![Praveen Prakash: 100 percent GER should be achieved - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/26/Praveen%20Prakash.jpg.webp?itok=suOCe5eb)
సాక్షి, అమరావతి: దేశంలో విద్యార్థుల నమోదులో నూరు శాతం స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) సాధించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆకాంక్షించారు. సెప్టెంబర్ 2005 నుంచి ఆగస్టు 2018 మధ్య జన్మించిన వారంతా రాష్ట్రంలోని ఏదో ఒక పాఠశాల/కాలేజీలో నమోదై ఉండాలన్నారు. ఇందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం విద్యాశాఖ అధికారులతో ప్రవీణ్ ప్రకాశ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో చేరికలపై చర్చించారు.
వచ్చే నెల సెప్టెంబర్ 4 నాటికి రాష్ట్రంలోని బడి ఈడు పిల్లలంతా ఏదో ఒక పాఠశాలలో చేరి ఉండాలన్నారు. వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, జిల్లా అధికారులు, కలెక్టర్లు సమన్వయంతో పనిచేసి నూరుశాతం నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. నూరుశాతం జీఈఆర్ సాధన అంశాన్ని తాను సవాలుగా తీసుకుంటున్నట్టు తెలిపారు.
విద్యార్థుల విషయంలో స్థానికంగా నమోదైన అంశాల్లో తప్పులు ఉంటే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చాలెంజ్ విసిరారు. జీఈఆర్ సాధించడంలో ఎక్కడా పొరపాట్లు జరగకూడదని.. డేటా అంతా పూర్తి పారదర్శకంగా ఉండాలని కోరారు. జూలై రెండో వారంలో గుడివాడలో ఒక వలంటీర్ 100 శాతం జీఈఆర్ సాధించారని, ఇప్పుడు 63,993 మంది వలంటీర్లు తమ పరిధిలో 100 శాతం జీఈఆర్ సాధించారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment