
యూనిఫాం లేకుండా విధులకు హాజరైన దేవస్థానం అధికారులు, సిబ్బంది
యాదగిరికొండ (ఆలేరు) : యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం (యాదాద్రి) అధికారులు, సిబ్బంది డ్రెస్‌కోడ్‌ను పాటించడం లేదు. ప్రతిరోజూ వైట్ దుస్తులు (యూనిఫాం) ధరించాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోని దుస్థితి నెలకొంది. దీంతో ఎవరు సిబ్బంది.. ఎవరు భక్తులు అనే తేడా లేకుండా పోతోంది.
దేవస్థానానికి ప్రముఖులు వచ్చినప్పుడు తప్పితే మిగతా సమయాల్లో డ్రెస్‌కోడ్ అమలు కావడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్లో వైట్ యూనిఫాం ధరించి విధులకు హాజరవుతుంటే ఇక్కడి అధికారులు, సిబ్బంది అలా ఎందుకు చేయడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నా..
యాదాద్రిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగా యాదాద్రి పునరుద్ధరణ పనులను కనీవిని ఎరగని రీతిలో నిర్వహిస్తున్నారు. దీంతో యాదాద్రి పేరు జాతీయ, అంతర్జాతీయంగా మారుమోగు తోంది. అన్ని విభాగాల్లో పనుల నాణ్యత బాగుందని ఇటీవల ఐఎస్‌ఓ సర్టిఫికేట్ సైతం కైవసం చేసుకుంది. ఈ సర్టిఫికెట్ దేశంలో ఏ ఆలయానికి రాకపోవడం గమనార్హం.
ఇతంటి ప్రాధాన్యత సంతరించుకుంటున్న ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది యూనిఫాం ధరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతపెద్ద తిరుమలలోనే చిన్న అధికారుల నుంచి ఏఈఓల వరకు ప్రతిరోజూ యూనిఫాం వేసుకుని విధులు నిర్వహిస్తుంటారు. కానీ మన యాదాద్రిలో మాత్రం ఆలయ ఈఓ గీతారెడ్డి ప్రత్యేకంగా ఆదేశా>లు జారీ చేస్తే తప్ప యూనిఫాం ధరించని దుస్థితి నెలకొంది.
అదికూడా ముఖ్యమైన వీఐపీల వస్తేనో, రాజకీయ నాయకులు వస్తేనో ఆదేశాలు ఇస్తున్నారు. కాని విధిగా ప్రతి ఉద్యోగి వైట్ యూనిఫాంతో విధులకు హాజరు కావాల్సి ఉన్నా అవేమీ పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు కూడా కిందిస్థా?ఇ అధికారులను హెచ్చరించాల్సింది పోయి ఉన్నతాధికారులు సైతం యూనిఫాం ధరించడం మర్చిపోయారు. దీంతో డ్రెస్ కోడ్ అమలుకు నోచుకోవడం లేదు.
ప్రత్యేక డ్రెస్‌కు ఖర్చు ఇలా..
ప్రతి సంవత్సరం యాదాద్రి దేవస్థానం అధికారులకు సుమారు 2 లక్షల రూపాయల విలువైన వైట్ యూనిఫాం దుస్తులను ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇందులో భాగంగా ప్రతి ఉద్యోగికి రెండు జతల యూనిఫాం ఇస్తున్నారు. తెలంగాణాలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రతి దేవస్థానంలోని వైట్ యూనిఫాంను ప్రతి రోజు ధరించి విధులను నిర్వహించాలనే నిబంధన ఉంది.
అయితే యాదాద్రిలో మాత్రం డ్రెస్‌కోడ్ అమలు కాని దుస్థితి నెలకొంది. వైట్ యూనిఫాం వేసుకోకుండా విధులకు హాజరైన అధికారులెవరూ, సామాన్య భక్తులు ఎవరూ అని తేడా తెలియకుండా పోయింది. దీంతో దైవదర్శనానికి వచ్చిన తమకు ఏదైనా సమాచారం కావాల్సి వస్తే ఎవరిని అడగాలో తెలియకుండా ఉందని భక్తులు అంటున్నారు. ప్రతిరోజూ విధిగా యూనిఫాం వేసుకుని వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సమయానికి రాని అధికారులు !
కొంతమంది అధికారులు ఈఓ రాని రోజుల్లో విధులకు ఉదయం 10 గంటలకు రావాల్సిన అధికారులు 11, 12 గంటలకైనా రాని రోజులు ఉన్నాయి. దీంతో ఎక్కడి ఫైళ్లు అక్కడే మగ్గుతున్నాయి. ఒక్కో ఫైల్‌ను రోజుల తరబడి తమ వద్దే ఉంచుకుంటున్నారు. కాంట్రాక్టులకు రావాల్సిన బిల్లులు నెలల తరబడి రావడం లేదని కొంతమంది కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ ఈఓ గీతారెడ్డి ఏమంటున్నారంటే..
నూతన ప్రధానాలయం నిర్మాణం దాదాపు పూర్తి కావస్తున్నందున కొన్ని విషయాలపై దృష్టిపెట్టడం లేదు. కాని డ్రెస్ కోడ్ పాటించకపోవడం అనేది నిజమే. దీనిపై కఠిన నిర్ణయం తీసకుం టాను. అవసరమైతే యూనిఫాం వేసుకోవాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment