అప్రమత్తమైన తెలంగాణ సర్కారు.. ‘తొలిమెట్టు’తో పట్టు!  | Telangana Govt Schools To Start Tholimettu Program | Sakshi
Sakshi News home page

అప్రమత్తమైన తెలంగాణ సర్కారు.. ‘తొలిమెట్టు’తో పట్టు! 

Published Mon, Aug 1 2022 3:10 AM | Last Updated on Mon, Aug 1 2022 2:42 PM

Telangana Govt Schools To Start Tholimettu Program - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్‌లో వెనుకబడి పోతున్నారని, గణితమంటే వణికిపోతున్నారని.. పలు సర్వేలు తేల్చిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. 1 నుంచి 5 తరగతుల విద్యార్థుల్లో ప్రమాణాలు పెంచేందుకు, అభ్యసన మెలకువలు అభివృద్ధి చేసేందుకు ‘తొలిమెట్టు’కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇది మొదలుకానుంది. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో రిసోర్స్‌ పర్సన్స్‌కు శిక్షణ ఇచ్చారు. వారిద్వారా జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.

ఏదో సిలబస్‌ పూర్తి చేశామనిపించు కోవడం కాకుండా, అర్థవంతమైన బోధన చేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధానోద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. తొలిమెట్టు ద్వారా జరిగే పురోగతిని ప్రతినెలా ఉన్నతాధికారులు సమీక్షించనున్నారు. అవసరమైతే మరిన్ని మార్పులతో తొలిమెట్టును విజయవంతం చేయాలని భావిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

3లో భాష గోస.. 
నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే–2021 ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లోని 1–5 తరగతుల మధ్య విద్యార్థులకు కనీస పరిజ్ఞానం ఉండటం లేదు. రాష్ట్ర పరిధిలోని ఎస్‌సీఈఆర్‌టీ అధ్యయనం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. భాష (తెలుగు, ఇంగ్లిష్‌ ఇతరాలు) విషయంలో 3వ తరగతి విద్యార్థుల్లో 52 శాతం మంది కనీస పరిజ్ఞానం కన్నా తక్కువ స్థాయిలో ఉన్నారు. కనీస స్థాయిలో ఉన్న వాళ్ళు 26 శాతమైతే, కాస్త పట్టున్న వాళ్ళు కేవలం 16 శాతమే. గణితంలో చిన్న చిన్న కూడికలు కూడా అర్థం కాని వాళ్ళు 43 శాతం, క్లూ అందిస్తే నెట్టుకొచ్చేవాళ్ళు 32 శాతం (బేసిక్‌) ఉన్నారు. 3వ తరగతిలో ఉండాల్సిన పరిజ్ఞానం కేవలం 20 శాతం మందిలోనే కన్పిస్తోంది.  

5లో తప్పుతున్న లెక్క! 
ఐదవ తరగతిలో భాషపై ఏమాత్రం పట్టు లేని వాళ్ళు (బేసిక్‌ స్థాయికన్నా తక్కువ) 35 శాతం ఉంటే, బేసిక్స్‌ స్థాయిలో 41 శాతం ఉన్నారు. కొద్దోగొప్పో ఫర్వాలేదు అన్న వాళ్ళు 19 శాతమే ఉన్నారు. గణితంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏ లెక్కయిన చేయగల విద్యార్థులు కేవలం 10 శాతమే ఉన్నారు. బేసిక్స్‌ దగ్గరే ఆగిపోయే వాళ్ళు 40 శాతం ఉంటే, అసలేమీ తెలియని వాళ్ళు (బేసిక్స్‌ స్థాయిలో లోపల) 49 శాతం ఉన్నారు. 2017–21 మధ్య భాషలు, గణితంలో ప్రమాణాలు మరీ తగ్గిపోయాయి.  

తొలిమెట్టుతో ఇలా.. 
విద్యార్థిపై రోజూ అదనంగా ఓ గంట ప్రత్యేక దృష్టి పెడతారు. ముందుగా అతను ఏ స్థాయిలో ఉన్నాడనేది క్లాస్‌ టీచర్‌ అంచనా వేస్తారు. దానికి అనుగుణంగా బోధన ప్రణాళికను సిద్ధం చేస్తారు. ఉదాహరణకు విద్యార్థి ఓ గేయాన్ని చూసి రాయగలడు. కానీ చదవలేడు. కాబట్టి అతను ప్రతిరోజూ చదివేలా చేస్తారు. దీనిద్వారా చదివే పరిజ్ఞానం పెరుగుతుంది. గణితంలో కూడికలు, తీసివేతలు అర్థమయ్యేలా ప్రత్యేక పద్ధతుల ద్వారా పునఃశ్చరణ చేస్తారు. దీనికోసం ఎస్‌సీఈఆర్‌టీ సరికొత్త బోధన పద్ధతులను రూపొందించింది.

పాఠాలు ఎంతమందికి అర్థమయ్యాయనేది పరిశీలిస్తారు. ఎక్కువ శాతం మందికి అర్థం కాని పాఠాలుంటే, వాటిని అదనంగా తీసుకునే క్లాసులో మరోసారి బోధిస్తారు. చదవడం, రాయడం, పాఠంలోంచి కొత్త ఆలోచన రేకెత్తించడం వంటి సరికొత్త పద్ధతులు అనుసరిస్తారు. వీటికి సంబంధించి ప్రతి వారం ప్రతి విద్యార్థి ప్రమాణాలను అంచనా వేసి, నివేదికలు రూపొందించాల్సి ఉంటుంది. వీటిని ప్రతినెలా రాష్ట్రంలోని ఉన్నతాధికారులు పరిశీలిస్తారు.  

ప్రత్యేక మాడ్యూల్స్‌తో అర్ధమయ్యేలా బోధన  
తొలిమెట్టు కోసం ప్రత్యేక మాడ్యూల్స్‌ తయారు చేశారు. రాష్ట్ర స్థాయిలో రిసోర్స్‌ పర్సన్స్‌కు శిక్షణ ఇచ్చాం. వీరు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తారు. వారంలో 5 రోజులు బోధన ఉంటుంది. ఆరవ రోజు విద్యార్థి ప్రమాణాలు అంచనా వేస్తారు. చెప్పే పాఠం కనీసం 80 శాతం మందికి అర్థమవ్వాలి. లేకపోతే మళ్ళీ దాన్ని బోధిస్తారు. అర్థం కాని పాఠాలను ప్రత్యేక ప్రణాళికతో అర్థమయ్యేలా బోధించేలా మాడ్యూల్స్‌ ఉంటాయి. ఉపాధ్యాయుడు కరదీపిక నిర్వహిస్తూ ఖచ్చితమైన లక్ష్యాలు సాధిస్తారు. 
– కల్వకుంట్ల శ్రీలతా రావు (రాష్ట్రస్థాయి తొలిమెట్టు శిక్షకురాలు) 

టీచర్ల కొరత లేకుండా చూడాలి 
ప్రాథమిక స్థాయిలో ప్రమాణాలు మెరుగు పరచటానికి ప్రత్యేక చర్యలు అవసరమే. దీనికన్నా ముందు ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి. చాలా స్కూళ్ళలో సబ్జెక్టులన్నీ ఒకే ఉపాధ్యాయుడు చెబుతున్నాడు. అలాంటప్పుడు నాణ్యత ఎలా వస్తుంది.  
– పి.రాజా భానుచంద్ర ప్రకాశ్‌ (గెజిటెడ్‌ హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) 
 
ప్రత్యేక మాడ్యూల్స్‌తో అర్థమయ్యేలా బోధన  
తొలిమెట్టు కోసం ప్రత్యేక మాడ్యూల్స్‌ తయారు చేశారు. రాష్ట్ర స్థాయిలో రిసోర్స్‌ పర్సన్స్‌కు శిక్షణ ఇచ్చాం. వీరు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తారు. వారంలో 5 రోజులు బోధన ఉంటుంది. ఆరో రోజు విద్యార్థి ప్రమాణాలు అంచనా వేస్తారు. చెప్పే పాఠం కనీసం 80 శాతం మందికి అర్థమవ్వాలి. లేకపోతే మళ్ళీ దాన్ని బోధిస్తారు. అర్థం కాని పాఠాలను ప్రత్యేక ప్రణాళికతో అర్థమయ్యేలా బోధించేలా మాడ్యూల్స్‌ ఉంటాయి. 
– కల్వకుంట్ల శ్రీలతా రావు (రాష్ట్రస్థాయి తొలిమెట్టు శిక్షకురాలు) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement