
60 కంటే తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం
దీంతో 32,596 ప్రైమరీ స్కూళ్లలో చదువుతున్న పిల్లలపై ప్రభావం
కూటమి సర్కారు నిర్ణయాలతో వేలాదిగా మూత‘బడి’నట్లే
1 నుంచి 5వ తరగతి చదవాలంటే ఐదు కిలోమీటర్లు వెళ్లాల్సిందే
విలీనం పేరుతో భారీగా స్కూళ్లను కుదించేందుకు రంగం సిద్ధం..
ఎంఈవోల ద్వారా టీచర్లపై ఒత్తిళ్లు పాఠశాల కమిటీలతో ‘‘ఎస్’’ చెప్పించాల్సిన బాధ్యత టీచర్లదే
లేదంటే ప్రత్యక్షంగా కలెక్టర్ల ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందే
ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తెచ్చిన విద్యారంగ సంస్కరణలను భ్రష్టు పట్టించిన కూటమి సర్కారు..
ఆ నిర్వాకాలకు పరాకాష్టగా తాజా అడుగులు
రాష్ట్రంలో సర్కారు బడికి తాళం పడుతోంది. గ్రామాల్లో 60 మంది కంటే తక్కువ విద్యార్థులున్న స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం కావడంతో వేలాదిగా పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. మిగిలిన వాటి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ఇకపై విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి చదవాలంటే 5 కి.మీ. వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానుంది. భారీగా స్కూళ్ల సంఖ్యను తగ్గించేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం మండల విద్యాధికారుల ద్వారా ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తోంది.
పాఠశాలల కమిటీలను ఒప్పించాల్సిన బాధ్యత టీచర్లపైనే మోపింది. లేదంటే ఎంఈవోలు ప్రత్యక్షంగా కలెక్టర్లకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటికే గత ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలను నీరుగార్చి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన కూటమి సర్కారు నిర్వాకాలకు ఇది పరాకాష్టగా నిలుస్తోంది. పేదింటి తలరాతలను మార్చే శక్తి చదువులకు మాత్రమే ఉందని దృఢంగా విశ్వసించిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత ఐదేళ్లూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏకంగా రూ.72 వేల కోట్లకుపైగా వెచ్చించి ఉత్తమ ఫలితాలను రాబట్టారు.
దీంతో మన స్కూళ్ల ప్రతిభ ఐరాస వరకు వినిపించింది. అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద, బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, బైజూస్ కంటెంట్‌తో పిల్లలకు ట్యాబ్‌లు, డిజిటల్ తరగతులతో ఏ ఒక్కరూ ఊహించని రీతిలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. నాడు– నేడు ద్వారా కార్పొరేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దటంతోపాటు ఇంగ్లీషు మీడియం చదువులు, సీబీఎస్‌ఈ నుంచి టోఫెల్, ఐబీ దాకా సర్కారు స్కూళ్ల ప్రయాణం మొదలైంది. ఇప్పుడు వీటన్నిటినీ నీరుగార్చిన టీడీపీ కూటమి సర్కారు స్కూళ్ల మూసివేత దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థులకు పిడుగుపాటులా పరిణమించాయి.
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అక్కసుతో విద్యా సంస్కరణలను నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు తొలి టార్గెట్‌గా ప్రభుత్వ విద్యారంగాన్ని ఎంచుకుంది! గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల విలీనమే లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేస్తోంది. ప్రాథమికోన్నత పాఠశాలలను పూర్తిగా ఎత్తివేయడంతో పాటు పల్లెల్లో ప్రాథమిక పాఠశాలల మూసివేత దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.
5 కి.మీ పరిధిలోని స్కూళ్లను మాత్రమే విలీనం చేస్తామని చెప్పిన సర్కారు తరువాత ఎంఈవోల ద్వారా మౌఖికంగా 7 కి.మీ. పరిధికి పెంచి ఒత్తిడి పెంచుతోంది. అంటే ఆ పరిధిలోని ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ఇక చదువుకునేందుకు దూరంలోని మోడల్ ప్రైమరీ స్కూల్‌కి వెళ్లాల్సిందే! లేదంటే ప్రైవేట్ స్కూళ్లే దిక్కు!! మోడల్ స్కూల్ అంటే ఏదో కొత్తది నిర్మిస్తున్నారనుకుంటే పొరబడినట్లే! మోడల్ ముసుగులో స్కూళ్లను భారీగా ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేసింది.
32 వేలకు పైగా పాఠశాలలపై తీవ్ర ప్రభావం
ఉపాధ్యాయ సమావేశాల్లో ఇచ్చిన హామీకి భిన్నంగా స్కూళ్ల విలీనానికి రంగం సిద్ధం చేసి మోడల్ స్కూళ్ల పేరుతో ఉన్న పాఠశాలల ప్రాణం తీసేస్తున్నారని టీచర్లు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మోడల్ ప్రైమరీ పాఠశాలకు మ్యాపింగ్ చేయాలంటూ ఎంఈవోలపై ఒత్తిడి తెస్తున్నారు. విలీనానికి అంగీకరించాల్సిందేని ఒత్తిడి పెంచుతున్నారు. ఈమేరకు స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల నుంచి అంగీకార పత్రాలను తెప్పించాల్సిన బాధ్యత టీచర్లు, ఎంఈవోలకు కేటాయించారు. అలా చేయని వారు కలెక్టర్ ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించారు.
విలీనమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతుండటంతో రాష్ట్రంలో వేలాదిగా స్కూళ్లు మూతపడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 1 – 5 తరగతులు కొనసాగుతున్న 32,596 ప్రాథమిక పాఠశాలల్లో కేవలం 17 శాతం స్కూళ్లల్లోనే 60 మందికి మించి ఎన్‌రోల్‌మెంట్ ఉంది. మిగిలిన 83 శాతం స్కూళ్లల్లో విద్యార్థులు 60 మంది కంటే తక్కువ ఉన్నారు. అంటే ఈ 83 శాతం స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులపై విలీనం ప్రభావం పడనున్నట్లు స్పష్టమవుతోంది.
విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ లేదనే సాకుతో 2014–19 మధ్య 1,785 స్కూళ్లను రద్దు చేసిన టీడీపీ సర్కారు.. తాజాగా అస్తవ్యస్థ విధానాలతో పేద విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేస్తోంది. దీంతో గ్రామాల్లో వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం నెలకొంది. ఒక్కో పంచాయతీలో సుమారు మూడు నుంచి నాలుగు ప్రాథమిక పాఠశాలలున్నాయి. పట్టణాల్లో పరిధిని బట్టి 30 వరకు స్కూళ్లున్నాయి.
ఏ పాఠశాలలోనైనా 60 కంటే తక్కువ మంది ఉంటే ఐదు కి.మీ దూరంలోని స్కూళ్లకు వెళ్లి చదువుకోవాల్సిందే. 60 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే ఆ పంచాయతీలో ఉన్న స్కూల్‌కి మోడల్ స్కూల్‌గా నామకరణం చేసి అక్కడకు తరలిస్తారు. మోడల్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య 100కి చేరుకోకుంటే పరిధిని ఏడు కి.మీ.కి పెంచి అమలు చేయాలని అనధికారికంగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. విలీనాన్ని గ్రామస్తులతో పాటు తల్లిదండ్రుల కమిటీలు వ్యతిరేకిస్తుండడంతో ఒప్పించే బాధ్యతను టీచర్లకు అప్పగించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో పాఠశాలలను విలీనం చేయవద్దంటూ నిరసన తెలుపుతున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు (ఫైల్)
విలీన ఒత్తిడితో టీచర్ల బెంబేలు
ఈ నిర్ణయంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. స్కూళ్ల కమిటీలను ఒప్పించలేక అటు ఉన్నతాధికారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ప్రతి పాఠశాల స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీతో ‘ఎస్’ అని ఆమోదం తెలుపుతూ తీర్మానం ఇవ్వాలని కలెక్టర్లు ఆదేశిస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోడల్ స్కూళ్లను కొత్తగా ఏర్పాటు చేస్తామంటే ఉపాధ్యాయులు వ్యతిరేకించడం లేదు.
ఒక పాఠశాలను కేంద్రంగా చేసి చుట్టూ ఉన్న పాఠశాలలను విలీనం చేయడం, ఎంపిక చేసిన పాఠశాలలో తరగతులు కలపటాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. పైగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యతను ఆదే ఉపాధ్యాయులకు అప్పగించడం, కాదన్న వారిని ఉన్నతాధికారుల బెదిరించటాన్ని తట్టుకోలేక పోతున్నామని వాపోతున్నారు.
గతంలో ప్రతి పాఠశాలను మనబడి నాడు–నేడు పథకం కింద రూ.లక్షలు ఖర్చు చేసి అన్ని సదుపాయాలు కల్పిస్తే ఇప్పుడు వాటిని వినియోగించుకోకుండా విలీనం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం పెట్టిన ఖర్చు వృథా అవుతుందని, ఈ ప్రక్రియ మొత్తం ప్రైవేట్ స్కూళ్లను ప్రోత్సహించేందుకేనని మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment