ప్రధానాలయంలో స్వర్ణ ధ్వజస్తంభానికి కంకణధారణ చేస్తున్న అర్చకులు
సాక్షి, యాదాద్రి: యాదాద్రిలో శ్రీ నృసింహస్వామివారి సప్తాహ్నిక పంచకుండాత్మక మహాకుంభాభిషేక ఉత్సవాలు రెండోరోజు అత్యంత వైభవంగా జరిగాయి. విశ్వశాంతి, లోకకల్యాణార్థం శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ ప్రధానాచార్యులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చకబృందం, పారాయణీకులు కనులపండువగా నిర్వహించారు. బాలాలయంలో ఉదయం 9 గంటలకు శాంతిపాఠం, యాగశాలలో చతుస్థానార్చనలు, ద్వార తోరణ ధ్వజకుంభారాధనలు, అగ్నిమ«థనం, అగ్నిప్రతిష్ఠ, యజ్ఞం ప్రారంభించారు. విశేష వాహనములు, మూర్తిమంత్ర హవనములు, నిత్యలఘు పూర్ణాహుతి నిర్వహించారు.
30 నిమిషాలపాటు అగ్నిమథనం
ఉత్సవాల్లో భాగంగా మహా మండపంలో యాగశాల ముందు భాగంలో అగ్నిమథనం కార్యక్రమాన్ని జరిపించారు. 10 మంది అర్చక స్వాములు, యాజ్ఞీకులు సహజంగా అగ్ని వచ్చేటట్లు అగ్నిమథనం చేశారు. జమ్మి, రాగి చెట్టు కర్రల ద్వారా అగ్నిని పుట్టించారు. ఈ అగ్నిని పుట్టించేందుకు సుమారు 30 నిమిషాలపాటు సంప్రదాయ పద్ధతిలో వేదమంత్రాలతో ఆచార్యులు, పారాయణీకులు పూజలు చేశారు. వృత్త కుండంలో అగ్ని ప్రతిçష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఆ వృత్త కుండం నుంచి మిగతా అన్ని కుండాలకు అగ్నిని విస్తరించారు.
విశేష యజ్ఞ హవనములు
పంచకుండాత్మక మహా యాగంలో అధిష్టాన దైవమైన శ్రీమన్నారాయణుడిని ప్రస్తుతించే మంత్రాలు, మూల మంత్రాలతో దశాంశ, శతాంశ, సహస్రంశాది తర్పణాలు, శ్రీ లక్ష్మీనారసింహుని స్తోత్రాలతో బీజాక్షర మంత్రాలతో విశేష హోమం నిర్వహించారు. బాలాలయంలో రాత్రి సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. నూతనంగా నిర్మించిన శ్రీ స్వామి వారి ప్రధానాలయంలో బింబ పరీక్ష, మన్నోమాన శాంతి హోమం చేశారు.
బింబ పరీక్ష ద్వారా ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించిన నూతన శిలస్వరూపులైన దేవతలు శిల్పి ఉలి తాకిడికి ఏర్పడిన అపరాధాన్ని తొలగించడానికి మంత్రోచ్ఛరణతో సంప్రోక్షణ చేయడం, శాంతి హోమం ద్వారా ఆగమశాస్త్రం ప్రకారం ప్రధాన ఆలయంలోని ఆయా మూర్తుల తేజస్సును పెంపొందించే కార్యక్రమం నిర్వహించారు. నవకలశ స్నపనం ద్వారా సర్వాభీష్ట సిద్ధి, సర్వసంపదలు కలగాలని నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment