పాఠశాలకు..  పాత దుస్తులతోనే! | Telangana Govt School Student Dress Code Not Implemented | Sakshi
Sakshi News home page

పాఠశాలకు..  పాత దుస్తులతోనే!

Published Sat, May 25 2019 1:27 PM | Last Updated on Sat, May 25 2019 1:27 PM

Telangana Govt School Student Dress Code Not Implemented - Sakshi

వికారాబాద్‌ అర్బన్‌: పాఠశాలల పునఃప్రారంభ గడువు ముంచుకొస్తున్నా.. ప్రభుత్వం ఇప్పటికీ విద్యార్థులకు కొత్త యూనిఫాంలు పంపిణీ చేయలేదు. సర్కారీ బడుల్లో చదివే విద్యార్థుల్లో పేద, ధనిక భేదాభిప్రాయాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఏటా యూనిఫాం అందజేస్తున్నారు. అయితే స్కూళ్లు తెరుచుకునే సమయంలో కాకుండా విద్యాసంవత్సరం చివరలో యూనిఫాంలకు సంబంధించిన వస్త్రాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. అప్పటికే బడికి వేసవి సెలవులు వస్తుండటంతో అధికారులు పంపిణీ చేసిన వస్త్రం మూలన పడి ఉంటోంది. ఈ ఏడాది కూడా విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యార్థులకు యూనిఫాంలు అందించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో జూన్‌ 1న విద్యార్థులు పాత దస్తులతోనే పాఠశాలకు రానున్నారు. జూన్‌ 2న రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా పాత బట్టలతోనే పాల్గొననున్నారు.

ఏటా ఇదే పరిస్థితి... 
విద్యార్థులకు అందించే యూనిఫాం విషయంలో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు విషయంలో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు శ్రద్ధచూపడం లేదు. ఏటా విద్యా సంవత్సరం ముగుస్తున్న సమయంలో వస్త్రం పంపిస్తున్నారు. ఇలాగైతే సకాలంలో పిల్లలకు దుస్తులు ఇవ్వలేకపోతున్నామని తెలిసి కూడా వస్త్రం పంపిణీ విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. వస్త్రం వచ్చిన తర్వాత విద్యార్థుల కొలతలు తీసుకుని, యూనిఫాంలు కుట్టేందుకు దర్జీలు మూడు నెలల సమయం తీసుకుంటారు. విద్యాసంవత్సరం ముగుస్తున్న సమయంలో పాఠశాలల వారీగా పిల్లల కొలతలు తీసుకుంటే స్కూళ్లు తెరిచే నాటికి కొత్త దుస్తులు అందించవచ్చని తల్లిదండ్రులు చెబుతున్నారు.
  
జిల్లాలో 1,043 పాఠశాలలు...  
జిల్లాలో 1,043 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 88,648 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఏటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో యూనిఫాంలు అందజేస్తున్నారు. విద్యా సంవత్సరం ముగిసి, సెలవులు పూర్తయ్యి.. పాఠశాలలు తెరిచే సరికి అవి పాతబడి చిరిగిపోతున్నాయి. దీంతో స్కూళ్లు తెరిచిన సమయంలో విద్యార్థులు పాత దుస్తులతోనే వస్తున్నారు. ఈ ఏడాది విద్యాసంవత్సరం ఆరంభం నుంచే పాఠ్య పుస్తకాలతో పాటు,ఏకరూప దుస్తులు కూడా అందించే ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని తల్లిదండ్రులు కోరుతున్నారు. గత ఏడాది ఎంత మేర వస్త్రం ఆర్డర్‌ ఇచ్చారనే అంశంపై ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎంఈఓల నుంచి వివరాలు తీసుకున్నారు.
  
ఒక్కో విద్యార్థికి రూ.200 ఖర్చు..  
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంల కోసం ప్రభుత్వం ఏటా ఒక్కొక్కరికి రూ.200 ఖర్చు చేస్తోంది. వీటిలో ఆప్కో ద్వారా వస్త్రం కొనుగోలుకు రూ.160, కుట్టు కూలికి రూ.40 చెల్లిస్తున్నారు. కూలి చాలా తక్కువగా ఉందని దర్జీలు సైతం దుస్తులు కుట్టడానికి ముందుకు          రావడం లేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement