Telangana Govt schools
-
అక్షరాలా కష్టాలే.. తెలంగాణలో ప్రభుత్వ బడి లేని ఊళ్లు 3,688
హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న సిద్దిపేట జిల్లాలోనే అత్యధికంగా 314 శివారు గ్రామాల్లో స్కూళ్లు లేని పరిస్థితి ఉంది. 284 శివారు గ్రామాల్లో పాఠశాలలు లేని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం జైత్రం తండా గ్రామ విద్యార్థులు ఉన్నత పాఠశాల కోసం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి ఆటోలో వెళ్తున్నారు. కిక్కిరిసిన ఆటో ఎప్పుడు ఏ ప్రమాదానికి గురవుతుందోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతోంది. అందరికీ విద్య ప్రాథమిక హక్కు అని మన రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. కానీ ఇప్పటికీ, ఇన్నేళ్లు గడిచినా.. ఎన్నో గ్రామాలకు విద్య దూరంగానే ఉంది. ప్రాథమిక విద్యకు సైతం వ్యయప్రయాసలకోర్చి పక్క ఊరికో, ఆ పక్క ఊరికో వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక మాధ్యమిక, ఉన్నత పాఠశాల కోసం మరింత దూరం ప్రయాణించక తప్పని పరిస్థితి ఉంది. మన రాష్ట్రాన్నే చూసుకుంటే.. 3,688 శివారు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలే లేదు. 546 శివారు గ్రామాల్లో అక్షరాలు దిద్దించే ప్రాథమిక పాఠశాల లేదు. 2,018 గ్రామాలు మాధ్యమిక విద్యకు దూరంగా ఉన్నాయి. 2,508 శివారు గ్రామాల్లో ఉన్నత పాఠశాల లేదు. రాష్ట్రవ్యాప్తంగా 30,395 మంది చిన్నారులు చదువు కోసం 3 నుంచి 5 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తోంది. నడుచుకుంటూనో, కిక్కిరిసిన ఆటోల్లోనో, సైకిళ్ళ మీదో దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. కొద్దిపాటి వర్షం వచ్చినా బురదగా మారే రోడ్ల మీద అష్టకష్టాలు పడుతూ విద్యనభ్యసిస్తున్నారు. ఉచిత, నిర్బంధ విద్య కింద 10 నెలల రవాణా భత్యం ప్రభుత్వం ఇస్తుంది. కానీ పెరిగిన డీజీల్ చార్జీల కారణంగా చుక్కలనంటే ఆటో చార్జీలకు ఇవి ఏమాత్రం సరిపోవడం లేదని మారుమూల గ్రామాల పేద ప్రజలు అంటున్నారు. ఈ పరిస్థితులు విద్యపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. స్కూల్ దశలోనే చదువు మానేసేవారి (డాపవుట్స్) సంఖ్య పెరుగుతోంది. విద్యకు దూరమవుతున్న వారిలో ఎక్కువ శాతం వెనుకబడిన ప్రాంతాల నిరుపేదలే ఉంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ‘యూ డైస్’ (యూనిఫైడ్ డిస్క్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) నివేదిక ఈ విషయాలన్నీ స్పష్టం చేస్తోంది. ఎంతెంత దూరం.. ► భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గుంపాడుకు సమీపంలోని గిరిజన గ్రామాల విద్యార్థులు కనీసం 4 కిలోమీటర్ల మేర ప్రయాణించి చదువుకోవాల్సి వస్తోంది. సంవత్సరంలో కనీసం 70 రోజులు బురదతో నరక యాతన పడుతున్నారు.– ► ఆదిలాబాద్ జిల్లాలో 162 శివారు గ్రామాల్లో అక్షరం చెప్పే దిక్కే లేదు. మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నిర్మల్, పెద్దపల్లి.. ఇలా పలు జిల్లాల్లో..ఒక్కో జిల్లాలో 150కి పైగా శివారు గ్రామాల్లో స్కూళ్ళు లేవు. ► మెదక్ జిల్లా తూప్రాన్ సమీకృత వసతి గృహంలో ఉండే విద్యార్థులు 2.5 కిలో మీటర్ల దూరంలోని స్కూలుకు వెళ్తున్నారు. మధ్యలోనే మానేస్తున్నారు చదువుపై పెద్దగా అవగాహన లేని శివారు గ్రామస్తులు, ముఖ్యంగా పేద కుటుంబాల వారు పిల్లలను దూర ప్రాంతాలకు పంపేందుకు ఇష్టపడటం లేదు. దగ్గర్లో ఉన్న స్కూల్ విద్యకే పరిమితం చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో గత ఏడాది 13.7 శాతం మంది విద్యార్థులు టెన్త్ క్లాస్‌కు వచ్చేసరికే చదువు మానేశారు. ఇందులో 12.9 శాతం బాలికలే ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో చదివే విద్యార్థులకు జూనియర్ కాలేజీ అందుబాటులో లేదు. దీంతో తల్లిదండ్రులు బాలికలను టెన్త్‌తోనే ఆపేస్తున్నారు. గడచిన రెండేళ్ళలో 18 మంది ఇలా విద్యకు దూరమయ్యారు. వీరిలో ఎక్కువ మందికి వివాహాలు కూడా జరిగాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో 8–10 తరగతుల బాలికలను పాఠశాలకు వెళ్లని కారణంగా పెళ్ళిళ్ళు చేసేస్తున్నట్టు గుర్తించారు. ఇలా గడచిన రెండేళ్ళలో 19 మందికి వివాహాలైనట్టు ప్రభుత్వ సర్వేల్లో తేలింది. స్కూళ్ళు, కాలేజీలు అందుబాటులో లేకపోవడం వల్లే చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. శివారు తండాల వరకూ ప్రభుత్వ స్కూళ్ళను తీసుకెళ్తే తప్ప ఈ పరిస్థితిలో మార్పు రాదని స్పష్టం చేస్తున్నారు. చదవాలంటే నడవాల్సిందే.. ఈ బడి పిల్లల కష్టాల గురించి ‘యూ డైస్’.. తమ నివేదికలో ప్రస్తావించింది. గిరిజన గ్రామమైన కొండతోగు.. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉంది. ఇక్కడ దాదాపు 21 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా చదువుకోవడం కోసం 3 కిలోమీటర్ల దూరంలోని పండువారిగూడేనికి నడిచి వెళ్తున్నారు. ఇలా రోజూ రానూపోనూ ఆరు కిలోమీటర్లు నడవాల్సిందే.. మామూలు రోజుల్లోనే ఈ మార్గంలో నడవడం కష్టం.. ఇక, వానొస్తే అంతే.. -
ఐదేళ్లలో 100% పరిజ్ఞానం!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థి చదివే, రాసే సామర్థ్యాన్ని ఇకపై వారానికోసారి అంచనా వేయ బోతున్నారు. అభ్యసన సామర్థ్యాలపై ప్రతి నెలా రాష్ట్ర స్థాయిలో సమీక్ష చేపట్టబోతున్నారు. ముఖ్యంగా భాష, గణితంపై దృష్టి పెట్టనున్నారు. తద్వారా వచ్చే ఐదేళ్లలో 3, 5 తరగతుల విద్యార్థుల్లో 100% తెలివి తేటలు (పరిజ్ఞానం) పెంచాలని రాష్ట్ర విద్యాశాఖ లక్ష్యంగా పెట్టు కుంది. అలాగే 8వ తరగతి విద్యార్థుల్లో ప్రస్తుత సామర్థ్యాని 85 శాతానికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘తొలిమె ట్టు’ కార్యక్రమానికి ఆగస్టు 15 నుంచి శ్రీకారం చుట్టింది. దీనికోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. 1–5 తరగ తుల విద్యార్థుల కోసం తొలిమెట్టు అమలు చేయబోతు న్నారు. దీంతో పాటే 6–10 తరగతుల విద్యార్థుల అభ్యసన నష్టాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ‘న్యాస్’ రిపోర్టుతో మేల్కొలుపు అన్ని రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాలపై నేషనల్ అచీవ్మెంట్ సర్వే (న్యాస్) ప్రతి రెండేళ్ళకోసారి సర్వే నిర్వహిస్తుంది. సర్వేలో భాగంగా విద్యార్థులకు పలు ప్రశ్నలు వేయడం ద్వారా వారి స్థాయిని అంచనా వేస్తుంది. గత ఏడాది నవంబర్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేసి, ఫలితాలు వెల్లడించింది. కరోనా కారణంగా రెండేళ్ళలో విద్యా ప్రమాణాలు అనూహ్యంగా తగ్గాయని తాజా నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల మెరుగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ కార్యాచరణకు దిగింది. పాఠశాలల ప్రారంభంలోనే విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సు నిర్వహించింది. దీనికి కొనసాగింపుగా 1–5 తరగతులకు తొలిమెట్టు, 6–10 తరగతుల్లో అభ్యసన నష్టాల భర్తీకి కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారం వారం అంచనా... విద్యార్థులకు వారంలో ఐదు రోజుల పాటు రెగ్యులర్ క్లాసులు జరుగుతాయి. అదనంగా ఓ గంట తొలిమెట్టు కింద ప్రత్యేక క్లాసు తీసుకుంటారు. విద్యార్థి వెనుకబడిన సబ్జెక్టు, పాఠాన్ని అర్థమయ్యేలా మళ్ళీ బోధిస్తారు. వారికి అర్థమైందా లేదా అనే దానిపై పాఠశాల స్థాయిలో చిన్న పరీక్ష నిర్వహిస్తారు. ఇది రాత పూర్వకంగా లేదా మౌఖికంగానైనా ఉండొచ్చు. ఒక పాఠం కనీసం 80 శాతం మందికి అర్థమవ్వాలని తొలిమెట్టు ప్రణాళికలో పేర్కొన్నారు. ఉన్నత తరగతుల విద్యార్థులకూ ఇదే విధానాన్ని అమలు చేస్తారు. -
అప్రమత్తమైన తెలంగాణ సర్కారు.. ‘తొలిమెట్టు’తో పట్టు!
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్‌లో వెనుకబడి పోతున్నారని, గణితమంటే వణికిపోతున్నారని.. పలు సర్వేలు తేల్చిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. 1 నుంచి 5 తరగతుల విద్యార్థుల్లో ప్రమాణాలు పెంచేందుకు, అభ్యసన మెలకువలు అభివృద్ధి చేసేందుకు ‘తొలిమెట్టు’కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇది మొదలుకానుంది. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో రిసోర్స్ పర్సన్స్‌కు శిక్షణ ఇచ్చారు. వారిద్వారా జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఏదో సిలబస్ పూర్తి చేశామనిపించు కోవడం కాకుండా, అర్థవంతమైన బోధన చేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధానోద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. తొలిమెట్టు ద్వారా జరిగే పురోగతిని ప్రతినెలా ఉన్నతాధికారులు సమీక్షించనున్నారు. అవసరమైతే మరిన్ని మార్పులతో తొలిమెట్టును విజయవంతం చేయాలని భావిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 3లో భాష గోస.. నేషనల్ అచీవ్మెంట్ సర్వే–2021 ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లోని 1–5 తరగతుల మధ్య విద్యార్థులకు కనీస పరిజ్ఞానం ఉండటం లేదు. రాష్ట్ర పరిధిలోని ఎస్సీఈఆర్టీ అధ్యయనం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. భాష (తెలుగు, ఇంగ్లిష్ ఇతరాలు) విషయంలో 3వ తరగతి విద్యార్థుల్లో 52 శాతం మంది కనీస పరిజ్ఞానం కన్నా తక్కువ స్థాయిలో ఉన్నారు. కనీస స్థాయిలో ఉన్న వాళ్ళు 26 శాతమైతే, కాస్త పట్టున్న వాళ్ళు కేవలం 16 శాతమే. గణితంలో చిన్న చిన్న కూడికలు కూడా అర్థం కాని వాళ్ళు 43 శాతం, క్లూ అందిస్తే నెట్టుకొచ్చేవాళ్ళు 32 శాతం (బేసిక్) ఉన్నారు. 3వ తరగతిలో ఉండాల్సిన పరిజ్ఞానం కేవలం 20 శాతం మందిలోనే కన్పిస్తోంది. 5లో తప్పుతున్న లెక్క! ఐదవ తరగతిలో భాషపై ఏమాత్రం పట్టు లేని వాళ్ళు (బేసిక్ స్థాయికన్నా తక్కువ) 35 శాతం ఉంటే, బేసిక్స్ స్థాయిలో 41 శాతం ఉన్నారు. కొద్దోగొప్పో ఫర్వాలేదు అన్న వాళ్ళు 19 శాతమే ఉన్నారు. గణితంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏ లెక్కయిన చేయగల విద్యార్థులు కేవలం 10 శాతమే ఉన్నారు. బేసిక్స్ దగ్గరే ఆగిపోయే వాళ్ళు 40 శాతం ఉంటే, అసలేమీ తెలియని వాళ్ళు (బేసిక్స్ స్థాయిలో లోపల) 49 శాతం ఉన్నారు. 2017–21 మధ్య భాషలు, గణితంలో ప్రమాణాలు మరీ తగ్గిపోయాయి. తొలిమెట్టుతో ఇలా.. విద్యార్థిపై రోజూ అదనంగా ఓ గంట ప్రత్యేక దృష్టి పెడతారు. ముందుగా అతను ఏ స్థాయిలో ఉన్నాడనేది క్లాస్ టీచర్ అంచనా వేస్తారు. దానికి అనుగుణంగా బోధన ప్రణాళికను సిద్ధం చేస్తారు. ఉదాహరణకు విద్యార్థి ఓ గేయాన్ని చూసి రాయగలడు. కానీ చదవలేడు. కాబట్టి అతను ప్రతిరోజూ చదివేలా చేస్తారు. దీనిద్వారా చదివే పరిజ్ఞానం పెరుగుతుంది. గణితంలో కూడికలు, తీసివేతలు అర్థమయ్యేలా ప్రత్యేక పద్ధతుల ద్వారా పునఃశ్చరణ చేస్తారు. దీనికోసం ఎస్సీఈఆర్టీ సరికొత్త బోధన పద్ధతులను రూపొందించింది. పాఠాలు ఎంతమందికి అర్థమయ్యాయనేది పరిశీలిస్తారు. ఎక్కువ శాతం మందికి అర్థం కాని పాఠాలుంటే, వాటిని అదనంగా తీసుకునే క్లాసులో మరోసారి బోధిస్తారు. చదవడం, రాయడం, పాఠంలోంచి కొత్త ఆలోచన రేకెత్తించడం వంటి సరికొత్త పద్ధతులు అనుసరిస్తారు. వీటికి సంబంధించి ప్రతి వారం ప్రతి విద్యార్థి ప్రమాణాలను అంచనా వేసి, నివేదికలు రూపొందించాల్సి ఉంటుంది. వీటిని ప్రతినెలా రాష్ట్రంలోని ఉన్నతాధికారులు పరిశీలిస్తారు. ప్రత్యేక మాడ్యూల్స్‌తో అర్ధమయ్యేలా బోధన తొలిమెట్టు కోసం ప్రత్యేక మాడ్యూల్స్ తయారు చేశారు. రాష్ట్ర స్థాయిలో రిసోర్స్ పర్సన్స్‌కు శిక్షణ ఇచ్చాం. వీరు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తారు. వారంలో 5 రోజులు బోధన ఉంటుంది. ఆరవ రోజు విద్యార్థి ప్రమాణాలు అంచనా వేస్తారు. చెప్పే పాఠం కనీసం 80 శాతం మందికి అర్థమవ్వాలి. లేకపోతే మళ్ళీ దాన్ని బోధిస్తారు. అర్థం కాని పాఠాలను ప్రత్యేక ప్రణాళికతో అర్థమయ్యేలా బోధించేలా మాడ్యూల్స్ ఉంటాయి. ఉపాధ్యాయుడు కరదీపిక నిర్వహిస్తూ ఖచ్చితమైన లక్ష్యాలు సాధిస్తారు. – కల్వకుంట్ల శ్రీలతా రావు (రాష్ట్రస్థాయి తొలిమెట్టు శిక్షకురాలు) టీచర్ల కొరత లేకుండా చూడాలి ప్రాథమిక స్థాయిలో ప్రమాణాలు మెరుగు పరచటానికి ప్రత్యేక చర్యలు అవసరమే. దీనికన్నా ముందు ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి. చాలా స్కూళ్ళలో సబ్జెక్టులన్నీ ఒకే ఉపాధ్యాయుడు చెబుతున్నాడు. అలాంటప్పుడు నాణ్యత ఎలా వస్తుంది. – పి.రాజా భానుచంద్ర ప్రకాశ్ (గెజిటెడ్ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) ప్రత్యేక మాడ్యూల్స్‌తో అర్థమయ్యేలా బోధన తొలిమెట్టు కోసం ప్రత్యేక మాడ్యూల్స్ తయారు చేశారు. రాష్ట్ర స్థాయిలో రిసోర్స్ పర్సన్స్‌కు శిక్షణ ఇచ్చాం. వీరు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తారు. వారంలో 5 రోజులు బోధన ఉంటుంది. ఆరో రోజు విద్యార్థి ప్రమాణాలు అంచనా వేస్తారు. చెప్పే పాఠం కనీసం 80 శాతం మందికి అర్థమవ్వాలి. లేకపోతే మళ్ళీ దాన్ని బోధిస్తారు. అర్థం కాని పాఠాలను ప్రత్యేక ప్రణాళికతో అర్థమయ్యేలా బోధించేలా మాడ్యూల్స్ ఉంటాయి. – కల్వకుంట్ల శ్రీలతా రావు (రాష్ట్రస్థాయి తొలిమెట్టు శిక్షకురాలు) -
పుస్తకాలొచ్చేదెప్పుడు? పాఠాలు చెప్పేదెప్పుడు?
రాష్ట్రంలో బడులు తెరిచి ఐదు వారాలు దాటింది. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంతవరకు విద్యార్థులు పుస్తకం తెరవలేదు. ఉపాధ్యాయులు ఒక్క పాఠం చెప్పలేదు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందకపోవడమే ఇందుకు కారణం. విద్యాశాఖ క్యాలండర్ ప్రకారం ఆగస్టు మొదలయ్యే నాటికి అంటే ఇంకో పదిరోజుల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ కనీసం రెండు చాప్టర్లు పూర్తవ్వాలి. కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి మరో రెండు వారాల వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ప్రైవేటు స్కూళ్ళల్లో ఇప్పటికే కొన్ని చాప్టర్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో..ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో సర్కారీ స్కూళ్ళపై ఆసక్తి చూపిన తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంగ్లిష్ మీడియం నేపథ్యంలో ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు 2.5 లక్షల వరకు పెరిగాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 24,852 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు ఇస్తుంది. కాగా ఈ ఏడాది నుంచి 1–8 తరగతులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రవేశపెట్టారు. ఇంగ్లిష్ మీడియం విద్యకు సన్నాహాలు చేస్తున్నప్పుడే పుస్తకాల ముద్రణపై దృష్టి పెట్టాల్సి ఉండగా.. విద్యాశాఖ విఫలమైందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో పుస్తకాల ముద్రణ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైందని అంటున్నాయి. పుస్తకాలకు అవసరమైన పేపర్ సకాలంలో సరఫరా కాకపోవడం, మిల్లర్లు పేర్కొన్న ధర చెల్లించేందుకు నిధుల కొరత.. వెరసి పుస్తకాల ముద్రణ ఆలస్యంగా ప్రారంభం కావడానికి కారణమని తెలుస్తోంది. మొత్తం మీద ఇంగ్లిష్ మీడియం నేపథ్యంలో పుస్తకంలో ఒకవైపు తెలుగు, మరోవైపు ఇంగ్లిష్ భాషలో పాఠాలు ముద్రిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,64,28,320 పుస్తకాలు ముద్రించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 1.33 కోట్ల పుస్తకాలు ముద్రించారు. అయితే ముద్రించిన పుస్తకాలు కూడా మండల కేంద్రాల్లోనే ఉన్నాయి. ఇటీవల వర్షాలు రావడంతో వాటిని పాఠశాలలకు చేర్చలేకపోయారు. మరోవైపు పూర్తిస్థాయిలో పుస్తకాలు రాకపోవడంతో వచ్చిన వాటిని ఎవరికివ్వాలనే సంశయంతో చాలాచోట్ల పంపిణీ చేయకుండా అలాగే ఉంచారు. దీంతో ఆంగ్ల మాధ్యమం బోధన కోసం లక్ష మందికిపైగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినా, వారు బోధనలోకి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. మరో రెండు నెలల వరకూ ఇదే పరిస్థితి కొనసాగితే ఆంగ్ల బోధనపై తీసుకున్న శిక్షణ మరిచిపోయే అవకాశముందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. మరోవైపు తగిన సంఖ్యలో టీచర్లు లేకపోవడం, ముఖ్యంగా సబ్జెక్టు టీచర్ల కొరతపై తల్లిదండ్రుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 16 వేల ఉపాధ్యాయుల కొరత! గత ఏడాది 317 జీవో అమలు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంకా 16 వేల ఉపాధ్యాయుల కొరత ఉందని తేల్చారు. దాదాపు 52 శాతం స్కూళ్ళల్లో ఏదో ఒక సబ్జెక్టు టీచర్ లేరు. దీంతో ఇతర సబ్జెక్టులకు చెందిన టీచర్‌తోనే బోధన కొనసాగించాలనే ఆదేశాలిచ్చారు. ఇటీవల ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించారు. డీఎస్సీ నోటిఫికేషన్ వస్తే తప్ప టీచర్ల నియామకం చేపట్టేందుకు వీల్లేదు. దీనికన్నా ముందు ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని, అప్పుడే ఖాళీల సంఖ్యపై మరింత స్పష్టత వస్తుందని అంటున్నారు. అందువల్ల ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఆస్కారం లేదని విద్యాశాఖ అధికారులే అంటున్నారు. తాత్కాలికంగా విద్యా వాలంటీర్లను నియమించాలనే ప్రయత్నం కూడా ముందుకెళ్ళలేదు. మరోవైపు 500కు పైగా మండల విద్యాశాఖ అధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యా ప్రమాణాలపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకుండా పోయిందని అంటున్నారు. వేధిస్తున్న నిధుల సమస్య ప్రభుత్వ స్కూళ్ళ నిర్వహణకు అందే నిధులూ ఆలస్యమవుతున్నాయి. గత రెండేళ్ళుగా ఈ నిధుల్లో కోత పడింది. రాష్ట్రంలో 467 మండల రిసోర్స్ సెంటర్లు (ఎంఆర్సీలు) ఉన్నాయి. ఒక్కో ఎంఆర్సీకి ఏడాదికి రూ.90 వేల చొప్పున ఇస్తారు. అలాగే ఒక్కో పాఠశాల ఆవరణ నిర్వహణకు రూ.33 వేలు ఇస్తారు. ఇప్పటివరకు ఈ నిధులు అందకపోవడంతో కనీసం చాక్‌పీస్‌లు కొనే అవకాశం కూడా ఉండటం లేదని హెచ్ఎంలు అంటున్నారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ సమస్యలన్నీ పరిష్కారమైతేనే బోధన సక్రమంగా సాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ఒక్క పాఠం చెప్పలేదు బడి తెరిచి నెలన్నర అయినా ఇప్పటికీ పుస్తకాలు ఇవ్వలేదు. ఒక్క పాఠం చెప్పలేదు. మేథ్స్ టీచర్ సెలవులో ఉన్నారంట. సైన్స్ టీచర్ చేత మేథ్స్ చెప్పిస్తారని అంటున్నారు. ఇంగ్లిష్ మీడియం కావడంతో కొంత కంగారుగా ఉంది. త్వరగా పాఠాలు చెబితే బాగుంటుంది. – పి నాగబాబు (8వ తరగతి, మూసారాంబాగ్ ప్రభుత్వ పాఠశాల) ఆగస్టు మొదటి వారంలో అందరికీ పుస్తకాలు ఇప్పటివరకు 80 శాతం పుస్తకాల ముద్రణ పూర్తయింది. మిగిలిన 20 శాతం పుస్తకాల ముద్రణను ఆగస్టు మొదటి వారంలో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాం. ద్విభాషలో పుస్తకాల ముద్రణ చేపట్టడం వల్ల ఈసారి పేపర్ ఎక్కువ అవసరమైంది. పేపర్ సకాలంలో అందకపోవడం వల్లే ముద్రణ ఆలస్యమైంది. పుస్తకాల పంపిణీ చేపట్టి విద్యార్థులకు అందజేయమనే ఆదేశాలు ఇచ్చాం. ఆగస్టు మొదటి వారంలోనే అందరికీ చేరేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసాచారి (డైరెక్టర్, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణ విభాగం) -
Telangana: ఈ ఏడాది నుంచే ఇంగ్లిష్ మీడియం
సాక్షి, హైదరాబాద్: 2022–23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలంటూ కేబినెట్‌కు సిఫార్సు చేయాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఇందుకు సంబం ధించిన విధి విధానాలు, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బుధవారం సమావేశమైంది. మంత్రులు కేటీఆర్, టి.హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ ఈ భేటీలో పాల్గొన్నా రు. ఇంగ్లిష్ మీడియం అమలుపై సీఎంతో చర్చించాక విధివిధానాలు రూపొందించాలని సమావేశం నిర్ణయించింది. ఈలోగా ఆంగ్ల మాధ్యమానికి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించింది. విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండేలా ద్విభాషా విధానంలో పాఠ్య పుస్తకాలను ముద్రించాలని కోరింది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని, విద్యార్థుల్లో ఆంగ్లంలో ప్రత్యేక మెళకువలు నేర్పేందుకు అవసరమైతే టీ–శాట్ ద్వారా కోర్సులను అందుబాటులోకి తేవాలని సూచించింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ఉపసంఘం చర్చించింది. దీని పై మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, అధికారులు సయ్యద్ ఒమర్ జలీల్ పాల్గొన్నారు. -
ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన
-
పుస్తకాల్లేని చదువులు.. విద్యార్థుల చింత
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసలే టీవీ పాఠాలు. వాటిని వింటున్న విద్యార్థులు చాలా తక్కువ. అధికారుల లెక్కల ప్రకారం 9, 10 తరగతుల విద్యార్థులు కొంతమేరకు టీవీ పాఠాలను చూస్తున్నా.. ఎక్కువ మంది విద్యార్థులు చదువు లకు దూరమయ్యారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. తమ పిల్లలకు విద్యా బోధన ఎలా? అని ఆవేదన చెందుతున్నారు. టీవీ పాఠాలు పెద్దగా అర్థంకావడం లేదని, కనీసం పుస్తకాలున్నా కొంతవరకు వాటిని చదువుకొని ఉపాధ్యాయులను ఫోన్లలో అడిగి సందేహాలను నివృత్తి చేసుకునే వారమని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో టీచర్లు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నా.. అవి అత్యధిక మంది విద్యార్థులకు చేరడం లేదు. 8 జిల్లాల్లో అందని పాఠ్య పుస్తకాలు రాష్ట్రంలోని 8 జిల్లాల్లో విద్యార్థులకు ఇంతవరకు పాఠ్య పుస్తకాల పంపిణీనే ప్రారంభించలేదు. ఆదిలాబాద్, జోగుళాంబ, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, ములుగు, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లా కేంద్రాలకు పాఠ్య పుస్తకాలు చేరినా వాటిని మండల స్థాయికి, పాఠశాలలకు పంపించి విద్యార్థులకు పంపిణీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. 12 జిల్లాల్లో 20 శాతంలోపే పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు ఇవ్వగా, ఆరు జిల్లాల్లో 20-50 శాతంలోపు పంపిణీ చేశారు. కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే ఎక్కువ మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందినట్లు అధికారులు తేల్చారు. విందామన్నా.. నెట్‌వర్క్‌తో ఇబ్బంది చాలా జిల్లాల్లో విద్యార్థులు టీవీ పాఠాలను వినేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. టీవీల్లో ఏయే సమయాల్లో ఆ పాఠాలను బోధిస్తారనే విషయంపై అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారు. టీచర్లు కొంత చొరవ తీసుకొని వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి పాఠాలు ప్రసారమయ్యే సమయం తెలియజేస్తున్నారు. దీంతో కొద్దిమంది వాటిని వింటున్నారు. మిగతా విద్యార్థుల్లో స్మార్ట్ ఫోన్లు కలిగిన కొందరు విద్యార్థులు టీశాట్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని పాఠాలను విందామనుకుంటే నెట్వర్క్ సమస్యలతో వీడియో పాఠాలను వినలేకపోతున్నారు. పుస్తకాలు ఇవ్వలేదు మా పాప పదో తరగతి రామన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. ఆన్లైన్ తరగతులు ప్రారంభమై 12 రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు పుస్తకాలు రాలేదు. ఆన్లైన్ తరగతులు జరుగుతున్న నేపథ్యంలో ఏమైనా సందేహాలు చూసుకునేందుకు పుస్తకాలు లేవు. దీంతో ఇబ్బంది పడుతోంది. - సుభద్ర, విద్యార్థిని తల్లి, రామన్నపేట ఏమి అర్థం కావడం లేదు ఆన్లైన్ పాఠాలు జరుగుతున్నా పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఆన్లైన్లో పాఠాలు చూడటం తప్పæ పుస్తకంలో చదువుకునే వీలులేకుండా పోతోంది. సందేహం వస్తే పుస్తకాలు లేకపోవటంతో ఏమీ అర్థంకావడం లేదు. - రాకేశ్, 10వ తరగతి ,బాలుర ఉన్నత పాఠశాల, మంచిర్యాల పుస్తకాలు లేకుండా విద్య ఎలా? ఆన్లైన్లో బోధించేటప్పుడు విద్యార్థులకు పుస్తకాలు ముందు ఉండాలి. అర్థంకాని అంశాలను అందులో చూసి చదువుకుంటారు. పుస్తకాలు లేకుండా విద్యార్థులకు విద్యనందించడం సాధ్యం కాదు. పుస్తకాలు లేకుండా క్లాస్‌లు నిర్వహిస్తే ప్రయోజనం ఉండదు. అందరికీ పుస్తకాలు అందేలా చూడాలి. - తుకారం, టీచర్, రెబ్బెన, ఆసిఫాబాద్ జిల్లా -
పూర్తయిన పాఠాలపైనే విద్యార్థులకు పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా అస్తవ్యస్తంగా మారిన విద్యా బోధనను గాడిలో పెట్టే పనిలో ప్రభుత్వం పడింది. ఇందులో భాగంగా 9, 10వ తరగతులతోపాటు ఇంటర్, డిగ్రీ, పీజీ తరగతులను ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రారంభించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అందుకు అవసరమైన చర్యలపై కార్యాచరణ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రధానమైన సిలబస్, పరీక్షల విధానంపై దృష్టి సారించాయి. ప్రస్తుతం 1 నుంచి 8వ తరగతి వరకు ప్రత్యక్ష విద్యా బోధనపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఇప్పటివరకు ఆన్లైన్/ టీశాట్/ దూరదర్శన్ ద్వారా ప్రసారం చేసిన వీడియో పాఠాలపైనే పరీక్షలు నిర్వహించాలా? లేదంటే పరీక్షలే లేకుండా పైతరగతులకు పంపించాలా అనే దానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఎక్కువ శాతం అధికారులు మాత్రం 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలే అవసరం లేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగానే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 9, 10వ తరగతుల వారికి మాత్రం మాత్రం పరీక్షలు నిర్వహించాల్సిందేనన్న భావనలో పాఠశాల విద్యా శాఖ అధికారులు ఉన్నారు. 70 శాతం సిలబస్ మాత్రమే ఉండేలా ఇప్పటికే పాఠశాల విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మిగతా 30 శాతం సిలబస్‌లో ప్రాజెక్టులు, అసైన్మెంట్ ఆధారిత ఇంటర్నల్స్ ఉంటాయని పేర్కొంది. సీనియర్ అధికారులు మాత్రం పాఠశాలలు ప్రారంభమయ్యాక పూర్తి చేసే సిలబస్, ప్రస్తుతం ఆన్లైన్/ టీవీ ద్వారా ప్రసారం చేసిన పాఠాలపైనే పరీక్షలు నిర్వహించాలని సూచిస్తున్నారు. వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తయ్యే పాఠ్యాంశాల్లో ప్రాజెక్టులు, అసైన్మెంట్లతో ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. వాటి ఆధారంగా విద్యార్థులకు మార్కులను ఇవ్వొచ్చని పేర్కొన్నారు. దీనిపై కూడా ఇంతవరకు అధికారిక నిర్ణయం లేదు. ఇకనైనా ప్రభుత్వం సిలబస్ కుదింపుపై స్పష్టత ఇస్తే ఆ విధానం కొనసాగుతుందని, లేదంటే ఏప్రిల్ నాటికి అయ్యే పాఠ్యాంశాలపై మాత్రమే ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించి విద్యాసంవత్సరాన్ని ముగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇంటర్లో.. ఇంటర్‌లోనూ ఇదే పరిస్థితి ఇంటర్మీడియట్ సిలబస్ విషయంలోనూ గందరగోళం కొనసాగుతోంది. అధికారులు ఇంతవరకు సిలబస్ కుదింపుపై తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. గతంలో 30 శాతం సిలబస్ ను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అందులో తెలంగాణ పండుగలు, జాతీయనేతలు, సంఘసంస్కర్తల పాఠాలు తొలగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తడంతో.. అది నిర్ణయం కాదని, అలాంటి పాఠ్యాంశాలను తొలగించట్లేదని, పైగా అది ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన మాత్రమేనని బోర్డు అధికారులు ప్రకటించారు. అయితే ప్రభుత్వం 30 శాతం సిలబస్ కుదింపునకు ఓకే చెప్పినట్లు తెలిసింది. తగ్గించిన సిలబస్‌ను ప్రకటించలేదు. ఇంటర్మీడియట్ సిలబస్ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలతో ముడిపడి ఉన్నందున లెక్చరర్లు, విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. జేఈఈ మెయిన్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో సిలబస్ కుదింపు లేదు. కేవలం విద్యార్థులకు ప్రశ్నల సంఖ్యను పెంచి ఆప్షన్లు ఎక్కువగా ఇచ్చారు. కాబట్టి విద్యార్థులు ఉన్న సిలబస్ మొత్తం ప్రిపేర్ కావాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు వొకేషనల్ కోర్సుల సిలబస్ తగ్గింపుపైనా బోర్డు కసరత్తు చేయలేదు. -
‘స్కూళ్ల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయం తిరోగమన చర్యేనని, గత ఆరేళ్లలో విద్యారంగాన్ని సర్కార్ నిర్లక్ష్యం చేసిందని రౌండ్ టేబుల్ సమావేశం ఆరోపించింది. బీజేపీ రిటైర్డ్ టీచర్స్, ఎంప్లాయీస్ సెల్ చైర్మన్ బి.మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 12 వేల పాఠశాలల మూసివేతకు చేసిన సిఫార్సులను రద్దు చేయాలని భేటీలో పాల్గొన్న వక్తలు డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ నిలిపేయాలని, బడ్జెట్లో విద్యకు 15 శాతం నిధులు విడుదల చేయాలని వారు కోరారు. ఐదున్నర ఏళ్లలో 40 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 8 వేల పోస్టులనే భర్తీ చేశారన్నారు. 20 దేశాలు వ్యతిరేకించిన సీసీఐ విధానాన్ని మన రాష్ట్రం కూడా నిలిపేయాలని పేర్కొన్నారు -
నియామకాలెప్పుడో..!
కరీంనగర్‌ఎడ్యుకేషన్: టీఆర్టీ నియామకాలపై సందిగ్ధం నెలకొంది. పాఠశాలల్లో ఇది వరకు పనిచేస్తున్న విద్యావాలంటీర్లనే తాజాగా కొనసాగించాలని ప్రభుత్వం మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. బడులు ప్రారంభమయ్యే సమయం దగ్గరపడిన కొద్దీ ఉపాధ్యాయుల నియామకంపై తర్జనభర్జన కొనసాగింది. ప్రభుత్వం టీఆర్టీ నియామకాలు చేపడుతుందా.. విద్యావాలంటీర్లను కొనసాగిస్తుందా అనే సందేహాలు ఉండగా తాజాగా తాత్కాలిక బోధకుల వైపే విద్యాశాఖ మొగ్గు చూపింది. ఈ నెల 11న రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారులకు వెల్లడించారు. దీంతో ఏడాదిన్నరగా నియామకాల కోసం ఎదురు చూస్తున్న టిఆర్టీ అభ్యర్థుల కథ మళ్లీ మొదటికొచ్చింది. నియామకాలను భర్తీ చేసి మిగతా ఖాళీలను విద్యావాలంటీర్ల ద్వారా భర్తీ చేయాల్సిన విద్యాశాఖ టీఆర్టీ అభ్యర్థులను పక్కనబెట్టి విద్యావాలంటీర్లను కొనసాగించడంతో సందిగ్ధత నెలకొంది. పాతవారే కొనసాగింపు.. సర్కారు బడుల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కొన్నేళ్ల నుంచి విద్యావాలంటీర్లను నియమిస్తోంది. రెండేళ్ల నుంచి నెలకు రూ.12 వేల వేతనం అందజేస్తూ వారితో వివిధ సబ్జెక్టుల వారీగా బోధన చేయిస్తోంది. కిందటేడాది వరకు కొత్తగా నియామకాలు చేపడుతూ అర్హత ప్రకారం నియమించేవారు. ఇలా ప్రతీ ఏడాది దరఖాస్తులు చేసుకోవడం, మెరిట్ తదితర కారణాల రీత్యా ఇబ్బందులు పడుతున్నామని కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఇదివరకు పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావాలంటీర్లనే ఈ ఏడాది నుంచి కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం సైతం ఇందుకు సుముఖంగా ఉండడంతో తాత్కాలిక బోధకులను బడుల్లో కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బడులు పునః ప్రారంభం కావడంతో ఆయా జిల్లాల విద్యాధికారులు సైతం ఉపాధ్యాయుల కొరతపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో వారు తాత్కాలిక బోధకులను కొనసాగించాలని ఆదేశించారు. జిల్లా అధికారులు వారికి బడుల్లో చేరాలని సమాచారం అందించారు. ఇది వరకు ఉపాధ్యాయులు లేనిచోట, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి బోధకుల కొరత ఉన్నచోట, ప్రాధాన్యతక్రమంలో వీరిని నియమించారు. ఆయా పాఠశాలల్లో తాజా సంఖ్యను బట్టి మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చని అధికార వర్గాల ద్వారా తెలిసింది. కిందటేడాదిలో పలువురు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయడంతో వారి స్థానంలో కొత్తగా మరికొందరిని కూడా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారు 134 మంది వరకు ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. తాజాగా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడుతున్న పాఠశాలలకు విద్యావాలంటీర్లు రావడంతో కొంత ఉపశమనం కలిగినట్లవుతోంది. టీఆర్టీ అభ్యర్థులకు నిరీక్షణ తప్పదా..! ప్రభుత్వం తాజాగా సర్కారు బడుల్లో విద్యావాలంటీర్లను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల టీఆర్టీ నియామకాలపై సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఇప్పటి కే తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు సంబంధించి ఫలితాల ను ప్రకటించింది. ఫలితాలు ప్రకటించి సుమారు నాలు గు నెలలు కావస్తున్నా... వీరికి నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. బడులు తెరిచే నాటికి వీరిని బడుల్లో నియమించాలని అనేక డిమాండ్లు వచ్చినా ప్రభుత్వం ఎటూ తేల్చలేకపోతోంది. ఎంపికైన అభ్యర్థులు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. పలు ఉపాధ్యాయ సంఘాలు సైతం నియామక ఉత్తర్వులు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం తాత్కాలికంగా విద్యావాలంటీర్లనే బడుల్లో కొనసాగేలా నిర్ణయం తీసుకుంది. దీంతో మరికొంత కాలం టీఆర్టీ అభ్యర్థులకు నిరీక్షణ తప్పదనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వి ద్యావాలంటీర్లను కొనసాగిస్తున్నామని డీఈవో వెంకటేశ్వర్లు వివరించారు. పాఠశాలల్లో ప్రాధాన్య క్రమంలో వారిని నియమించినట్లు వివరించారు. -
మోగిన బడిగంట
జనగామ: నూతన విద్యా సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతూ విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టారు. బుధవారం బడిగంట మోగడంతో పుస్తకాల బ్యాగులు వీపున వేసుకుని హడావిడిగా స్కూళ్లకు బయలు దేరారు. జిల్లాలోని అన్ని మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల వద్ద విద్యార్థుల సందడి నెలకొంది. సెలవుల్లో తాము చేసిన అల్లరిని స్నేహితులతో పంచుకుంటూ తొలిరోజు పాఠశాలలో అడుగుపెట్టారు. ఉపాధ్యాయులకు గుడ్ మార్నింగ్ చెబుతూ సరదాగా గడిపారు. పలువురు విద్యార్థులు కొత్తగా కొనుగోలు చేసిన సైకిళ్లపై పాఠశాలకు చేరుకోగా.. మరికొందరు తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల వద్ద విద్యార్థులు శ్రమదానం చేపట్టి పాఠశాల ఆవరణతో పాటు తరగతి గదులను శుభ్రం చేసుకున్నారు. తరగతి గదుల్లోకి వస్తున్న స్నేహితులను విష్ చేస్తూ తొలిరోజు సరలదాగా గడిపారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలో ప్రభుత్వ ప్రైమరీ, ప్రాథమికోన్నత, ఉన్నత, ట్రైబల్, సాంఘిక, బీసీ సంక్షేమ, ఎయిడెడ్ పాఠశాలలు 571 ఉన్నాయి. వీటిలో ప్రైమరీ 349, ప్రాథమికోన్నత 71, ఉన్నత పాఠశాలలు 151 ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో కలిపి 54 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అనేక సమస్యలతో నూతన విద్యా సంవత్సరం స్వాగతం పలికింది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో తాగునీరు, వంటగదుల నిర్మాణం, టాయిలెట్స్ సమస్య విద్యార్థులను వెంటాడుతోంది. అయితే జిల్లాలోని ప్రతి పాఠశాలలో టాయిలెట్స్ ఉన్నప్పటికీ నిర్వహణ లేక సగం స్కూళ్లలో వినియోగించలేని పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయుల ఇంటిబాట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య ఆదేశాల మేరకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతున్నారు. తల్లిదండ్రులకు అవగాహన కలిగిస్తూ.. ప్రైవేటు కాదని ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరుతున్నారు. కాగా జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు ప్రైవేటు స్కూళ్లకు పంపించబోమని పలువురు తల్లిదండ్రులు సర్కారు స్కూళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రేపటి నుంచి బడిబాట ఈ నెల14 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రైవేటుకు వెళ్లే విద్యార్థులతో పాటు బడిబయట ఉన్న వారిని గుర్తిస్తారు. మన ఊరు–మనబడిబాట ద్వారా స్థానిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి ఇంటింటికి వెళ్లడం జరుగుంది. ఇంటింటికీ ప్రణాళిక రూపొందించుకుని, పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. పిల్లల ప్రవేశాలు, ఆధార్ కార్డుల సేకరణపై దృష్టి సారించనున్నారు. బడిమధ్యలో మానేసిన పిల్లల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారికి అవగాహన కలిగిస్తారు. బాలికలను కేజీవీబీలో చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటారు. -
ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): జిల్లాలో బడి గంటలు మోగాయి. తొలిరోజు విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు తరలి వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 1608 పాఠశాలలు తెరుచుకున్నాయి. అందులో 454 ప్రైవేటు పాఠశాలలు కాగా, 766 ప్రైమరీ, 136 అప్పర్ ప్రైమరీ, 252 హైస్కూల్ ఉన్నాయి. ఇవే కాకుండా కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, బీసీ, మైనార్టీ, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో గత నాలుగైదు రోజులుగా పుస్తకాలు, బట్టలు, బ్యాగులు, స్టీల్, ఇతరాత్ర దుకాణాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కిటకిటలాడాయి. కొత్త దుస్తులు, బ్యాగులు, లంచ్ బాక్సులతో న్యూలుక్లో విద్యార్థులు పాఠశాలలకు ఉత్సాహంగా వెళ్లారు. పాఠశాలలకు చేరిన పాఠ్యపుస్తకాలు.. జిల్లాలోని 766 ప్రైమరీ, 136 అప్పర్ ప్రైమరీ, 252 హైస్కూల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. ఆ పుస్తకాలు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు చేరుకున్నాయి. ఒకటి నుంచి పదోతరగతి 6,90,600 పుస్తకాలు అవసరమని ప్రతిపాదనలు పంపించగా, 6,89,350 పుస్తకాలను ప్రభుత్వం జిల్లాకు సరఫరా చేసింది. అందులో 27 మండలాల్లోని ఆయా ప్రభుత్వ పాఠశాలలకు 6,67,695 పుస్తకాలను తరలించారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించి 1250 పుస్తకాలు రావాల్సి ఉంది. మొదటిరోజు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. -
మొదటి రోజు హాజరు నామమాత్రమే
నల్లగొండ : పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఎండలు తగ్గకపోవడంతో మొదటిరోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే నమోదైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2 నుంచే పాఠశాలలు పునః ప్రారంభించాలని ప్రభుత్వం మొదట భావించింది. 45 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది. బుధవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కానీ ఎండల తీవ్రత మాత్రం తగ్గలేదు. బుధవారం నల్లగొండలో41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, మిర్యాలగూడలో 41, సాగర్‌లో 40, దేవరకొండ లో కూడా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎండల తీవ్రతతో అంతంతమాత్రంగానే విద్యార్థులు ఎండాకాలం మాదిరిగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో బుధవారం పాఠశాలలు తెరిచినా ఎక్కడా పెద్దగా విద్యార్థులు హాజరుకాలేదు. 100 ఉన్న చోట 20 మందికి మించి హాజరు కాలేదు. దీంతో పాఠశాలలన్నీ విద్యార్థులు లేక వెలవెలబోయాయి. నల్లగొండ పట్టణంలోని మాన్కంచెల్క ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ముగ్గురువిద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. పాఠశాలకు పంపేందుకు సుముఖత చూపని తల్లిదండ్రులు ఎండతీవ్రతతో తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపేందుకు కూడా సుముఖత చూపలేదు. సాధారణంగా మొదటి రోజు మంచి రోజు లేకుంటే పంపరు. కానీ బుధవారం మంచిరోజు ఉన్నప్పటికీ పిల్లలను కేవలం ఎండల కారణంగానే బడికి పంపలేదు. ఇదంతా ప్రభుత్వ పాఠశాలల్లో కనిపించిన పరిస్థితి. హాస్టల్లో ఉండే విద్యార్థులు కూడా ఎవరూ రాని పరిస్థితి. గతంలో పాఠశాల పునఃప్రారంభానికి ముందు రోజే సరంజామా అంతా సిద్ధం చేసుకొని హాస్టల్‌కు చేరుకునేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించ లేదు. ప్రైవేట్ పాఠశాలల వద్దే సందడి ప్రైవేట్ పాఠశాలల వద్ద సందడి నెలకొంది. పుస్తకాలు, డ్రెస్సులు తదితర వాటిని కొనుగోలు చేసేందుకు తల్లిదండ్రులు, విద్యార్థులు ఆయా పాఠశాలల వద్ద పెద్ద ఎత్తున కనిపించారు. వారు కూడా ఒక్కపూట మాత్రమే పాఠశాల నడిపారు. మధ్యాహ్నం తర్వాత పిల్లలను ఇంటికి పంపారు. -
మోగిన బడిగంట
ఆదిలాబాద్‌టౌన్: బడిగంట మోగింది. ఆట పాటలకు చిన్నారులు బైబై చెప్పారు. దాదాపు 50 రోజుల పాటు వేసవి సెలవుల్లో ఉల్లాసంగా గడిపిన చిన్నారులు బుధవారం బడిబాట పట్టారు. ఇన్ని రోజులు బోసిపోయిన పాఠశాలలు విద్యార్థుల రాకతో కళకళలాడాయి. ఉదయాన్నే తల్లిదండ్రులు తమ పిల్లల్ని నిద్రలేపి.. యూనిఫాం, బ్యాగు, పుస్తకాలు వాటర్‌బాటిళ్లు, టిఫిన్ బాక్సులు సిద్ధం చేసి పాఠశాలల వరకు తీసుకెళ్లారు. కొందరు నవ్వుతూ వెళ్లగా.. నర్సరీ, ఎల్కేజీ చిన్నారులు ఏడుస్తూ.. మారం చేస్తూ కనిపించారు. స్కూల్ బస్సులు, ఆటోల్లో విద్యార్థుల రాకపోకలు మొదలయ్యాయి. బుక్ సెంటర్లు, షూ, దుస్తులు, షాపులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కిక్కిరిసాయి. జిల్లా వ్యాప్తంగా బడి మొదలైన సందడి కనిపించింది. సర్కారు వెలవెల.. ప్రైవేటు కళకళ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. 45 డిగ్రీలకు పైగా ఉండడంతో పాఠశాలలకు హాజరైన విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. తొలిరోజు తక్కువ సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా సమయానికి హాజరు కాలేదు. పాఠాలు బోధించలేదు. వచ్చిన విద్యార్థులు స్కూల్ ఆవరణలో ఆడుతూ పాడుతూ కనిపించారు. సర్కారు పాఠశాలలకు భిన్నంగా ప్రైవేటు పాఠశాలలు కళకళలాడాయి. అధిక శాతం విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలకు రెండు పూటల బడి నిర్వహించారు. ఎల్కేజీ, యూకేజీ పిల్లలను ప్రైవేటు పాఠశాల్లో చేర్పించడంతో తల్లిదండ్రులు పాఠశాలలకు చేరుకుని విద్యార్థులను బుజ్జగించి తరగతి గదుల్లోకి తీసుకెళ్లి కూర్చొబెట్టారు. కొంత మంది చిన్నారులు కంటతడి పెట్టగా, వారిని సముదాయించి చాక్టెట్లు, బిస్కెట్లతో నచ్చజెప్పి మరీ పాఠశాలలకు పంపించారు. సమస్యలతో స్వాగతం.. ఏటా మాదిరిగానే ఈ విద్యా సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాల్లో సమస్యలు స్వాగతం పలికాయి. చాలా చోట్ల తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, తరగతి గదుల సమస్యలు యథావిధిగా దర్శనమిచ్చాయి. దీంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. కొన్ని పాఠశాలల్లో కిటికీలు సరిగా లేక, ఫ్యాన్లు తిరగక చిన్నారుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. పాఠశాలలను శుభ్రపర్చకపోవడంతో పలు చోట్ల విద్యార్థులే తరగతి గదులను ఊడ్చుకోవడం, కడగడం చేశారు. సర్కారు పాఠశాలల్లో హాజరు శాతం అంతంత మాత్రంగానే కనిపించింది. చాలా స్కూళ్లల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాలో రెగ్యూలర్ ఉపాధ్యాయులు లేక పాఠశాలలు కొన్ని తెరుచుకోలేదు. కొన్ని చోట్ల మండల విద్యాధికారులు పక్కనున్న పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి పాఠశాలలను తెరిపించినా పాఠ్యాంశాల బోధన జరగలేదు. ఎండ తీవ్రతతో ఇబ్బందులు.. జిల్లాలో భానుడు ప్రతాం చూపుతున్నాడు. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలలకు పంపలేదు. గత ఏడాది జూన్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాగా అయితే ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో 11 రోజులు అదనంగా ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ప్రైవేటు పాఠశాలలు బుధవారం ఒంటి పూట బడి నిర్వహించగా, ప్రభుత్వ పాఠశాలలు రెండు పూటలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అదే విధంగా జైనథ్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. -
నాణ్యమైన బోధన.. ఉత్తమ ఫలితాలు
‘ప్రభుత్వ బడులను పునఃప్రారంభానికి సిద్ధం చేశాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీచేశాం. ప్రభుత్వ బడుల్లో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన బోధన అందించడంతోపాటు ఉత్తమ ఫలితాలు రాబట్టడమే 2019–20 విద్యా సంవత్సరం లక్ష్యం’ అని జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాణరెడ్డి చెప్పారు. పాఠశాలల పునఃప్రారంభం రోజునే ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేస్తామని, పుస్తకాలు ఇప్పటికే పాఠశాలలకు చేరాయన్నారు. బుధవారం పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరంలో చేపట్టే కార్యాచరణను వివరించారు. సాక్షి, రంగారెడ్డి: జిల్లాప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాం. గతేడాది కంటే ఈసారి సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంపై దృష్టిసారించాం. తాజాగా పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాం. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడుల్లో చదువుకున్న విద్యార్థులు రాణించారు. ఈ ఫలితాలను రుజువుగా చూపిస్తూ ప్రభుత్వ బడులకు తమ పిల్లలను పంపించేలా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తాం. బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండేలా చూస్తాం. సర్కారు బడుల్లో నాణ్యమైన బోధన అందిస్తున్నాం. అనుభవం, నైపుణ్యం గల టీచర్లు ఉన్నారు. ఫీజు లేదు. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందజేస్తాం. అలాగే మధ్యాహ్న భోజనం వడ్డిస్తాం. ఈ సానుకూలతలు.. ప్రైవేటు బడుల పిల్లలను కూడా ఆకర్షిస్తుండటం విశేషం. ప్రైవేటు ఫీజులు భరించలేని తల్లిదండ్రులు కొందరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే తిరిగి పంపించారు. ఇలాంటి పరిస్థితులు ఈ ఏడాది కూడా ఉంటాయని ఆశిస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో 585 ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరో రెండు వందలకు పైగా టీచర్లు అవసరం. అయితే, ఈ ఖాళీల్లో శాశ్వత టీచర్లు వచ్చేవరకు గతేడాది పనిచేసిన విద్యావలంటీర్లనే విధుల్లోకి తీసుకోవాలి ఆదేశాలు అందాయి. ఫలితంగా బోధనకు ఆటంకం కలి గే పరిస్థితి లేకపోవడం సంతోషకరం. రె గ్యులర్ టీచర్లకు పోస్టింగ్‌లు ఇచ్చేవరకు వలంటీర్లే కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది. సరిపడా పుస్తకాలు.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,304 ప్రభుత్వ బడుల్లో నమోదైన విద్యార్థులకు దాదాపుగా సరిపడ పాఠ్యపుస్తకాలు వచ్చాయి. కేవలం 15వేల పుస్తకాలు రావాల్సి ఉంది. వారం రోజుల్లో ఇవి కూడా జిల్లాకు చేరుతాయి. వచ్చిన పుస్తకాలను అన్ని పాఠశాలలకు అందజేశాం. బుధవారం (12న) పిల్లలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. యూనిఫాం అందజేతకు మరికొంత సమయం పడుతుంది. జిల్లాకు ఇంకా వస్త్రం రాలేదు. పది రోజుల్లో జిల్లాకు చేరే వీలుంది. ఆ వెంటనే కుట్టించి విద్యార్థులకు అందజేస్తాం. మరుగుదొడ్లు, మూత్రశాలలను వినియోగంలోకి తీసుకరావాలని హెచ్ఎంలకు సూచించాం. వీటి నిర్వహణలో కీలకమైన నీటి వసతి ఉండేలా చూడాలని చెప్పాం. దాదాపు అన్ని స్కూళ్లలో తాగునీటి సౌకర్యం ఉంది. ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాం. ప్రస్తుతం 258 ప్రాథమిక, 95 ప్రాథమికోన్నత, 123 ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన సా గుతోంది. దీంతో చాలా మంది విద్యార్థులు స ర్కారు బడుల వైపు మళ్లుతున్నారు. ఈ ఏడాది విద్యార్థుల డిమాండ్‌ని బట్టి ఈ స్కూళ్ల సం ఖ్యను పెంచే అంశాన్ని పరిశీలిస్తాం. దీనికి అనుగుణంగా ప్రతిపాదనలు పంపించాలని ఎంఈఓలకు సూచించాం. ప్రైవేటుపై నిక్కచ్చిగా.. ప్రతి స్కూల్ ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే పనిచేయాలి. ప్రై వేటు స్కూళ్ల నిర్వహణపై నిక్కచ్చిగా వ్యవహరిస్తాం. అనుమతులు లేని పాఠశాలల జాబితా రూపొందించి ఇప్పటికే వాటి యాజమాన్యాలకు నోటీసులు జారీచేశాం. ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందకుండా బడులు తెరిస్తే సీజ్ చేస్తాం. 25 స్కూళ్లు తమ గుర్తింపును రె న్యూవల్ చేసుకోవాల్సి ఉంది. అలాగే ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంది. దీనికితోడు ఇ ప్పటివరకు అసలు గుర్తింపు లేకుండా 12 స్కూ ళ్లు నిర్వహిస్తున్నట్లు మా పరిశీలనలో తేలింది. అలాగే కొన్ని పాఠశాలలు పరిమిత స్థాయి తరగతుల వరకే అనుమతులు పొందాయి. కానీ, వాస్తవంగా అంతకుమించి తరగుతులు నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వీటన్నింటినీ ఆకస్మికంగా తనిఖీలు చేస్తాం. తమ పిల్లలను చేర్పించే ముందు సదరు స్కూళ్లకు గుర్తింపు ఉందో.. లేదో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. దీనికితోడు గుర్తింపు లేని స్కూళ్ల జాబితాను ఆయా మండల విద్యాధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతాం. నిర్ధిష్ట అర్హతలు ఉన్న టీచర్లే ప్రైవేటు స్కూళ్లలో బోధించాలి. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు డీఎడ్ చేసి, హైస్కూల్ స్థాయి పిల్లలకు బీఎడ్ చేసిన టీచర్లే బోధించాలి. డొనేషన్లు లేవు.. విద్యార్థుల చేరిక సమయంలో ప్రైవేటు పాఠశాలలు డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజును తీసుకోవద్దు. ఒకవేళ వసూలు చేసినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకువస్తే సదరు స్కూల్‌పై చర్యలు తీసుకుంటాం. పాఠశాలల్లో యూనిఫాంలు, నోట్‌బుక్స్, షూ, టై, బెల్టులు అమ్మడానికి వీల్లేదు. ప్రభుత్వ నిర్దేశించిన పని వేళలను తప్పనిసరిగా ప్రైవేటు స్కూళ్లు పాటించాలి. స్టేట్ సిలబస్ బోధించే బడుల్లో ఐదు నుంచి పదో తరగతుల వరకు విద్యాశాఖ రూపొందించిన పాఠ్య పుస్తకాలనే వినియోగించాలి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రభుత్వం ఆమోదించిన పాఠ్య పుస్తకాలనే బోధించాలి. ప్రైవేటు బడుల్లో చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాల కొరత లేదు. వీరికోసం జిల్లావ్యాప్తంగా విద్యాశాఖ గుర్తించిన 23 బుక్స్ స్టోర్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. అంతేగాక హైదరాబాద్ మింట్ కాంపౌండ్ వద్ద ఉన్న ప్రభుత్వ ప్రచురణ కేంద్రంలోనూ అందుబాటులో ఉంటాయి. ఇక్కడికి వెళ్లి కొనుగోలు చేయవచ్చు. బుక్స్ స్టోర్లలో పుస్తకాలను ఎమ్మార్పీకే విక్రయించాలి. ఆ ధరకు మించి అమ్మితే మాకు ఫిర్యాదు చేస్తే.. సదరు స్టోర్‌పై చర్యలు తీసుకుంటాం. వచ్చేనెల ఒకటి నుంచి ప్రత్యేక తరగతులు పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు, ప్రతి విద్యార్థిలో విషయ పరిజ్ఙానం పెంచేందుకు కార్యాచరణ రూపొందిస్తాం. జూలై ఒకటో తేదీ నుంచే టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించాం. వార్షిక పరీక్షలు వచ్చే వరకు విద్యార్థులను అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించేలా చేయడంతోపాటు పరీక్షల పట్ల భయం తొలగించడానికి ప్రాధాన్యత ఇస్తాం. తద్వారా చదువులో వెనుకడిన విద్యార్థి కూడా కనీసం ఉత్తీర్ణత సాధించేలా సంసిద్ధత చేస్తాం. మొన్నటి కంటే మెరుగైన ఫలితాలు సాధించడంతోపాటు వంద శాతం ఉత్తీర్ణత స్కూళ్ల సంఖ్యను పెంచుతాం. 14 నుంచి బడిబాట ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం, బడిఈడు పిల్లలకు ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా మార్చడం కోసం ఈనెల 14 నుంచి 19 వరకు బడిబాట నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా.. మధ్యలో బడిమానేసిన, బడి ఈడు వయసున్న విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యం. విద్యాశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను ఇందులో భాగస్వామ్యం చేస్తాం. ఆరు రోజుల పాటు నిత్యం ఏడు నుంచి 11 గంటల వరకు అన్ని గ్రామాల్లో బడిబాట నిర్వహిస్తాం. చదువు ప్రాముఖ్యత తెలియజేయడంతోపాటు ప్రభుత్వ బడుల్లో పిల్లలు చేర్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదై ఐదేళ్లు నిండిన 13వేలకుపైగా పిల్లలను బడిబాట ద్వారా స్కూళ్లలో చేర్పిస్తాం. అలాగే సీఆర్పీలు గుర్తించిన 448 బాల కార్మికులను స్కూళ్లలో చేర్చుతాం. -
బడికి వేళాయే..!
భువనగిరి : వేసవి సెలవుల్లో ఆటాపాటలతో హాయిగా గడుపుతున్న విద్యార్థులు బడికి వెళ్లే సమయం రానే వచ్చింది. నేటి నుంచి బడిగంట మోగనుంది. 2019–2020 విద్యా సంవత్సరం బుధవారం నుంచి ప్రారంభంకానుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున విద్యార్థుల సందడితో పండుగ వాతావరణం నెలకొనాలని రెండు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం విద్యా క్యాలెండర్‌ను 12రోజులు ముందుకు జరి పింది. కానీ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వేసవి సెలవులను జూన్ 11వ తేదీ వరకు పొడిగించింది. దీంతో జూన్ 1వ తేదీన పునః ప్రారంభం కావాల్సిన పాఠశాలలు జూన్ 12న ప్రారంభమవుతున్నాయి. అలాగే 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగాల్సిన బడిబాటను కూడా 14 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలిరోజున పాఠ్య పుస్తకాల పంపిణీ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తొలిరోజున పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక, మోడల్, కేజీబీవీలకు ఇప్పటికే పాఠ్య పుస్తకాలు చేరాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 3,39,962 పుస్తకాలు అవసరం ఉండగా 3,12,950 పాఠ్య పుస్తకాలు పాఠశాలలకు చేరా యి. మరో 27,012 పుస్తకాలు రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు విక్రయించడానికి వీలులేదు. ప్రైవేట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు విక్రయించడానికి భువనగిరిలో దత్తసాయి, చౌటుప్పల్‌లో ధనలక్ష్మి, బుక్స్టోర్లకు విద్యాశాఖ అధికారుల అనుమతి ఇచ్చారు. 14 నుంచి బడిబాట.. ఈనెల 14 నుంచి 19వ తేదీవరకు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేందుకు ఏటా ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. సుమారు ఆరు రోజులపాటు కొనసాగే బడిబాట కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు శాతం పెరిగే అవకాశం ఉంటుంది. తగ్గని ఉష్ణోగ్రతలు.. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. గరిష్టంగా 40 నుంచి 42 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలను పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్రులు జంకుతున్నారు. జూన్ 1వ తేదీన ప్రారంభించాల్సిన పాఠశాలలను అధిక ఉష్ణోగ్రతల కారణంగా సెలవులను 11వ తేదీ వరకు పొడిగించారు. అయినప్పటికీ ఉష్ణోగ్రతలు అదే విధంగా కొనసాగుతుండడంతో పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తొలిరోజు పాఠ్యపుస్తకాల పంపిణీ పాఠశాలలు ప్రారంభం రోజున పాఠ్య పుస్తకాల పంపిణీ జరుగుతుంది. 14 నుంచి 19వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషిచేయాలి. యూనిఫాం కూడా ఇప్పటికే మండలాలకు చేరింది. – రోహిణి, డీఈఓ -
బడికి పోదాం..
ఆదిలాబాద్‌టౌన్/ఆదిలాబాద్‌కల్చరల్: బడికి వేళయింది.. బుధవారం నుంచి బడిగంట మోగనుంది. వేసవి సెలవుల్లో సరదాగా ఆడిపాడిన విద్యార్థులు ఇక ఆటాపాటలకు టాటా చెప్పి బడిబాట పట్టనున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు. ఎప్పటిలాగే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. ప్రహరీలు, తాగునీరు.. మొండి గోడలు, అసంపూర్తి గదులు ఆహ్వానిస్తున్నాయి. ఉపాధ్యాయుల ఖాళీలు, శిథిల భవనాలు, చెట్ల కింద చదువులు కొనసాగేలా ఉన్నాయి. మరుగుదొడ్డి ఉన్నా నీటి సౌకర్యం లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. వాటి నుంచి దుర్గం ధం వ్యాపిస్తోంది. ఉపాధ్యాయ పోస్టులు ఇంకా భర్తీ కాకపోవడంతో విద్యావాలంటీర్లతోనే విద్యాబోధన కొనసాగనుంది. జిల్లాలో దాదాపు 400 పాఠశాలల్లో తాగునీటి సమస్య ఉంది. 241 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. విద్యాశాఖాధికారులు సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యబోధన అందించి వారి భవిష్యత్‌కు బాటలు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అందరూ ఇన్‌చార్జీలే.. జిల్లాలోని 18 మండలాల్లో ఒక్కరు కూడా రెగ్యులర్ ఎంఈఓలు లేరు. ఆయా మండలాల్లోని సీనియర్ ప్రధానోపాధ్యాయులే మండల విద్యాధికారులుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో పాఠశాలపై పర్యవేక్షణ కొరవడి అస్తవ్యస్తంగా తయారవుతుంది. ప్రధానోపాధ్యాయులకు రెండు బాధ్యతలు ఉండడంతో అటు ఎంఈఓ విధులకు.. ఇటు పాఠశాలకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారు. కొత్తగా ఏర్పడిన మావల, సిరికొండ, భీంపూర్, ఆదిలాబాద్‌అర్బన్, గాదిగూడ మండలాలకు ఇంకా ఎంఈఓలను నియమించలేదు. పాత మండలాల ఎంఈఓలే ఇన్చార్జీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ ఎంఈఓ పోస్టులు భర్తీ చేస్తేగానీ ప్రాథమిక విద్యావ్యవస్థ గాడిలో పడేలా కనిపించడం లేదు. ఉపాధ్యాయుల ఖాళీలు.. జిల్లాలో మొత్తం 1,420 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,288 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. 970 ప్రాథమిక పాఠశాలలు, 122 ప్రాథమికోన్నత పాఠశాలలు, 195 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1,28,354 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యా హక్కుచట్టం ప్రకారం ప్రతీ తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. దాదాపు 500లకు పైగా ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీలున్నాయి. ఉపాధ్యాయుల నియామకం కోసం టీఆర్టీ పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేసినా నియామకాలు చేపట్టకపోవడంతో వీవీలతోనే విద్యాబోధన కొనసాగుతోంది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలేదని తెలుస్తుంది. దాదాపు 50 పాఠశాలల వరకు జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా, 20 వరకు ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో సమీపంలోని పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులతో సర్దుబాటు చేసి విద్యబోధన చేయిస్తున్నారు. వీరు పాఠశాలకు సెలవు పెడితే విద్యార్థులకు కూడా సెలవే అన్న విధంగా పాఠశాలలు కొనసాగుతున్నాయి. తాగునీటి సమస్య.. జిల్లాలో దాదాపు 430 పాఠశాలల్లో తాగునీటి సమస్య ఉంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థులు కొంతమంది ఇంటి నుంచే నీటిని తీసుకొస్తుండగా, ఇంకొందరు ఇంటికి వెళ్తున్నారు. సమీపంలోని బోరుబావుల వద్ద నీరు తాగుతున్నారు. నీటి సమస్యతో మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. మరుగుదొడ్లు శుభ్రంగా ఉండకపోవడంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడటం లేదు. మహిళ ఉపాధ్యాయుల సైతం మరుగుదొడ్లు లేనిచోట అవస్థలు పడుతున్నారు. అందని కంప్యూటర్ విద్య.. విద్యార్థులకు గత కొన్నేళ్లుగా కంప్యూటర్ విద్య అందకుండా పోయింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్ విద్య బోధించాలనే ఉద్దేశంతో అప్పట్లో ఎడ్కం సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని విద్యార్థులకు కంప్యూటర్ విద్యను బోధించారు. ఐదు సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ ఒప్పందం ఉండగా, వారి గడువు ముగియడంతో ఇన్స్ట్రక్టర్లను తొలగించారు. ప్రస్తుతం పాఠశాలల్లో కంప్యూటర్లు మూలన పడ్డాయి. విద్యార్థులకు సాంకేతిక విద్య అందకుండా పోయింది. విద్యార్థులతోనే సిబ్బంది పనులు.. బోధనేతర సిబ్బందిలో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒక స్వీపర్, ఒక అటెండర్, రాత్రి కాపలదారి ఉండాలి. ఉన్నత పాఠశాలల్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ ఉండాలి. కొన్ని పాఠశాలల్లో మాత్రమే జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. స్వీపర్లు లేకపోవడంతో విద్యార్థులే పాఠశాలలను శుభ్రపర్చుకుంటున్నారు. స్కావెంజర్ ఉన్నచోట పాఠశాలలను శుభ్రపర్చుతున్నారు. కొన్ని పాఠశాలల్లో మొదటి గంట కొట్టడం నుంచి సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు విద్యార్థులే పనులు కొనసాగిస్తున్నారు. ఇబ్బందులు లేకుండా చర్యలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఇప్పటికీ అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు చేరాయి. ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాంలు కూడా విద్యార్థులకు అందిస్తాం. బడి బయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పించేందుకు ఈ నెల 14 నుంచి బడిబాట చేపడుతున్నాం. ఇటీవల విడుదలైన పదో ఫలితాల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారు. ఈ విద్యాసంవత్సరం కూడా మంచి ఫలితాలు సాధించేందుకు చర్యలు చేపడతాం. – ఎ.రవీందర్‌రెడ్డి, డీఈఓ -
బడికి వేళాయె!
పాలమూరు: బడిగంటలు మోగాయి.. వేసవి సెలవుల్లో అమ్మమ్మ, నానమ్మ ఊర్లకు వెళ్లి సరదాగా గడిపిన విద్యార్థులు నేటినుంచి పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు ఈనెల 1వ తేదీనే తెరుచుకోవాల్సిన పాఠశాలలు ఎండలు మండుతుండడంతో ప్రభుత్వం 12వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నేటినుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. ప్రభుత్వ పాఠశాలలను మొదటిరోజు అట్టహాసంగా ప్రారంభించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయగా ఉపాధ్యాయులు ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా గ్రామాలు, పట్టణాల్లో తమదైన శైలిలో ప్రచారాలు చేసి నేడు ఆర్భాటంగా పాఠశాలలను ప్రారంభించనున్నారు. ముందేచేరిన పుస్తకాలు పాఠశాలల ప్రారంభం రోజునే తరగతులు కూడా ప్రారంభించాలని విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడంతో అందుకు తగ్గట్టు ముందుగానే అవసరమైన పాఠ్యపుస్తకాలను అందజేశారు. నేటినుంచి పాఠశాలలు తెరుచుకోనున్నడంతో పిల్లలకు బ్యాగులు, పుస్తకాలు, స్కూల్ యూనిఫాం ఇతర వస్తువులను కొనుగోలు చేస్తూ తల్లిదండ్రులు బిజీగా కనిపించారు. జిల్లా కేంద్రంలో ఉన్న బుక్సెంటర్లు, షూ సెంటర్లు, బట్టల దుకాణాల్లో సందడి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 2601 ప్రాథమిక పాఠశాలలు, 567 ప్రాథమిక కొన్నత పాఠశాలలు, 575 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా 1750 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా దాదాపు 10లక్షల మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో చదువుకుంటున్నారు. ఇదిలాఉండగా మహబూబ్‌నగర్ జిల్లాలో 212 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 1,167 ప్రాథమికొన్నత ప్రాథమిక పాఠశాలలు, 383 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో నూతనంగా వచ్చిన పాఠశాలలు కాకుండా 150 ప్రాథమిక పాఠశాలలు, 213 ఉన్నత పాఠశాలలుండగా 85,511 మంది విద్యార్థులు చదువుతున్నారు. సామాన్యులకు ఆర్థికభారం జూన్ మాసం వచ్చిందంటే సామాన్యులకు ఆర్థిక, అప్పుల భారం పెరుగుతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల సంగతి చెప్పనక్కరలేదు. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు రూ.12వేల నుంచి రూ.18వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.22వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని పాఠశాలలు ప్యాకేజీ కింద రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నాయి. దాంతోపాటు సాధారణ స్కూల్ ఫీజులే కాకుండా డోనేషన్లు, అడ్మిషన్ ఫీజులు, స్పెషల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, ల్యాబ్ ఫీజులు, రికార్డులు, బస్సు ఫీజులు, టైలు, బెల్టులు, ఐడెంటీ కార్డులు, పుస్తకాలు, వంటివి బయట కొనుగోలు చేయకుండా నిబంధనలు ఏర్పాటు చేసి వారి పాఠశాలల్లోనే కొనాల్సిన పరిస్థితి తీసుకొస్తారు. దీంతో విద్యార్థులు ఎక్కడ కూడా చెప్పలేక యాజమాన్యాలు చెప్పనదానికి తల ఊపాల్సి వస్తోంది. దానికితోడు పెరిగిన ధరలు కూడా తల్లిదండ్రులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే వారికి పెన్సిల్ దగ్గరి నుంచి స్కూల్ ఫీజుల వరకు వేలల్లో ఖర్చు అవుతుంది. ఒక మధ్యతరగతి కుటుంబం ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడం కష్టంగా మారుతోంది. -
పాఠశాలకు.. పాత దుస్తులతోనే!
వికారాబాద్ అర్బన్: పాఠశాలల పునఃప్రారంభ గడువు ముంచుకొస్తున్నా.. ప్రభుత్వం ఇప్పటికీ విద్యార్థులకు కొత్త యూనిఫాంలు పంపిణీ చేయలేదు. సర్కారీ బడుల్లో చదివే విద్యార్థుల్లో పేద, ధనిక భేదాభిప్రాయాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఏటా యూనిఫాం అందజేస్తున్నారు. అయితే స్కూళ్లు తెరుచుకునే సమయంలో కాకుండా విద్యాసంవత్సరం చివరలో యూనిఫాంలకు సంబంధించిన వస్త్రాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. అప్పటికే బడికి వేసవి సెలవులు వస్తుండటంతో అధికారులు పంపిణీ చేసిన వస్త్రం మూలన పడి ఉంటోంది. ఈ ఏడాది కూడా విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యార్థులకు యూనిఫాంలు అందించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో జూన్ 1న విద్యార్థులు పాత దస్తులతోనే పాఠశాలకు రానున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా పాత బట్టలతోనే పాల్గొననున్నారు. ఏటా ఇదే పరిస్థితి... విద్యార్థులకు అందించే యూనిఫాం విషయంలో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు విషయంలో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు శ్రద్ధచూపడం లేదు. ఏటా విద్యా సంవత్సరం ముగుస్తున్న సమయంలో వస్త్రం పంపిస్తున్నారు. ఇలాగైతే సకాలంలో పిల్లలకు దుస్తులు ఇవ్వలేకపోతున్నామని తెలిసి కూడా వస్త్రం పంపిణీ విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. వస్త్రం వచ్చిన తర్వాత విద్యార్థుల కొలతలు తీసుకుని, యూనిఫాంలు కుట్టేందుకు దర్జీలు మూడు నెలల సమయం తీసుకుంటారు. విద్యాసంవత్సరం ముగుస్తున్న సమయంలో పాఠశాలల వారీగా పిల్లల కొలతలు తీసుకుంటే స్కూళ్లు తెరిచే నాటికి కొత్త దుస్తులు అందించవచ్చని తల్లిదండ్రులు చెబుతున్నారు. జిల్లాలో 1,043 పాఠశాలలు... జిల్లాలో 1,043 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 88,648 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఏటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో యూనిఫాంలు అందజేస్తున్నారు. విద్యా సంవత్సరం ముగిసి, సెలవులు పూర్తయ్యి.. పాఠశాలలు తెరిచే సరికి అవి పాతబడి చిరిగిపోతున్నాయి. దీంతో స్కూళ్లు తెరిచిన సమయంలో విద్యార్థులు పాత దుస్తులతోనే వస్తున్నారు. ఈ ఏడాది విద్యాసంవత్సరం ఆరంభం నుంచే పాఠ్య పుస్తకాలతో పాటు,ఏకరూప దుస్తులు కూడా అందించే ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని తల్లిదండ్రులు కోరుతున్నారు. గత ఏడాది ఎంత మేర వస్త్రం ఆర్డర్ ఇచ్చారనే అంశంపై ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎంఈఓల నుంచి వివరాలు తీసుకున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.200 ఖర్చు.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంల కోసం ప్రభుత్వం ఏటా ఒక్కొక్కరికి రూ.200 ఖర్చు చేస్తోంది. వీటిలో ఆప్కో ద్వారా వస్త్రం కొనుగోలుకు రూ.160, కుట్టు కూలికి రూ.40 చెల్లిస్తున్నారు. కూలి చాలా తక్కువగా ఉందని దర్జీలు సైతం దుస్తులు కుట్టడానికి ముందుకు రావడం లేదు. -
ఇక అ‘ధనం’!
వైరా: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, మరింత రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు వడ్డించాలనే లక్ష్యంతో సర్కారు నిధులు పెంచింది. ఇకపై కేటాయింపులు అదనంగా చెల్లించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న వంట కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీపి కబురు అందించాయి. రెండేళ్ల తర్వాత మధ్యాహ్న భోజన ధరలు పెంచుతూ ఇటీవలె రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కూరగాయలు, నూనె, పప్పు, ఉప్పు తదితర వస్తువులకు సంబంధించి రూ.5.35 శాతం ధరలు పెంచింది. ఇవి వెంటనే అమలులోకి రానున్నాయి. గతంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికీ రోజుకు రూ.4.13 చెల్లించేవారు. ఇకపై రూ.4.35 చెల్లించనున్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.2.61 కాగా రాష్ట్రం వాటా రూ.1.74 ఉంటుంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు గతంలో రూ.6.18 చెల్లించేవారు. పెరిగిన చార్జీలతో ప్రస్తుతం రూ.6.51 చెల్లిస్తారు. ఇందులో కేంద్రం వాటా రూ.3.91, రాష్ట్రం వాటా రూ.2.60 చొప్పున ఉంటుంది. జిల్లాలో 605 ప్రాథమిక, 193 ప్రాథమికోన్నత, 209 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు మొత్తం 92,663 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు, నిరుపేద విద్యార్థులకు నాణ్యత గల విద్య అందించాలన్న లక్ష్యంతో 2005లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైన విషయం విదితమే. సన్న బియ్యం, పోషకాహారం.. దొడ్డు బియ్యం అన్నం నాసిరకంగా ఉండటంతో 2015 నుంచి సన్నబియ్యంతో భోజనం ప్రారంభించారు. వారానికి మూడు గుడ్లు, ఒక రోజు కిచిడీ, రోజు తప్పించి రోజు పప్పు, కూరగాయలు, సాంబార్ మెనూగా ఇస్తున్నారు. ఈ మెనూ ప్రకారం అందించాలంటే వంట ఏజెన్సీలకు గిట్టుబాటు కావట్లేదు. ముఖ్యంగా ఒక్కగుడ్డుకు ప్రభుత్వం ఇచ్చేది రూ.4 మాత్రమే. మార్కెట్లో సాధారణంగా ఒక్కో గుడ్డు రూ.5కు విక్రయిస్తున్నారు. వంట వండినందుకు ఒక్కో మహిళకు నెలకు రూ.వెయ్యి గౌరవభృతిగా చెల్లిస్తున్నారు. వంట ఖర్చు, గౌరవభృతి నెలనెలా రావడం లేదని, మూడు నెలలకోసారి బిల్లులిస్తున్నారంటూ..ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చూస్తే చాలా పాఠశాలల్లో మార్చి నెల వరకు వంట ఖర్చులు, జనవరి వరకు గౌరవ వేతనాలు వచ్చినట్లు సమాచారం. మెనూ అమలు పర్చడానికి ప్రభుత్వం ఇచ్చే రేట్లు సరిపోవడం లేదని ఏజెన్సీ మహిళలు అంటున్న తరుణంలో ఈ ధరల పెంపు వారికి ఊరడింపు లాంటిదేనని భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం హర్షించదగింది.. ప్రభుత్వం మధ్యాహ్న భోజన చార్జీలను పెంచడం హర్షించదగింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా ఆరోగ్యకరమైన భోజనాన్ని కూడా అందించేందుకు అవకాశం ఉంది. ఇక విద్యార్థులకు మంచి భోజనం అందనుం ది. – కె.వెంకటేశ్వర్లు, ఎంఈఓ, వైరా మధ్యాహ్న భోజన కార్మికులకు ఊరట.. ప్రభుత్వం మధ్యాహ్న భోజన చార్జీలను పెంచడం హర్షించదగింది. దీంతో మధ్యాహ్న భోజన కార్మికులకు ఊరట లభించినట్లైంది. ప్రభుత్వ నిర్ణయం చాలా బాగుంది. హాజరుశాతం మరింత మెరుగవుతుంది. – టి.నర్సింహారావు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వైరా -
పాఠ్య పుస్తకాలొచ్చాయ్
పాపన్నపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రారంభమైంది. 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలలు తెరిచేనాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు మెదక్ పాఠ్యపుస్తక నిల్వ కేంద్రం నుంచి జిల్లాలోని పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీని ప్రారంభించినట్లు డిపో మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఫీజులు లేకుండా విద్య అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో పాతికేళ్ల నుంచి ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీని ప్రారంభించింది. జిల్లాలో మొత్తం 143 ఉన్నత, 132 ప్రాథమికోన్నత, 632 ప్రాథమిక, 7 మోడల్, 15 కేజీబీవీ పాఠశాలలున్నాయి. ఇందులో సుమారు 1.20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ 6,02,517 పాఠ్య పుస్తకాలు అవసరమవుతాయి. ఇప్పటికే మెదక్‌లోని పాఠ్యపుస్తక నిల్వ కేంద్రంలో 34,521 పుస్తకాలు నిల్వ ఉన్నాయి. ఇంకా 5,67,996 పుస్తకాలు అవసరముండగా శుక్రవారం నాటికి 4,49,480 పుస్తకాలు వచ్చాయి. మరో 1,18,516 పుస్తకాలు రావాల్సి ఉన్నాయి. 1 నుంచి 10వ తరగత వరకు విభిన్న మీడియంలలో కలసి 165 టైటిల్స్ అవసరం ఉండగా ఇప్పటి వరకు 117 టైటిల్స్ వచ్చాయి. మరో 48 రావాల్సి ఉంది. ఇప్పటికే హవేలిఘణపూర్, మెదక్, శంకరంపేట(ఏ), రేగోడ్ మండలాలకు పంపిణీ చేసినట్లు డిపో మేనేజర్ శ్రీకాంత్ వెల్లడించారు. ఆతర్వాత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వివిధ మండలాలకు సరఫరా చేస్తామన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా వాటిపై బార్కోడ్ ముద్రించినట్లు సమాచారం. పుస్తకాల పంపిణీ తర్వాత అక్విటెన్స్ కూడా పాఠశాలల వారీగా రికార్డు చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధిత హెచ్‌ఎంలదే పూర్తి బాధ్యత ఉంటుందని తెలిసింది. బడులు తెరిచే నాటికి పూర్తి జూన్1న పాఠశాలలు తెరిచేనాటికి పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి చేస్తాం. నిర్ణయించిన షెడ్యూల్‌కనుగుణంగా ఎంఈఓలు పాఠ్యపుస్తకాలు తీసుకెళ్లే చర్యలు చేపట్టాలి. ఇంకా కొన్ని టైటిల్స్, పుస్తకాలు రావాల్సి ఉంది. అవి రాగానే అన్ని పాఠశాలలకు పూర్తిస్థాయిలో అందజేస్తాం. –శ్రీకాంత్, గోదాం ఇన్చార్జి -
బైబై పాఠశాలలకు వేసవి సెలవులు
పాపన్నపేట(మెదక్): ఇన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఇక ఆటపాటల్లో మునిగి తేలేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ శనివారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. పదోతరగతి పరీక్షలు ఈనెల 3న ముగియగా, ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల పరీక్షలు ఈనెల 9వ తేదీతో పూర్తయ్యాయి. 10,11 తేదీల్లో లోక్‌సభ ఎన్నికల సెలవులు ఉండగా, 12న (శుక్రవారం) ఎన్నికల విధుల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు మధ్యాహ్నం వరకు పాఠశాలలు కొనసాగించి, ఫలితాలు వెల్లడించి సెలవులు ప్రకటించారు. జిల్లాలో వారం రోజుల నుంచి ఎండలు మండుతున్న నేపథ్యంలో చిన్నారులు పాఠశాలలకు రావాలంటే విలవిల్లాడిపోయారు. శుక్రవారం జిల్లాలో 40 çడిగ్రీల సెంటీగ్రేడ్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే 31 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 1న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు.. సెలవులను కచ్చి తంగా పాటించాలని, ఎవరైనా బడులు నడిపితే చర్యలు తప్పవని ఇన్చార్జి డీఈఓ రవికాంత్‌రావు హెచ్చరించారు. కేజీబీవీ పాఠశాలల్లో చదువుకుంటున్న తల్లిదండ్రులు లేని పిల్లలకు సిద్దిపేట జిల్లా చేర్యాలలో సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నారు. బిజీబిజీగా ఉపాధ్యాయులు.. జిల్లాలో 632 ప్రాథమిక, 131 ప్రాథమికోన్నత, 143 ఉన్నత పాఠశాలలుండగా ఇందులో సుమారు 1.27 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. 2017–18 ఎన్నికల సంవత్సరంగానే గడిచింది. 2018 జూలైలో టీచర్ల బదిలీలు జరిగాయి. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు, జనవరిలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఈనెల 11న జరిగిన లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మార్చిలో శిక్షణ, పదో తరగతి పరీక్షలతో బిజీబిజీగా గడిచిపోయంది. పక్కా ప్రణాళికతో పది పరీక్షలు విద్యా సంవత్సరంలో కొన్ని అవాంతరాలు ఏర్పడినప్పటికీ పదో తరగతి పరీక్షలకు పక్కా ప్రణాళికతో విద్యార్థులను సన్నద్ధం చేశారు. కలెక్టర్ ధర్మారెడ్డి, ఇన్చార్జి డీఈఓ రవికాంత్‌రావు ఆధ్వర్యంలో ఆగస్టు నుంచే ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ‘లిటిల్ టీచర్–లిటిల్ లీడర్’ ప్రోగ్రాంతో విద్యార్థుల్లో పది పరీక్షలపై ఆత్మ విశ్వాసం పెంపొందించారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నడిపించారు. సాయంత్రం ప్రత్యేక తరగతుల వేళ స్నాక్స్ అందించారు. మొత్తం మీద పది పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న ధీమాను విద్యాశాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కేజీబీవీ విద్యార్థినులకు వేసవి శిబిరం తల్లిదండ్రులు లేని కేజీబీవీ విద్యార్థినులకు చేర్యాలలో సమ్మర్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ నెల 13 నుంచి మే 25 వరకు ఈ క్యాంపు కొనసాగుతుంది. మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని కేజీబీవీ పాఠశాలల్లో చదువుతూ తల్లిగాని, తండ్రి గాని, ఇద్దరూ లేని విద్యార్థులను శిబిరానికి పంపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, నైపుణ్యాలు పెంపొందించేలా అక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. వీటితో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. -
ఆంగ్లం.. అలవోకగా
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అధికారులు నడుం బిగించారు. ఈమేరకు జిల్లాలోని 969 పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ‘జాలీ ఫోనిక్స్’ ఎడ్యుకేషన్ సొసైటీతో ఒప్పందం కుడుర్చుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్య అందించాలని గత విద్యా సంవత్సరంలోనే నిర్ణయించారు. ఈ క్రమంలో జిల్లాలోని 10 పాఠశాలలకు సంబంధించిన 20 మంది ఉపాద్యాయులకు రెండు విడతల్లో శిక్షణ ఇప్పించారు. ఈ మేరకుశిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులు తాము బోధించే పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పడంతో విద్యా సంవత్సరం అన్ని ప్రాథమిక పాఠశాలల్లో అమలుకు నిర్ణయించారు. దీంతో అదే సంస్థ ఆధ్వర్యాన మిగతా ఉపాధ్యాయులకు కూడా త్వరలోనే మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 24వేల మంది విద్యార్థులకు ప్రయోజనం ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు మాతృభాషతో పాటు ఇతర భాషలపై కూడా పట్టు ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అధికారులు అంతర్జాతీయ సంస్థ అయినా జాలీ ఫోనిక్స్ ఆధ్వర్యాన తొలుత ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చిన అనంతరం ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభిస్తే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1, 2వ తరగతులకు చెందిన 24వేలమంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. కాగా, శిక్షణ పూర్తయ్యాక ప్రతీ పాఠశాలకు జాలీ ఫోనిక్స్ సంస్థ తరఫున 969 స్కూళ్లకు రూ.20వేలు విలువైన కిట్లు కూడా ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చారు. ఈ కిట్ ద్వారా విద్యార్థులకు సులువుగా ఆంగ్ల బోధన సాధ్యం కానుంది. ఈ కిట్‌లోని వస్తువుల ద్వారా పదాలను పలకడం, ఎలాంటి ధ్వనులను వెలువరించాలనే అంశం సులువుగా తెలిసొస్తుంది. ప్రవేశాలు పెరిగే అవకాశం విద్యావ్యవస్థలో వస్తున్న మార్పుల నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రులు చాలా వరకు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో చదివించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, ప్రభుత్వ బడుల్లో కేవలం తెలుగు మీడియం ఉండడంతో ప్రవేశాలు ఏటా తగ్గిపోతున్నాయి. కొన్నింట్లోనైతే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోగా మూతపడే స్థితికి చేరుకున్నాయి. ఈ మేరకు పేద విద్యార్థులు ఉచితంగా నాణ్యమైన ఆంగ్ల బోధన జరిపేందుకు సిద్ధమైన అధికారులు ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇప్పటికే పది పాఠశాలల్లో మంచి ఫలితాలు వచ్చిన నేపథ్యంలో వచ్చే ఏడాది అన్ని పాఠశాలల్లో ప్రారంభించే ప్రవేశాలు పెరిగే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. జిల్లా కేంద్రంపై ప్రత్యేక దృష్టి ఇంగ్లిష్ విద్యను అందించడంలో భాగంగా అధికారులు మొదట జిల్లా కేంద్రంపై దృష్టి కేంద్రీకరించారు. జాలీ ఫొనిక్స్ సంస్థ చేసిన అధ్యయనం లో కూడా జిల్లా కేంద్రంలోనే తొలుత అమలు చేసేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆంగ్లంపై పట్టు లేకపోవడం, ఉన్నత పాఠశాల స్థాయికి వెళ్లాక అదే పరిస్థితి కొనసాగుతున్న కారణంగా పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పడిపోతోంది. అయితే హైస్కూల్ విద్యార్థులకు ఒకవేళ శిక్షణ ఇచ్చినా తక్కువ సమయంలో పూర్తి స్థాయిలో నేర్చుకునే అవకాశం లేదని భావించి.. ప్రాథమిక స్థాయిలోనే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. విద్యార్థులకు ఎంతో మేలు... ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం లేని కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు రూ.వేలల్లో ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయం ఎంతో మంచిది. ఈ నిర్ణయం ద్వారా పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన బోధన అందనుంది. – శ్యాంబాబు, ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాల, మణికొండ ఇంగ్లిష్తో మంచి ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. గతంలో శిక్షణ తీసుకుని మా పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తున్నాం. విద్యార్థుల నుండి మంచి స్పందన వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో బడుల్లో ఇంగ్లిష్ మీడియం లేదనే కారణంతో తల్లిదండ్రులు ఆసక్తి చూపే వారు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. – ఎం.సునీత, ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాల, మరికల్ ఆనందంగా ఉంది.. ప్రస్తుతం చాలా ప్రైవేట్ పాఠశాలలు కూడా జాలీ ఫోనిక్స్ సంస్థ వారు ఇచ్చే శిక్షణ ఆధారంగానే బోధిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు అందిస్తున్న నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య మన జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందనుండడం ఆనందంగా ఉంది. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు అవకాశం ఉంది. – ఎం.శ్వేత, ప్రాథమిక పాఠశాల, పిల్లలమర్రి -
అప్పు చేసి భోజనం!
బజార్హత్నూర్(బోథ్): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు సర్కారు మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తోంది. ఎన్నో వ్యయ, ప్రయాసాలకు ఓర్చి నిర్వాహకులు వంట చేసి భోజనం పెడుతున్నా బిల్లులు మాత్రం నెలనెలా రావడం లేదు. దీంతో అప్పులు చేసి విద్యార్థులకు వండి పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. మూడు నెలలుగా రాని బిల్లులు జిల్లాలో మొత్తం 68,382 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అందులో భాగంగా 2018 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో మొత్తం 56 పనిదినాల్లో 68,382 మంది విద్యార్థులకు అందించిన మధ్యాహ్నం భోజనం బిల్లులు రూ.2,63,89,728లను ప్రభుత్వం చెల్లించకపోవడంతో నిర్వాహకులు అప్పులు చేసి మరి ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు.అందుబాటులో డబ్బులు లేక నాణ్యమైన భోజనం అందించలేకపోతున్నారు. ప్రభుత్వం తక్షణం బిల్లులు చెల్లిస్తే తప్పా మధ్యాహ్న భోజన కార్యక్రమం కొనసాగే పరిస్థితి కనపడటం లేదు. 9–10వ తరగతుల విద్యార్థులు మధ్యాహ్న భోజన బిల్లులు జూలై నుంచి డిసెంబర్ వరకు బిల్లులు రాలేదు. జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదిస్తే మొదటి మూడు నెలలకు సంబంధించి రూ.43,62,000 బిల్లులు మంజూరయ్యాయని, త్వరలో నిర్వాహకులకు అందిస్తామని తెలిపారు. గిట్టుబాటు కాని చార్జీలు కూరగాయలు పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ మేరకు ఏజెన్సీలకు బిల్లులు ఇవ్వడం లేదు. ప్రభుత్వం నెలనెలా బిల్లులు చెల్లించకపోవడం, చార్జీలు పెంచకపోతే రోజు కూరగాయలు పెట్టడం సాధ్యం కాదని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచకపోవడంతో భోజనంలో కూడా నాణ్యత లోపిస్తోంది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒక్కొరికి రోజుకు రూ.4.13పైసలు, సోమ, బుధ, శుక్రవారాల్లో గుడ్డు పెడితే అదనంగా రూ.4.. 6నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకు రూ.6.18పైసలు సోమ, బుధ, శుక్రవారాల్లో గుడ్డు పెడితే అదనంగా రూ.4.. 9, 10వ తరగతులకు గుడ్డుతోపాటు భోజనానికి రూ.8.18చొప్పున ఏజెన్సీలకు చెల్లిస్తున్నాయి. ఏళ్ల తరబడి ఈ మొత్తాన్ని ప్రభుత్వం పెంచడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో ఏ కూరగాయల ధరలు చూసిన కిలోకు రూ.50కు తక్కువ లేదు. ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలతో గిట్టుబాటు కాకా నిర్వాహకులు ఆలుగడ్డ, చారు, పలుచని పప్పుకే పరిమితమవుతున్నారు. ఇతర కూరగాయలు లేకపోవడంతో భోజనం రుచించక, విద్యార్థులు సగం కడుపుతో సరిపెట్టుకుంటున్నారు. మెనూ ప్రకారం భారమే అయినా.. మధ్యాహ్న భోజనం మెనూలో సర్కారు కూరగాయలతో కూడిన భోజనంతోపాటు వారంలో సోమ, బుధ, శుక్రవారం గుడ్డు అందించాలని పలు మార్పులు చేసింది. దీనిపై జూన్‌లోనే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో రాష్ట్రంలో మధ్యాహ్నభోజనం అమలు తీరును పరిశీలించిన కేంద్ర బృందం మెనూ మార్చాలని సూచించింది. రకరకాల కూరగాయలు, బఠానీ పలావ్, కూరగాయలతో కూర్మా, కాబులీ శనగలు, కూరగాయలతో బిర్యాణి, మిల్మేకర్ బిర్యాణి, మునగకాయ, పెసర పప్పుతో కిచిడీ, చట్నీ, అన్నం, టమాటా, బఠానీల కూర, సోయాచిక్కుడు వంటి కూరలు ఉండాలని నిర్ధేశించింది. తదితర పదార్థాలతో వండి పెడితే విద్యార్థులు ఇష్టంగా తినడంతోపాటు వారికి పౌష్టికాహరం అందించనట్లు కూడా ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వాహకులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం భారమే అయినా కూరగాయలు కొని భోజనం పెడుతున్నారు. కానీ బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రూ.15 చెల్లిస్తేనే.. జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు 1,153 పాఠశాలలు ఉండగా, 68వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిపై మధ్యాహ్న భోజన పథకం కింద గుడ్డు అందించిన రోజు రూ.5.91లక్షలు, గుడ్డు లేని రోజు రూ.3.59లక్షలకుపైగా ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. నాణ్యమైన భోజనం అందాలంటే ఒక్కో విద్యార్థిపై కనీసం రూ.15 వంతున చెల్లించాలని ఏజెన్సీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు అదనంగా ప్రతీ రోజు మరో రూ.3లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇలా చేస్తే భోజనంలో నాణ్యత పెరిగే అవకాశాలు ఉన్నాయి. భారమైతంది నేను వృధ్యాప్యలో ఉండటంతో వ్యవసాయ కూలీగా వెళ్లే పరిస్థితి లేనందున నీడపట్టున ఉంటూ మధ్యాహ్న భో జనం వంటచేసి పెడుతున్నాను. కానీ ప్రభుత్వం బిల్లులు నెలల తరబడి చెల్లించకపోవడంతో ఉపాధ్యాయుల వద్ద అప్పులు చేయాల్సి వస్తోంది. ఒక నెల ఎలాగోలా సర్ధుకపోవచ్చు కాని 3 నెలలు బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా భారమైతంది. – కమలాబాయి, నిర్వాహకురాలు నెలనెలా చెల్లించాలి మధ్యాహ్నభోజన నిర్వాహకులంతా రోజు కూలీలే. వారి వద్ద వేల రూపాయలు జమ ఉండవనే విషయం ప్రభుత్వానికి తెలిసినా బిల్లుల విషయంలో నిర్లక్ష్యం చేయడం సరికాదు. అప్పులు చేసి వడ్డీలు కట్టే పరిస్థితుల్లో లేము. అలా కట్టాలంటే మా రోజు కూలీ వడ్డీకే సరిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలలాగే మధ్యాహ్నభోజనం బిల్లులు నెలనెలా చెల్లించాలి. – కర్వల పోసాని, నిర్వాహకురాలు బడ్జెట్ విడుదలైతే బిల్లులు చెల్లిస్తాం జిల్లాలో 1,153 పాఠశాలల మధ్యాహ్న భోజనం బిల్లులు గత 3 నెలలకు రూ.2.63 కోట్లు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. 9–10వ తరగతి విద్యార్థులు మధ్యాహ్న భోజన బిల్లులు జూలై నుంచి డిసెంబర్ వరకు పెండింగ్‌లో ఉండే. అందులో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మొదటి మూడు నెలలకు సంబంధించిన రూ.43,62,000 ఇటీవల మంజూరయ్యాయి. త్వరలో వాటిని నిర్వాహకులకు అందిస్తాం. మిగతా మూడు నెలల బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయగానే చెల్లిస్తాం. – రవీందర్‌రెడ్డి, డీఈవో -
బాలికలకు భరోసా..
భూపాలపల్లి అర్బన్: మానసిక వేధింపులు, లింగవివక్షకు గురవుతూ ఎవరికీ చెప్పలేక తమలోతాము కుంగిపోతున్న బాలికల్లో చైతన్యం నింపి భరోసా ఇవ్వడానికి రాష్ట్ర విద్యాశాఖ నడుంబిగించిం ది. ప్రభుత్వ పాఠశాలల్లో యుక్తవయసు బాలికలు సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దడానికి బాలిక సాధికారత క్లబ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సర్కారు స్కూళ్లలో చదువుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాల బాలికలు లింగవిక్షతోపాటు పలురకాల మానసిక వేధింపులకు గురవుతున్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోవడం వల్ల ఈ సమస్యల ను ధైర్యంగా ఎదుర్కోలేక పోతున్నారు. మరోవైపు యుక్త వయసులో వచ్చే శారీరక మార్పులకు అనుగుణంగా ఆరో గ్యం, పరిశుభ్రతపై అవగహన కొరవడుతోంది. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి బాలికల్లో ఆత్మవిశ్వసాన్ని నింపుతూనే వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ జీవన నైపుణ్యాలు పెంచేలా సమగ్ర శిక్ష అభియాన్ బాలిక సాధికారత క్లబ్‌లను ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలను ఇందుకు ఎంచుకుంది. మొదటి విడతలతో జిల్లాలోని 20 కస్తూరిబా పాఠశాలలతో పాటు భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు, కాటారం, ఏటూరునాగారం మండల కేంద్రాల్లోని ఉన్నత పాఠశాల్లో ప్రయోగాత్మకంగా ఈ క్లబ్‌లను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తోంది. గత ఏడాది వేసవి సెలవుల్లో జిల్లాలోని పలు కస్తూరిబా విద్యాలయల్లో వివిధ అంశాలపై నిర్వహించిన ప్రత్యేక శిక్షణ ప్రస్తుతం ఈ క్లబ్‌ల ఏర్పాటుకు ఎంతో ఉపయోగపడుతోంది. 15 మంది సభ్యులతో కమిటీ బాలిక సాధికారత క్లబ్లో భాగంగా 13 నుంచి 15 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా కస్తూరిబా విద్యాలయ స్పెషల్ అధికారి చైర్మన్‌గా, గర్ల్ చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్ కన్వీనర్‌గా, ప్రతి తరగతి నుంచి ఇద్దరు ప్రతిభ కలిగిన బాలికలతో మొత్తం 10 నుంచి 12 మంది సభ్యులు, అలాగే ఎక్స్టర్నల్ సభ్యులుగా సమీపంలోని పోలీసుస్టేషన్ నుంచి మహిళా కానిస్టేబుల్ ఉంటారు. ఈ క్లబ్‌లు ప్రతినెలా మొదటి శుక్రవారం సమావేశమై పాఠశాలతో పాటు గ్రామంలోని బాలికల నుంచి వచ్చిన ఫిర్యాదులు, గుర్తించిన సమస్యలపై సమీక్షిస్తారు. క్లబ్ లక్ష్యాలు.. యుక్త వయసు బాలికల్లో వచ్చే శారీరక మార్పులు, ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, సంరక్షణ, లింగవివక్ష, జీవన నైపుణ్యాలు వంటి వాటిపై ఈ క్లబ్‌ల ద్వారా అవగహన కల్పిస్తారు. లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్, బెదిరింపులు తదితర సమస్యలను గుర్తించి సమస్యల పరిష్కారానికి క్లబ్‌లు చర్యలు తీసుకుంటాయి. విద్యార్థినులను ఎవరైనా మానసికంగా వేధించినా, చెప్పుకోలేని విషయాలు ఏమైనా ఉంటే కమిటీ సమావేశంలో చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటా రు. ఈ క్లబ్‌లను ఏర్పాటు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ నుంచి అమలు.. బాలికల కోసం ఏర్పాటు చేస్తున్న సాధికారత క్లబ్‌లను డిసెంబర్ మొదటి వారం నుంచి అమలు చేస్తాం. పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే శిక్షణ సైతం ఇచ్చారు. బాలికల ప్రయోజనం కోసమే రాష్ట్ర విద్యాశాఖ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. – పి.నిర్మల, ఎస్ఎస్ఏ సెక్టోరియల్ అధికారిణి