వికటించిన ‘నారాయణ’ మంత్రం..? | SSC result: Pass percentage decreases in GVMC schools | Sakshi
Sakshi News home page

వికటించిన ‘నారాయణ’ మంత్రం..?

Published Wed, May 15 2019 9:01 AM | Last Updated on Wed, May 15 2019 9:06 AM

SSC result: Pass percentage decreases in GVMC schools - Sakshi

సాక్షి, విశాఖ సిటీ: జీవీఎంసీకి వచ్చిన ప్రతిసారీ మున్సిపల్‌ స్కూల్స్‌లో నారాయణ మెటీరియల్‌తో విద్యార్థులను చదివిస్తున్నాం.. ఈ సారి శతశాతం ఫలితాలు వస్తాయని ఊదరగొట్టిన మంత్రి నారాయణ.. ఉన్న పరువు తీసేశారు. గత విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలు కనబరిచిన జీవీఎంసీ హైస్కూల్స్‌పై మంత్రి కార్పొరేట్‌ రుద్దుడు ఉత్తీర్ణత శాతాన్ని తగ్గించేసింది. కార్పొరేషన్‌ పాఠశాలలు పదో తరగతి ఫలితాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. 2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పోలిస్తే జీవీఎంసీ పాఠశాలల విద్యార్థులే ఎక్కువ మంది 10 పాయింట్లు సాధించారు. ఈ సారి 100 మంది విద్యార్థులకు 10కి 10 పాయింట్లు సాధించడమే లక్ష్యంగా జీవీఎంసీ ప్రత్యేక కార్యచరణను రూపొందించుకుంది. అయితే మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ రంగ ప్రవేశం చేసి మొత్తం వ్యవస్థను మార్చేశారు.

‘మా నారాయణ స్కూల్‌లో కరిక్యులమ్‌ భిన్నంగా ఉంటుంది. దాన్ని చదివితే విద్యార్థులకు 10కి 10 పాయింట్లు గ్యారెంటీ..’ అంటూ.. ఎప్పటికప్పుడు జీవీఎంసీలో సమీక్షలు నిర్వహించి ఉపన్యాసాలు ఇచ్చేవారు. మంత్రి ఆదేశాల్ని పాటించిన విద్యాశాఖాధికారులు దాదాపు నారాయణ స్టడీ మెటీరియల్‌నే పేరు మార్చి మున్సిల్‌ స్కూళ్ల విద్యార్థులతో బట్టీ పట్టించారు. 100 శాతం ఫలితాలు మాట అటుంచితే చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన గతేడాదితో పోలిస్తే స్వల్పంగా ఉత్తీర్ణత శాతం తగ్గడంతో జీవీఎంసీ విద్యాశాఖ ఊపిరి పీల్చుకుంది.

ఉత్తీర్ణతతో పాటు 10 పాయింట్లూ తగ్గాయి
మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో 27 హైస్కూల్స్‌ ఉన్నాయి. ఇందులో 1907 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి చదవగా.. 1903 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 868 మంది బాలురు, 1035 మంది బాలికలున్నారు. వీరిలో 91.75 శాతంతో 1746 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 796 మంది బాలురు, 950 మంది బాలికలు పాసయ్యారు. 157 మంది ఫెయిల్‌ అయ్యారు. 2017–18 విద్యా సంవత్సరంలో 92.67 ఉత్తీర్ణత శాతం ఉండగా, ఈ ఏడాది 0.92 శాతం తగ్గింది. దీంతో పాటు గతేడాది 39 మంది విద్యార్థులు 10 పాయింట్లు సాధించగా ఈ ఏడాది ఆ సంఖ్య కూడా తగ్గి 31కి దిగజారింది.

4 పాఠశాలల్లో శతశాతం ఉత్తీర్ణత
గతేడాది 2 పాఠశాలలు మాత్రమే 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ సారి ఆ సంఖ్య నాలుగుకి చేరింది. అనకాపల్లిజోన్‌ పరిధిలోని గాంధీనగరం హైస్కూల్, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ హైస్కూల్, భీమిలి జోన్‌లోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ హైస్కూల్, పీఎన్‌ఎం హైస్కూల్‌లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. నాలుగు స్కూల్స్‌లో బాలురు, 8 స్కూల్స్‌లో బాలికలు 100 శాతం పాసయ్యారు. ఎంజీఎం హైస్కూల్‌ 73.33 శాతంతో అట్టడుగున నిలిచింది. 14 పాఠశాలలు 90 శాతానికి పైగా, 9 స్కూల్స్‌ 70 శాతానికి పైగా ఫలితాలు సాధించాయి. అయితే గతేడాది 9.8 జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్య 29 కాగా ఈ సారి ఏకంగా 40 మందికి చేరడం విశేషం.

మంత్రి చలవతోనే బెడిసి కొట్టాయి..
2016–17 విద్యా సంవత్సరంలో కేవలం 7గురు విద్యార్థులు మాత్రమే 10 పాయింట్లు సాధించడంతో.. 2017–18–లో 40 మంది విద్యార్థులకు ఆ సంఖ్య చేరుకోవాలని కార్పొరేషన్‌ ప్రణాళికలు రూపొందించింది. దీనికి అనుగుణంగా ప్రత్యేకమైన స్టడీ మెటీరియల్‌ తయారు చేసి, విద్యార్థులకు అందించడంతో 39 మంది విద్యార్థులు 10 పాయింట్లు సాధించారు. ఈ ఏడాది మాత్రం మంత్రి నారాయణ సూచనలకనుగుణంగా బో ధన సాగడంతో ఫలితాల్లో చతికిలపడ్డామంటూ జీవీఎంసీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement