Dress Code
-
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
ఇంతవరకు పలు సంస్థల్లో పలు రకాల డ్రెస్ కోడ్లు ఉండేవి. కార్పోరేట్ సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు శుక్రవారాల్లో ఫార్మల్ దుస్తులకు దూరంగా ఉంటారు. ఆ రోజుల్లో కేవలం సెమీ ఫార్మల్తో రిలాక్స్డ్గా పనిచేస్తారు. వాటిల్లోనే 'థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే' లేదా 'క్యాజువల్ ఫ్రైడే' వంటి డ్రెస్ కోడ్లను విన్నాం. ఇప్పుడూ అతిపెద్ద పరిశోధన సంస్థ సీఎస్ఐఆర్ అలాంటి డ్రెస్ కోడ్ విధానాన్నే కాస్త వెరైటీగా తీసుకొచ్చింది. అది కూడా క్యాజువల్ డ్రెస్ కూడా కాకుండా మరీ నలిగిన బట్టలు వేసుకురమ్మని చెబుతుడటం విశేషం. ఎందుకంటే ఇలా..డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెక్రటరీ, సీఎస్ఐఆర్ మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ అయిన డాక్టర్ ఎన్ కలైసెల్వి, సోమవారాల్లో ఇస్త్రీ చేయని బట్టలు ధరించమని తన సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. పైగా "ముడతలు అచ్చే హై"(ముడతలు బాగుంటాయి) అని ప్రచారం చేస్తోన్నారు కూడా. ఇది వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రతి సోమవారం ఐరన్ చేయని దుస్తులు ధరించేలా చేయడమే ఈ డ్రెస్ కోడ్ ముఖ్యోద్దేశం. ఇలాంటి డ్రెస్ వేసుకునేందుకు అందరూ సహకరించాలని సీఎస్ఆర్ కోరింది. ప్రతి బట్టల సెట్‌ను ఇస్త్రీ చేయడం వల్ల సుమారు 200 గ్రాములు కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందని పేర్కొంది. కాబట్టి ఇస్త్రీ చేయని బట్టలు ధరించడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నిరోధించవచ్చని సీఎస్ఆర్ డైరెక్టర్ జనరల్ కలైసెల్వి అన్నారు. మే 1 నుంచి 15 వరకు 'స్వచ్ఛతా పఖ్వాడా'లో భాగంగా 'ముడతలు అచ్చే హై' ప్రచారాన్ని ప్రారంభించింది. ఎనర్జీని ఆదా చేసే చొరవలో భాగంతా సీఎస్ఐఆర్ దేశంలోని అన్ని ల్యాబ్‌లలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి కొన్ని ప్రామాణిక రేటింగ్ విధానాలను కూడా అమలు చేస్తోంది. ప్రస్తుతం సీఎస్ఐఆర్ కార్యాలయంలో విద్యుత్ ఛార్జీలను సుమారు 10% తగ్గించడమే ప్రారంభ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టులోపు దీన్ని అమలు చేయనుంది. అంతేగాదు ఇటీవలే ఢిల్లీలోని రఫీ మార్గ్‌లోని సీఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయ భవనంలో దేశంలోనే అతిపెద్ద వాతావరణ గడియారాన్ని ఏర్పాటు చేసింది కూడా. తన మాతృభూమిని, ఈ గ్రహాన్ని(భూమి) రక్షించడానికి సీఎస్ఐఆర్ చేస్తున్న చిన్న ప్రయత్నం అని డాక్టర్ కలైసెల్వి అన్నారు.(చదవండి: 27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!) -
Kashi Vishwanath Temple: వారణాసి ఆలయంలో పోలీసులకు అర్చకుల డ్రెస్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయంలో విధులు నిర్వర్తించే పోలీసులు దోతీ కుర్తా ధరించారు. మహిళా పోలీసులు సల్వార్ కుర్తాలో కనిపించారు. వారికి దోతీ కుర్తా, సల్వార్ కుర్తాలను ఉన్నతాధికారులు డ్రెస్‌కోడ్‌గా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, దీనిపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులు తమ యూనిఫాం కాకుండా ఇతర దుస్తులు ధరించడం ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల భద్రతకు ముప్పు కలుగుందని చెప్పారు. పోలీసులు పూజారుల వేషం వేయడం సరైంది కాదన్నారు. నేరగాళ్లు కూడా ఇలాంటి దుస్తులు ధరించి ప్రజలను మోసం చేసే అవకాశం ఉందన్నారు. ఆలయంలో పోలీసులు పూజారుల దుస్తులు ధరించాలంటూ ఆదేశాలు ఇచి్చనవారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, విశ్వనాథ ఆలయంలో పోలీసుల డ్రెస్‌కోడ్‌ను వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ సమరి్థంచారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆలయాల్లో పోలీసుల విధులు భిన్నంగా ఉంటాయని అన్నారు. రద్దీగా ఉన్నప్పుడు పోలీసులు నెట్టివేస్తే భక్తులు ఆగ్రహిస్తారని తెలిపారు. ఆర్చకుల వేషధారణలో ఉన్నవారు నెట్టివేస్తే పెద్దగా సమస్యలు రాబోవన్నారు. -
జొమాటో యూనిఫామ్‌లో మార్పులు.. క్షణాల్లోనే నిర్ణయం వెనక్కి..
ప్రత్యేకంగా శాకాహారమే కోరుకునే వినియోగదారుల కోసం ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ పేరుతో ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కొత్త సేవలు ప్రారంభించింది. శాకాహారుల కోరిక మేరకే ఈ సేవలు ప్రారంభించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. అయితే ఈ ప్రకటన చేసిన సమయంలో డెలివరీ స్టాఫ్‌కు ప్రత్యేకంగా గ్రీన్‌కలర్ డ్రెస్‌కోడ్ ఉంటుందని ప్రకటించారు. అలా ప్రకటన వెలువరించిన కాసేపటికే కంపెనీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్‌ను ధరిస్తారని చెప్పింది. అయితే ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. వెజ్ ఆర్డర్లను అందించడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారని కంపెనీ వివరించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో వ్యతిరేక సామాజిక పరిణామాలు ఎదురైతే మాత్రం ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ను వెంటనే నిలిపివేస్తామని దీపిందర్ గోయల్ తెలిపారు. ఆకుపచ్చ యూనిఫామ్ ధరించడంపట్ల కొన్ని సమాజిక వర్గాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్యూర్ వెజ్ ఫ్లీట్ వెనుక ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవని గోయల్ స్పష్టం చేశారు. ‘చాలామంది వినియోగదారులు నిత్యం నాన్‌వెజ్ ఆర్డర్ చేస్తారు. డెలివరీ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ డెలివరీ బాక్సుల్లో పదార్థాలు కొన్నిసార్లు ఒలికిపోయే అవకాశం ఉంటుంది. దాంతో ఆ వాసన అలాగే ఉండిపోతుంది. తదుపరి ఆర్డర్ చేసే శాకాహార వినియోగదారులకు అది ఒకింత ఇబ్బంది కలిగించే అంశం. దాంతో ఫ్లీట్‌ను విభజించాం. కొంతమంది ప్యూర్ వెజిటేరియన్ హోటళ్ల నుంచి మాత్రమే ఫుడ్ ఆర్డర్ పెడతారు. వారిని దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నాం’ అని సీఈఓ వివరించారు. భారత్‌లోనే అత్యధిక శాతం శాకాహారులు ఉన్నారని గోయల్ తెలిపారు. ఆహారం వండే విధానం, దాన్ని నిర్వహించడంపై వారు ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉంటారని అన్నారు. కేవలం శాకాహారమే అందించే రెస్టారెంట్ల ఎంపిక, నాన్-వెజ్ ఆహారాన్ని మినహాయించడం వంటివి ఫ్యూర్ వెజ్ మోడ్‌లో ఉంటాయి. ఇదీ చదవండి: ఉద్యోగుల జీతాల పెంపునకు టీసీఎస్ ఎస్? ఫ్యూర్ వెజ్ ఫ్లీట్ ఆహారాన్ని డెలివరీ చేసేందుకు జొమాటో సాధారణంగా వినియోగించే ఎర్ర బాక్సుల స్థానంలో ఆకుపచ్చ డెలివరీ బాక్స్‌లను వినియోగించనుందని ముందుగా ప్రకటించింది. కొన్ని వర్గాల నుంచి సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రావడంతో డెలివరీ బాక్స్‌లు, యూనిఫామ్ విషయంతో ప్రకటనను తిరిగి వెనక్కి తీసుకుంది. కానీ ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. Update on our pure veg fleet — While we are going to continue to have a fleet for vegetarians, we have decided to remove the on-ground segregation of this fleet on the ground using the colour green. All our riders — both our regular fleet, and our fleet for vegetarians, will… — Deepinder Goyal (@deepigoyal) March 20, 2024 -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్
మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ నిబంధన విధించింది. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం ఇకపై ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టు, డిజైనర్, ప్రింటెడ్ దుస్తులు ధరించి స్కూలుకు రాకూడదు. ఈ విషయమై ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఉపాధ్యాయులు తమ వస్త్రధారణ విషయంలో హద్దులకు లోబడి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ధరించే ఆధునిక దుస్తులు విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆ నోటిఫికేషన్లో వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మహిళా ఉపాధ్యాయులు, పురుష ఉపాధ్యాయులకు వేర్వేరు రకాల డ్రెస్ కోడ్లు అమలు చేయనున్నారు. మహిళా ఉపాధ్యాయులు జీన్స్ , టీ-షర్టులు, ముదురు రంగులు, డిజైన్లు లేదా ప్రింట్లు ఉన్న దుస్తులను ధరించకూడదు. వారు కుర్తా దుపట్టా, సల్వార్, చురీదార్, లేదా చీర ధరించాలని తెలిపారు. పురుష ఉపాధ్యాయులు, షర్టు, ప్యాంటు ధరించాలని మార్గదర్శకాలలో పేర్కొన్నారు. షర్టును ప్యాంట్‌లోకి టక్ ఇన్ చేయాలని సూచించారు. ఈ నిబంధనలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకే కాకుండా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాగా ఈ డ్రెస్ కోడ్‌పై పలువురు ఉపాధ్యాయులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఏమి ధరించాలి? ఏమి ధరించకూడదనేది వారి వ్యక్తిగత విషయమని, దానిపై వారికి ప్రత్యేక హక్కు ఉంటుందని వారంటున్నారు. ఉపాధ్యాయుల వస్త్రధారణ విద్యార్థులపై దుష్ప్రభావం చూపకూడదనే ఉద్దేశ్యంతోనే డ్రెస్‌కోడ్‌ను రూపొందించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. -
BAPS అబుదాబి హిందూ మందిర్ : కఠిన నిబంధనలు, డ్రెస్ కోడ్
అబుదాబిలో ఇటీవల (ఫిబ్రవరి 14, 204) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ మందిరంలో డ్రెస్‌కోడ్ వార్తల్లో నిలిచింది. మార్చి ఒకటో తేదీనుంచి ఇక్కడ ప్రజల దర్శనాలకు అనుమతినిచ్చిన నేపథ్యంలో నియమ నిబంధనలు, భక్తుల డ్రెస్ కోడ్‌కు సంబంధించిన నియమాలు, మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా క్యాప్స్, టీషర్ట్లు, అభ్యంతరకరమైన దుస్తులకు అనుమతి ఉండదు. డ్రెస్ కోడ్, ఇతర నిబంధనలు అబుదాబి మందిర్ ట్విటర్లో షేర్ చేసిన వివరాల ప్రకారం ప్రతి మంగళవారం - శనివారం, ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఈ మందిర్ తెరిచి ఉంటుంది. సోమవారం మాత్రం ఆలయాన్ని మూసివేస్తారు. The wait is over!#AbuDhabiMandir is now open for all visitors and worshipers. Opening hours: Tuesday to Sunday: 9am-8pm Every Monday: Closed for visitors pic.twitter.com/JnYvZoVSPk — BAPS Hindu Mandir (@AbuDhabiMandir) March 1, 2024 ముస్లిం దేశంలో అబుదాబిలో తొలి హిందూ దేవాలయంబాప్స్లో డ్రెస్ కోడ్, మార్గదర్శకాల విషయంలో కఠినంగా వహరించనున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం, మెడ, మోచేతులు, మడమల వరకూ కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. టైట్‌గా ఉన్న దుస్తులు, స్లీవ్‌లెస్, షార్ట్స్‌కు అనుమతించరు. శబ్దాలు చేసే ఉపకరణాలనూ ఆలయంలోకి అనుమతించరు. బయటి ఆహారాన్ని ఆలయంలోకి తీసుకు రాకూడదు. పెంపుడు జంతువులకు కూడా ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం. అంతేకాదు దేవాలయం పరిసరాల్లో డ్రోన్స్ వినియోగంపై కూడా నిషేధం విధించారు. ఫోటోలకు అనుమతి ఉందా? వ్యక్తిగత అవసరాల కోసమే ఫోటోలు తీసుకోవచ్చు. ఎవరైనా వాణిజ్య అవసరాల నిమిత్తం వీడియోను రికార్డ్ చేయాలనుకుంటే, వారు తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాలి. ఆలయంలోని ఆధ్యాత్మిక, ప్రశాంత వాతావరణానికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా భక్తులు నియమాలను పాటించి సహకరించాలని ఆలయ అధికారులు కోరారు. కాగా 700 కోట్ల రూపాయల వ్యయంతో 27 ఎకరాల్లో బాప్స్ సంస్థ ఆధ్వర్యంలో అబూ మారేఖ్ ప్రాంతంలో ఆలయ నిర్మాణం జరిగింది. శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన ఈ ఆలయంలో ఒకేసారి 5 వేల మంది ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. -
టీసీఎస్ మరో కీలక నిర్ణయం?.. ఆఫీస్‌లో ఉద్యోగులు ఇలా ఉండాల్సిందే?
ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసే విధానానికి ప్రముఖ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) స్వస్తి పలికింది. ఈ మేరకు ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా సమాచారమిచ్చింది. దీంతో నవంబర్ 1నుంచి (అంచనా) సిబ్బంది కార్యాలయాల నుంచి పనిచేయనున్నారు. ఈ తరుణంలో సిబ్బంది ధరించే దుస్తుల విషయంలో మరిన్ని ఆదేశాలు జారీ చేసింది. వర్క్ ఫ్రమ్ ముగింపు పలికిన టీసీఎస్.. తాజాగా ఉద్యోగులకు మరోసారి మెయిల్స్ పంపింది. ఆఫీస్‌కి వచ్చే ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లో సంస్థ సంప్రదాయాల్ని మరువకూడదని గుర్తు చేసింది. ముఖ్యంగా, వేషధారణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ఆర్వో) మిలింద్ లక్కడ్ ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌లో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా టీసీఎస్ వాటాదారులు సంస్థ సంప్రదాయాలకు గౌరవించేలా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. డ్రెస్ కోడ్ పాలసీలో భాగంగా సిబ్బంది విధులు నిర్వహించే సమయంలో సరైన వస్త్రధారణ ఉండేలా మార్గదర్శకత్వం చేస్తున్నట్లు లక్కడ్ తెలిపారు. ఈ సందర్భంగా నా సహచరులు దాదాపూ రెండేళ్ల పాటు ఇంటి వద్ద నుంచే పని చేశారు. ఇప్పుడు కార్యాలయాల నుంచి పనిచేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అదే సమయంలో క్లయింట్ల ఉద్యోగులు డ్రెస్ కోడ్ గురించి స్పష్టత ఇచ్చేలా లక్కడ్ ఉద్యోగులు మెయిల్స్ చేశారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగుల కోడ్ విషయానికి వస్తే..పురుషులు తప్పని సరిగా ఫుల్ - స్లీవ్డ్ షర్టులతో టక్ చేసుకోవాలి. మహిళా ఉద్యోగులు సోమవారం నుంచి గురువారం వరకు సెమినార్లు, క్లయింట్ మీటింగ్‌లలో బిజినెస్ ఫార్మల్స్ తప్పని సరి. శుక్రవారం హాఫ్ స్లీవ్ షర్టులు, టర్టిల్నెక్, ఖాకీ చొక్కాలు, చినోలు, కుర్తీ, సల్వార్ (మహిళలు)లను మాత్రమే అనుమతిస్తున్నట్లు నివేదికలు హైలెట్ చేశాయి. ఉద్యోగుల డ్రెస్ కోడ్ నిబంధనలపై టీసీఎస్ యాజమాన్యం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. చదవండి👉 జీతం 17 లక్షలు..13 ఉద్యోగాల్ని రిజెక్ట్ చేసిన 21 ఏళ్ల యువతి! -
New Parliament Dress Code: పార్లమెంట్ ఉద్యోగులకు కొత్త యూనిఫామ్..
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సమయం సమీపిస్తోంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకూ ఐదురోజులపాటు ఈ సమావేశాలు పార్లమెంట్లో నూతన భవనంలో జరుగుతాయి. మొదటి రోజు పాత భవనంలోనే సమావేశం నిర్వహించి, రెండో రోజు (ఈ నెల 19న) వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, కొత్త భవనంలోకి లాంఛనంగా అడుగుపెడతారు. కొత్త భవనానికి తరలివెళ్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఉద్యోగులు, సిబ్బంది ధరించే యూనిఫామ్‌ను మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసలు సిసలైన భారతీయత ఉట్టిపడేలా ఈ దుస్తులు ఉంటాయని సమాచారం. నెహ్రూ జాకెట్లు, ఖాకీ రంగు ప్యాంట్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) నిపుణులు ఈ యూనిఫామ్‌లను డిజైన్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు ధరించే నెహ్రూ జాకెట్ ముదురు గులాబీ రంగులో కమలం పువ్వు డిజైన్‌తో ఉంటుందని సమాచారం. ఉభయ సభల మార్షల్స్ డ్రెస్‌ను కూ డా మారుస్తున్నారు. వారు మణిపురి తలపాగాలు ధరిస్తారు. సెక్యూరిటీ సిబ్బంది ధరించే సఫారీ సూట్లలోనూ మార్పులుంటాయి. సైని కులు ధరించే డ్రెస్ లాంటిది వారికి ఇవ్వబోతున్నారు. NIFT designed New dress code for Parliament staff includes 1. Modi Jacket 2. Cream shirt with Lotus emblem 3. Khaki trousers 😂😂 pic.twitter.com/RWlP93mNha — Mac (@pattaazhy) September 12, 2023 ఎన్నికల గుర్తు ముద్రించడం ఏమిటి?: కాంగ్రెస్ పార్లమెంట్ సిబ్బంది యూనిఫామ్‌పై ‘కమలం’ను ముద్రించబోతున్నారంటూ వచ్చిన వార్తలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పందించారు. జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలి బొమ్మ కాకుండా కమలం గుర్తు ముద్రించడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బీజేపీ ఎన్నికల గుర్తు కాబట్టే కమలాన్ని ముద్రిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ‘ట్విట్టర్’లో పోస్టు చేశారు. ఇది కూడా చదవండి: జీ20 నిర్వహణకు రూ.4,100 కోట్లా -
కట్టు..బొట్టు తీరు.. కాస్త డ్రస్ కోడ్‌గా మారింది!..ఆ విధంబెట్టిదనినా..
కట్టు..బొట్టు తీరు.. ఇదివరకైతే కేవలం సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నం! తర్వాత వ్యక్తిగత అభిరుచికి అద్దమైంది! అటు తర్వాత సమయ సందర్భాలకు సూచిక అయింది! ఇప్పుడు.. పార్టీలు.. ప్రత్యేక వేడుకలు.. అంతెందుకు సరదా కాలక్షేపాలలో ఆయా సందర్భాలకు తగ్గట్టుగా ఈ కట్టు.. బొట్టు.. తీరు మార్చుకుంది! సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తూ! దాన్నే మోడర్న్‌గా ‘డ్రెస్ కోడ్’ అంటున్నారు! పలు రంగుల్లో.. భిన్నమైన డిజైన్లలో.. క్లాస్‌గా.. మాస్‌గా.. ఫన్‌గా.. వియర్డ్‌గా.. ట్రెడిషనల్‌గా.. ట్రెండీగా.. కనిపిస్తోంది! ఒకరకంగా ఇది.. దాన్ని ఫాలో అవుతున్న వాళ్ల అడ్రెస్ కోడ్‌గా మారింది!! ఆ విధంబెట్టిదనినా.. బార్బీ మూవీ ఫ్యాషన్.. మరిస్సా స్మిత్ అతి పెద్ద బార్బీ అభిమాని. గత సంవత్సరం బార్బీ సినిమా ట్రైలర్ విడదలైనప్పటి నుంచి ఆమె తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను మొత్తం బార్బీ ట్రెండ్ తోనే నింపేసింది. అచ్చం బార్బీలాగే రెడీ అయి వీడియోలు చేసింది. బార్బీ చిత్రం విడుదలైనప్పుడైతే అచ్చం బార్బీలాగే వెళ్లి ‘పింక్ ఫ్యాషన్ చాలెంజ్’ విసిరింది. అలా బార్బీ అభిమానులు మొత్తం ఆ సినిమాకు పింక్ డ్రెస్ కోడ్‌లోనే వెళ్లి చూశారు. కొంతమంది ఆ చాలెంజ్ ఏమిటో తెలియకుండానే పింక్ డ్రెస్‌లో వెళ్లి చూశారు. ఇప్పుడు ఈ ట్రెండ్ మన దేశంలోనూ కొనసాగుతోంది. దశాబ్దాల నాటి బొమ్మ పట్ల ప్రజలు తమ ఇష్టాన్ని వ్యకం చేసే విధానాల్లో ఈ పింక్ ఫ్యాషనూ ఒకటైంది! ఇది ఎంతలా ట్రెండ్ అయిందంటే పలు ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్స్ కూడా బార్బీ అభిమానుల కోసం స్పెషల్ డిజైన్స్‌ను, ఆఫర్స్‌ను ప్రకటించేంతగా! ఇదే తరహాలో.. ఆ తర్వాత విడుదలైన ‘ఓపన్ హైమర్’ సినిమాకూ చాలా మంది బ్లాక్ డ్రెస్ కోడ్‌లో వెళ్లారు. దెయ్యాల డ్రెస్ కోడ్.. హాలోవీన్.. ఈ పండగ పేరు చెప్పగానే అరివీర భయంకరమైన వేషాధారణ గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ పండగ గ్లోబలైజేషన్లో భాగంగా మన దేశంలోకీ ప్రవేశించింది. హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాల్లోనూ యువత హాలోవీన్ థీమ్ పార్టీల్లో పాల్గొంటూ.. ఎంజాయ్ చేస్తోంది. నిజానికి ఈ ‘హాలోవీన్ డే’ రెండువేల సంవత్సరాలకు పూర్వమే ప్రారంభమైందని చరిత్ర చెబుతోంది. ప్రాచీనకాలంలో పేగన్లు (మధ్యయుగం నాటి ఓ మతానికి చెందినవారు) సమ్ హెయిన్’ అనే పండగను జరుపుకునేవాళ్లట. అదే ఈ హాలోవీన్ పండగకు ప్రేరణ అని చరిత్రకారులు చెబుతారు. పేగన్ల సంవత్సరం అక్టోబర్‌తో పూర్తయ్యేది. అక్టోబర్ మాసం ఆఖరి రోజు రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ వేడుకలు జరిగేవి. అయితే అప్పట్లో మొదలైన ఓ నమ్మకం వింత ఆచారాలకు తెరతీసింది. కొత్త సంవత్సరాది సందర్భంగా అంతకుముందు చనిపోయిన పెద్దల ఆత్మలన్నీ భూమిపైకి తిరిగి వస్తాయని పేగన్లు నమ్మేవారు. ఆరోజు రాత్రి భూమికి, ఆత్మలు నివసించే ప్రపంచానికి మధ్యలో ఉండే తలుపు తెరుచుకుంటుందని, ఆత్మలు తమ బంధువులను చూసి వెళ్లడానికి భూమిపైకి వస్తాయని నమ్మేవారు. వాటికి భయపడి అవి తమ జోలికి రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఆత్మలు తమ పొలాలపై పడి వాటిని నాశనం చేయకుండా వాటికి ఆహారాన్ని ఏర్పాటు చేసి ఆరుబయట పెట్టేవారు. నిప్పు అంటే ఆత్మలు భయపడతాయని ఇంటికి దగ్గరగా మంటలు వేసేవారు. ఆత్మలు తమ వద్దకు రాకుండా ఉండేందుకు తెల్ల దుస్తులు వేసుకొని ముఖానికి నల్లని రంగు పూసుకునేవారు. అలా మొదలైన ఆ నమ్మకం తర్వాత సంప్రదాయంగా.. పదహారో శతాబ్దానికి ఓ పండగగా మారిపోయింది. పెళ్లి డ్రెస్ కోడ్ ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. ఆ పెళ్లి వేడుకను పదికాలాల పాటు గుర్తుండిపోయేలా చేసుకోవాలని భావిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. ఖర్చుకు వెనుకాడకుండా ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ పెళ్లిళ్లలోనూ డ్రెస్ కోడ్ మొదలైంది. మెహందీ, హల్దీ, పెళ్లి కూతురు ఫంక్షన్, సంగీత్, పెళ్లి. ఇలా ఒక్కో వేడుకకు పెళ్ళికూతురు, పెళ్లి కొడుకుతో పాటు ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు, ఆత్మీయులు కూడా డ్రెస్ కోడ్‌లో కనిపిస్తున్నారు. అంతేకాదు మతాలకనుగుణంగా ఆయా పెళ్లిళ్లలో ఆయా సంప్రదాయాల రీతిలో దుస్తులు ధరిస్తున్నారు. ఉదాహరణకు క్రిస్టియన్లలో వధూవరులు తెల్ల గౌన్, బ్లాక్ సూట్ వేసుకుంటే, హిందువుల్లో వధూవరులు పసుపు చీర, తెల్ల పంచెలు ధరించడం! ఇలా మతాలు, పద్ధతులే కాకుండా పలు ప్రాంతాల్లోని ఆచారవ్యవహారాలూ ఆ డ్రెస్ కోడ్‌లో భాగమవుతున్నాయి. పెళ్లి ఆపేస్తున్నారు.. చైనాలో వివాహ వేడుకకు సంబంధించి ప్రజలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. గతంలో పెళ్లి కోసం రిజిస్ట్రారు ఆఫీస్‌కి.. తమ ఇష్టానుసారమైన వస్త్రధారణతో వచ్చేవారట. దీంతో ఆ క్రమశిక్షణ రాహిత్యానికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం.. ఓ డ్రెస్ కోడ్‌ను ప్రవేశ పెట్టింది. పెళ్లి చేసుకోవడానికి రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వచ్చే దంపతులు సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించాలి. లేనిపక్షంలో మ్యారేజ్ సర్టిఫికెట్ మంజూరు కాదు. కనీసం పెళ్లిరోజు అయినా దేశ సంప్రదాయాలను కాపాడాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట. ఓనం చీర.. దక్షిణాదిన ఘనంగా జరుపుకునే పండగల్లో కేరళకు చెందిన ఓనం ఒకటి. ఆ పండగనాడు మిగిలిన ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నా, బంగారు అంచుతో కూడిన తెల్లటి కాటన్ లేదా సిల్క్ చీరను కట్టుకుంటారు మలయాళ మహిళలు. ఆ చీరను కసవ్ అంటారు. ఇప్పుడు ఈ కట్టూ బొట్టూ ఓనం రోజున ఒక్క కేరళకే కాకుండా దేశమంతటికీ కోడ్‌గా మారింది. తమిళనాడులో అయితే కళాశాలలు, కార్యాలయాల్లోని విద్యార్థులు, ఉద్యోగినులు ఓనం చీరలను ధరించి తరగతులకు, విధులకు హాజరవుతున్నారు. అయితే కరోనా తర్వాత ఓనం చీర కోడ్ కేరళలో ఒకరకంగా యూనిఫామ్‌గా మారిందని చెప్పవచ్చు. కరోనా లాక్‌డౌన్‌తో అక్కడ నేత కార్మికులు ఘోరమైన నష్టాలను చవిచూశారు. వాళ్లను ఈ కష్టం నుంచి గట్టెక్కించడానికి ‘సేవ్ ది లూమ్’ సంస్థ ఆ రాష్ట్ర మహిళా న్యాయవాదుల కోసం ఓనం చీరలనే మోనోక్రోమ్ చీరలుగా మార్చేసింది. ఇంకో అడుగు ముందుకు వేసి ప్రత్యేక కాలర్ గల జాకెట్, ఫార్మల్ గౌన్నూ నేయించింది! ఈ డిజైన్‌ను ‘విధి’ అంటున్నారు. ఇప్పుడది అక్కడ చాలా ఫేమస్. బ్లాక్ అండ్ వైట్.. నలుపు, తెలుపు.. న్యాయవాద వృత్తికి చిహ్నం.. ప్రపంచవ్యాప్తంగా! ప్రతి రంగుకున్నట్టే దీనికీ కొన్ని సానుకూల, ప్రతికూల అర్థాలున్నాయి. ఒక వైపు విషాదం.. నిరసనను సూచిస్తూనే ఇంకో వైపు బలం.. అధికారాన్నీ సూచిస్తుంది. న్యాయవాద వృత్తికి నలుపు రంగునే ఎంచుకోవడానికి మరో కారణం.. అప్పట్లో రంగులు అంతగా అందుబాటులో లేవు. విస్తారమైన ఫాబ్రిక్ నలుపు రంగులో మాత్రమే ఉండేది. అలాగే న్యాయవాది డ్రెస్‌లోని ఇంకో రంగు తెలుపు.. కాంతిని, స్వచ్ఛతను, మంచితనాన్ని సూచిస్తుంది. వాది, ప్రతివాది రెండు పక్షాల న్యాయవాదులు ఒకే విధమైన డ్రెస్ కోడ్‌ను ధరిస్తారు. స్కూల్ యూనిఫాం స్టోరీ.. 16 వ శతాబ్దంలో యూకేలో యూనిఫామ్‌లు ప్రారంభమయ్యేంత వరకు అవి పాఠశాల క్రమశిక్షణలో భాగం కాదు. పిల్లలు తమకు నచ్చిన దుస్తులను ధరించి బడికి వెళ్లేవారు. 16వ శతాబ్దంలో మెజారిటీ పాఠశాలలు స్వచ్ఛంద పాఠశాలలు. మెజారిటీ విద్యార్థులు వెనుకబడినవారే. కాబట్టి నాటి స్వచ్ఛంద సంస్థలు ఒకే రంగు, ఒకే డిజైన్ కుట్టిన దుస్తులను విరాళంగా ఇచ్చేవి. ఇవే యూనిఫామ్ పుట్టుకకు నాంది అయ్యాయి. అలా నాటి నుంచి చాలా బడులు తమ విద్యార్థులు అందరికీ డ్రెస్ కోడ్‌ను తప్పనిసరి చేశాయి. ఈ యూనిఫామ్‌లు పిల్లల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యత్యాసాలకు చెల్లుచీటీ పాడి బడిలో పిల్లలంతా సమానమనే భావనను పెంచాయి. క్రమశిక్షణలో భాగం చేశాయి. చాలా దేశాలు విద్యార్థుల డ్రెస్ కోడ్ అయిన ఈ యూనిఫామ్‌ను అమోదించినప్పటికీ, యూనిఫామ్ అనే ఆ పదానికి అభ్యంతరం చెబుతున్న దేశాలూ ఉన్నాయి. అలాంటి దేశాలు యూనిఫామ్‌ను సున్నితంగా ‘స్కూల్ డ్రెస్’ అంటున్నాయి. మన దేశంలో ముంబైలోని కొన్ని పాఠశాలల్లో బ్లేజర్లు, ప్యాంటు, స్కర్టులు లేదా ట్యూనిక్స్, బూట్లు, సాక్స్‌లు వాళ్ల యూనిఫామ్‌లో భాగం. బ్రిటిష్ పాలకులు భారతదేశంలో ఇంగ్లిష్ మీడియం బడులను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా బడి యూనిఫాం కలోనియల్ డ్రెస్సింగ్ స్టైల్లోనే ఉంది. అయితే కొన్ని పాఠశాలలు మాత్రం దానిని మార్చుకున్నాయి. జపాన్‌లో బాలికల పాఠశాల యూనిఫామ్‌లు బ్రిటిష్ నావికాదళ యూనిఫామ్‌ను పోలి ఉంటాయి. అక్కడి పిల్లలు తరగతి గదిలోకి ప్రవేశించే ముందు వారు తమ షూను తీసివేయాలి. తరగతి గదిలో వారు ప్రత్యేకమైన చెప్పులు వేసుకుంటారు. యూని కోడ్.. కేరళలోని ఎర్నాకుళం జిల్లా వలయాంచిరంగార గ్రామంలో వందేళ్ల చరిత్ర ఉన్న సర్కారు బడి ఒకటి ఉంది. అందులో టీచర్లతోపాటు బోధనేతర సిబ్బంది కూడా మహిళలే. ఈ ఆల్ విమెన్ స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు సి.రాజి.. పిల్లల యూనిఫామ్ విషయంలో ఇప్పటి వరకు కొనసాగిన ఒక సంప్రదాయ విభజన రేఖను చెరిపేశారు. అన్ని స్కూళ్లలాగే ఆ స్కూల్లో కూడా అబ్బాయిలకు షర్టు – నిక్కరు, అమ్మాయిలకు షర్టు– స్కర్టు యూనిఫామ్‌గా ఉండేది. ప్రిన్సిపల్ నిర్ణయంతో ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ‘షర్టు – నిక్కరు’ వేసుకుంటున్నారు. ఆటలు ఆడేటప్పుడు బాలికలకు సౌకర్యంగా ఉండటం కోసమే ఇలా యూని (డ్రెస్) కోడ్‌ను తెచ్చారు. బాడ్మింటన్, షటిల్ ఆడాలన్నా.. హై జంప్ చేయాలన్నా స్కర్టు పైకి ఎగురుతుందేమోననే బిడియంతో ఆడపిల్లలు ఆటలు ఆడడానికి ముందుకు రావడంలేదట. మంచి క్రీడాకారులు కాగల సత్తా ఉన్న అమ్మాయిలను వస్త్రధారణ కారణంతో అలా రెక్కలు విరిచి కూర్చోబెట్టడం ఏమిటి అని ఆలోచించిన సి. రాజి.. ఆ స్కూల్ డ్రెస్‌ని అలా మార్చేశారు. ఫ్రెషీ చాయిస్ ట్రాన్స్జెండర్లకు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ యూనివర్సిటీ డ్రెస్ కోడ్‌ను ప్రకటించింది. ఫ్రెషర్స్‌లో ఆడవారికి, మగవారికి ప్రతిఏటా డ్రెస్ కోడ్‌ను ప్రకటించే ఆనవాయితీగల ఈ యూనివర్సిటీ ఈసారి తొలిసారిగా ట్రాన్స్జెండర్లకు కూడా డ్రెస్ కోడ్‌ను ప్రకటించడం విశేషం. విద్యార్థినులకు బటన్లు కలిగిన షార్ట్ స్లీవ్స్, డార్క్ కలర్ లాంగ్ స్కర్ట్స్‌ను, విద్యార్థులకు వైట్ షర్ట్, నెక్ టై, బ్లాక్ ట్రౌజర్లను డ్రెస్ కోడ్‌గా నిర్ణయించింది. వీటిలో ఏ డ్రెస్‌నైనా ధరించే అవకాశాన్ని ‘ఫ్రెషీ చాయిస్’ పేరిట ట్రాన్స్జెండర్లకు కల్పించింది. ఆధ్యాత్మిక డ్రెస్ కోడ్ పలు ప్రసిద్ధ దేవస్థానాల్లో ఎప్పటి నుంచో డ్రెస్ కోడ్ అమలవుతోంది. ఆలయ అధికారుల నిర్ణయానికి భక్తులు కూడా ఆమోద ముద్ర వేశారు. జీన్స్, టీ షర్టులను ధరించిన యువతులకే కాదు పంజాబీ డ్రెస్‌పై చున్నీ లేని యువతులకు సైతం ఆలయాల్లో అనుమతి దొరకడం కష్టం. సంప్రదాయ పద్ధతి తప్పనిసరి కావడంతో చాలామంది పంచె, చీరలను కొనుగోలు చేసి, సంప్రదాయ పద్ధతిలో దైవాన్ని దర్శించుకుంటున్నారు. ఈ తరహాలోనే అయ్యప్ప దీక్ష భక్తులు నలుపు రంగులోనూ, భవానీ భక్తులు ఎరుపు రంగు, హనుమాన్ భక్తులు కాషాయం.. ఇలా భక్తులు ఆయా దైవ దీక్షల నియమాసారం ఆయా రంగుల డ్రెస్ కోడ్‌లో దీక్షలను కొనసాగిస్తున్నారు. అలాగే పలు మతాలకు సంబంధించిన అధిపతులు, పూజారులు, సన్యాసులకూ పలు రంగుల డ్రెస్ కోడ్ ఉంది. పోప్స్ తెల్లని, నల్లని దుస్తులు ధరిస్తే.. హిందూ, బౌద్ధ మతాల్లోని పూజారులు, సన్యాసులు, స్వామీజీలు, భిక్షువులు కాషాయ దుస్తుల ధరిస్తారు. జైనంలో శ్వేతాంబరులు పేరుకు తగ్గట్టు తెల్లటి డ్రెస్ కోడ్‌లో ఉంటారు. ముస్లిం మతంలో ప్రాంతాలను బట్టి ఆకు పచ్చ, తెలుపు, నలుపు వంటి రంగులు కనిపిస్తుంటాయి. లెక్కల్లో.. గణాంకాల ప్రకారం పదహారవ శతాబ్దంలోనే స్కూల్ యూనిఫామ్, సైనికుల యూనిఫామ్, బిజినెస్ యూనిఫామ్, ఉద్యోగుల యూనిఫామ్.. ఇలా రకరకాల డ్రెస్ కోడ్లను వారు చేస్తున్న పనికి అనుగుణంగా డిజైన్ చేశారు. ఇప్పుడు దాని పరిధి విస్తృతమైంది. అమెరికాలో ఒక యూనివర్సిటీ నిర్వహించిన సర్వే ప్రకారం 2022లో యూనిఫామ్‌ల రకాలు 80 వేల కంటే ఎక్కువే! చదువులు.. వృత్తులు.. విధులకు సంబంధించిన యూనిఫామ్స్‌ని పక్కనబెడితే.. విందు వినోదాలు.. వేడుకలు.. సరదా కాలక్షేపాలు వంటి వాటన్నిటికీ డ్రెస్ కోడ్ ఓ ట్రెండ్ అయింది. పార్టీలు, పబ్బులు సరే.. పాప్ స్టార్స్ కన్సర్ట్స్కీ.. ఆ పాప్ స్టార్స్ స్టయిల్స్‌ను ప్రతిబింబించే డ్రెస్ కోడ్‌లో హాజరవుతున్న అభిమానులూ ఉన్నారు. ఇలా డ్రెస్ కోడ్ కూడా ఫ్యాషన్‌లో చేరి.. ఎక్స్‌ప్రెషన్‌కి.. కమ్యూనికేషన్కీ ఓ టూల్‌గా మారింది! (చదవండి: ఆ చిన్న పింగాణి పాత్ర ధర తెలిస్తే..నోరెళ్లబెట్టాల్సిందే!) -
టీచర్లకు డ్రస్ కోడ్! కొత్త రూల్‌ని జారీ చేసిన ప్రభుత్వం
ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ జారీ చేస్తూ ప్రభుత్వం సంచన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. ఈ మేరకు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్ట్లు, లెగ్గింగ్స్ ధరించకుండా నిషేధించేలా ఒక కొత్త నిబంధనను జారీ చేస్తు నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. వృత్తి రీత్యా ఉపాధ్యాయులైతే బోధన, క్రమశిక్షణ పరంగా వస్త్రధారణ ఆదర్శంగా ఉండాలని చెప్పింది. ఉపాధ్యాయులు విధులను నిర్వర్తించే సమయంలో మర్యాదపూర్వక హోదాలో ఉంటారు కాబట్టి డ్రెస్ కోడ్‌ని అనుసరించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొంది. అస్సాంలోని అని విద్యాశాఖల్లోని పురుష, మహిళా ఉపాధ్యాయులు లెగ్గింగ్‌లు, జీన్స్‌లు, టీ షర్ట్లు ధరించొద్దని కోరింది. కొందరూ ఉద్యోగులు తమకు నచ్చిన దుస్తులను ధరించి పాఠశాలలకు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పబ్లిక్ కూడా చాలా వరకు దీన్ని ఆమెదించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. బోధనా సమయంలో ఉపాధ్యాయులు తమ వృత్తికి తగ్గట్టుగా గంభీరత ప్రతిబింబించే దుస్తులు ధరించే కోడ్ అవసరమని నోటిఫికేషన్లో వెల్లడించింది. పాఠశాల విద్యాశాఖ పేర్కొన్న నిబంధనను అందరూ కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలకు తీసుకోవడం జరుగుతుందని అస్సాం ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అస్సాం విద్యాశాఖ మంత్రి డాక్టర్ రనోజ్ పెగు మాట్లాడుతూ..అస్సాం ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠశాల నియమ నిబంధనలకు సంబంధించిన పుస్తకాన్ని ప్రవేశపెట్టనుంది. అందులో పాఠశాలను ఎలా నిర్వహించాలి, తరగతులు ఏవిధంగా నిర్వహించాలి వంటి వాటి తోపాటు ఉపాధ్యాయుల డ్రస్ కోడ్, పిల్లల యూనిఫాంకి సంబంధించిన రూల్స్ ఉంటాయని చెప్పారు. (చదవండి: పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వకండి! కోరుతున్న సాక్షాత్తు కంపెనీ సీఈ ..) -
మహిళల శరీరాలు ఎంతో విలువైనవి.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
మహిళల డ్రెస్ కోడ్ కాంట్రవర్సీపై బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పందించారు. మహిళల శరీరాలు ఎంతో విలువైనవని ,వాటిని ఎంత ఎక్కువ దుస్తులతో సంరక్షిస్తే వారికి అంత మంచిదని వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రసారమైన ‘ఆప్ కీ అదాలత్’ టీవీ కార్యక్రమంలో సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు డ్రేస్ కోడ్ వివాదమేంటి? కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ సినిమాలో సల్మాన్‌తో కలిసి నటించిన పాలక్ తివారీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘సల్మాన్ ఖాన్ తన సినిమా సెట్లో ఉన్న మహిలందరూ నిండుగా, మెడ వరకు వస్త్రాలు ధరించేలా చూస్తారు’ అని పేర్కొంది. దీనిని నెటిజన్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. సల్మాన్‌ను విమర్శిస్తూ ట్వీట్స్ చేశారు. (చదవండి: మే తొలివారం థియేటర్/ ఓటీటీలో అలరించే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లివే ) అందుకే ఆ కండీషన్ పెట్టా: సల్మాన్ తాజాగా ఆప్ కీ అదాలత్’ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్‌ను వ్యాశ్యాత రజత్ శర్మ ఓ ప్రశ్న అడిగారు. ‘మీ సినిమా సెట్లోని మహిళలకు దుస్తుల విషయంలో నియమం పెట్టిన మీరు.. సినిమాల్లో మాత్రం చొక్కా విప్పి నటిస్తారు కదా. ఇది ద్వంద్వ ప్రమాణాల కిందికి రాదా?’ అంటూ ప్రశ్నించారు. (చదవండి: నా జీవితంలో ఎలాంటి బాధలు లేవు.. కానీ ఆ ఒక్క విషయంలోనే: నాగ చైతన్య ) దీనికి సల్మాన్ ఖాన్ జవాబిస్తూ ఇందులో ద్వంద్వ ప్రమాణాలు ఏమీ లేవు. మహిళలు శరీర భాగాలు చాలా విలువైనవి అన్నదే నా అభిప్రాయం. వాటిని ఎంత ఎక్కువ దుస్తులతో సంరక్షిస్తే అంత మంచింది. ఇది మహిళల గురించి చెబుతున్న మాట కాదు, మన తల్లులు, సోదరీమణులూ, భార్య వంటి మహిళలను వక్రబుద్ధి తో చూసే కొందరిని ఉద్దేశించి చెబుతున్న మాట. దుస్తుల కారణంగా మహిళలు అవమానాలకు గురి కాకూడదని నేను కోరుకుంటున్నాను’ అని సల్మాన్ వివరించారు. నా చుట్టూ ఎన్నో తుపాకులు ఉన్నాయి ఇదే కార్యకమ్రంలో తనకు వస్తున్న బెదిరింపులపై కూడా సల్మాన్ స్పందించారు. బెదిరింపుల కారణంగా తనకు భద్రత పెంచారని, దీంతో గతలో మాదిరి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లలేకపోతున్నానని అన్నాడు. ‘ట్రాఫిక్‌లోనూ నా చుట్టు సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అది ఇతరులకు అసౌకర్యంగా ఉంటుంది. ఏది జరగాలో అదే జరుగుతుంది. భగవంతుడిపై భారం వేశా. ఇప్పుడు నా చుట్టూ ఎన్నో తుపాకులు ఉన్నాయి. వాటిని చూసి భయపడుతున్నా. చాలా జాగ్రత్తగా ఉంటున్నా’ అని సల్మాన్ చెప్పుకొచ్చాడు. -
ఇరాన్లో ‘నైతిక పోలీస్’ రద్దు
టెహ్రాన్: మహ్సా అమినీ (22) అనే కుర్దిష్ యువతి మరణంతో ఇరాన్ నెలలుగా కొనసాగుతున్న హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గింది. న్యాయవ్యవస్థతో సంబంధం లేని నైతిక పోలీస్ వ్యవస్థను రద్దు చేసింది. ఒక మత కార్యక్రమంలో ఓ వ్యక్తి ప్రశ్నకు బదులుగా ఇరాన్ అటార్నీ జనరల్ ఈ మేరకు తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇరాన్ గణతంత్ర, ఇస్లామిక్ పునాదులు రాజ్యాంగబద్ధంగా స్థిరంగా ఉన్నాయని, అయితే అమలు విధానాలు సరళంగా ఉంటాయని అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ శనివారం వ్యాఖ్యానించారు. హిజాబ్ సరిగా ధరించలేదని అమినిని నైతిక పోలీసులు సెప్టెంబర్ 16న అరెస్ట్ చేయడం, మూడు రోజుల తర్వాత ఆమె కస్టడీలోనే మరణించడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేగాయి. మహిళలకు కఠినమైన డ్రెస్ కోడ్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు రాజుకున్నాయి. బలగాలు కాల్పుల్లో వందలాదిగా చనిపోయారు. అమిని పేరు, ఫొటో ప్రదర్శిస్తూ ఇరాన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనల్లో పాల్గొన్న మహిళలు హిజాబ్‌ను కాల్చివేయడం, బహిరంగంగా జుత్తును కత్తిరించుకోవడం చేశారు. నైతిక పోలీసింగ్ ఇలా మొదలైంది... అతివాద అధ్యక్షుడు అహ్మదీ నెజాది హయాంలో 2006లో గష్త్–ఇ–ఇర్షాద్ (మార్గదర్శక పహారా) పేరుతో ఈ వ్యవస్థ ఏర్పాటైంది. ఇందులో భాగంగా మహిళలకు హిజాబ్ ధారణ తప్పనిసరి చేశారు. 15 ఏళ్ల క్రితం దాకా నైతిక పోలీసులు ముందుగా హెచ్చరించి, అయినా ఖాతరు చేయని మహిళలను అరెస్ట్ చేసేవారు. ఈ ప్రత్యేక బలగాల పాత్రపై మొదట్నుంచీ వివాదాలు నడుస్తున్నాయి. ఇరాన్ అధ్యక్షులుగా చేసిన వారిలోనే దీనిపై భిన్నాభిప్రాయాలుండేవి. మహిళల దుస్తుల నిబంధనలు కూడా మారుతూ వచ్చాయి. ఆధునిక భావాలున్న అధ్యక్షుడు రౌహానీ హయాంలో మహిళలు బిగుతైన జీన్స్, రంగురంగుల హిజాబ్ ధరించే వీలు కల్పించారు. కానీ సంప్రదాయ భావాలున్న రైసి ఈ ఏడాది జూలైలో పగ్గాలు చేపట్టాక నిబంధనలు కఠినతరమయ్యాయి. అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి చేశారు. -
NEET: లోదుస్తుల వివాదం.. బాధిత అమ్మాయిలకు మళ్లీ ‘నీట్’ పరీక్ష
న్యూఢిల్లీ: కేరళలో నీట్ పరీక్షకు హాజరైన సందర్భంగా ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్థినులతో లోదుస్తులు విప్పించి.. ఆ తర్వాతే పరీక్ష రాయడానికి వెళ్లాలని సిబ్బంది ఆదేశించిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ వివాదంలో జాతీయ పరీక్షల మండలి(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రం వద్ద అవమానం ఎదుర్కొన్న బాధిత అమ్మాయిలు మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది ఎన్టీఏ. వారికి సెప్టెంబరు 4న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి విద్యార్థినులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం చేరవేసినట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది జులై 17న నీట్ పరీక్ష సమయంలో తనిఖీల పేరుతో తమను లోదుస్తులు విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు కొందరు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దాంతో అది పెను దుమారం రేపింది. కేరళలోని కొల్లం జిల్లా ఆయుర్‌లో గల మార్థోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ ఘటన జరిగింది. లోదుస్తులకు ఉన్న హుక్స్ కారణంగా సౌండ్ వచ్చిందని దీంతో దాన్ని తీసేసి తన కుమార్తెను పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలని సిబ్బంది ఆదేశించారని ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పలువురు విద్యార్థినులు కూడా ఇదే తరహా ఫిర్యాదులు చేశారు. విద్యార్థినుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన కళాశాల సిబ్బందిపై చర్యలకు డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. ఘటనపై నిజ నిర్ధారణ కమిటీని నియమించింది ఎన్టీఏ. ఈ కేసులో కేరళ పోలీసులు తనిఖీలు చేపట్టిన ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు. ఇదీ చదవండి: NEET Dress Code Controversy: ఇదంత ‘నీట్’ కాదేమో!? -
NEET Dress Code Controversy: ఇదంత ‘నీట్’ కాదేమో!?
మొదలైన ముహూర్తబలమో ఏమో కానీ, కొన్ని నిత్యం వివాదాస్పదమే. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం కేంద్రం కొన్నేళ్ళ క్రితం ఆరంభించిన ‘జాతీయ ఉమ్మడి అర్హత – ప్రవేశ పరీక్ష’ (నీట్) అందుకు ఓ ఉదాహరణ. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కొంతకాలంగా ఉన్న ‘నీట్’ వ్యతిరేకత చాలదన్నట్టు, ఆదివారం నాటి పరీక్ష వివాదాల్లో మరో మెట్టు పైకెక్కింది. ఆడవారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడానికి వేదికైంది. కేరళలోని ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్థినులతో ‘బ్రాసరీలు’ విప్పించి, ఆ తర్వాతే పరీక్ష రాయడానికి అనుమతించిన ఘటన అత్యంత హేయమైనది. ‘నీట్’ సహా అనేక పరీక్షల్లో ఆడపిల్లల్ని వేధించడానికి అనువుగా మారిన అర్థరహిత ‘దుస్తుల నిబంధ నల’పై చర్చ జరగాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తోంది. ఒక్క మార్కుతో జాతకాలే మారే చోట మాస్ రిగ్గింగ్‌తో ‘నీట్’ ప్రయోజనమే ప్రశ్నార్థకమవుతోంది. ‘నీట్–2022’కు దేశవ్యాప్తంగా 18 లక్షల మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. జూలై 17న 497 పట్నాల్లో 3,570 కేంద్రాల్లో ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (ఎన్టీఏ) పరీక్ష నిర్వహిం చింది. త్వరలోనే ఫలితాలు విడుదల చేయాలి. తీరా పరీక్షలో అక్రమాల నేపథ్యంలో మళ్ళీ పరీక్ష పెట్టాలనే వాదన వినిపిస్తోంది. ఇన్నేళ్ళయినా నిక్కచ్చిగా ఒక పరీక్ష పెట్టలేకపోవడం సర్కారీ చేతకానితనమే. కరోనా వల్ల తరగతులే సరిగా జరగలేదంటూ, పరీక్ష వాయిదా కోరుతూ విద్యా ర్థులు వీధికెక్కినా, వారి గోడు విన్నవారు లేరు. ఇప్పుడేమో హిందీ మాధ్యమ అభ్యర్థులకు ఆంగ్ల ప్రశ్నపత్రాల పంపిణీ, ఆడవారి ఆత్మ గౌరవాన్ని హరించే ‘డ్రెస్ కోడ్’ లాంటివి మరింత తల వంపులు తెచ్చాయి. కనీసం అభ్యర్థి రాసే మీడియమ్‌లోని పేపరైనా ఇవ్వలేకపోతే, మార్కుల నష్టానికి పూచీ ఎవరు? రాష్ట్రాల స్థానిక ప్రవేశపరీక్షలతో పోలిస్తే, ‘నీట్’ లోపరహితమనీ, వైద్యవిద్యలో ప్రవేశాలు పారదర్శకంగా సాగుతాయనీ కేంద్ర వర్గాల మాట. పరీక్షలో ప్రమాణాలు పెంచడం ఓకే కానీ, నిర్వహణలో లోపాలే విద్యార్థులకు శాపాలు. తాజా ‘నీట్’లో మాస్‌రిగ్గింగ్‌కు తెర తీసిన 8 మంది నిందితులను సీబీఐ అరెస్టు చేయడం అందుకు మచ్చుతునక. పరీక్ష రాయాల్సిన అసలు అభ్యర్థుల స్థానంలో వేరొకరెళ్ళి రాస్తున్నారంటే ‘నీట్’లో అక్రమాలకు ఆస్కారమే లేదని ఎలా అంటాం? పైగా, ఢిల్లీ, హరియాణా ల్లోని పలు కేంద్రాల్లో ఇదే తంతు! పరీక్ష మర్నాడు పుంజీడు మంది పట్టుబడ్డా, దొరకని దొంగలు ఎందరున్నారో ఎవరు చెప్పగలరు? రాజస్థాన్‌లో ఓ చోట నిర్ణీత గడువు ముగిసిన తర్వాతా పరీక్ష కొనసాగుతూనే ఉంది. సాక్షాత్తూ ఓ ఎంపీ ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. కొన్నిచోట్లయితే... బయో మెట్రిక్ హాజరు తీసుకోకుండానే అందరినీ పరీక్షకు అనుమతించారనీ, అయినవాళ్ళయిన అభ్యర్థులకు అనుకూలంగా ఉండేలా ‘నీట్’ పేపర్లనే మార్చేశారనీ వార్త. ప్రతిష్ఠాత్మక ‘ఎన్టీఏ’ పరీక్షలు నిర్వహిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఇంత సంబడంగా సాగుతోందంటే ‘నీట్’ ఏ మాత్రం నీటుగా నడుస్తోందో వేరే చెప్పనక్కర్లేదు. వాములు తింటున్న స్వాముల్ని వదిలేసి, కనబడని సూదుల కోసం వెతికినట్టు... అక్రమార్కుల కన్నా ఆడవారి లోదుస్తులకుండే లోహపు కొక్కీ ‘నీట్’ పరీక్షకులకు అభ్యంతరకరంగా, ప్రమాద కరంగా కనిపించడం పరాకాష్ఠ. పరీక్ష రాయాల్సిన పిల్లలు ఏడుస్తున్నా కరగక, ‘లోదుస్తులు ముఖ్యమా, భవిష్యత్తు ముఖ్యమా’ అని ప్రశ్నించి, లోదుస్తులు విడిస్తే తప్ప పరీక్ష రాయనివ్వని పరిస్థితి కల్పించారంటే మనం ఏ నాగరక సమాజంలో ఉన్నట్టు? ఆ షాక్‌లోనే పరీక్ష రాసిన పిల్లల్ని తిరిగి చాటుగా ఆ దుస్తులను ధరించనివ్వక, అదేదో పరీక్షా కేంద్రం బయటకెళ్ళి చేసుకొమ్మనడం ఎంత రాక్షసత్వం? ఈ కర్కశత్వంతో హృదయం గాయపడిన ఆ చిన్నారులకు ఏ మందు రాస్తే గాయం మానుతుంది? జీవితాంతం వేధించే దారుణ అనుభవానికి తోడు అసలేమీ జరగలేదనీ, విద్యార్థిని అబద్ధమాడుతోందనీ ‘ఎన్టీఏ’ బుకాయించడం విడ్డూరం. చివరకు మరో నలుగురు పిల్లలు ముందుకొచ్చి, తమకూ ఎదురైన అదే అనుభవాన్ని వెల్లడించాల్సి వచ్చిందంటే మన ప్రవేశ పరీక్షల్లోని పాశవిక నిబంధనల్ని ఏమనాలి? గతంలోనూ ‘నీట్’లో ఇలాంటివే జరిగాయి. 2017లో కేరళలోనే కన్నూరులోని ఓ పరీక్షా కేంద్రంలో లోదుస్తుల్ని విప్పమని నలుగురు స్కూలు టీచర్లు ‘అతిగా ప్రవర్తించి’, ఆనక సస్పెండ య్యారు. అప్పట్లో సీబీఎస్ఈ నిర్వహించిన ‘నీట్’ ఇప్పుడు ‘ఎన్టీఏ’ చేతికొచ్చింది. పాత ‘అతి’ మాత్రం మారలేదు. చీటీలు పెట్టకుండా, ఆధునిక పరికరాలను వాడకుండా కట్టుదిట్టంగా పరీక్ష నిర్వహించాలనుకోవడం తప్పు కాదు. పొడుగు చేతుల దుస్తులు, బూట్లు వేసుకోకూడదన్నదీ అర్థం చేసుకోవచ్చు. కానీ, ‘ఆభరణాలు, లోహపు వస్తువులు ధరించ రాద’న్న నిబంధనను సాకుగా చేసు కొని, లోహపు కొక్కీతో ధరించే లోదుస్తులు విప్పేయాలనడం విపరీతం, వితండవాదం. వచ్చే జేఈఈ లాంటి అనేక ప్రవేశపరీక్షలకూ దాదాపు ఇవే నిబంధనలు గనక ఆడపిల్లల ఆత్మగౌరవ హననం అక్కడా పునరావృతం కాదన్న గ్యారంటీ లేదు. కేరళ విద్యా శాఖ మహిళా మంత్రి ఖండిం చినా, ఇప్పటికీ పెదవి విప్పని కేంద్ర పెద్దలు, బాధ్యులు ఇలాంటి ఘటనలకు తెరపడేలా చర్యలు చేపట్టాలి. ఇప్పటికే వివాదాలు, రిగ్గింగ్‌లతో ‘నీట్’ నవ్వులపాలైంది. రీ–ఎగ్జామ్ అంటూ పెట్టాల్సి వస్తే, అధికారుల వైఫల్యానికి మూల్యం చెల్లించేది – అమాయక విద్యార్థులు, వారి కుటుంబాలే! -
అక్కడ మగవాళ్లు గడ్డం లేకుండా ఆఫీసుకి రాకూడదట!
Taliban have enforced a new dress code: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు ఎప్పడూ ఏదో ఒక కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూనే ఉంది. అందులో భాగంగానే అఫ్గనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్‌ని అమలు చేసింది. దీని ప్రకారం పురుష ప్రభుత్వ ఉద్యోగులు గడ్డం లేకుండా కార్యాలయానికి రాకూడదని తెలిపింది. పాశ్చాత్య సూట్లు ధరించకూడదని, తమ తలలను కప్పుకోవడానికి టోపీ లేదా తలపాగాతో పాటు సంప్రదాయ పొడవాటి టాప్స్ , ప్యాంటులు ధరించాలి అని పేర్కొంది. ఈ కోడ్‌ను ఉల్లంఘిస్తే, ఉద్యోగులు తమ కార్యాలయాల్లోకి ప్రవేశించడానికి అనుమతించకపోవడమే కాకుండా చివరికి విధుల నుంచి తొలగించే అవకాశం కూడా ఉందని తాలిబాన్ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంగళవారం నుంచే కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. పైగా గతవారం నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉండగా బాలికలు పాఠశాలలకు హాజరుకాకుండా నిషేధించింది. దీంతో యూఎన్ ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ఈ విషయమై తాలిబన్లకు విద్యాహక్కును గౌరవించమని నొక్కి చెప్పింది. ఆఖరికి పురుషులు, కుటుంబ సభ్యులు లేకుండా మహిళలు ఒంటరిగా ప్రయాణించడాన్ని నిషేధించింది కూడా. (చదవండి: రెండు శిక్షణా విమానాలు ఢీ... ముగ్గురు మృతి) -
డ్రెస్‌కోడ్ మార్చకపోతే రైలుని అడ్డుకుంటాం.. దెబ్బకు దిగొచ్చిన రైల్వే శాఖ
ఉజ్జయిని: రామాయణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పనిచేసే వెయిటర్ల డ్రెస్‌కోడ్‌ను రైల్వే శాఖ సోమవారం ఉపసంహరించుకుంది. వారి యూనిఫామ్‌ను మార్చేసింది. వారి డ్రెస్‌కోడ్ పట్ల మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మత గురువులు, సాధువులు అభ్యంతరం వ్యక్తం చేయడమే ఇందుకు కారణం. వెయిటర్లు సాధువుల తరహాలో కాషాయ రంగు దుస్తులు, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి, రైలులో విధులు నిర్వర్తిస్తున్నారని, ఇది హిందూ మతాన్ని అవమానించడమే అవుతుందని వారు ఆక్షేపించారు. డ్రెస్‌కోడ్‌ను మార్చకపోతే ఢిల్లీలో ఈ రైలును అడ్డుకుంటామన్నారు. రెండు రోజుల క్రితం రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశారు. దీంతో రైల్వే శాఖ వెంటనే స్పందించింది. సిబ్బంది దుస్తులను మార్చింది. సాధారణ చొక్కా, ప్యాంట్, సంప్రదాయ తలపాగా ధరించి, యాత్రికులకు సేవలందిస్తారని తెలిపింది. కాషాయ రంగు మాస్కులు, చేతి గ్లౌజ్‌ల్లో మార్పులు చేయలేదు. రామాయణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇటీవలే ఢిల్లీలో ప్రారంభమయ్యింది. 7,500 కి.మీ.ల మేర దేశంలోని వివిధ ప్రాంతాలను చుట్టేసి మళ్లీ ఢిల్లీకి చేరుకోనుంది. -
పాకిస్తాన్ ఆంక్షలు...నో జీన్స్ అండ్ టైట్స్
ఇస్లామాబాద్: కొన్ని ఇస్లామిక్ దేశాల్లో మహిళా వస్త్రధారణ పై ఆంక్షలు విధించడం సాధారణం. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు కూడా కో ఎడ్యుకేషన్ నిషేధిస్తూ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసింది. తాజాగా పాకిస్తాన్ కూడా అదే తరహలో ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఫెడరల్ డైరక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఎఫ్‌డీఈ) మహిళా ఉపాధ్యాయులను టైట్స్, జీన్స్ ,పురుష ఉపాధ్యాయులను జీన్స్, టీ షర్ట్స్ ధరించకూడదంటూ ఆంక్షలు జారీ చేసింది. అంతేకాదు మహిళలు/పురుష ఉపాధ్యాయులు ఎలాంటి దుస్తులు ధరించాలో ఎఫ్‌డీఈ నిర్ణయించింది. పాకిస్తాన్లో అన్ని విద్యాసంస్థలలోని బోధన/బోధనేతర సిబ్బంది వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ తాము సూచించిన నియమాలను పాటించేలా చూడాల్సిందిగా ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. -
అమ్మాయిలూ ‘జట్టు విరబోసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’
పాట్నా: ‘కళాశాలకు వస్తుంటే తల విరబూసుకుని జట్టు వేసుకోకుండా వస్తే ఇకపై అనుమతి లేదు. హీరోయిన్ మాదిరి తయారై వస్తే కళాశాలలోకి అడుగు పెట్టేదే లేదు’ అని బిహార్ భగల్పూర్లో ఉన్న సుందర్‌వతి మహిళా మహావిద్యాలయం నిర్ణయం తీసుకుంది. విద్యా ఆవరణలో క్రమశిక్షణ, పద్ధతిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ విద్యాలయం తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఇటీవల విద్యాలయ ప్రిన్సిపల్ పలు నిబంధనలు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాటిలో అమ్మాయిలకు డ్రెస్ కోడ్‌తో పాటు అలంకరణ, వేషధారణ పలు విషయాలపై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. (చదవండి: జర చూసి తినండి.. పిజ్జాలో ఇనుప నట్లు, బోల్టులు) కళాశాలకు వచ్చే విద్యార్థినులు కచ్చితంగా జడ వేసుకోవాలి. జుట్టు విరబూసుకుని రావొద్దు. కళాశాల గేటు లోపలకి వచ్చాక సెల్ఫీలు, ఫొటోలు దిగవద్దు. డ్రెస్ కోడ్ విధిగా పాటించాలి. రాయల్ బ్లూ బ్లేజర్ లేదా, చలికోటు ధరించాలి. పైవీ ఏవైనా ఉల్లంఘిస్తే కళాశాలకు అనుమతించరు. ఈ నిబంధనలను విధిగా పాటించాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమణ్ సిన్హా తెలిపారు. ఈ నిబంధనలపై విమర్శలు రావడంపై కొట్టిపారేశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని ఆర్జేడీ తప్పుబట్టింది. ఇదో తుగ్లక్ నిర్ణయమని ఎద్దేవాచే సింది. మరికొన్ని విద్యార్థి సంఘాలు ఈ నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ విద్యాలయంలో మొత్తం విద్యార్థులు 1,500మంది ఉన్నారు. చదవండి: గుండెల్ని పిండేస్తున్న అమెజాన్ వీడియో -
Vidhi Collections: ఈ క్లాత్‌లో అస్సలు గంజి ఉండదు!
న్యాయవాదులు న్యాయం గురించి ఆలోచిస్తారు. న్యాయవాదుల గురించి కేరళ కసవు చేనేత ఆలోచించింది. ‘విధి’ కలెక్షన్ పేరుతో కొంగొత్త ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన చీరలను వారి ముందుంచింది. ‘కసవు’ అనేది కేరళలో ధరించే సంప్రదాయ హాఫ్‌వైట్ ఫ్యాబ్రిక్. ఇది అక్కడి స్థానిక చేనేతకారుల చేతుల్లో రూపుద్దుకుంటుంది. కసవు చీరలు కేరళ సంప్రదాయ పండగ సీజన్లలో ముఖ్యంగా ఏప్రిల్–ఆగస్టు నెలలో విరివిగా కొనుగోళ్లు జరుగుతాయి. ఓనమ్ పండగకు మహిళలు తప్పక కసవు సంప్రదాయ చీరను ధరిస్తారు. కోవిడ్–19 మహమ్మారి వల్ల లాక్డౌన్ విధింపులతో పండగలు, వేడుకలు లేవు. అంతకుముందు ఏడాది వరదల కారణంగా నేత కార్మికులు ఘోరమైన నష్టాలను చవిచూశారు. ఈ కష్టం నుంచి గట్టెక్కడానికి ఈ కొత్త మోనోక్రామ్ చీరలు వినూత్నంగా రూపొందించారు. అయితే, ‘ప్రజలు వీటినే కొనాలని మేం కోరుకోవడం లేదు. మేం సమకాలీన ఉత్పత్తులను సృష్టించాలి, మా హస్తకళ ప్రావీణ్యం తెలియాలనే వీటిని రూపకల్పన చేశాం’ అని సేవ్ ది లూమ్ వ్యవస్థాపకుడు రమేష్ మీనన్ ఈ సందర్భంగా వివరిస్తారు. వీరి ఆలోచనా విధానం నుంచే ‘విధి’ అనే నూతన డిజైన్ కసవు నేతలో పుట్టుకొచ్చింది. సౌకర్యానికే ప్రథమ స్థానం న్యాయవాదుల వేషధారణ గురించి 18వ శతాబ్దం నుండి ఆలోచించనేలేదు. బ్రిటీష్ కోర్టుల నుంచి ప్రేరణ పొందిన ఈ యూనిఫాం చీరలు, సల్వార్ కుర్తాలు నలుపు, తెలుపు లేదా బూడిద రంగులో ఉంటాయి. ప్రత్యేక కాలర్ గల జాకెట్, ఫార్మల్ గౌన్ అదనంగా మహిళలకు నిర్ణయించారు. అంతేకాదు, మరికొన్ని ముఖ్యమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని వివరిస్తారు మీనన్. ‘మన దేశంలో న్యాయస్థానాలు వేడి వాతావరణంలో ఉంటాయి. న్యాయవాదులు రోజుకు 12 నుండి 14 గంటలపాటు పనిలో ఉంటారు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు. వారు తమ రెగ్యులర్ వేర్ని మెయింటెయిన్ చేయడానికి సమయం ఉండదు. కోర్టుకు సెలవులు ఉన్నప్పుడు గౌన్లను శుభ్రపరుచుకోవడానికి మాత్రమే కాస్త అవకాశం లభిస్తుంది. కసవు నేతలో నాణ్యమైన పత్తి ఉంటుంది. ఈ క్లాత్‌లో అస్సలు గంజి ఉండదు. దీంతో పనిలో ఉండేవారికి ఈ చీరలు చాలా సౌలభ్యంగా ఉంటాయి. ఈ చేనేతకు ముష్రూ పట్టు నుండి ప్రేరణ పొందాం. మొఘల్ రాచకుటుంబీకుల కోసం అభివృద్ధి చేసిన ఫ్యాబ్రిక్‌గా దీనిని చెప్పవచ్చు. బట్ట ఎంతో మృదువుగా ఉంటుంది’ అని వివరిస్తారు. న్యాయవాది అన్నా చాందీ పుట్టిన రోజు సందర్భంగా ‘విధి’ క్లాత్‌ను లాంచ్ చేశారు. ఈ కొత్త చీరల కలెక్షన్‌ను యువ మహిళా న్యాయవాదులు ధరించి అందమైన, అత్యద్భుతమైన, సౌకర్యవంతమైన ఈ చీరల్లో కొత్తగా మెరిసిపోయారు. ఈ చీరలను న్యాయవాదులే కాదు దేశ మహిళలందరూ ధరించి, హుందాతనాన్ని మూటగట్టుకోవచ్చు. ముఖ్యంగా వర్కింగ్ వేర్‌గా ఈ ‘విధి’ సరికొత్త శారీస్ పేరొందుతాయి అని చెప్పచ్చు. -
సీన్ తొలగించాల్సిందే
అనిల్ కపూర్, పాపులర్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏకే వర్సెస్ ఏకే’. విక్రమాదిత్యా మోత్వానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 24న ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్లో అనిల్ కపూర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ డ్రస్‌లో కనిపిస్తారు. అలాగే ఆయన మాట్లాడిన డైలాగుల్లో అభ్యంతరకర పదజాలం ఉంది. ఈ విషయంలో ‘ఐఏఎఫ్’ (భారత వైమానిక దళం) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎఫ్ అధికారిగా అనిల్ కపూర్ ధరించిన డ్రెస్ కోడ్ సరిగ్గా లేదని ఐఏఎఫ్ పేర్కొంది. అలాగే ట్రైలర్లో ఉపయోగించిన పదజాలం ఇబ్బందికరంగా ఉందని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ విషయంపై అనిల్ కపూర్ క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేశారు. -
సచివాలయ సిబ్బందికి డ్రెస్ కోడ్ !
సాక్షి, ఒంగోలు: సచివాలయాల ఏర్పాటుతో ఉద్యోగుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. పని దినాల్లో పట్టణ ప్రాంతాల్లో సచివాలయాల సిబ్బంది రాకపోకలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సచివాలయాల్లో పనిచేసే వారిలో ఎక్కువ శాతం యువతే ఉన్నారు. ప్రజలతో నిత్యం సత్సంబంధాలు కలిగి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయాల్లో పనిచేసేవారు ప్రత్యేకంగా కనిపించాలన్న ఆలోచనను ప్రభుత్వం చేస్తోంది. అందుకుగాను వారికి కూడా డ్రస్ కోడ్ అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. పైలెట్ సచివాలయాల కింద కొన్నింటిని గుర్తించి ముందుగా అక్కడి సిబ్బందికి డ్రస్ కోడ్ అమలు చేయాలని నిర్ణయించింది. అక్కడి సిబ్బంది నుంచి, ఆ సచివాలయాల పరిధిలోని ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను ఆధారం చేసుకొని మిగిలిన సచివాలయాల్లో కూడా అమలుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసి పెద్ద సంఖ్యలో సిబ్బందిని నియమించింది. ఒక్కో సచివాలయంలో పదిమందికి తగ్గకుండా సిబ్బందిని నియమించారు. జనాభాను ఆధారం చేసుకొని సచివాలయాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 179 వార్డు సచివాలయాలు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 884 గ్రామ సచివాలయాలున్నాయి. వీటిలో దాదాపు 8535 మంది పనిచేస్తున్నారు. వేలాది మంది పనిచేస్తుండటంతో వారందరినీ యూనిఫామ్‌గా ఉంచాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పురుష ఉద్యోగులకు స్కై బ్లూ షర్ట్, బిస్కెట్ కలర్ ప్యాంట్, మహిళా ఉద్యోగులకు స్కై› బ్లూ టాప్, బిస్కెట్ కలర్ లెగిన్ డ్రస్ కోడ్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు కింద ఒకటి రెండు జిల్లాలను ఎంపికచేసి, అక్కడి ఒకటి రెండు సచివాలయాలకు డ్రస్ కోడ్ అమలు చేస్తోంది. డ్రస్ కోడ్ పట్ల సానుకూల స్పందన లభిస్తే రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. (అగ్రిగోల్డ్ డిపాజిట్ల చెల్లింపులకు లైన్ క్లియర్) ట్యాగ్ కలర్‌తో క్యాడర్ గుర్తింపు: సచివాలయాల్లో డ్రస్ కోడ్‌ను అమలు చేయనున్న నేపథ్యంలో ఏ క్యాడర్‌కు చెందిన సిబ్బంది ఎవరన్న విషయాన్ని ప్రజలు సులువుగా తెలుసుకునేందుకు ఐడెంటిటీ కార్డుల ట్యాగ్ కలర్లను ప్రత్యేకంగా రూపొందిస్తోంది. వార్డు సచివాలయాల్లో దాదాపు పది విభాగాలకు చెందినవారు కార్యదర్శులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. సిబ్బందికి ఇప్పటికే ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. ఐడెంటిటీ కార్డులు ధరించేందుకు ట్యాగ్‌లను వినియోగిస్తారు. ఒక్కో కార్యదర్శికి ఒక్కో కలర్ ట్యాగ్ ఇచ్చే విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని అడ్మిన్ సెక్రటరీ, గ్రామ సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులకు ఎల్లో ట్యాగ్, డిజిటల్ అసిస్టెంట్‌కు రెడ్ ట్యాగ్, హెల్త్ సెక్రటరీకి వైట్ ట్యాగ్, మహిళా పోలీసుకు ఖాకి ట్యాగ్, వీఆర్ఓకు బ్రౌన్ ట్యాగ్, అగ్రికల్చరల్/ హార్టీ కల్చరల్ సెక్రటరీకి గ్రీన్ ట్యాగ్, ఎడ్యుకేషన్ సెక్రటరీకి ఆరంజ్ ట్యాగ్, ఇంజినీరింగ్ అసిస్టెంట్‌కు గ్రే ట్యాగ్ ఇవ్వనున్నారు. వలంటీర్లకు కూడా.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందించే విషయంలో వలంటీర్లు కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 18187 మంది వలంటీర్లు ఉన్నారు. వీరికి కూడా డ్రస్ కోడ్ అమలుచేసే విషయమై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వలంటీర్లకు ఎలాంటి డ్రస్ కోడ్ అమలు చేయాలనే విషయమై చర్చ నడుస్తోంది. వలంటీర్లు సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నారు. ఆ సమయంలో వలంటీర్లు డ్రస్ కోడ్ పాటించడం ద్వారా ఎవరైనా కొత్తవారు కూడా వారిని వెంటనే గుర్తించి తమ పింఛన్ల విషయమై మాట్లాడే వీలు కలగనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా పింఛన్లకు అర్హత సాధించినవారు కూడా తమ ప్రాంతంలో వలంటీర్ పింఛన్ల పంపిణీకి తిరుగుతున్న సమయంలో గుర్తించి వాటిని వెంటనే పొందే వెసులుబాటు కూడా కలగనుంది. మొత్తం మీద డ్రస్ కోడ్లతో సచివాలయాలు సరికొత్త శోభను సంతరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ముఖానికి మాస్కులు.. షీల్డులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిపరమైన ఆంక్షలతో దేశీయంగా నిల్చిపోయిన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైన తర్వాత సిబ్బంది డ్రెస్ కోడ్‌లో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. వారు కూడా ముఖానికి మాస్కులు, ఫేస్ షీల్డులు, గౌన్లు వంటి వ్యక్తిగత భద్రత సాధనాలను (పీపీఈ) ఉపయోగించనున్నారు. విధుల నిర్వహణలో ప్రయాణికులకు దగ్గరగా తిరిగే సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఆహార్యాన్ని అమలు చేయాలని ఇండిగో, ఎయిరిండియా, విస్తార, ఎయిర్ఏషియా ఇండియా తదితర సంస్థలు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 27న ఫిలిప్పీన్స్ ఎయిర్ఏషియా ఆవిష్కరించిన డ్రెస్ కోడ్ తరహాలోనే ఇది కూడా ఉండవచ్చని వివరించాయి. ఫేస్ షీల్డు, ఫేస్ మాస్కుతో పాటు శరీరాన్ని పూర్తిగా కప్పేసే ఎరుపు రంగు ఫుల్ బాడీ సూట్‌ను ఫిలిప్పీన్స్ ఎయిర్ఏషియా రూపొందించింది. ఎయిర్ఏషియా తమ సిబ్బంది.. పీపీఈ కిట్ కింద ఫేస్ షీల్డులు, మాస్కులు, గౌన్లు, ఆప్రాన్స్, గ్లౌజులు ధరించవచ్చని తెలుస్తోంది. విస్తార సంస్థ సిబ్బంది కొత్త డ్రెస్ కోడ్‌లో ల్యాప్ గౌన్, ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డులు ఉండవచ్చని సమాచారం. అటు ఇండిగో సిబ్బంది గౌను లేదా బాడీ సూట్‌తో పాటు సర్జికల్ మాస్కు, గ్లౌజులు, ఫేస్ షీల్డు ధరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. ఎయిరిండియా ఉద్యోగులు కూడా బాడీ సూట్, గ్లౌజులు, ఫేస్ షీల్డు, ఫేస్ మాస్క్ ఉపయోగించనున్నారని తెలిపాయి. -
అడ్వకేట్ల డ్రస్కోడ్ మారింది, ఇకపై వారు...
భువనేశ్వర్: కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు వస్తోన్నాయి. అత్యవసర సర్వీసులు వారు తప్ప మిగిలిన వారందరూ ఇంటి దగ్గర నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తోన్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ చేపడుతున్నాయి. సాధారణంగా అడ్వకేట్లు అంటే నల్లని కోర్టు వేసుకొని కేసులు వాదిస్తూ ఉంటారు. అయితే ఒడిషా హైకోర్టు మాత్రం ఇకపై లాయర్లందరూ తెల్లని వస్త్రాలు ధరించి తమ వాదనలు వినిపించాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది. (లాక్డౌన్: మహిళపై అఘాయిత్యం) వర్చువల్ కోర్టు సిస్టమ్ ద్వారా అడ్వకేట్లందరూ కోర్టు ముందు హాజరవుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోన్న ఈ తరుణంలో జాగ్రత్త చర్యల్లో భాగంగా బ్లాక్‌కోర్టుని, గౌన్‌ను ధరించాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. తెల్ల షర్ట్, తెల్లసెల్వార్‌కమీజ్, తెల్లటి చీరలో కోర్టు ముందు హాజరు కావాలని ఒడిషా హైకోర్టు ఆదేశాలు జారిచేసింది. దీంతోపాటు బుధవారం నాడు వాదనలు వినే జడ్జీలు పొడుగాటి గౌన్లు ధరించాల్సిన అవసరం లేదని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. (కోల్‌కతా నగర వీధుల్లోకి ఎల్లో టాక్సీలు) -
డ్రెస్‌కోడ్‌ని పునఃసమీక్షిస్తాం
న్యూఢిల్లీ: రాజ్యసభలో మార్షల్స్ ధరించే యూనిఫాం తీరును తాజాగా మార్చిన విషయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆదేశించారు. నూతన డ్రెస్‌కోడ్‌పై సైనికాధికారుల నుంచి అభ్యంతరాలు రావడంతో వెంకయ్య పై విధంగా ఆదేశించారు. ఇప్పటివరకు మార్షల్స్ ధరిస్తోన్న భారత సాంప్రదాయ సఫారీ డ్రెస్, తలపాగా స్థానంలో సైనికాధికారులు ధరించే ముదురు నీలం రంగు, ముదురు ఆకుపచ్చరంగు యూనిఫాంలను రాజ్యసభ మార్షల్స్కి కేటాయించారు. అయితే ఇది సైనికాధికారులు ధరించే యూనిఫాంలను పోలి ఉందని అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై రాజకీయవేత్తలు, ఇతర ప్రముఖుల నుంచి అభ్యంతరాలు రావడంతో డ్రెస్‌కోడ్‌లో మార్పులను పునఃసమీక్షించాలని సచివాలయ సిబ్బందిని వెంకయ్య ఆదేశించారు. -
సచివాలయ ఉద్యోగులకు డ్రెస్‌కోడ్
పట్నా : సచివాలయ ఉద్యోగులు జీన్స్, టీషర్ట్స్ ధరించి విధులకు హాజరుకారాదని నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు కేవలం సౌకర్యవంతంగా, సింపుల్‌గా ఉండే లేత రంగు దుస్తులు ధరించాలని కోరింది. కార్యాలయ సంస్కృతికి విరుద్ధమైన దుస్తులతో అధికారులు, ఉద్యోగులు కార్యాలయానికి వస్తున్నట్టు గమనించామని..కార్యాలయ నిబంధనలకు ఇది విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి మహదేవ్ ప్రసాద్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతిఒక్కరూ సంప్రదాయ వస్త్రధారణతోనే కార్యాలయానికి హాజరు కావాలని స్పష్టం చేశారు. అధికారులు, ఉద్యోగులు సౌకర్యవంతంగా, సింపుల్‌గా ఉండే లేత రంగు దుస్తుల్లో విధులకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఆ స్కూల్లో పిల్లలందరికీ చొక్కా నిక్కరు..
కేరళ, ఎర్నాకుళం జిల్లాలో వలయాంచిరంగార అనే గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. వందేళ్లు దాటిన ఆ పాఠశాలలో టీచర్లతోపాటు బోధనేతర సిబ్బంది కూడా మహిళలే. ఈ ఆల్‌ఉమెన్ స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు సి.రాజి పిల్లల యూనిఫామ్ విషయంలో ఇప్పటి వరకు కొనసాగిన ఒక సంప్రదాయ విభజన రేఖను చెరిపేశారు. అన్ని స్కూళ్లలాగే ఆ స్కూల్లో కూడా అబ్బాయిలకు షర్టు – నిక్కరు, అమ్మాయిలకు షర్టు– స్కర్టు స్కూల్ యూనిఫామ్‌గా ఉండేది. ప్రిన్సిపల్ నిర్ణయంతో ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ‘షర్టు – నిక్కరు’ వేసుకుంటున్నారు. బాలికలకు ఆడేటప్పుడు సౌకర్యంగా ఉండటం కోసమే ఇలా యూని (డ్రెస్) కోడ్‌ను తెచ్చారు. ‘‘ఆటల్లో ఒకటో తరగతి పిల్లలు ఉన్నంత చురుగ్గా పెద్ద తరగతుల పిల్లలు ఉండడం లేదు. ఒకటి– రెండు తరగతుల్లో చురుగ్గా ఉన్న పిల్లలు కూడా నాలుగైదు తరగతులకు వచ్చే సరికి ఆటలాడడానికి బిడియపడుతున్నారు. ఉత్సాహంగా ఉండాల్సిన పిల్లలకు కనిపించని సంకెళ్లుగా మారుతున్నది వాళ్ల దుస్తులే. ఆటల్లో పైకెగిరి షటిల్ రాకెట్‌తో కాక్‌ను కొట్టాలన్నా, ఒక్క గెంతులో లాంగ్ జంప్ చేయాలన్నా, హై జంప్ చేయాలన్నా స్కర్టు పైకెగురుతుందేమోననే బిడియంతో ఆటలాడడానికి ముందుకు రావడం లేదు. క్రీడాకారులుగా తయారుకాగలిగిన సత్తా ఉన్న పిల్లలను వస్త్రధారణ కారణంగా రెక్కలు విరిచి కూర్చోబెట్టడం ఏమిటి అనిపించింది. కార్పొరేట్ స్కూళ్లలో ఉన్నట్లు రెగ్యులర్ స్కూల్ డ్రస్ ఒకటి, స్పోర్ట్స్ పీరియడ్‌కి మరో రకం డ్రస్ అనే నియమం పెట్టడం మాకు కుదరదు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో డ్రస్ చేంజ్ రూములు ఏర్పాటు చేయడం కష్టం. ఇంటి నుంచి స్కూలుకి నడిచి వచ్చే పిల్లలకు తమ వెంట మరో జత దుస్తులు తెచ్చుకోవడం కూడా కష్టమే. అందుకే స్కూల్ డ్రెస్‌ని ఇలా డిజైన్ చేశాం. నిక్కర్ని కూడా ముందు ఉన్నట్లు తొడల వరకే కాకుండా, అందరికీ మోకాళ్ల వరకు ఉండేలా నియమం పెట్టాం’’ అన్నారు ప్రధానోపాధ్యాయురాలు రాజీ మేడమ్. తల్లిదండ్రులకూ సంతోషమే రాజీ మేడమ్ డిజైన్ చేసిన యూనిసెక్స్ యూనిఫామ్ పట్ల అమ్మాయిల తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారు. బాలికలు మాత్రం... నిక్కర్ జేబులో చేతులు పెట్టుకుంటూ సంతోషపడుతున్నారు. చాక్లెట్ కొనుక్కోవడానికి అమ్మ ఇచ్చిన రూపాయిని జేబులో దాచుకుంటూ, మధ్యలో చూసుకుంటూ మురిసిపోతున్నారు. రాజి మేడమ్ పదేళ్లుగా వలయాంచిరంగార ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు, ఆమె చదివింది కూడా అదే స్కూల్లో. ప్రస్తుతం ఆమెతో పని చేస్తున్న అనేక మంది సిబ్బంది ఆమెకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్లే. ‘తనకు స్కూల్లో ప్రతి అంగుళం తనకు తెలుసని, గ్రామంలో ప్రతి ఒక్కరితో పరిచయం ఉందని, అందువల్లనే స్కూలు అవసరం ఏమిటో గుర్తించి పరిష్కరించడంలో తనకు అందరి సహకారం ఉంటోందని’ చెప్పారు రాజీ మేడమ్.– మంజీర