ఆరోగ్యం వెం‘బడి’... | Organic farming in Siddipet district Nancharpalli Government school | Sakshi
Sakshi News home page

ఆరోగ్యం వెం‘బడి’...

Published Mon, Jan 10 2022 5:18 AM | Last Updated on Mon, Jan 10 2022 8:24 AM

Organic farming in Siddipet district Nancharpalli Government school - Sakshi

నాంచార్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో కూరగాయలు కోస్తున్న విద్యార్థులు

సాక్షి, సిద్దిపేట: విద్యార్థులకు సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయల ద్వారా పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో సిద్దిపేట జిల్లా అర్బన్‌ మండలం నాంచార్‌పల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పండిస్తున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కిచెన్‌ గార్డెన్‌లో సేంద్రియ ఎరువులతో పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరలతో 45 రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.  

12 మందితో కమిటీ 
కూరగాయల సాగుకోసం ప్రత్యేకంగా 12 మంది విద్యార్థులతో కిచెన్‌ గార్డెన్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ విద్యార్థులు ప్రతి రోజు ఉదయం 20 నిమిషాలు పాఠశాల సమయానికంటే ముందుగా రావడం, తరగతులు ముగిసిన తర్వాత మరో 15 నిమిషాల పాటు కిచెన్‌ గార్డెన్‌లో కలుపు తీత, మొక్కలకు నీళ్లు పెట్టడం.. వాటిని పరిరక్షించడం చేస్తుంటారు. దీంతో విద్యార్థులకు పంటలు ఎలా పండిస్తారనే అవగాహనతో పాటు పని పట్ల గౌరవం కలుగుతోందని ఉపాధ్యాయులు చెబతున్నారు.  

ఇతరులు తీసుకోకుండా.. 
పాఠశాలలో ఏర్పాటు చేసిన కిచెన్‌ గార్డెన్‌కు గ్రామ పంచాయతీ సహకారం కూడా అందుతోంది. కిచెన్‌ గార్డెన్‌కు సేంద్రియ ఎరువులను పంచాయతీ ఉచితంగా అందజేస్తోంది. పాఠశాలలో పండిన కూరగాయలను గ్రామస్తులు ఎవరూ కోసుకుపోవద్దని చాటింపు సైతం చేశారు. కూరగాయలు తెంచినట్లు తెలిస్తే వారికి రూ.10 వేల జరిమానా విధిస్తామని ప్రకటించారు.

సాగు చేస్తున్న కూరగాయలు
సొరకాయ, బీర, వంకాయ, కాకర, టమాటా, దోసకాయ, చిక్కుడు, గోరు చిక్కుడు, బెండకాయ, పాలకూర, తోటకూర, సుక్క కూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర, ఉల్లిఆకు, పచ్చిమిర్చి. నాంచార్‌పల్లి ప్రభు త్వ ప్రాథమికోన్నత పాఠశాల 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1– 7వ తరగతి వరకు 166 మంది విద్యార్థులున్నారు. స్కూల్‌ ఆవరణలో 5 గుంటల స్థలంలో గత అక్టోబర్‌ నెలలో పలు రకాల కూరగాయల విత్తనాలు నాటారు. నవంబర్‌ 30 నుంచి కాత మొదలైంది. అప్పటి నుంచి పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పండించిన కాయగూరలనే మధ్యాహ్న భోజనంలో ఆహారంగా అందిస్తున్నారు. తాజా కాయగూరలతో రోజుకో రకమైన వంటకాన్ని అందిస్తున్నారు. ఎలాంటి పురుగు మందులను వినియోగించకుండా కేవలం సేంద్రియ ఎరువుల ద్వారానే సాగు చేస్తుండటంతో విద్యార్థులకు మంచి పౌష్టికాçహారం అందుతోంది. సంపూర్ణ ఆరోగ్యం అందించే తాజా కూరగాయలతో మధ్యాహ్న భోజనం అందించడంపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

పౌష్టికాహారం అందించడమే లక్ష్యం 
విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో పాఠశాల ఆవరణలో కిచెన్‌ గార్డెన్‌ను ఏర్పాటు చేశాం. 45 రోజుల నుంచి బడిలో పండించిన కూరగాయలతోనే మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. పంచాయతీ, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడం సంతోషంగా ఉంది. 
– పద్మావతి, ప్రధానోపాధ్యాయురాలు 

ఎంతో రుచికరం
మా స్కూల్‌లో పండించిన కూరగాయలతో మధ్యాహ్న భోజనం చేయడం చాలా ఆనందంగా ఉంది. తాజాగా ఉండడం, పురుగు మందుల వినియోగం లేకపోవడంతో వంటలు ఎంతో రుచికరంగా ఉంటున్నాయి. ప్రతీ రోజు పాఠశాల సమయం కంటే ముందు వచ్చి కొద్ది సేపు వాటి రక్షణకు కేటాయిస్తాం. ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరం నిత్యం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. 
–పూజ, 7వ తరగతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement