Yadadri Temple: వైకుంఠమే దిగివచ్చింది! | CM KCR Inaugurates Yadadri Temple He Performs Pooja At Yadadri | Sakshi
Sakshi News home page

Yadadri Temple: వైకుంఠమే దిగివచ్చింది!

Published Tue, Mar 29 2022 1:58 AM | Last Updated on Tue, Mar 29 2022 11:52 AM

CM KCR Inaugurates Yadadri Temple He Performs Pooja At Yadadri - Sakshi

బాలాలయం నుంచి దేవతామూర్తులతో ప్రధానాలయానికి శోభాయాత్రగా వెళ్తున్న దృశ్యం, దివ్య విమానగోపురంపై సువర్ణ సుదర్శన చక్రానికి పూజలు చేస్తున్న సీఎం కేసీఆర్‌

అల వైకుంఠపురం భువికి దిగి వచ్చిందా అన్నట్టుగా యాదాద్రి శోభాయమానమైంది. పునర్నిర్మాణ ఆలయ మహాకుంభ సంప్రోక్షణ అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆలయ శిఖరాలు, ఉప ఆలయ సన్నిధులు, ప్రాకార మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వీఐపీల దర్శనం అనంతరం భక్తులు ఆలయానికి పోటెత్తారు. కృష్ణశిలలతో అబ్బురపరిచే శిల్పాలతో రూపుదిద్దుకున్న అద్భుత నిర్మాణం ఓవైపు.. యాదగిరీశుడి స్వయంభూ దర్శనం మరోవైపు భక్తులను తన్మయత్వంలో ముంచేశాయి.

సాక్షి,యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో యాదాద్రికి తరలివచ్చి నారసింహుడి సేవలో పాల్గొన్నారు. తొలుత బాలాలయం నుంచి స్వామివారి బంగారు కవచ మూర్తులు, యాగమూర్తులు, కల్యాణ మూర్తులు, అర్చనా మూర్తులు, అళ్వారులు, అండాళ్‌ అమ్మవార్ల ఉత్సవమూర్తులను తీసుకుని శోభాయాత్ర నిర్వహించారు. తిరువీధులతో ప్రదక్షిణ చేసి మూర్తులను ప్రధానాలయంలోకి తీసుకెళ్లారు. ఈ శోభాయాత్రలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొని, పూజలు చేశారు. 

వేద మంత్రాల మధ్య మహాకుంభ సంప్రోక్షణ
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటనలో ప్రధాన ఘట్టమైన మహాకుంభ సంప్రోక్షణను వేద మంత్రాల మధ్య వైభవంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్, కేసీఆర్‌ మనవడు హిమాన్షు, దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఈవో గీతారెడ్డి, ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌ సాయి ఆచార్యులు విమాన గోపురాల వద్దకు చేరుకున్నారు. తొలుత గర్భాలయంపై ఉన్న విమానగోపురం వద్ద పూజలు చేసి, ఆశీర్వచనం నిర్వహించారు. కేసీఆర్‌కు కంకణధారణ చేసి, సుదర్శన చక్రానికి పూజలు చేయించారు.

అనంతరం దివ్య విమాన రాజగోపురం వద్ద ఉదయం 11:55 గంటలకు శ్రవణ నక్షత్రయుక్త మిథునలగ్న అభిజిత్‌ ముహూర్తంలో మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభించారు. ప్రధానాచార్యులు నల్లంథీఘల్‌ లక్ష్మీనర్సింహాచార్యుల ఆధ్వర్యంలో సువర్ణ సుదర్శన చక్రానికి బంగారు కలశంలో నింపిన పవిత్ర నదీజలాలతో మహాకుంభాభిషేకం (సంప్రోక్షణ) నిర్వహించారు. ఇదే సమయంలో మిగతా గోపురాల వద్ద మంత్రులు కుంభ సంప్రోక్షణ చేశారు. చివరిగా సుదర్శన చక్రం చుట్టూ ప్రదక్షిణలు, హారతి నివేదన పూర్తి చేశారు. 

కుటుంబ సభ్యులతో వీఐపీలు.. 
సీఎం పిలుపు మేరకు యాదాద్రి ఆలయ ఉద్ఘాటన కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. మహాకుంభ సంప్రోక్షణ జరుగుతున్న సమయంలో అందరినీ ప్రధానాలయ ముఖమండపంలో కూర్చో బెట్టారు. అంతా సంప్రదాయ వస్త్రాలు ధరించారు. అర్చకులతో కలిసి భజనలు చేస్తూ నారసింహ జపం చేశారు. గర్భాలయంలో సీఎం కుటుంబ సభ్యుల అనంతరం అంతా దర్శనాలు చేసుకున్నారు. మొత్తంగా పంచారాత్ర ఆగమ శాస్త్రానుసారం ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం సంప్రదాయబద్ధంగా యాదాద్రి ఆలయ ఉద్ఘాటన క్రతువును పూర్తి చేశారు. 

సన్మానాలు చేసిన సీఎం కేసీఆర్‌ 
ఆలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న దేవస్థానం అభివృద్ధి మండలి వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, ఆలయ ధర్మకర్త నర్సింహమూర్తి, ఆర్కిటెక్టులు ఆనంద సాయి, మధుసూదన్, స్థపతులు సుందర రాజన్, ఆనందాచారి వేలు తదితరులను సీఎం, మంత్రులు సన్మానించారు. 

మంత్రులు, వీఐపీల పూజలు.. 
దివ్యవిమాన గోపురం వద్ద సీఎం కేసీఆర్‌ సంప్రోక్షణ పూజలు చేయగా.. తూర్పు రాజగోపురంపై దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు; దక్షిణ రాజగోపురం వద్ద మంత్రి నిరంజన్‌రెడ్డి దంపతులు; పశ్చిమ రాజగోపురం వద్ద మంత్రి జగదీష్‌రెడ్డి దంపతులు; ఉత్తర రాజగోపురం వద్ద మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దంపతులు; పశ్చిమ రాజగోపురం(సప్తతల) వద్ద మంత్రి పువ్వాడ అజయ్‌ దంపతులు; తూర్పు (త్రితల) రాజగోపురం వద్ద మంత్రి గంగుల కమలాకర్‌ దంపతులు; ఆండాళ్‌ అమ్మవారి సన్నిధి వద్ద విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి; గరుడాళ్వార్‌ సన్నిధి వద్ద అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి; ఆంజనేయస్వామి సన్నిధి వద్ద మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి; ఆగ్నేయ ప్రాకార మండపం–2 వద్ద మంత్రి సబితా ఇంద్రారెడ్డి; వాయవ్య ప్రాకార మండ పాల వద్ద మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి; ఈశాన్య ప్రాకార మండపాల వద్ద మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు సంప్రోక్షణ పూజలు చేశారు. 

కిక్కిరిసిన యాదాద్రి 
లక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయ ఉద్ఘాటన, స్వయంభూ దర్శనం పునః ప్రారంభం కోసం వచ్చిన వీఐపీలు, వారి కుటుంబ సభ్యులు, భక్తులతో యాదాద్రి నిండిపోయింది. సోమవారం మొదట సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, వారి కుటుంబ సభ్యులు ఆలయంలో నారసింహుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అధికారులు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాధారణ భక్తులను అనుమతించారు. అప్పటికే యాదగిరిగుట్ట పట్టణ శివార్లలో వేచి ఉన్న వేలాది మంది భక్తులు వరుసకట్టారు. కొండ దిగువన కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించి.. పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి యాదాద్రిపైకి చేరుకున్నారు. సుదూ ర ప్రాంతాల నుంచీ వచ్చిన భక్తులు స్వామి వారి స్వయంభూ విగ్రహాలను దర్శించుకుని తన్మయత్వంలో మునిగిపోయారు. పూర్తి రాతితో నిర్మించిన ఆలయాన్ని సందర్శించి మంత్రముగ్ధులయ్యారు. 

ముగిసిన పంచకుండాత్మక యాగం 
పంచనారసింహుడు కొలువైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. 7 రోజులు కొనసాగిన సప్తాహ్నిక పంచకుండాత్మక సహిత మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలకు ఆచార్యులు 8వ రోజు సోమ వారం రాత్రి ముగింపు పలికారు. మహాకుంభ సంప్రోక్షణ తర్వాత ప్రధానాలయంలో శాంతి కల్యాణం జరిపించారు. వేడుకల్లో ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్‌ లక్ష్మీనరసింహచార్యులు, మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, రంగాచార్యులు పాల్గొన్నారు.

జయజయధ్వానాల మధ్య.. 
మహాకుంభ సంప్రోక్షణ పూర్తయిన అనంతరం సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యులు ప్రధానాలయంలోకి చేరుకున్నారు. ధ్వజ స్తంభానికి, గరుఖ్మంతుడికి పూజలు చేశారు. గర్భాలయం గడపకు సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ పూజ చేశారు. తర్వాత భక్తుల జయజయధ్వానాల మధ్య ఆచార్యులు స్వయంభూ లక్ష్మీనరసింహుడి గర్భాలయం ద్వారాలను తెరిచారు. కేసీఆర్, కుటుంబ సభ్యులు లోనికి వెళ్లి ప్రథమ పూజలు చేశారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదం ఇచ్చారు. సీఎం దంపతులకు ఆలయ ప్రధాన అర్చకుడు నల్లంథీఘల్‌ లక్ష్మీనర్సింహచార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు మహావేద ఆశీర్వచనం ఇచ్చారు. 

మహాకుంభ సంప్రోక్షణ ఇదీ 
నూతనంగా నిర్మించిన ఆలయం, గోపురాలపై ఏర్పాటు చేసిన కలశాలకు పంచారాత్ర ఆగమశాస్త్రం ప్రకారం చేసిన పూజలే మహాకుంభ సంప్రోక్షణ. ఇందుకోసం ఈ నెల 21 నుంచి బాలాలయంలోని యాగశాలలో పంచకుండాత్మక హోమం నిర్వహించారు. బిందెలలో నింపిన పవిత్ర నదీజలాలకు మహామంత్రాలతో ఆవాహన చేశారు. ఆ పవిత్ర జలాలతో ప్రధానాలయ గోపురాలపై కలశాలు, సుదర్శన చక్రానికి మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించారు. పవిత్ర మంత్ర జలాల అభిషేకం, వేద మంత్రోచ్ఛారణలతో ఆలయం పవిత్రమై.. భక్త కోటికి భగవంతుని పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందని ఆచార్యులు తెలిపారు.  

యాదాద్రి సమాచారం 
యాదాద్రీశుడి ప్రధానాలయాన్ని ప్రతిరోజూ ఉదయం 3 గంటలకు తెరుస్తారు. సుప్రభాతం, బిందెతీర్థం, ఆరాధన, బాలభోగం, నిజాభిషేకం, అలంకరణ, సహస్ర నామార్చన పూర్తిచేశాక.. 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సర్వ దర్శనాలు ఉంటాయి. మధ్యలో 8 గంటల నుంచి గంటపాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను అనుమతిస్తారు. మధ్యాహ్నం 12.45 నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వ దర్శనాలు ఉంటాయి. మధ్యలో 4 నుంచి 5 గంటల వరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను అనుమతిస్తారు. రాత్రి 7 గంటల నుంచి 8.15 వరకు పూజలు జరుగుతాయి. తర్వాత 9.15 గంటల వరకు మళ్లీ సర్వ దర్శనాలు ఉంటాయి. తర్వాత రాత్రి నివేదన, శయనోత్సవం, ద్వార బంధనం నిర్వహిస్తారు. 

విశేష పూజలివీ.. : ప్రతిరోజు ఉదయం 6.30 నుంచి రాత్రి 9.15 గంటల వరకు సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనం కొనసాగుతాయి. ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు శ్రీసుదర్శన నారసింహ హోమం, 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు శ్రీస్వామి వారి వెండి మొక్కు జోడు సేవలు, 6.45 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్బార్‌ సేవ ఉంటాయి. ఇక క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ప్రతి మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి 11గంటల వరకు ఆకుపూజ.. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆండాళ్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవ నిర్వహిస్తారు.

శోభాయాత్ర నుంచి భోజనం దాకా.. 
యాదాద్రిలో 5 గంటలకు పైగా గడిపిన సీఎం కేసీఆర్‌ 
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో ఆసాంతం సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఉదయం 9.20 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి హెలికాప్టర్‌లో టెంపుల్‌సిటీకి చేరుకున్న ఆయన.. 9.32 గంటలకు మొదటి ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి వచ్చారు.  కేసీఆర్, ఆయన కుటుంబసభ్యు లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమాలు, పూజల వివరాలివీ.. 

ఉదయం 
►  10.10:    సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో కలిసి శోభాయాత్రలో పాల్గొన్నారు. తూర్పు రాజగోపురం నుంచి ప్రదక్షిణ చేశారు.  
►  10.45:    ఎంపీ సంతోష్, మనవడు హిమాన్షుతో కలిసి కేసీఆర్‌ విమాన గోపురంపైకి ఎక్కారు. 
►  10.50:    శోభాయాత్ర ముగిసింది. అర్చకులు బంగారు కవచ మూర్తులను ప్రధానాలయంలోకి తీసుకెళ్లారు. 
►  11.04:    కేసీఆర్‌ ఆధ్వర్యంలో మహాకుంభ సంప్రోక్షణ పూజలు మొదలుపెట్టారు. 
►  11.22:    విమాన గోపురం వద్ద కేసీఆర్, ఇతరులకు ఆశీర్వచనం చేశారు. 
►  11.27:    మంత్రులు, ప్రజాప్రతినిధులు వారికి కేటాయించిన గోపురాలు, ప్రాకార మండపాల వద్ద సంప్రోక్షణ పూజలు ప్రారంభించారు. 
►  11.32:    ఆచార్యులు సీఎం కేసీఆర్‌కు కంకణధారణ చేసి.. సుదర్శన చక్రానికి పూజలు చేశారు. 
►  11.50:    కేసీఆర్‌ గోత్రనామాలతో పూజలు చేస్తూ మహాకుంభ సంప్రోక్షణ చేసే బంగారు కలశాన్ని ఆయనకు అందించారు. 
►  11.55:    విమాన గోపురానికి ఏర్పాటు చేసిన స్వర్ణ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్‌.. మిగతా గోపురాలకు మంత్రులు ఏకకాలంలో కుంభ సంప్రోక్షణ నిర్వహించారు. 
►  11.58:    సుదర్శన చక్రం చుట్టూ ప్రదక్షిణలు చేసి, హారతి ఇచ్చారు.

పుష్కరిణిలో పుణ్యస్నానాలు కల్యాణకట్టలో తలనీలాలు..
యాదగిరిగుట్ట: లక్ష్మీనర్సింహుడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అధునాతనంగా నిర్మించిన కొత్త కల్యాణకట్టను చూసి ఆనందం వ్యక్తం చేశారు. అధికారులు తిరుమల తరహాలో భక్తులకు టోకెన్లు ఇచ్చి.. తలనీలాలు తీసేచోటికి పంపా రు. దర్శనానికి వచ్చిన భక్తులంతా కొండ కింద నిర్మించిన లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు అచరించారు. పుష్కరిణి మధ్య ఏర్పాటు చేసిన దేవతామూర్తులకు పూజలు చేశారు. అనంతరం దర్శనం కోసం కొండపైకి వెళ్లారు. 

ప్రత్యేక బందోబస్తు మధ్య..: యాదాద్రి ప్రధానాలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఇది మహాద్భుతం 
యాదగిరిగుట్ట, రాజాపేట, మోటకొండూర్‌: యాదాద్రి ఆలయం తెలంగాణకే మకుటాయమానమని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో పాలుపంచుకోవటం ఆనందదాయకమని చెప్పా రు. యాదాద్రి ఆలయం అద్భుతమని, పునః ప్రారంభ క్రతువులో పాల్గొనడం సంతోషంగా ఉందని మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత చెప్పారు. 

పువ్వాడపై తేనెటీగల దాడి 
యాదాద్రి ఆలయ పంచతల గోపురంపై పూజా క్రతువులో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్, వేద పండితులపై ఉదయం 11:45 సమయంలో తేనెటీగలు దాడి చేశాయి. అలాగే సంప్రోక్షణ పూజా కార్యక్రమాన్ని కొనసాగించిన ఆయన.. అనంతరం హైదరాబాద్‌ వెళ్లి ప్రాథమిక చికిత్స పొందారు.

ఈ ఆనందంచెప్పలేనిది
మేం గత 30 ఏళ్లుగా ప్రతినెలా యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటాం. ఆలయ పునః నిర్మాణం చేపట్టి స్వయంభూ దర్శనం నిలిపివేయడంతో
ఆరేళ్లుగా బాలాలయంలో దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు తొలిరోజే స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆలయం వైభవోపేతంగా రూపుదిద్దుకుంది. వైకుంఠంలో స్వామి వారిని దర్శించుకున్న అనుభూతి కలిగింది.    –భాగ్యలక్ష్మి, సికింద్రాబాద్‌ 

మేం ఒకరోజు ముందే యాదాద్రికి వచ్చి వేచి ఉన్నాం. తొలిరోజు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనంతో మనసు పులకరించింది. నల్లరాతి కట్టడం, శిల్పాలు, అలంకరణ కనువిందుగా ఉన్నాయి. ఆలయం మరో తిరుపతిలా ఎంతో బాగుంది.     – వెంకటమ్మ, పరిగి 

నాలుగేళ్ల కింద స్వామివారిని బాలాలయంలో దర్శించుకున్నాం. ఇప్పుడు నూతన ఆలయం, స్వయంభూ దర్శనం మొదలవడంతో కుటుంబ సమేతంగా వచ్చాం. సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ బస్సులో కొండపైకి చేరుకున్నాం. 30 నిమిషాల్లో స్వామివారి దర్శనం లభించింది. ఇది ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆలయ నిర్మాణం చాలా బాగుంది.     – లక్ష్మి, సంగారెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement