
‘కట్టు’ తప్పకుండా ఆట
మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడల్లో ముందు గుర్తు చేసుకోవాల్సింది ఇరాన్ మహిళలను. వీళ్లకు అనేక కట్టుబాట్లు ఉంటాయి. ఏ క్రీడలో పాల్గొన్నా ఏ మాత్రం శరీరం కనిపించకుండా బట్టలు ధరించాలి. స్విమ్మింగ్ పోటీల్లోనూ
ఇరాన్‌లో ప్రతి ఒక్కరూ సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. ఇంట్లో నుంచి బయటకెళ్లినప్పుడు మహిళలు హిజాబ్(బురఖా) ధరించినట్లే.. క్రీడల్లోనూ క్రీడాకారిణులు అదే బాటలో నడుస్తారు. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్నప్పుడు మహిళా క్రీడాకారిణుల వేషధారణ మిగతా దేశాల వారికి విభిన్నంగా కనిపించినప్పటికీ.. వారికి మాత్రం అదంతా మామూలు విషయమే. తమ దేశ కట్టుబాట్లను కచ్చితంగా పాటిస్తామని వారు ప్రతి ఇంటర్వ్యూలోనూ కుండ బద్దలు కొట్టేస్తారు.
2005లో హైదరాబాద్ ఆసియా కబడ్డీ పోటీలకు ఆతిథ్యమిచ్చింది. ఈ పోటీల్లో ఇరాన్ మహిళల జట్టు తమ డ్రెస్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎప్పట్లాగే ఇరాన్ నిబంధనల ప్రకారం హిజాబ్ ధరించి పోటీల్లో బరిలోకి దిగారు. మిగిలిన జట్ల క్రీడాకారిణులు నిక్కర్లతో ఆడితే.. ఇరాన్ మహిళల జట్టు మాత్రం హిజాబ్‌తోనే మ్యాచ్ ఆడారు. తమ ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. వారి వేషధారణ అభిమానులకు విచిత్రంగా అనిపించినప్పటికీ.. ఇలాగే బరిలోకి దిగడం తమకెంతో ఇష్టమని చెబుతుంటారు.
స్విమ్మింగ్‌లోనూ...
మహిళలు పాల్గొనే ఏ క్రీడాంశమైనా హిజాబ్ తప్పనిసరి. కబడ్డీ నుంచి మొదలుకుని ఫుట్‌బాల్ వరకు ప్రతి ఆటలోనూ హిజాబ్ ధరించే పోటీల్లో పాల్గొంటారు. చివరికి స్విమ్మింగ్‌లోనూ హిజాబ్ తప్పనిసరి. అది స్వదేశంలో అయినా సరే, విదేశాల్లో అయినా సరే.. నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇక క్రీడాకారిణులకు శిక్షణ కూడా మహిళలే ఇస్తారు. ఒకవేళ మహిళా కోచ్‌లు అందుబాటులో లేకపోతే వారిని ఆ క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతించరంటే నిబం ధనలు ఎంత కచ్చితంగా పాటిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో కొందరు క్రీడాకారిణులు తమ అసంతృప్తిని వెళ్లగక్కిన సందర్భాలు ఉన్నాయి. అయితే చివరికి వారు కట్టుబాట్ల విషయంలో బద్దులుగానే ఉంటారు.
డ్రెస్ కోడ్ పాటించకుంటే వేటే...
కొన్ని దేశాల్లో మహిళలు క్రీడల్లో బరిలోకి దిగుతున్నప్పుడు సాధారణంగా డ్రెస్ కోడ్ గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే ఇరాన్‌లో మాత్రం క్రీడాకారిణులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్‌ను పాటించాల్సి ఉంటుంది. లేకుంటే జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు వారిని అనుమతించరు. క్రీడాకారిణులు లాంగ్ స్లీవ్ బ్యాగి టాప్, ట్రాక్ సూట్ బాటమ్స్, హెడ్ స్క్రాప్స్‌తో బరిలోకి దిగుతారు. ఈ డ్రెస్‌ను హిజాబ్‌గా పరిగణిస్తారు. క్రీడ ఏదైనా ఇరాన్ మహిళలు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ను పాటిస్తారు. నిజానికి 35 ఏళ్ల కిందటి వరకు క్రీడాకారిణులు వేసుకునే స్పోర్ట్స్ డ్రెస్‌పై పెద్దగా పట్టింపులు ఉండేవి కావు. అందరిలాగే స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని ఆడేవారు.. అయితే ఇరాన్ విప్లవం తర్వాత 1979 నుంచి ఇరాన్ ప్రభుత్వం మహిళల డ్రెస్ విషయంలో నియమ నిబంధనలు విధించింది. అప్పటి నుంచి నిబంధనల్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిని జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో ఆడకుండా నిషేధం విధిస్తారు.