Visakha city
-
ప్రాణం ఉన్నంతవరకూ జగనన్న వెంటే..
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అమితమైన ప్రేమ.. ప్రాణమున్నంతవరకు జగనన్న వెంటే నడుస్తానని ఆ పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ ఎప్పుడూ తనకు అన్యాయం చేయలేదని, ఎప్పటిలాగే పార్టీ కోసం, జగనన్న కోసం సైనికుడిలా పనిచేస్తానన్నారు. జీవీఎంసీ మేయర్ పదవి దక్కలేదన్న కోపంతో పార్టీ నగర అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తున్నట్టు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు నమ్మవద్దని కోరారు. ఫేక్ అకౌంట్‌తో వివాదాస్పద పోస్టింగ్‌లు కొంతమంది నా పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వైఎస్సార్ సీపీపై వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టింగ్‌లు పెడుతున్నారని, అలా చేసిన వారిపై పోలీస్‌లకు ఫిర్యాదు చేస్తానని వంశీకృష్ణ శ్రీనివాస్ హెచ్చరించారు. పార్టీకి, నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. తల్లి వంటి పార్టీని, పెద్దల ప్రతిష్టకు భంగం కల్గించే చర్యలను పూర్తిగా ఖండిస్తున్నానని వంశీకృష్ణ పేర్కొన్నారు. చదవండి: నమ్మించి నట్టేట ముంచారు.. టీడీపీ ఎమ్మెల్యేపై గుస్సా తిరుపతి ఉప పోరు: ‘ఆ ది’శగా అరాచకాలకు కుట్ర! -
విశాఖ సీపీగా మనీష్‌కుమార్ సిన్హా బాధ్యతలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గా మనీష్ కుమార్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పోలీస్ కమిషనరేట్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఇప్పటి వరకు సీపీగా పని చేసిన రాజీవ్ కుమార్ మీనా నుంచి మనీష్ కుమార్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. 2000 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన మనీష్ కుమార్ ఇప్పటి వరకు ఇంటిలిజెన్స్ ఛీఫ్ గా పనిచేశారు. డీసీపీలు ఐశ్వర్య రస్తోగి, సురేష్ బాబు, ఇతర పోలీస్ అధికారులు కొత్త సీపీని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. మెరుగైన సేవలు అందిస్తాం: మనీష్ కుమార్ సిన్హా బాధ్యతలు చేపట్టిన అనంతరం సీపీ మాట్లాడుతూ విశాఖపట్నం చాలా ప్రశాంత నగరం అని, అదే ప్రశాంతత కొనసాగించే విధంగా ముందుకెళ్తామన్నారు. నగరంలో పోలీస్ మ్యాన్ పవర్, మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. గతంలో ఎలాంటి సేవలు అందించారో అలాంటి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. అక్రమార్కులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు. ప్రజల సహకారం మరువలేనిది: ఆర్కే మీనా మాజీ సీపీ ఆర్కే మీనా మాట్లాడుతూ ఏడాది పాటు విశాఖ లాంటి ప్రశాంతనగరంలో పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపారు. విశాఖ ప్రజలు అందించిన సహకారం మరువలేనిదన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన బాధాకరమన్నారు. -
5 స్టార్ జస్ట్ మిస్!
సాక్షి, విశాఖపట్నం: చెత్త రహిత నగరాల జాబితాలో కేవలం 16 పాయింట్ల తేడాతో విశాఖ నగరం 5 స్టార్ రేటింగ్ కోల్పోయింది. సవరించిన గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్స్ జాబితాలో సింగిల్ స్టార్ నుంచి త్రీస్టార్ రేటింగ్ సాధించిన విశాఖ నగరం.. తృటిలో 5 స్టార్ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. మొత్తం మూడు విభాగాల్లో కలిపి 225 పాయింట్లు రావాల్సి ఉండగా.. విశాఖ నగరం 209 పాయింట్లకే పరిమితమైంది. దీంతో త్రీస్టార్ రేటింగ్‌కే పరిమితమైపోయింది. మాండేటరీ విభాగంలో 85 పాయింట్లకు గాను 84, ఎసెన్షియల్‌లో 80కి 70, డిజైరబుల్ విభాగంలో 60 పాయింట్లు రావాల్సి ఉండగా 55 పాయింట్లు విశాఖ నగరానికి దక్కాయి. దీంతో 5 స్టార్ రేటింగ్ రానప్పటికీ 3 స్టార్ సాధించిన నగరాల జాబితాలో విశాఖ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 72 నగరాలు 3 స్టార్ సాధించగా.. విశాఖ మొదటి స్థానంలో, తిరుపతి, విజయవాడ నగరాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. తిరుపతి నగరానికి విశాఖ కంటే 4 పాయింట్లు ఎక్కువ వచ్చినప్పటికీ.. కీలక విభాగాల్లో జీవీఎంసీ మెరుగైన స్థానంలో నిలవడంతో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. కొన్ని విభాగాల్లో 50 పాయింట్లు మాత్రమే సాధించడంతో 5 స్టార్ ర్యాంకింగ్ కోల్పోయినట్లు జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, అదనపు కమిషనర్ వి.సన్యాసిరావు, సీఎంహెచ్వో డా.కేఎల్ఎస్జీ శాస్త్రి తెలిపారు. గ్రీవెన్స్ పరిష్కారం, ప్లాస్టిక్ నిషేధం, కాల్వల స్రీ్కనింగ్, తడిచెత్త ప్రాసెసింగ్, డంప్‌సైట్ రెమిడియేషన్ పద్ధతుల్లో 50 చొప్పున పాయింట్లు మాత్రమే సాధించడంతో 5 స్టార్ రేటింగ్ సాధించుకోవడంలో విఫలమయ్యామని కమిషనర్ వివరించారు. అయితే తొలి జాబితాలో సింగిల్ స్టార్‌కు పరిమితమైన సమయంలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ విభాగంలో సున్నా మార్కులు వేశారని.. తాజాగా సవరించిన మార్కుల జాబితాలో 100 మార్కులు సాధించినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది కచ్చితంగా 5 స్టార్ రేటింగ్ సాధిస్తామని సృజన దీమా వ్యక్తం చేశారు. -
‘మహా’ బడ్జెట్..!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలోని 72 వార్డుల ప్రజల్నీ మెప్పించేలా వార్షిక పద్దు తయారు చేసేందుకు మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి స్మార్ట్ సిటీ మహా బడ్జెట్ సిద్ధమవుతోంది. గతేడాది కంటే ఎక్కువ అంచనాలతోనే వార్షిక బడ్జెట్‌ను అధికారులు తయారు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు అన్ని ప్రాంతాల వారికీ అందేలా.. అంచనాలు వండి వారుస్తున్నారు. 2019–20 ఆర్ధిక సంవత్సరానికి 3,740.65 కోట్ల రూపాయలతో బడ్జెట్ తయారు చెయ్యగా.. 2020–21 ఆర్థిక సంవత్సరానికి రూ.3,950 కోట్లతో జంబో పద్దు రానుంది. స్మార్ట్ విశాఖను క్లీన్ సిటీగా, సకల సౌకర్యాల నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపైసా ఖర్చు చేసేలా యంత్రాంగం లెక్కలు వేస్తోంది. నగరాభివృద్ధి, ప్రాజెక్టులకు పెద్దపీట.. మహా విశాఖ నగర పాలక సంస్థ 2020–21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తయారీలో కమిషనర్ జి.సృజన ఆచితూచి వ్యవహరిస్తూ వాస్తవ ఆదాయానికి అనుగుణంగా ఉండేలా రూపొందించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆ«ర్థిక రాజధానిగా చలామణి అవుతున్న విశాఖ నగరం అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా... అన్ని ప్రాంతాలలో, అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం భారీ కేటాయింపులతో కూడిన బడ్జెట్ తయారవుతోంది. ప్రస్తుత ప్రారంభ నిల్వగా రూ.95 కోట్లు ఉండనుంది. ఇంజినీరింగ్ విభాగానికి సుమారు రూ.1200 కోట్లు, ప్రజారోగ్యానికి రూ.450 కోట్లు, యూసీడీకి రూ.300 కోట్లు, నీటి సరఫరా విభాగానికి రూ.300 కోట్లు, విద్యకు రూ.100 కోట్లు, ప్రాజెక్టులకు రూ.300 కోట్లు, స్మార్ట్ సిటీకి రూ.300 కోట్లు, లైటింగ్‌కు రూ.100 కోట్లు, పార్కులు, హరిత అభివృద్ధికి రూ.75 కోట్లు... వంతున మొత్తం రూ.3,800 కోట్లు ఖర్చులకు కేటాయించారు. ప్రజలపై భారం లేకుండా.. ప్రజలపై ఎలాంటి పన్నుల భారం మోపకుండా ఎక్కువగా వచ్చే ఆదాయ మార్గాలపై జీవీఎంసీ దృష్టిసారించింది. 010 పద్దు పరిధిలోకి రావడంతో, ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు ఏటా వెచ్చించే రూ.250 కోట్లు మిగులుతోంది. ఈ మొత్తాన్ని మౌలిక సదుపాయాల కోసం వినియోగించాలని గ్రేటర్ అధికారులు నిర్ణయించారు. అదేవిధంగా ఖాళీ స్థలాల పన్నులు, ప్రొఫెషనల్ ట్యాక్స్‌లు, మొండి బకాయిలపై దృష్టి సారించి.. వాటి వసూళ్లని వేగవంతం చేసుకొని కార్పొరేషన్ ఖజానాని నింపాలని భావిస్తున్నారు. మొండి బకాయిలు, ఇతర పన్నుల ద్వారా ఏటా వచ్చే ఆదాయం కాకుండా అదనంగా మరో రూ.100 కోట్లు రాబట్టుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆదాయం వృద్ధి రేటు 20 శాతం కంటే ఎక్కువగా ఉండేందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయి. నీటి సరఫరా ద్వారా సుమారు రూ.200 కోట్లు, టౌన్‌ప్లానింగ్ ద్వారా రూ.150 కోట్లు, ఆస్తిపన్ను నుంచి రూ.350 కోట్లు, ఇతర పన్నులు మరో రూ.100 కోట్లు రాబట్టుకోనున్నారు. దీనికి తోడు గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు నిర్దేశించిన విధంగా రూ. 100 కోట్ల వరకూ రుణాల్ని జీవీఎంసీ పొందనుంది. అదేవిధంగా విశాఖ చెన్నై కారిడార్ కు సంబంధించి రూ.150 కోట్లు, ఏడీబీ రూ.100 కోట్లు, ఎస్సీఎస్పీ నుంచి రూ.100 కోట్లు, టీఎస్పీ నుంచి రూ. 50 కోట్లు, అమృత్‌కు రూ.100 కోట్లు నిధులు రానున్నాయి. మొత్తంగా రూ.4,100 కోట్ల వరకూ ఆదాయాన్ని ఆర్జించడమే లక్ష్యంగా జీవీఎంసీ 2020–21 నాటికి కసరత్తులు చేస్తోంది. టీడీపీ హయాంలో అంతా మాయాజాలం..అప్పుల్నీ ఆదాయంగా చూపించిన వైనం గతేడాది తెలుగుదేశం ప్రభుత్వహయాంలో 2018–19ఏడాదికి రూ.3740 కోట్లతో బడ్జెట్ రూపొందించగా. అంతకు ముందు ఏడాదికి రూ.3,292.96 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. అయితే అప్పట్లో అప్పులని కూడా ఆదాయంగా చూపించే పరిస్థితి ఉండేది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను, జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద వచ్చే నిధులను కూడా జీవీఎంసీ ఆదాయంగా లెక్క కట్టే వారు. శివారు ప్రాంతాలపై ప్రధాన దృష్టి.. అనధికార నిర్మాణాలు, నీటి పన్ను, షాపింగా కాంప్లెక్స్‌లు, కల్యాణ మండపాలు, లీజ్ రెన్యువల్స్, ట్రేడ్ లైసెన్స్‌లు ద్వారా గతేడాది కంటే ఈ సారి ఆదాయం ఎక్కువగా వస్తుందని అంచనా వేస్తూ ఈ ఏడాది మాత్రం దానికంటే రెట్టింపు కేటాయింపులతో మొత్తం రూ.200 కోట్లు అదనంగా వేస్తూ బడ్జెట్ రూపకల్పన జరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, ప్రధాన రహదారులకు అనుసంధానం చేసేలా రోడ్ల నిర్మాణాలు పెద్ద పీట వేయనున్నారు. అదేవిధంగా విలీన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్ సృజన భావిస్తున్నారు. ఇంజినీరింగ్ వర్గాల నుంచి అంచనాల కోసం అధికార యంత్రాంగం వేచి చూస్తోంది. మొత్తంగా వచ్చే నెల 15 నాటికి వార్షిక పద్దుకి తుది రూపు ఇచ్చి.. ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌కు పంపించాలని అధికారులు భావిస్తున్నారు. -
బైక్‌ను ఢీకొట్టి.. 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
సాక్షి, విశాఖపట్నం: దీపావళి రోజున విశాఖ నగరంలో దారుణం జరిగింది. జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు కథనం ప్రకారం.. మధురవాడ ప్రాంతంలోని వెంకటేశ్వర నగర్‌కు చెందిన సత్యాల శరణ్ (24) డెయిరీ ఫారమ్ జంక్షన్ సమీపంలో ఓయో హోటల్లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం వెంకోజీపాలెంలో ఉన్న తన స్నేహితుడిని తీసుకు రావడానికి బైక్‌పై బయలుదేరాడు. మితిమీరిన వేగంతో వచ్చిన లారీ డెయిరీ ఫారం వద్ద వెనుక నుంచి శేఖర్ బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌తో పాటు శేఖర్‌ను మద్దిలపాలెం జంక్షన్ వరకు మూడు కిలోమీటర్లు మేర ఈడ్చుకుపోయింది. ఇదిచూసిన స్థానికులు కేకలు వేయడంతో లారీ రోడ్డు పక్కన నిలిపాడు. ఈ ఘటనలో శరణ్ శరీరం నుంచి కాలు, చేతులు విడిపోయాయి. ఆరిలోవ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. -
పోలీసులకు వీక్లీఆఫ్‌లు వచ్చేశాయ్!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసులకు ఇచ్చిన వీక్లీఆఫ్ హామీ అమల్లోకి వచ్చేసింది. విశాఖ సిటీలో శనివారం నుంచి దీనికి శ్రీకారం చుట్టారు. విశాఖతోపాటు మరికొన్ని చోట్లా వీక్లీఆఫ్ అమలులోకి రాగా.. దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి తెచ్చేందుకు పోలీసు శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అమలుచేసేందుకు అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే ఆయన చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఈ నెల 4న కమిటీ ఏర్పాటుచేశారు. వీక్లీఆఫ్ అమలులో వచ్చే ఇబ్బందులను ఈ కమిటీ వారం రోజులపాటు అధ్యయనం చేసింది. అనంతరం ఈ నెల 10న మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ సవాంగ్‌తో కమిటీ సమావేశమై వీక్లీఆఫ్ అమలుకు నిర్ణయించారు. ఇందుకు సిబ్బంది కొరత ఇబ్బంది కాదని కూడా తేల్చారు. దీంతో ముందుగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా శనివారం ఉత్తర్వులివ్వడంతో నగరంలోని 2,147 మంది సివిల్, 850 ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులకు వీక్లీఆఫ్ అమలులోకి వచ్చింది. వీక్లీఆఫ్ అమలు ఇలా.. - శాంతిభద్రతల విభాగంలో పనిచేసే వారిలో మార్నింగ్ షిఫ్ట్, సెక్షన్ డ్యూటీలో (రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే డ్యూటీ చేసేవాళ్లు) ప్రస్తుతం మూడ్రోజులు డ్యూటీ చేసి తర్వాత 36 గంటల పాటు విశ్రాంతి తీసుకునే వారికి అదే విధానం కొనసాగుతుంది. - జనరల్ డ్యూటీ, వారెంట్లు, బందోబస్తు విధులు నిర్వహించే వారికి విధులకు ఇబ్బంది లేకుండా సర్దుబాటుతో ఒక రోజు వీక్లీఆఫ్ ఇస్తున్నారు. - ట్రాఫిక్ విభాగంలో పనిచేసే వారిని ఏడు రోజులకు ఏడు భాగాలుగా చేసి ఒక్కో భాగానికి ఒక్కో రోజున వారాంతపు సెలవు ఇస్తున్నారు. - నేర పరిశోధన విభాగంలోను సిబ్బందికి స్టేషన్ల వారీగా ఏడు విభాగాలుగా చేసి వీక్లీఆఫ్ ఇస్తారు. - ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో గార్డు, సెక్యూరిటీ కంపెనీ విధులను నిర్వహించే వారికి పరిస్థితులకు అనుగుణంగా, సిబ్బంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీక్లీఆఫ్ ఇస్తారు. వారికి వీక్లీఆఫ్ అమలుచేస్తూనే అత్యవసర సమయాల్లో విధులకు హాజరయ్యేలా అంగీకార పత్రం తీసుకుంటారు. - పోలీసు వాహనానికి ఇద్దరేసి డ్రైవర్లు ఉన్నందున వారిలో ఒకరు విధుల్లో ఉండేలా వీక్లీఆఫ్ ఇవ్వనున్నారు. -
వికటించిన ‘నారాయణ’ మంత్రం..?
సాక్షి, విశాఖ సిటీ: జీవీఎంసీకి వచ్చిన ప్రతిసారీ మున్సిపల్ స్కూల్స్‌లో నారాయణ మెటీరియల్‌తో విద్యార్థులను చదివిస్తున్నాం.. ఈ సారి శతశాతం ఫలితాలు వస్తాయని ఊదరగొట్టిన మంత్రి నారాయణ.. ఉన్న పరువు తీసేశారు. గత విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలు కనబరిచిన జీవీఎంసీ హైస్కూల్స్‌పై మంత్రి కార్పొరేట్ రుద్దుడు ఉత్తీర్ణత శాతాన్ని తగ్గించేసింది. కార్పొరేషన్ పాఠశాలలు పదో తరగతి ఫలితాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. 2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పోలిస్తే జీవీఎంసీ పాఠశాలల విద్యార్థులే ఎక్కువ మంది 10 పాయింట్లు సాధించారు. ఈ సారి 100 మంది విద్యార్థులకు 10కి 10 పాయింట్లు సాధించడమే లక్ష్యంగా జీవీఎంసీ ప్రత్యేక కార్యచరణను రూపొందించుకుంది. అయితే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రంగ ప్రవేశం చేసి మొత్తం వ్యవస్థను మార్చేశారు. ‘మా నారాయణ స్కూల్లో కరిక్యులమ్ భిన్నంగా ఉంటుంది. దాన్ని చదివితే విద్యార్థులకు 10కి 10 పాయింట్లు గ్యారెంటీ..’ అంటూ.. ఎప్పటికప్పుడు జీవీఎంసీలో సమీక్షలు నిర్వహించి ఉపన్యాసాలు ఇచ్చేవారు. మంత్రి ఆదేశాల్ని పాటించిన విద్యాశాఖాధికారులు దాదాపు నారాయణ స్టడీ మెటీరియల్‌నే పేరు మార్చి మున్సిల్ స్కూళ్ల విద్యార్థులతో బట్టీ పట్టించారు. 100 శాతం ఫలితాలు మాట అటుంచితే చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన గతేడాదితో పోలిస్తే స్వల్పంగా ఉత్తీర్ణత శాతం తగ్గడంతో జీవీఎంసీ విద్యాశాఖ ఊపిరి పీల్చుకుంది. ఉత్తీర్ణతతో పాటు 10 పాయింట్లూ తగ్గాయి మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో 27 హైస్కూల్స్ ఉన్నాయి. ఇందులో 1907 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి చదవగా.. 1903 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 868 మంది బాలురు, 1035 మంది బాలికలున్నారు. వీరిలో 91.75 శాతంతో 1746 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 796 మంది బాలురు, 950 మంది బాలికలు పాసయ్యారు. 157 మంది ఫెయిల్ అయ్యారు. 2017–18 విద్యా సంవత్సరంలో 92.67 ఉత్తీర్ణత శాతం ఉండగా, ఈ ఏడాది 0.92 శాతం తగ్గింది. దీంతో పాటు గతేడాది 39 మంది విద్యార్థులు 10 పాయింట్లు సాధించగా ఈ ఏడాది ఆ సంఖ్య కూడా తగ్గి 31కి దిగజారింది. 4 పాఠశాలల్లో శతశాతం ఉత్తీర్ణత గతేడాది 2 పాఠశాలలు మాత్రమే 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ సారి ఆ సంఖ్య నాలుగుకి చేరింది. అనకాపల్లిజోన్ పరిధిలోని గాంధీనగరం హైస్కూల్, డా.బీఆర్ అంబేడ్కర్ హైస్కూల్, భీమిలి జోన్‌లోని డా.బీఆర్ అంబేడ్కర్ హైస్కూల్, పీఎన్ఎం హైస్కూల్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. నాలుగు స్కూల్స్‌లో బాలురు, 8 స్కూల్స్‌లో బాలికలు 100 శాతం పాసయ్యారు. ఎంజీఎం హైస్కూల్ 73.33 శాతంతో అట్టడుగున నిలిచింది. 14 పాఠశాలలు 90 శాతానికి పైగా, 9 స్కూల్స్ 70 శాతానికి పైగా ఫలితాలు సాధించాయి. అయితే గతేడాది 9.8 జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్య 29 కాగా ఈ సారి ఏకంగా 40 మందికి చేరడం విశేషం. మంత్రి చలవతోనే బెడిసి కొట్టాయి.. 2016–17 విద్యా సంవత్సరంలో కేవలం 7గురు విద్యార్థులు మాత్రమే 10 పాయింట్లు సాధించడంతో.. 2017–18–లో 40 మంది విద్యార్థులకు ఆ సంఖ్య చేరుకోవాలని కార్పొరేషన్ ప్రణాళికలు రూపొందించింది. దీనికి అనుగుణంగా ప్రత్యేకమైన స్టడీ మెటీరియల్ తయారు చేసి, విద్యార్థులకు అందించడంతో 39 మంది విద్యార్థులు 10 పాయింట్లు సాధించారు. ఈ ఏడాది మాత్రం మంత్రి నారాయణ సూచనలకనుగుణంగా బో ధన సాగడంతో ఫలితాల్లో చతికిలపడ్డామంటూ జీవీఎంసీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
ప్రశాంత 'విశాఖ' చిరునామా చెరిగిపోనుందా?
తూర్పు తీరంలో కీలకమైన ఉక్కు నగరం విశాఖ ఇప్పటివరకు ప్రశాంతతకు మారుపేరు. అయితే కేంద్ర నిఘావర్గాల హెచ్చరికలు చూస్తే.. ఈ నగరాన్ని ఉగ్రపీడ పట్టుకుందా?.. అన్న అనుమానాలు..ఆందోళన రేగుతున్నాయి. తూర్పు కోస్తాపై ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల కన్నుపడిందని.. ముఖ్యంగా తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం, సబ్‌మెరైన్ కేంద్రం, పోర్టులు.. తదితర కీలకమైన వ్యవస్థలకు కేంద్రంగా ఉన్న విశాఖపై ఉగ్రనీడ పడిందని.. ఇప్పటికే స్లీపర్ సెల్స్ కార్యకలాపాలు మొదలయ్యాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు తగినట్లే మంగళవారం రాష్ట్ర డీజీపీ నగరానికి వచ్చి పర్యటించడం.. ఆ వివరాలు బయటకు పొక్కకపోవడం అనుమానాలను మరింత పెంచుతున్నాయి. ఐఎస్ఐఎస్ కదలికలతో హై అలర్ట్ స్లీపర్ సెల్స్ ఉన్నట్లు గుర్తించిన కేంద్రం రాష్ట్రానికి హెచ్చరికలు జారీచేసిన ఐబీ అప్రమత్తమైన జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. విశాఖపట్నం : ప్రశాంత విశాఖ నగరంపై ఉగ్రవాదుల కన్ను పడింది. అంతకంటే ఆందోళనకర విషయమేమిటంటే ఇప్పటికే ఐఎస్ఐఎస్కు చెందిన స్లీపర్ సెల్స్ సిటీలో విస్తరించాయని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయంతో రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన జిల్లా యంతాంగం ప్రత్యేక తనిఖీలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లో భద్రత కట్టుదిట్టం చేశారు. స్పెషల్ బ్రాంచ్ విభాగానికి పదును పెడుతున్నారు. కొందరు అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ముఖ్యంగా స్లీపర్‌సెల్స్‌ను గుర్తించేందుకు కసరత్తు ప్రారంభించారు. మంగళవారం డీజీపీ రాముడు విశాఖ వచ్చి అధికారులతో సమావేశం కావడం వెనక ప్రధాన కారణం కూడా ఇదేనని తెలుస్తోంది. ఇక విశాఖ నగరం ఇప్పటికే హై సెన్సిబుల్ ఏరియాగా గుర్తింపుపొందింది. ఉగ్రవాదులు తీర ప్రాంతం గుండా నగరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌తో పాటు కోస్ట్‌గార్డ్‌లను అప్రమత్తం చేశారు. ముంబయి దాడులకు సముద్ర మార్గాన్నే ఎంచుకున్న ఉగ్రవాదులు విశాఖలోనూ అదే అవకాశాన్ని వినియోగించుకోవచ్చనే హెచ్చరికలతో తీరం వెంబడి రక్షణను పటిష్టం చేశారు. బయటి నుంచి ముష్కర మూకలు నగరంలోకి రాకుండా అడ్డుకోవడం ఒకెత్తయితే ఇప్పటికే ఉన్న స్లీపర్ సెల్స్‌ను గుర్తించి మట్టుబెట్టడం మరో ఎత్తు. ఈ రెండూ కత్తిమీద సాములాంటివే. దీంతో విశాఖ పోలీసింగ్‌లో పలు కీలక మార్పులు చేయాల్సి ఉంది. డీజీపీ సమీక్షలోనూ ఇదే అంశాన్ని పలువురు ఉన్నతాధికారులు వ్యక్తం చేసినట్లు సమాచారం. కలవరపరుస్తున్న పరిస్థితులు నగరంపై ఉగ్రనీడ పడిందని తెలియగానే అధికారులతో పాటు, నగరవాసులూ ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడి పరిస్థితులు కలవరపరుస్తున్నాయి. నగరంలో ఎక్కడా చెప్పుకోదగ్గ రక్షణ ఏర్పాట్లు లేవు. అన్నీ ఇప్పుడు కొత్తగా చేయాల్సిందే. ఎదైనా జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప అధికారులు చేపడుతున్న శాశ్వత చర్యలు ఏమీ కనిపించడం లేదు. ఉగ్రవాదులను గుర్తించే ఏర్పాట్లు కూడా లేవు. నగరమంతటా సీసీ కెమెరాలతో అత్యంత భద్రత వలయం ఏర్పాటు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. నగరంలో వందకు పైగా పెద్ద హోటళ్లు, 60కి పైగా షాపింగ్ మాల్స్, 30కి పైగా సినిమా హాళ్లు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి సీసీ కెమెరాలు లేవు. కొన్నిటికి ఉన్నా సక్రమంగా పనిచేయడం లేదు. ఇక నగరంలో 128 జంక్షన్లు ఉండగా అన్ని జంక్షన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటికి 47 జంక్షన్లల్లో మాత్రమే ఏర్పాటు చేశారు. మిగతా ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. ఉగ్రవాదులు వచ్చినా, నగరంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు ఉన్నాయి. ఐబీ హెచ్చరికలతోనైనా నగర పోలీసింగ్‌లో మార్పులు జరుగుతాయేమో చూడాలి. గుంభనంగా డీజీపీ పర్యటన రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు మంగళవారం విశాఖ వచ్చారు. ఉదయం 8.30 గంటలకు ఎయిర్ కోస్టా విమానంలో విశాఖ చేరుకున్న ఆయన కాసేపు ఇక్కడ ఉన్న అనంతరం విజయనగరం జిల్లాకు బయలుదేరి వెళ్లారు. జాయింట్ పోలీస్ కమిషనర్ సత్తార్ ఖాన్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి డీజీపీకి స్వాగతం పలికారు. అయితే ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులు బయటకు వెల్లడించడం లేదు. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం విశాఖ వచ్చిన డీజీపీ ఇక్కడి పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన 11 మంది కేంద్ర హోంశాఖ అధికారులతోనూ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీస్ ఉన్నతాధికారులతోనూ గ్రేహౌండ్స్ జిల్లా కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో చేసిన హెచ్చరికల దృష్ట్యా డీజీపీ రాక ప్రాధాన్యత సంతరించుకుంది. కోస్టల్ సెక్యూరిటీతో పాటు ఉగ్రవాదుల కదలికలపైనా, మన్యంలో నక్సల్స్ సమస్యపైనా ఈ సమీక్షలో డీజీపీ చర్చించినట్లు తెలిసింది. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు పలు సూచనలు అందించారని, కమాండ్ కంట్రోల్ ద్వారా తీర ప్రాంత భద్రతపై సమీక్షించారని, పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారని సమాచారం. కానీ అధికారులు ఇవేవీ జరగలేదని చెబుతున్నారు. డీజీపీ విశాఖ వచ్చినా ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదని నగర పోలీస్ కమిషనర్ టి.యోగానంద్ తెలిపారు. -
ప్రశాంత విశాఖకు ఉగ్రపీడ పట్టుకుందా?
-
అరుణ కిరణాలు
- సీపీఎం జాతీయ మహాసభలకు సర్వం సిద్దం - విశాఖకు చేరుకున్న పార్టీ అగ్రనేతలు - వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు రాక - కళావాణి వేదికగా నేడు ప్రారంభం సాక్షి, విశాఖపట్నం: సీపీఎం 21వ అఖిలభారత జాతీయ మహాసభలకు తొలిసారిగా విశాఖనగరం ఆతిథ్యమిస్తోంది. ఈ మహాసభలు మంగళవారం నుంచి ఆదివారం వరకు స్థానిక పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరుగనున్నాయి. మహాసభల సందర్భంగా విశాఖ నగరంతో పాటు గ్రామీణమంతా ఎర్రజెండాల రెపరెపలతో ఎరుపెక్కింది. రాష్ర్ట విభజన జరిగిన తర్వాత నవ్యాంధ్రలో ఓ రాజకీయ పార్టీ అఖిలభారత మహాసభలు జరగడం ఇదే ప్రధమం. ప్రతినిధుల సభ జరుగనున్న పోర్టు కళా వాణి ఆడిటోరియాన్ని గ్రామీణ,గిరిజన ప్రాంత నివాసాలు, వృత్తులు, సాంస్కృతిక, సంప్ర దాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. మహాసభలు పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు పతాకావిష్కరణతో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు ప్రతినిధుల సభ ప్రారంభం కానుంది. మహాసభలో వివిధ పోరాటాలు, ఉద్యమానుభవం కల్గిన 900 మంది ప్రతినిధులు వివిధ రాష్ట్రాల నుంచి హాజరుకానున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ సభలు శనివారం వరకూ జరుగనున్నాయి. చివరి రోజైన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బహిరంగసభ జరుగనున్న ఆర్కే బీచ్ వరకు భారీ ప్రదర్శన చేరుకుంటుంది. అనంతరం అక్కడ భారీ బహిరంగసభ జరుగనుంది. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబింగా మహాసభల ప్రాంగణం పల్లె సంస్కృతిని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. సహజ వనరులు, ప్రకృతిలో లభించే వస్తువులతో నయానందకరంగా రూపొందిం చారు. పర్యావరణానికి ఎటువంటి నష్టంలేకుండా వివిధ ఆకృతులు తయారు చేశారు. ప్రతినిధుల మహాసభ ప్రవేశద్వారాన్ని గిరిజనులు నివసించేఆవాసాలను తలపించేలా ముస్తాబు చేసారు. మేదరు, జనపనార,కొబ్బరి పీచును ఉపయోగించే అనేక రూపాలతో మనస్సును కట్టిపడేలా రూపాలను ఏర్పాటు చేశారు. వేదికను అత్యంత ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. ప్రతినిధులు భోజనం చేసే మూడు భోజన శాలలకు శారద,నాగావళి, వంశధార నదుల పేర్లు పెట్టారు.ప్రాంగణంలో గ్రామీణ వాతావరణం ఉండేలా ఎండ్లబండ్లు, కోళ్ల గూళ్లు, తాటాకులతో ప్రత్యేకంగా పాకలు ఏర్పాటు చేశారు.ఆడిటోరియంలోని చెట్లను కొబ్బరి పీచు,కాగితపు తోరణాలతో అలంకరించారు. మహాసభల్లో చర్చించనున్న అంశాలివే ఈ మహాసభల్లో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలతో ఎలా వ్యవహరించాలి. అందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చకు రానుంది.అంతకంటే ముఖ్యంగా సీపీఐ(ఎం) తనస ఒంత బలాన్ని పెంచుకోవడంపైనే మహాసభ దృష్టి కేంద్రీకరించ నుంది. నిర్మాణ పరమైన లోపాలు, బలహీనతలువంటి అంశాలపే ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న ప్లీనంలో చర్చించాలని కేంద్ర కమిటీ గతంలోనే నిర్ణయించింది. వామపక్ష ఐక్యత మరింత బలపడేలా చొరవ తీసుకునేందుకు మహాసభ చర్చించనుంది. కేంద్రంలో మోడి, రాష్ర్టంలోని చంద్రబాబు, ఇతర రాష్ట్రాల్లోని పాలకపార్టీలు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను బలోపేతం చేసే అంశాలపై ఈ మహాసభలో చర్చించనున్నారు.