Fresh vegetables
-
ఆరోగ్యం వెం‘బడి’...
సాక్షి, సిద్దిపేట: విద్యార్థులకు సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయల ద్వారా పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం నాంచార్‌పల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పండిస్తున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్లో సేంద్రియ ఎరువులతో పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరలతో 45 రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. 12 మందితో కమిటీ కూరగాయల సాగుకోసం ప్రత్యేకంగా 12 మంది విద్యార్థులతో కిచెన్ గార్డెన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ విద్యార్థులు ప్రతి రోజు ఉదయం 20 నిమిషాలు పాఠశాల సమయానికంటే ముందుగా రావడం, తరగతులు ముగిసిన తర్వాత మరో 15 నిమిషాల పాటు కిచెన్ గార్డెన్లో కలుపు తీత, మొక్కలకు నీళ్లు పెట్టడం.. వాటిని పరిరక్షించడం చేస్తుంటారు. దీంతో విద్యార్థులకు పంటలు ఎలా పండిస్తారనే అవగాహనతో పాటు పని పట్ల గౌరవం కలుగుతోందని ఉపాధ్యాయులు చెబతున్నారు. ఇతరులు తీసుకోకుండా.. పాఠశాలలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్‌కు గ్రామ పంచాయతీ సహకారం కూడా అందుతోంది. కిచెన్ గార్డెన్‌కు సేంద్రియ ఎరువులను పంచాయతీ ఉచితంగా అందజేస్తోంది. పాఠశాలలో పండిన కూరగాయలను గ్రామస్తులు ఎవరూ కోసుకుపోవద్దని చాటింపు సైతం చేశారు. కూరగాయలు తెంచినట్లు తెలిస్తే వారికి రూ.10 వేల జరిమానా విధిస్తామని ప్రకటించారు. సాగు చేస్తున్న కూరగాయలు సొరకాయ, బీర, వంకాయ, కాకర, టమాటా, దోసకాయ, చిక్కుడు, గోరు చిక్కుడు, బెండకాయ, పాలకూర, తోటకూర, సుక్క కూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర, ఉల్లిఆకు, పచ్చిమిర్చి. నాంచార్‌పల్లి ప్రభు త్వ ప్రాథమికోన్నత పాఠశాల 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1– 7వ తరగతి వరకు 166 మంది విద్యార్థులున్నారు. స్కూల్ ఆవరణలో 5 గుంటల స్థలంలో గత అక్టోబర్ నెలలో పలు రకాల కూరగాయల విత్తనాలు నాటారు. నవంబర్ 30 నుంచి కాత మొదలైంది. అప్పటి నుంచి పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పండించిన కాయగూరలనే మధ్యాహ్న భోజనంలో ఆహారంగా అందిస్తున్నారు. తాజా కాయగూరలతో రోజుకో రకమైన వంటకాన్ని అందిస్తున్నారు. ఎలాంటి పురుగు మందులను వినియోగించకుండా కేవలం సేంద్రియ ఎరువుల ద్వారానే సాగు చేస్తుండటంతో విద్యార్థులకు మంచి పౌష్టికాçహారం అందుతోంది. సంపూర్ణ ఆరోగ్యం అందించే తాజా కూరగాయలతో మధ్యాహ్న భోజనం అందించడంపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పౌష్టికాహారం అందించడమే లక్ష్యం విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్‌ను ఏర్పాటు చేశాం. 45 రోజుల నుంచి బడిలో పండించిన కూరగాయలతోనే మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. పంచాయతీ, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడం సంతోషంగా ఉంది. – పద్మావతి, ప్రధానోపాధ్యాయురాలు ఎంతో రుచికరం మా స్కూల్లో పండించిన కూరగాయలతో మధ్యాహ్న భోజనం చేయడం చాలా ఆనందంగా ఉంది. తాజాగా ఉండడం, పురుగు మందుల వినియోగం లేకపోవడంతో వంటలు ఎంతో రుచికరంగా ఉంటున్నాయి. ప్రతీ రోజు పాఠశాల సమయం కంటే ముందు వచ్చి కొద్ది సేపు వాటి రక్షణకు కేటాయిస్తాం. ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరం నిత్యం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. –పూజ, 7వ తరగతి -
టమాటా నిల్వ సామర్థ్యం రెట్టింపు!
పండు టమాటాలు ఫ్రిజ్‌లో పెట్టకుండా (గది ఉష్ణోగ్రతలో) ఉంచితే సాధారణంగా వారం గడిచేటప్పటికి ముడతలు వచ్చి కుళ్లిపోవడం ప్రారంభమవుతుంది. అయితే, విశాఖపట్నానికి చెందిన శ్రీమతి దూబ రాజు అనే గృహిణి తయారు చేసిన హెర్బల్ ద్రావణంలో ముంచి తీసి నిల్వ చేసిన టమాటోలు మాత్రం రెండు వారాలకు పైగానే తాజాగా ఉంటున్నాయి. టమాటోల సీజన్లో మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు 10–15 రోజులు రైతులు నిల్వ చేసుకోగలిగితే వారి నికరాదాయం బాగా పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ఆకుకూరల రసాలను ఉపయోగించి శ్రీమతి రాజు తన సొంత ఆలోచనతో ఒక హెర్బల్ ద్రావణాన్ని రెండేళ్ల క్రితం తయారు చేశారు. లీటరు నీటికి 10 ఎం.ఎల్. ద్రావణం ఈ ద్రావణం 10 ఎం.ఎల్.ను లీటరు నీటిలో కలిపి.. ఆ నీటిలో టమాటోలను 10 నిమిషాలు నానబెట్టి.. బయటకు తీసి ట్రేలలో నిల్వ చేసుకుంటే సాధారణం కన్నా రెట్టింపు రోజులు నిల్వ ఉంటున్నాయని ఆమె తెలిపారు. రాగి, వెండి, ఇత్తడి తదితర పాత్రలు, వస్తువులను సమర్థవంతంగా శుభ్రం చేయగల హెర్బల్ ద్రావణాన్ని శ్రీమతి రాజు గతంలో తయారు చేశారు. అనేక దేవాలయాల్లో వెండి, బంగారం, రాగి, ఇత్తడి పాత్రలను సురక్షితంగా శుభ్రం చేయడానికి వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టమాటో రైతులకు ఉపయోగపడేలా ఈ ద్రావణాన్ని తయారు చేశానని ఆమె తెలిపారు. రైతు బజారులో కొనుగోలు చేసి తెచ్చిన టమాటోలను.. ఈ ద్రావణంలో ముంచి తీసి.. వాటిని ప్లాస్టిక్ ట్రేలలో నింపి, వాటిపైన గోనె సంచి లేదా పాత నూలు చీరను పైన కప్పానని ఆమె తెలిపారు. నెల రోజుల వరకు కుళ్లిపోకుండా ఉన్నాయన్నారు. నూటికి నూరు శాతం ఆకుకూరల రసాలతోనే దీన్ని తయారు చేశానని అంటూ.. ఈ ద్రావణంలో ముంచిన టమాటోల నిల్వ సామర్థ్యం రెట్టింపవుతుందే తప్ప వాటిని తిన్న వారి ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదని ఆమె అంటున్నారు. కృషి విజ్ఞాన కేంద్రంలో అధ్యయనం విశాఖపట్నం జిల్లాలోని భాగవతుల చారిటబుల్ ట్రస్టు కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ ద్రావణాన్ని ఉపయోగించి టమాటోల నిల్వ సామర్థ్యంపై 2017 ఎండాకాలంలో అధ్యయనం జరిగింది. సెంచూరియన్ యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఈ ద్రావణాన్ని పరీక్షించి చూడగా.. పండు టమాటోల నిల్వ సామర్థ్యం రెట్టింపైందని కేవీకే అధిపతి డాక్టర్ కుర్రా శైలజ తెలిపారు. పండిన, కరపచ్చిగా ఉన్న, పచ్చిగా ఉన్న టమాటాలను మూడేసి చొప్పున తీసుకొని నెల రోజులపాటు పరిశీలించారు. ద్రావణంలో ముంచి తీసిన టమాటోలతోపాటు సాధారణ టమాటోలను గది ఉష్ణోగ్రతలోను, వరండాలోను ట్రేలలో నిల్వ చేశారు. గదిలో ఉంచిన పండిన టమాటాలు మామూలువి 8–10 రోజులు మార్కెట్లో అమ్మదగినంత తాజాగా ఉండగా, ద్రావణంలో ముంచినవి 16–20 రోజులు తాజాదనాన్ని కోల్పోకుండా ఉన్నాయని డాక్టర్ శైలజ తెలిపారు. దోరగా ఉన్న టమాటోలు మామూలువి 12–14 రోజులు అమ్మదగినంత బాగుంటే.. ద్రావణంలో ముంచినవి 22–24 రోజుల పాటు నిల్వ ఉన్నాయి. గది వెలువల వరండాలో నిల్వ చేసిన టమాటోలు 4 రోజుల ముందే వడలిపోయాయని ఆమె తెలిపారు. కొద్ది పరిమాణంలో టమాటోలనే నిల్వ చేసి చూశామని, భారీ పరిమాణంలో నిల్వ చేసినప్పుడు ఫలితం ఎలా ఉండేదీ పరీక్షించాల్సి ఉందని డా. శైలజ వివరించారు. శ్రీమతి రాజు భర్త కనకారావు తోడ్పాటుతో ఈ ద్రావణాన్ని తయారు చేసి అర లీటరు రూ. వందకు విక్రయిస్తున్నారు. ఈ ద్రావణం టమాటో రైతులతోపాటు వినియోగదారులు కూడా ఉపయోగించుకోవచ్చని శ్రీమతి రాజు(96421 13002, 95738 19031) అంటున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు అనుబంధంగా ఉన్న నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, పల్లెసృజన సంస్థల ద్వారా శాస్త్రీయ పరీక్షలు జరిపించి, పేటెంట్‌కు దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె వివరించారు. శ్రీమతి దూబ రాజు -
అసలుకు కొసరు
సాక్షి, సిటీబ్యూరో : సమైక్యాంధ్ర సమ్మె కారణంగా నగరానికి కొన్నిరకాల కూరగాయల దిగుమతి నిలిచిపోయింది. ఈ కొరతను ఆసరా చేసుకొని వ్యాపారులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. తక్కువ రేటుకు తాజా కూరగాయలు లభిస్తాయని రైతుబ జార్‌కు వెళితే అక్కడ తిరుక్షవరం అవుతోంది. అక్కడ బోర్డుపై రాసినరేట్లకు... అమ్మే ధరకు ఏమాత్రం పొంతన ఉండట్లేదు. పచ్చిమిర్చి, ఉల్లి, క్యాప్సికం, క్యారెట్ వంటి వాటి ధరల్లో కేజీకి 5-20 రూపాయలు తేడా ఉంటోంది. నిజానికి నగరంలోని అన్ని రైతుబ జార్లలో ఒకే ధరను అమలు చేయాల్సి ఉండగా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నగర మార్కెట్లో పచ్చిమిర్చి, ఉల్లి కొరతను ఆసరా చేసుకొని ఉల్లి వ్యాపారులు, రైతులు ఎవరికిష్టమొచ్చినట్లు వారు ధర నిర్ణయించి వినియోగదారులను దగా చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని పది రైతుబ జార్లలో కూరగాయల ధరలు ఒక్కోచోట ఒక్కోవిధంగా ఉండటం అక్రమాల తీరుకు అద్దం పడుతోంది. బోర్డుతో సరి నగరంలోని అన్ని రైతుబజార్లలో బోర్డుపై కూరగాయల ధరలు పెద్దఅక్షరాలతో రాస్తున్నా... వాటినెవరూ అనుసరించట్లేదు. డిమాండ్ అధికంగా ఉన్న కూరగాయలకు బోర్డుపై ఉన్న ధరకు రూ.5-20లు ఎక్కువ ధర చెప్పి, కంటితుడుపుగా రూ.2-3 తగ్గించి విక్రయాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా పచ్చిమిర్చి, క్యాప్సికం, క్యారెట్, ఉల్లి, వెల్లుల్లి, అల్లం వంటి వాటి విషయంలో వ్యాపారులు చెప్పిందే సిసలైన ధరగా చెలామణి అవుతోంది. వీటి ధరలు హోల్‌సేల్ మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా నిర్ణయించేస్తున్నారు. వీరికి రైతుబజార్ల సిబ్బంది కూడా పూర్తిగా సహకరిస్తుండటంతో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఎర్రగడ్డ, మెహిదీపట్నం, సరూర్‌నగర్, ఫలక్‌నుమా, వనస్థలిపురం రైతుబజార్లలో ఏకంగా వారికిష్టమొచ్చిన ధరనే బోర్డుపై రాయిస్తూ వినియోగదారుడిని నిలువునా దగా చేస్తున్నారు. ఎర్రగడ్డ, మెహిదీపట్నం, సరూర్‌నగర్ రైతుబజార్లలో వ్యాపారుల తీరు మరీ దారుణంగా ఉంది. మిర్చి పావు కిలో రూ.20ల ప్రకారం వసూలు చేస్తున్నారు. ఎవరైనా నిల దీస్తే... ‘మీకు ఇష్టమైతే కొనండి, లేదంటే వెళ్లండి’ అంటూ సమాధానమిస్తున్నారు. దీనిపై రైతుబ జార్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోవట్లేదని వినియోగదారులు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఉదయం 10గం.లు దాటితే రైతుబజార్లలో ఎస్టేట్ ఆఫీసర్, సూపర్వైజర్లే కన్పించరనీ, ఈ అక్రమాల్లో వారికీ వాటా ఉండటంతో ముఖం చాటేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తనిఖీలు ఏవీ..? రైతుబజార్లపై అధికారుల తనిఖీలు లేకపోవడం వల్లే అక్రమార్కులు పెట్రేగిపోతున్నారు. సబ్సిడీ ఉల్లి గుట్టు గా తరలిపోతున్నా.. ప్రశ్నించే నాధుడే లేడు. అందుకే రైతుబజార్‌కు సరుకు వచ్చిన గంటలోనే కౌంటర్లో నో స్టాక్ బోర్డు దర్శనమిస్తోంది. నిజానికి హోల్‌సేల్ మార్కెట్ ధరకు 20శాతం అధికంగా రేటు నిర్ణయించి రైతుబ జార్లలో అమలు చేయాలి. ఈ ధరలు కూడా అన్ని రైతుబజార్లలో ఒకే విధంగా ఉండాలన్నది నిబంధన. అయితే... ఆ ధరతో సంబంధం లేకుండా వ్యాపారులు సొంత ధరలను అమలు చేస్తున్నారు. సిబ్బందితో కుమ్మక్కై అధిక ధరలు బోర్డుపై రాయిస్తూ... అందుకు ప్రతిఫలంగా ఏరోజుకారోజు మామూళ్లు ముట్టచెప్పే వ్యవహారం గుట్టుగా సాగుతోంది. ఈ అవకతవకలపై రైతుబజార్ సీఈఓ ఎం.కె.సింగ్ దృష్టిపెట్టక పోవడంతో అక్రమాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి.