
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిపరమైన ఆంక్షలతో దేశీయంగా నిల్చిపోయిన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైన తర్వాత సిబ్బంది డ్రెస్ కోడ్‌లో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. వారు కూడా ముఖానికి మాస్కులు, ఫేస్ షీల్డులు, గౌన్లు వంటి వ్యక్తిగత భద్రత సాధనాలను (పీపీఈ) ఉపయోగించనున్నారు. విధుల నిర్వహణలో ప్రయాణికులకు దగ్గరగా తిరిగే సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఆహార్యాన్ని అమలు చేయాలని ఇండిగో, ఎయిరిండియా, విస్తార, ఎయిర్‌ఏషియా ఇండియా తదితర సంస్థలు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 27న ఫిలిప్పీన్స్ ఎయిర్‌ఏషియా ఆవిష్కరించిన డ్రెస్ కోడ్ తరహాలోనే ఇది కూడా ఉండవచ్చని వివరించాయి.
ఫేస్ షీల్డు, ఫేస్ మాస్కుతో పాటు శరీరాన్ని పూర్తిగా కప్పేసే ఎరుపు రంగు ఫుల్ బాడీ సూట్‌ను ఫిలిప్పీన్స్ ఎయిర్‌ఏషియా రూపొందించింది. ఎయిర్‌ఏషియా తమ సిబ్బంది.. పీపీఈ కిట్ కింద ఫేస్ షీల్డులు, మాస్కులు, గౌన్లు, ఆప్రాన్స్, గ్లౌజులు ధరించవచ్చని తెలుస్తోంది. విస్తార సంస్థ సిబ్బంది కొత్త డ్రెస్ కోడ్‌లో ల్యాప్ గౌన్, ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డులు ఉండవచ్చని సమాచారం. అటు ఇండిగో సిబ్బంది గౌను లేదా బాడీ సూట్‌తో పాటు సర్జికల్ మాస్కు, గ్లౌజులు, ఫేస్ షీల్డు ధరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. ఎయిరిండియా ఉద్యోగులు కూడా బాడీ సూట్, గ్లౌజులు, ఫేస్ షీల్డు, ఫేస్ మాస్క్ ఉపయోగించనున్నారని తెలిపాయి.