government primary schools
-
అక్షరాలా కష్టాలే.. తెలంగాణలో ప్రభుత్వ బడి లేని ఊళ్లు 3,688
హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న సిద్దిపేట జిల్లాలోనే అత్యధికంగా 314 శివారు గ్రామాల్లో స్కూళ్లు లేని పరిస్థితి ఉంది. 284 శివారు గ్రామాల్లో పాఠశాలలు లేని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం జైత్రం తండా గ్రామ విద్యార్థులు ఉన్నత పాఠశాల కోసం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి ఆటోలో వెళ్తున్నారు. కిక్కిరిసిన ఆటో ఎప్పుడు ఏ ప్రమాదానికి గురవుతుందోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతోంది. అందరికీ విద్య ప్రాథమిక హక్కు అని మన రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. కానీ ఇప్పటికీ, ఇన్నేళ్లు గడిచినా.. ఎన్నో గ్రామాలకు విద్య దూరంగానే ఉంది. ప్రాథమిక విద్యకు సైతం వ్యయప్రయాసలకోర్చి పక్క ఊరికో, ఆ పక్క ఊరికో వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక మాధ్యమిక, ఉన్నత పాఠశాల కోసం మరింత దూరం ప్రయాణించక తప్పని పరిస్థితి ఉంది. మన రాష్ట్రాన్నే చూసుకుంటే.. 3,688 శివారు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలే లేదు. 546 శివారు గ్రామాల్లో అక్షరాలు దిద్దించే ప్రాథమిక పాఠశాల లేదు. 2,018 గ్రామాలు మాధ్యమిక విద్యకు దూరంగా ఉన్నాయి. 2,508 శివారు గ్రామాల్లో ఉన్నత పాఠశాల లేదు. రాష్ట్రవ్యాప్తంగా 30,395 మంది చిన్నారులు చదువు కోసం 3 నుంచి 5 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తోంది. నడుచుకుంటూనో, కిక్కిరిసిన ఆటోల్లోనో, సైకిళ్ళ మీదో దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. కొద్దిపాటి వర్షం వచ్చినా బురదగా మారే రోడ్ల మీద అష్టకష్టాలు పడుతూ విద్యనభ్యసిస్తున్నారు. ఉచిత, నిర్బంధ విద్య కింద 10 నెలల రవాణా భత్యం ప్రభుత్వం ఇస్తుంది. కానీ పెరిగిన డీజీల్ చార్జీల కారణంగా చుక్కలనంటే ఆటో చార్జీలకు ఇవి ఏమాత్రం సరిపోవడం లేదని మారుమూల గ్రామాల పేద ప్రజలు అంటున్నారు. ఈ పరిస్థితులు విద్యపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. స్కూల్ దశలోనే చదువు మానేసేవారి (డాపవుట్స్) సంఖ్య పెరుగుతోంది. విద్యకు దూరమవుతున్న వారిలో ఎక్కువ శాతం వెనుకబడిన ప్రాంతాల నిరుపేదలే ఉంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ‘యూ డైస్’ (యూనిఫైడ్ డిస్క్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) నివేదిక ఈ విషయాలన్నీ స్పష్టం చేస్తోంది. ఎంతెంత దూరం.. ► భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గుంపాడుకు సమీపంలోని గిరిజన గ్రామాల విద్యార్థులు కనీసం 4 కిలోమీటర్ల మేర ప్రయాణించి చదువుకోవాల్సి వస్తోంది. సంవత్సరంలో కనీసం 70 రోజులు బురదతో నరక యాతన పడుతున్నారు.– ► ఆదిలాబాద్ జిల్లాలో 162 శివారు గ్రామాల్లో అక్షరం చెప్పే దిక్కే లేదు. మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నిర్మల్, పెద్దపల్లి.. ఇలా పలు జిల్లాల్లో..ఒక్కో జిల్లాలో 150కి పైగా శివారు గ్రామాల్లో స్కూళ్ళు లేవు. ► మెదక్ జిల్లా తూప్రాన్ సమీకృత వసతి గృహంలో ఉండే విద్యార్థులు 2.5 కిలో మీటర్ల దూరంలోని స్కూలుకు వెళ్తున్నారు. మధ్యలోనే మానేస్తున్నారు చదువుపై పెద్దగా అవగాహన లేని శివారు గ్రామస్తులు, ముఖ్యంగా పేద కుటుంబాల వారు పిల్లలను దూర ప్రాంతాలకు పంపేందుకు ఇష్టపడటం లేదు. దగ్గర్లో ఉన్న స్కూల్ విద్యకే పరిమితం చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో గత ఏడాది 13.7 శాతం మంది విద్యార్థులు టెన్త్ క్లాస్‌కు వచ్చేసరికే చదువు మానేశారు. ఇందులో 12.9 శాతం బాలికలే ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో చదివే విద్యార్థులకు జూనియర్ కాలేజీ అందుబాటులో లేదు. దీంతో తల్లిదండ్రులు బాలికలను టెన్త్‌తోనే ఆపేస్తున్నారు. గడచిన రెండేళ్ళలో 18 మంది ఇలా విద్యకు దూరమయ్యారు. వీరిలో ఎక్కువ మందికి వివాహాలు కూడా జరిగాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో 8–10 తరగతుల బాలికలను పాఠశాలకు వెళ్లని కారణంగా పెళ్ళిళ్ళు చేసేస్తున్నట్టు గుర్తించారు. ఇలా గడచిన రెండేళ్ళలో 19 మందికి వివాహాలైనట్టు ప్రభుత్వ సర్వేల్లో తేలింది. స్కూళ్ళు, కాలేజీలు అందుబాటులో లేకపోవడం వల్లే చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. శివారు తండాల వరకూ ప్రభుత్వ స్కూళ్ళను తీసుకెళ్తే తప్ప ఈ పరిస్థితిలో మార్పు రాదని స్పష్టం చేస్తున్నారు. చదవాలంటే నడవాల్సిందే.. ఈ బడి పిల్లల కష్టాల గురించి ‘యూ డైస్’.. తమ నివేదికలో ప్రస్తావించింది. గిరిజన గ్రామమైన కొండతోగు.. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉంది. ఇక్కడ దాదాపు 21 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా చదువుకోవడం కోసం 3 కిలోమీటర్ల దూరంలోని పండువారిగూడేనికి నడిచి వెళ్తున్నారు. ఇలా రోజూ రానూపోనూ ఆరు కిలోమీటర్లు నడవాల్సిందే.. మామూలు రోజుల్లోనే ఈ మార్గంలో నడవడం కష్టం.. ఇక, వానొస్తే అంతే.. -
విద్యార్థినులను వేధిస్తే కఠిన చర్యలు
సాక్షి, అమరావతి/గుమ్మలక్ష్మీపురం: విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించటం, వేధించడం తదితర చర్యలను ఉపేక్షించేది లేదని అటువంటి ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. విజయనగరం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండలం బాలేసు ప్రాథమిక పాఠశాల ఘటనపై మంత్రి సురేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులకు పాల్పడిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశించడంతో విద్యాశాఖధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. ప్రధానోపాధ్యాయులు స్వామినాయుడు ఉపాధ్యాయుడు సూర్యనారాయణను సస్పెండ్ చేశారు. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు.. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పలువురు బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించిన హెచ్ఎం సీహెచ్ స్వామినాయుడిపై పోక్సో కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, మరో ఉపాధ్యాయుడు సూర్యనారాయణపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్ తెలిపారు. డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్ సూర్యకుమారి ఆదేశాల మేరకు ఆయన బాలేసు గ్రామాన్ని గురువారం సందర్శించి వివరాలు సేకరించారు. -
ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన
-
ఆరోగ్యం వెం‘బడి’...
సాక్షి, సిద్దిపేట: విద్యార్థులకు సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయల ద్వారా పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం నాంచార్‌పల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పండిస్తున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్లో సేంద్రియ ఎరువులతో పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరలతో 45 రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. 12 మందితో కమిటీ కూరగాయల సాగుకోసం ప్రత్యేకంగా 12 మంది విద్యార్థులతో కిచెన్ గార్డెన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ విద్యార్థులు ప్రతి రోజు ఉదయం 20 నిమిషాలు పాఠశాల సమయానికంటే ముందుగా రావడం, తరగతులు ముగిసిన తర్వాత మరో 15 నిమిషాల పాటు కిచెన్ గార్డెన్లో కలుపు తీత, మొక్కలకు నీళ్లు పెట్టడం.. వాటిని పరిరక్షించడం చేస్తుంటారు. దీంతో విద్యార్థులకు పంటలు ఎలా పండిస్తారనే అవగాహనతో పాటు పని పట్ల గౌరవం కలుగుతోందని ఉపాధ్యాయులు చెబతున్నారు. ఇతరులు తీసుకోకుండా.. పాఠశాలలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్‌కు గ్రామ పంచాయతీ సహకారం కూడా అందుతోంది. కిచెన్ గార్డెన్‌కు సేంద్రియ ఎరువులను పంచాయతీ ఉచితంగా అందజేస్తోంది. పాఠశాలలో పండిన కూరగాయలను గ్రామస్తులు ఎవరూ కోసుకుపోవద్దని చాటింపు సైతం చేశారు. కూరగాయలు తెంచినట్లు తెలిస్తే వారికి రూ.10 వేల జరిమానా విధిస్తామని ప్రకటించారు. సాగు చేస్తున్న కూరగాయలు సొరకాయ, బీర, వంకాయ, కాకర, టమాటా, దోసకాయ, చిక్కుడు, గోరు చిక్కుడు, బెండకాయ, పాలకూర, తోటకూర, సుక్క కూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర, ఉల్లిఆకు, పచ్చిమిర్చి. నాంచార్‌పల్లి ప్రభు త్వ ప్రాథమికోన్నత పాఠశాల 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1– 7వ తరగతి వరకు 166 మంది విద్యార్థులున్నారు. స్కూల్ ఆవరణలో 5 గుంటల స్థలంలో గత అక్టోబర్ నెలలో పలు రకాల కూరగాయల విత్తనాలు నాటారు. నవంబర్ 30 నుంచి కాత మొదలైంది. అప్పటి నుంచి పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పండించిన కాయగూరలనే మధ్యాహ్న భోజనంలో ఆహారంగా అందిస్తున్నారు. తాజా కాయగూరలతో రోజుకో రకమైన వంటకాన్ని అందిస్తున్నారు. ఎలాంటి పురుగు మందులను వినియోగించకుండా కేవలం సేంద్రియ ఎరువుల ద్వారానే సాగు చేస్తుండటంతో విద్యార్థులకు మంచి పౌష్టికాçహారం అందుతోంది. సంపూర్ణ ఆరోగ్యం అందించే తాజా కూరగాయలతో మధ్యాహ్న భోజనం అందించడంపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పౌష్టికాహారం అందించడమే లక్ష్యం విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్‌ను ఏర్పాటు చేశాం. 45 రోజుల నుంచి బడిలో పండించిన కూరగాయలతోనే మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. పంచాయతీ, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడం సంతోషంగా ఉంది. – పద్మావతి, ప్రధానోపాధ్యాయురాలు ఎంతో రుచికరం మా స్కూల్లో పండించిన కూరగాయలతో మధ్యాహ్న భోజనం చేయడం చాలా ఆనందంగా ఉంది. తాజాగా ఉండడం, పురుగు మందుల వినియోగం లేకపోవడంతో వంటలు ఎంతో రుచికరంగా ఉంటున్నాయి. ప్రతీ రోజు పాఠశాల సమయం కంటే ముందు వచ్చి కొద్ది సేపు వాటి రక్షణకు కేటాయిస్తాం. ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరం నిత్యం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. –పూజ, 7వ తరగతి -
సిద్దిపేట జిల్లాలో బాలికల కిడ్నాప్‌కు యత్నం
ములుగు (గజ్వేల్): సిద్దిపేట జిల్లా ములుగు మండలం మాసాన్‌పల్లిలో ఇద్దరి బాలికల కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. మంగళవారం పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న బాలికలకు చాకెట్లు ఆశ చూపి ఎత్తుకుని పారిపోతున్న కిడ్నాపర్లను గ్రామస్తులు గమనించి దేహశుద్ధి చేసి బాలికలను కాపాడారు. మాసాన్‌పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మంగళవారం మధ్యాహ్న భోజన సమయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సందీప్‌నిహార్, జగదీశ్ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న ఒకటవ, రెండవ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలకు చాక్లెట్లు ఆశ చూపి దగ్గరకు పిలు చుకుని ఎత్తుకుని పారిపోతున్నారు. ఈ క్రమంలో మిగతా పిల్లల అరుపులను గమనించిన గ్రామస్తులు వారిని అడ్డుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం గ్రామస్తులు కిడ్నాపర్లను స్థానిక పోలీసులకు అప్పగించారు. -
'మంచి' నీరేనా
- గత కొన్నేళ్లలో ప్రాథమిక స్కూళ్లలో పెరగని తాగునీటి వసతి.. - దాని నాణ్యతపైనా అనుమానాలు.. 2010లో తాగునీటి సదుపాయమున్న బడులు 83% 2016లో తాగునీటి సదుపాయమున్న బడులు 85% ఇందులో వినియోగానికి అనువుగా ఉన్నవి 73% ఇందులో వినియోగానికి అనువుగా ఉన్నవి 74% గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుతోందా..? అసలు వాటిలో నీటి సదుపాయాలెలా ఉన్నాయి..? విద్యార్థులకు అందిస్తున్న నీరు నిజంగా సురక్షితమేనా..? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్(ఏఎస్ఈఆర్) అనే స్వచ్ఛంద సంస్థ దేశంలోని గ్రామీణ పాఠశాలల్లో అధ్యయనం చేసింది. ఆరేళ్ల క్రితంతో పోలిస్తే.. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో తాగునీటి పరిస్థితిలో కొద్ది మేరకే మార్పు వచ్చిందని సర్వేలో తేలింది. స్కూళ్లలో తాగునీటి సదుపాయాలపై (పైపులు, హ్యాండ్ పంపులు, నీటి కూజాలు వంటివి) ఈ సర్వే నిర్వహించారు. పైకి కనిపించడానికి 2016లో 74 శాతం తాగునీటి సదుపాయాలు వినియోగానికి అనువుగా ఉన్నప్పటికీ.. తాగు నీటి నాణ్యత సందేహాస్పదమే అంటున్నారు. ఎందుకంటే.. దీన్ని కచ్చితంగా పరీక్షించే వ్యవస్థ లేకపోవడం ఇందుకు ఓ కారణం. – సాక్షి, తెలంగాణ డెస్క్ ప్రాథమిక స్కూళ్లలో విద్యార్థులు 20 కోట్లు.. 2016లో ఏఎస్ఈఆర్ సంస్థ దేశంలోని 619 గ్రామీణ జిల్లాలకుగానూ 589 జిల్లాల్లో సర్వే చేసింది. 17,473 మంది సర్వేయర్లు ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. ఏఎస్ఈఆర్ 2009 నుంచి గ్రామీణ ప్రభుత్వ స్కూళ్లలో తాగునీరు, పారిశుధ్య సదుపాయాలపై గణాంకాలను సేకరిస్తోంది. ప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సుమారు 20 కోట్లు. వీరికి సర్వశిక్షా అభియాన్ నిబంధనల ప్రకారం.. ప్రతి పాఠశాలలోనూ తాగునీటి సదుపాయం ఉండటం తప్పనిసరి. అయితే తాగునీటి సదుపాయం వినియోగంలో ఉందా లేదా అనే విషయాన్ని మాత్రం ఇందులో ప్రస్తావించలేదు. తాగే నీరు సురక్షితమేనా? పాఠశాలల్లో తాగునీటి సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా లేదా తాగునీటి నాణ్యత ఎలా ఉంది అనేదానిపై డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్(డీఐఎస్ఈ) గణాంకాలు సేకరించాలి. అయితే డీఐఎస్ఈ ఈ గణాంకాలను సరిగా సేకరించడం లేదు. ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్లలో తాగునీటి వసతి తగ్గిన రాష్ట్రాలు -
ప్రాథమిక ‘మిథ్య’!
చాపాడు: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల అభివృద్ధిపై ఎప్పటికప్పుడు సత్వర చర్యలు తీసుకొంటూ ముందుకెళ్లాల్సిన సర్వశిక్షాఅభియాన్(ఎస్ఎస్ఏ) నత్తనడకే నయమన్నట్లుగా ముందుకెళుతోంది. ప్రాథమిక విద్యాశాఖను పర్యవేక్షిస్తూ విద్యాప్రమాణాల మెరుగుకు ఉపాధ్యాయులకు వృత్త్యంతర( రీ ఓరియంటేషన్) శిక్షణలను ఇస్తూ ప్రాథమిక విద్యను ముందుకు తీసుకుపోవాల్సిన ఎస్ఎస్ఏ వేగం పుంజుకోలేకపోతోంది. ఫలితంగా అనుకున్న స్థాయిలో లక్ష్యాన్ని సాధించటంలో విఫలమవుతోంది. చతికలబడిన బడిబాట: ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా విద్యా సంవత్సరం ఆరంభంలో బడిబాట అంటూ ఆర్భాటంగా ప్రకటించిన ఎస్ఎస్ఏ ఈ కార్యక్రమాన్ని అమలు పరచటంలో క్షేత్రస్థాయిలో విఫలమైంది. ఎన్రోల్మెంటు స్పెషల్ డ్రైవ్, సంసిద్ధతా కార్యక్రమాలు అమలు పరచాలని విద్యాశాఖ ప్రత్యేక ఉత్తర్వులున్నా ఉపాధ్యాయులకు చేరవేయటంలో ఎస్ఎస్ఏ వెనుకబడినట్లు కన్పిస్తోంది. వీటిపై ప్రాధానోపాధ్యాయుల సమావేశాలు నిర్వహించని మండలాలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ఖరారు కాని శిక్షణ తరగతులు: విద్యా సంవత్సర ప్రారంభంలోనే తెలుగు, గణితం, ఇంగ్లీషులపై ప్రాథమికస్థాయి ఉపాధ్యాయులకు వృత్తంతర శిక్షణలను జూలై ఒకటవ తేదీ నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్దేశించింది. పొరుగు జిల్లాలలో శిక్షణ తరగతులు ప్రారంభమైనా మన జిల్లాలో మాత్రం వీటిని నిర్వహించటంలో వెనకబడింది. ఇప్పటికీ తేదీలను ఖరారు చేయటంలో తలమునకలవుతుందే తప్ప వేగం పుంజుకోలేదు. మారుతున్న బోధనా మెలకువలను సకాలంలో ఉపాధ్యాయులకు అందించటంలో ఎస్ఎస్ఏ వేగం పెంచాల్సి ఉంది. వేసవి సెలవుల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తే ప్రయోజనం ఉండేది. ఈ విద్యా సంవత్సరంలో ఎస్ఎస్ఏ వేగవంత చర్యలు చేపట్టలేదనేది దీన్నిబట్టి తేటతెల్లమవుతోంది. కన్పించని స్కూల్ కాంప్లెక్స్‌లు: నెల వారీగా విద్యా ప్రగతి చర్చించుకుని లోపాలను సరిదిద్దుకొంటూ విద్యా ప్రమాణాల మెరుగుకోసం కృషి చేసే వేదిక స్కూల్ కాంప్లెక్స్‌లు. వీటిని నిర్వహించడంలో ఎస్ఎస్ఏ వెనకబడింది. గత సంవత్సరం స్కూల్ కాంప్లెక్స్‌లకు నిధులు మంజూరైనా సమావేశాలు నిర్వహించలేదు. 279 స్కూలు కాంప్లెక్స్ కేంద్రాలు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. దీని కోసం ఏర్పాటైన సీఆర్పీ వ్యవస్థ అమలులో ఉన్నా కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణలో సత్వర చర్యలు కన్పించటం లేదు. వీటిపై ఎస్ఎస్ఏ తక్షణ నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందని నిధులు: పాఠశాలలు ప్రారంభమై నెలన్నర రోజులవుతున్నా పాఠశాలల అభివృద్ధి నిధులను ఎస్ఎంసీ ఖాతాలలో జమచేయటంలో నిర్లక్ష్యం కన్పిస్తోంది. పాఠశాలల వైపు విద్యార్థులను ఆకర్షించటం కోసం భవనాల మెరుగుకు నిధులను ఇప్పటికీ వెచ్చించకపోవటం అధికారుల అలసత్వాన్ని ఎత్తి చూపుతోంది. డ్రాపౌట్ల శాతాన్ని తగ్గించాలని పదేపదే చెప్పే ఎస్ఎస్ఏ ఇలాంటి కీలక నిర్ణయాలు సకాలంలో ఎందుకు తీసుకోలేకపోతోందనే విమర్శలు ఉన్నాయి. నిధులను వెంటనే విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను పటిష్టపరిచే దిశగా చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. బాలకార్మిక వ్యవస్థపై చర్యలేవి: బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. బడిఈడు పిల్లలు బాలకార్మికులుగా అనేక చోట్ల దర్శనమిస్తున్నారు. గతంలో మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలాన్ని బాలకార్మిక రహిత మండలంగా ప్రకటించినప్పటికీ ఇక్కడ అనేక మంది బాలకార్మికులు ఉన్నారు. తగినన్ని నిధులున్నా బాలకార్మిక వ్యవస్థను రూపుమాపటంలో ఎస్ఎస్ఏ ఏ మాత్రం శ్రద్ధ కన బరచటం లేదనే విమర్శలు అధికంగా ఉన్నాయి. ఎస్ఎస్ఏ విధానాల్లో మార్పులు రావాలి ప్రాథమిక విద్యా కార్యకలాపాల్లో ఎస్ఎస్ఏ వేగం పెంచాలి. వెంటనే పర్యవేక్షణా విభాగాన్ని సంస్కరించాలి. సీఆర్పీ వ్యవస్థను ప్రక్షాళన చేసి, పాఠశాలల గ్రాంటును వెంటనే విడుదల చేయాలి. పాఠశాలల్లో కనీస వసతులైన భవన, మరుగుదొడ్లు, వంటగదులు, నీటి వసతిని మెరుగుపరిచే చర్యలు తక్షణం చేపట్టాలి. యూనిఫారాలను విద్యార్థులకు సరఫరా చేయాలి. - సీవీ. ప్రసాద్, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి