టెహ్రాన్: మహ్‌సా అమినీ (22) అనే కుర్దిష్ యువతి మరణంతో ఇరాన్ నెలలుగా కొనసాగుతున్న హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గింది. న్యాయవ్యవస్థతో సంబంధం లేని నైతిక పోలీస్ వ్యవస్థను రద్దు చేసింది. ఒక మత కార్యక్రమంలో ఓ వ్యక్తి ప్రశ్నకు బదులుగా ఇరాన్ అటార్నీ జనరల్ ఈ మేరకు తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇరాన్ గణతంత్ర, ఇస్లామిక్ పునాదులు రాజ్యాంగబద్ధంగా స్థిరంగా ఉన్నాయని, అయితే అమలు విధానాలు సరళంగా ఉంటాయని అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ శనివారం వ్యాఖ్యానించారు.
హిజాబ్ సరిగా ధరించలేదని అమినిని నైతిక పోలీసులు సెప్టెంబర్ 16న అరెస్ట్ చేయడం, మూడు రోజుల తర్వాత ఆమె కస్టడీలోనే మరణించడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేగాయి. మహిళలకు కఠినమైన డ్రెస్ కోడ్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు రాజుకున్నాయి. బలగాలు కాల్పుల్లో వందలాదిగా చనిపోయారు. అమిని పేరు, ఫొటో ప్రదర్శిస్తూ ఇరాన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనల్లో పాల్గొన్న మహిళలు హిజాబ్‌ను కాల్చివేయడం, బహిరంగంగా జుత్తును కత్తిరించుకోవడం చేశారు.
నైతిక పోలీసింగ్ ఇలా మొదలైంది...
అతివాద అధ్యక్షుడు అహ్మదీ నెజాది హయాంలో 2006లో గష్త్–ఇ–ఇర్షాద్ (మార్గదర్శక పహారా) పేరుతో ఈ వ్యవస్థ ఏర్పాటైంది. ఇందులో భాగంగా మహిళలకు హిజాబ్ ధారణ తప్పనిసరి చేశారు. 15 ఏళ్ల క్రితం దాకా నైతిక పోలీసులు ముందుగా హెచ్చరించి, అయినా ఖాతరు చేయని మహిళలను అరెస్ట్ చేసేవారు. ఈ ప్రత్యేక బలగాల పాత్రపై మొదట్నుంచీ వివాదాలు నడుస్తున్నాయి. ఇరాన్ అధ్యక్షులుగా చేసిన వారిలోనే దీనిపై భిన్నాభిప్రాయాలుండేవి. మహిళల దుస్తుల నిబంధనలు కూడా మారుతూ వచ్చాయి. ఆధునిక భావాలున్న అధ్యక్షుడు రౌహానీ హయాంలో మహిళలు బిగుతైన జీన్స్, రంగురంగుల హిజాబ్ ధరించే వీలు కల్పించారు. కానీ సంప్రదాయ భావాలున్న రైసి ఈ ఏడాది జూలైలో పగ్గాలు చేపట్టాక నిబంధనలు కఠినతరమయ్యాయి. అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి చేశారు.
ఇరాన్‌లో ‘నైతిక పోలీస్’ రద్దు
Published Mon, Dec 5 2022 5:42 AM | Last Updated on Mon, Dec 5 2022 5:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment