పరంగా పోల్చకూడదు.  – ఎ.రవీందర్‌రెడ్డి, డీఈవో, ఆదిలాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement