‘మహా’ బడ్జెట్‌..! | GVMC Budget With About Rs 4000 Crore | Sakshi
Sakshi News home page

‘మహా’ బడ్జెట్‌..! 

Published Tue, Nov 26 2019 8:18 AM | Last Updated on Tue, Nov 26 2019 8:18 AM

GVMC Budget With About Rs 4000 Crore - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలోని 72 వార్డుల ప్రజల్నీ మెప్పించేలా వార్షిక పద్దు తయారు చేసేందుకు మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి స్మార్ట్‌ సిటీ మహా బడ్జెట్‌ సిద్ధమవుతోంది. గతేడాది కంటే ఎక్కువ అంచనాలతోనే వార్షిక బడ్జెట్‌ను అధికారులు తయారు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు అన్ని ప్రాంతాల వారికీ అందేలా.. అంచనాలు వండి వారుస్తున్నారు. 2019–20 ఆర్ధిక సంవత్సరానికి  3,740.65 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ తయారు చెయ్యగా.. 2020–21 ఆర్థిక సంవత్సరానికి రూ.3,950 కోట్లతో జంబో పద్దు రానుంది. స్మార్ట్‌ విశాఖను క్లీన్‌ సిటీగా, సకల సౌకర్యాల నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపైసా ఖర్చు చేసేలా యంత్రాంగం లెక్కలు వేస్తోంది.

నగరాభివృద్ధి, ప్రాజెక్టులకు పెద్దపీట..
మహా విశాఖ నగర పాలక సంస్థ 2020–21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ తయారీలో కమిషనర్‌ జి.సృజన ఆచితూచి వ్యవహరిస్తూ వాస్తవ ఆదాయానికి అనుగుణంగా ఉండేలా రూపొందించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.  ఆంధ్రప్రదేశ్‌ ఆ«ర్థిక రాజధానిగా చలామణి అవుతున్న విశాఖ నగరం అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా... అన్ని ప్రాంతాలలో, అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం భారీ కేటాయింపులతో కూడిన బడ్జెట్‌ తయారవుతోంది. ప్రస్తుత ప్రారంభ నిల్వగా రూ.95 కోట్లు ఉండనుంది. ఇంజినీరింగ్‌ విభాగానికి సుమారు రూ.1200 కోట్లు, ప్రజారోగ్యానికి రూ.450 కోట్లు,  యూసీడీకి రూ.300 కోట్లు, నీటి సరఫరా విభాగానికి రూ.300 కోట్లు, విద్యకు రూ.100  కోట్లు, ప్రాజెక్టులకు రూ.300 కోట్లు, స్మార్ట్‌ సిటీకి రూ.300 కోట్లు, లైటింగ్‌కు రూ.100 కోట్లు, పార్కులు, హరిత అభివృద్ధికి రూ.75 కోట్లు... వంతున మొత్తం రూ.3,800 కోట్లు ఖర్చులకు కేటాయించారు.

ప్రజలపై భారం లేకుండా..
ప్రజలపై ఎలాంటి పన్నుల భారం మోపకుండా ఎక్కువగా వచ్చే ఆదాయ మార్గాలపై జీవీఎంసీ దృష్టిసారించింది. 010 పద్దు పరిధిలోకి రావడంతో, ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు ఏటా వెచ్చించే రూ.250 కోట్లు మిగులుతోంది. ఈ మొత్తాన్ని మౌలిక సదుపాయాల కోసం వినియోగించాలని గ్రేటర్‌ అధికారులు నిర్ణయించారు. అదేవిధంగా ఖాళీ స్థలాల పన్నులు, ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌లు, మొండి బకాయిలపై దృష్టి సారించి.. వాటి వసూళ్లని వేగవంతం చేసుకొని కార్పొరేషన్‌ ఖజానాని నింపాలని భావిస్తున్నారు. మొండి బకాయిలు, ఇతర పన్నుల ద్వారా ఏటా వచ్చే ఆదాయం కాకుండా అదనంగా మరో రూ.100 కోట్లు రాబట్టుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆదాయం వృద్ధి రేటు 20 శాతం కంటే ఎక్కువగా ఉండేందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయి. నీటి సరఫరా ద్వారా సుమారు రూ.200 కోట్లు, టౌన్‌ప్లానింగ్‌ ద్వారా రూ.150 కోట్లు, ఆస్తిపన్ను నుంచి రూ.350 కోట్లు, ఇతర పన్నులు మరో రూ.100 కోట్లు రాబట్టుకోనున్నారు. దీనికి తోడు గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు నిర్దేశించిన విధంగా రూ. 100 కోట్ల వరకూ రుణాల్ని జీవీఎంసీ పొందనుంది. అదేవిధంగా విశాఖ చెన్నై కారిడార్‌ కు సంబంధించి రూ.150 కోట్లు, ఏడీబీ రూ.100 కోట్లు, ఎస్‌సీఎస్‌పీ నుంచి రూ.100 కోట్లు, టీఎస్‌పీ నుంచి రూ. 50 కోట్లు, అమృత్‌కు రూ.100 కోట్లు నిధులు రానున్నాయి. మొత్తంగా రూ.4,100 కోట్ల వరకూ ఆదాయాన్ని ఆర్జించడమే లక్ష్యంగా జీవీఎంసీ 2020–21 నాటికి కసరత్తులు చేస్తోంది.

టీడీపీ హయాంలో అంతా మాయాజాలం..అప్పుల్నీ ఆదాయంగా చూపించిన వైనం 
గతేడాది తెలుగుదేశం ప్రభుత్వహయాంలో 2018–19ఏడాదికి రూ.3740 కోట్లతో బడ్జెట్‌ రూపొందించగా. అంతకు ముందు ఏడాదికి రూ.3,292.96 కోట్లతో బడ్జెట్‌ రూపొందించారు. అయితే అప్పట్లో అప్పులని కూడా ఆదాయంగా చూపించే పరిస్థితి ఉండేది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద వచ్చే నిధులను కూడా జీవీఎంసీ ఆదాయంగా లెక్క కట్టే వారు.

శివారు ప్రాంతాలపై ప్రధాన దృష్టి..
అనధికార నిర్మాణాలు, నీటి పన్ను, షాపింగా కాంప్లెక్స్‌లు, కల్యాణ మండపాలు, లీజ్‌ రెన్యువల్స్, ట్రేడ్‌ లైసెన్స్‌లు ద్వారా గతేడాది కంటే ఈ సారి ఆదాయం ఎక్కువగా వస్తుందని అంచనా వేస్తూ ఈ ఏడాది మాత్రం దానికంటే రెట్టింపు కేటాయింపులతో మొత్తం రూ.200 కోట్లు అదనంగా వేస్తూ బడ్జెట్‌ రూపకల్పన జరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, ప్రధాన రహదారులకు అనుసంధానం చేసేలా రోడ్ల నిర్మాణాలు పెద్ద పీట వేయనున్నారు.  అదేవిధంగా విలీన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్‌ సృజన భావిస్తున్నారు. ఇంజినీరింగ్‌ వర్గాల నుంచి అంచనాల కోసం అధికార యంత్రాంగం వేచి చూస్తోంది. మొత్తంగా వచ్చే నెల 15 నాటికి వార్షిక పద్దుకి తుది రూపు ఇచ్చి.. ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌కు పంపించాలని అధికారులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement