School students suffering for education in Telangana villages - Sakshi
Sakshi News home page

అక్షరాలా కష్టాలే.. తెలంగాణలో ప్రభుత్వ బడి లేని ఊళ్లు 3,688

Published Thu, Mar 23 2023 1:01 AM | Last Updated on Thu, Mar 23 2023 3:29 PM

School students suffering in Telangana villages for Education - Sakshi

హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న సిద్దిపేట జిల్లాలోనే అత్యధికంగా 314 శివారు గ్రామాల్లో స్కూళ్లు లేని పరిస్థితి ఉంది. 284 శివారు గ్రామాల్లో పాఠశాలలు లేని  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆ తర్వాతి స్థానంలో ఉంది.

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం జైత్రం తండా గ్రామ విద్యార్థులు ఉన్నత పాఠశాల కోసం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి ఆటోలో వెళ్తున్నారు. కిక్కిరిసిన ఆటో ఎప్పుడు ఏ ప్రమాదానికి గురవుతుందోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతోంది. అందరికీ విద్య ప్రాథమిక హక్కు అని మన రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. కానీ ఇప్పటికీ, ఇన్నేళ్లు గడిచినా.. ఎన్నో గ్రామాలకు విద్య దూరంగానే ఉంది. ప్రాథమిక విద్యకు సైతం వ్యయప్రయాసలకోర్చి పక్క ఊరికో, ఆ పక్క ఊరికో వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక మాధ్యమిక, ఉన్నత పాఠశాల కోసం మరింత దూరం ప్రయాణించక తప్పని పరిస్థితి ఉంది.

మన రాష్ట్రాన్నే చూసుకుంటే.. 3,688 శివారు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలే లేదు. 546 శివారు గ్రామాల్లో అక్షరాలు దిద్దించే ప్రాథమిక పాఠశాల లేదు. 2,018 గ్రామాలు మాధ్యమిక విద్యకు దూరంగా ఉన్నాయి. 2,508 శివారు గ్రామాల్లో ఉన్నత పాఠశాల లేదు. రాష్ట్రవ్యాప్తంగా 30,395 మంది చిన్నారులు చదువు కోసం 3 నుంచి 5 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తోంది.

నడుచుకుంటూనో, కిక్కిరిసిన ఆటోల్లోనో, సైకిళ్ళ మీదో దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. కొద్దిపాటి వర్షం వచ్చినా బురదగా మారే రోడ్ల మీద అష్టకష్టాలు పడుతూ విద్యనభ్యసిస్తున్నారు. ఉచిత, నిర్బంధ విద్య కింద 10 నెలల రవాణా భత్యం ప్రభుత్వం ఇస్తుంది. కానీ పెరిగిన డీజీల్‌ చార్జీల కారణంగా చుక్కలనంటే ఆటో చార్జీలకు ఇవి ఏమాత్రం సరిపోవడం లేదని మారుమూల గ్రామాల పేద ప్రజలు అంటున్నారు.

ఈ పరిస్థితులు విద్యపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. స్కూల్‌ దశలోనే చదువు మానేసేవారి (డాపవుట్స్‌) సంఖ్య పెరుగుతోంది. విద్యకు దూరమవుతున్న వారిలో ఎక్కువ శాతం వెనుకబడిన ప్రాంతాల నిరుపేదలే ఉంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ‘యూ డైస్‌’ (యూనిఫైడ్‌ డిస్క్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌) నివేదిక ఈ విషయాలన్నీ స్పష్టం చేస్తోంది. 

ఎంతెంత దూరం.. 
► భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గుంపాడుకు సమీపంలోని గిరిజన గ్రామాల విద్యార్థులు కనీసం 4 కిలోమీటర్ల మేర ప్రయాణించి చదువుకోవాల్సి వస్తోంది. సంవత్సరంలో కనీసం 70 రోజులు బురదతో నరక యాతన పడుతున్నారు.– 

► ఆదిలాబాద్‌ జిల్లాలో 162 శివారు గ్రామాల్లో అక్షరం చెప్పే దిక్కే లేదు. మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నిర్మల్, పెద్దపల్లి.. ఇలా పలు జిల్లాల్లో..ఒక్కో జిల్లాలో 150కి పైగా శివారు గ్రామాల్లో స్కూళ్ళు లేవు.  

► మెదక్‌ జిల్లా తూప్రాన్‌ సమీకృత వసతి గృహంలో ఉండే విద్యార్థులు 2.5 కిలో మీటర్ల దూరంలోని స్కూలుకు వెళ్తున్నారు.   

మధ్యలోనే మానేస్తున్నారు 
    చదువుపై పెద్దగా అవగాహన లేని శివారు గ్రామస్తులు, ముఖ్యంగా పేద కుటుంబాల వారు పిల్లలను దూర ప్రాంతాలకు పంపేందుకు ఇష్టపడటం లేదు. దగ్గర్లో ఉన్న స్కూల్‌ విద్యకే పరిమితం చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో గత ఏడాది 13.7 శాతం మంది విద్యార్థులు టెన్త్‌ క్లాస్‌కు వచ్చేసరికే చదువు మానేశారు. ఇందులో 12.9 శాతం బాలికలే ఉన్నారు.

ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌లో చదివే విద్యార్థులకు జూనియర్‌ కాలేజీ అందుబాటులో లేదు. దీంతో తల్లిదండ్రులు బాలికలను టెన్త్‌తోనే ఆపేస్తున్నారు. గడచిన రెండేళ్ళలో 18 మంది ఇలా విద్యకు దూరమయ్యారు. వీరిలో ఎక్కువ మందికి వివాహాలు కూడా జరిగాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో 8–10 తరగతుల బాలికలను పాఠశాలకు వెళ్లని కారణంగా పెళ్ళిళ్ళు చేసేస్తున్నట్టు గుర్తించారు.

ఇలా గడచిన రెండేళ్ళలో 19 మందికి వివాహాలైనట్టు ప్రభుత్వ సర్వేల్లో తేలింది. స్కూళ్ళు, కాలేజీలు అందుబాటులో లేకపోవడం వల్లే చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. శివారు తండాల వరకూ ప్రభుత్వ స్కూళ్ళను తీసుకెళ్తే తప్ప ఈ పరిస్థితిలో మార్పు రాదని స్పష్టం చేస్తున్నారు.  

చదవాలంటే నడవాల్సిందే.. 
ఈ బడి పిల్లల కష్టాల గురించి ‘యూ డైస్‌’.. తమ నివేదికలో ప్రస్తావించింది. గిరిజన గ్రామమైన కొండతోగు.. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉంది. ఇక్కడ దాదాపు 21 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా చదువుకోవడం కోసం 3 కిలోమీటర్ల దూరంలోని పండువారిగూడేనికి నడిచి వెళ్తున్నారు. ఇలా రోజూ రానూపోనూ ఆరు కిలోమీటర్లు నడవాల్సిందే.. మామూలు రోజుల్లోనే ఈ మార్గంలో నడవడం కష్టం.. ఇక, వానొస్తే అంతే..  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement