
ట్రాన్స్‌జెండర్లకూ డ్రెస్‌కోడ్
ట్రాన్స్‌జెండర్లకు ప్రపంచంలో మొట్టమొదటి సారిగా థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ యూనివర్సిటీ డ్రెస్ కోడ్‌ను ప్రకటించింది. ఫ్రెషర్స్‌లో ఆడవారికి, మగవారికి ప్రతిఏటా డ్రెస్ కోడ్‌ను ప్రకటించే ఆనవాయితీ గల ఈ యూనివర్సిటీ ఈసారి తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ల (లింగ మార్పిడి చేసుకున్నవారు)కు కూడా డ్రెస్ కోడ్ ప్రకటించడం విశేషం. విద్యార్థినులకు బటన్లు కలిగిన షార్ట్ స్లీవ్, డార్క్ కలర్ కలిగిన లాంగ్ స్కర్ట్‌ను, విద్యార్థులకు వైట్ షర్ట్, నెక్ టై, బ్లాక్ ట్రౌజర్లను డ్రెస్ కోడ్‌గా నిర్ణయించింది. వీటిలో ఏ డ్రెస్‌నైనా ధరించే అవకాశాన్ని ట్రాన్స్‌జెండర్లకు కల్పించింది.
'ఫ్రెష్యీ ఛాయిస్' పేరిట యూనివర్సిటీ ఫేస్‌బుక్ పేజీలో డ్రెస్ కోడ్‌ను పోస్ట్ చేయగా, ప్రపంచం నలుమూలల నుంచి లైక్స్, కామెంట్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ముందుగా 'స్కూల్ ఆఫ్ ఫైన్ అండ్ అప్లైడ్ ఆర్ట్స్' కళాశాలలో ట్రాన్స్‌జెండర్లకు డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తున్నామని, వచ్చే స్పందనను బట్టి మిగతా కళాశాలల్లో కూడా ఈ కోడ్‌ను అమలు చేస్తామని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. మూడో జెండర్‌ను కూడా గుర్తిస్తూ గత జనవరిలో థాయ్ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన నేపథ్యంలో యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.