అసలుకు కొసరు
సాక్షి, సిటీబ్యూరో : సమైక్యాంధ్ర సమ్మె కారణంగా నగరానికి కొన్నిరకాల కూరగాయల దిగుమతి నిలిచిపోయింది. ఈ కొరతను ఆసరా చేసుకొని వ్యాపారులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. తక్కువ రేటుకు తాజా కూరగాయలు లభిస్తాయని రైతుబ జార్‌కు వెళితే అక్కడ తిరుక్షవరం అవుతోంది. అక్కడ బోర్డుపై రాసినరేట్లకు... అమ్మే ధరకు ఏమాత్రం పొంతన ఉండట్లేదు. పచ్చిమిర్చి, ఉల్లి, క్యాప్సికం, క్యారెట్ వంటి వాటి ధరల్లో కేజీకి 5-20 రూపాయలు తేడా ఉంటోంది. నిజానికి నగరంలోని అన్ని రైతుబ జార్లలో ఒకే ధరను అమలు చేయాల్సి ఉండగా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నగర మార్కెట్లో పచ్చిమిర్చి, ఉల్లి కొరతను ఆసరా చేసుకొని ఉల్లి వ్యాపారులు, రైతులు ఎవరికిష్టమొచ్చినట్లు వారు ధర నిర్ణయించి వినియోగదారులను దగా చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని పది రైతుబ జార్లలో కూరగాయల ధరలు ఒక్కోచోట ఒక్కోవిధంగా ఉండటం అక్రమాల తీరుకు అద్దం పడుతోంది.
బోర్డుతో సరి
నగరంలోని అన్ని రైతుబజార్లలో బోర్డుపై కూరగాయల ధరలు పెద్దఅక్షరాలతో రాస్తున్నా... వాటినెవరూ అనుసరించట్లేదు. డిమాండ్ అధికంగా ఉన్న కూరగాయలకు బోర్డుపై ఉన్న ధరకు రూ.5-20లు ఎక్కువ ధర చెప్పి, కంటితుడుపుగా రూ.2-3 తగ్గించి విక్రయాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా పచ్చిమిర్చి, క్యాప్సికం, క్యారెట్, ఉల్లి, వెల్లుల్లి, అల్లం వంటి వాటి విషయంలో వ్యాపారులు చెప్పిందే సిసలైన ధరగా చెలామణి అవుతోంది. వీటి ధరలు హోల్‌సేల్ మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా నిర్ణయించేస్తున్నారు. వీరికి రైతుబజార్ల సిబ్బంది కూడా పూర్తిగా సహకరిస్తుండటంతో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
నిత్యం రద్దీగా ఉండే ఎర్రగడ్డ, మెహిదీపట్నం, సరూర్‌నగర్, ఫలక్‌నుమా, వనస్థలిపురం రైతుబజార్లలో ఏకంగా వారికిష్టమొచ్చిన ధరనే బోర్డుపై రాయిస్తూ వినియోగదారుడిని నిలువునా దగా చేస్తున్నారు. ఎర్రగడ్డ, మెహిదీపట్నం, సరూర్‌నగర్ రైతుబజార్లలో వ్యాపారుల తీరు మరీ దారుణంగా ఉంది. మిర్చి పావు కిలో రూ.20ల ప్రకారం వసూలు చేస్తున్నారు. ఎవరైనా నిల దీస్తే... ‘మీకు ఇష్టమైతే కొనండి, లేదంటే వెళ్లండి’ అంటూ సమాధానమిస్తున్నారు. దీనిపై రైతుబ జార్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోవట్లేదని వినియోగదారులు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఉదయం 10గం.లు దాటితే రైతుబజార్లలో ఎస్టేట్ ఆఫీసర్, సూపర్‌వైజర్లే కన్పించరనీ, ఈ అక్రమాల్లో వారికీ వాటా ఉండటంతో ముఖం చాటేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
తనిఖీలు ఏవీ..?
రైతుబజార్లపై అధికారుల తనిఖీలు లేకపోవడం వల్లే అక్రమార్కులు పెట్రేగిపోతున్నారు. సబ్సిడీ ఉల్లి గుట్టు గా తరలిపోతున్నా.. ప్రశ్నించే నాధుడే లేడు. అందుకే రైతుబజార్‌కు సరుకు వచ్చిన గంటలోనే కౌంటర్‌లో నో స్టాక్ బోర్డు దర్శనమిస్తోంది. నిజానికి హోల్‌సేల్ మార్కెట్ ధరకు 20శాతం అధికంగా రేటు నిర్ణయించి రైతుబ జార్లలో అమలు చేయాలి. ఈ ధరలు కూడా అన్ని రైతుబజార్లలో ఒకే విధంగా ఉండాలన్నది నిబంధన. అయితే... ఆ ధరతో సంబంధం లేకుండా వ్యాపారులు సొంత ధరలను అమలు చేస్తున్నారు. సిబ్బందితో కుమ్మక్కై అధిక ధరలు బోర్డుపై రాయిస్తూ... అందుకు ప్రతిఫలంగా ఏరోజుకారోజు మామూళ్లు ముట్టచెప్పే వ్యవహారం గుట్టుగా సాగుతోంది. ఈ అవకతవకలపై రైతుబజార్ సీఈఓ ఎం.కె.సింగ్ దృష్టిపెట్టక పోవడంతో అక్రమాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి.