మహసా అమీనీ రెండో వర్ధంతి సందర్భంగా ఇరాన్ వీధుల్లో మహిళల విహారం
జైల్లో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన మహిళా ఖైదీలు
‘‘గుమ్మానికి పరదా కట్టినట్టే అమ్మ ముఖానికి ‘నఖాబ్’ కట్టారు’’ అంటూ ముస్లిం మహిళల జీవితాల్లోని దుఃఖాన్ని వినిపించారో కవయిత్రి. దుఃఖమో.. సంతోషమో.. హిజాబ్ చాటున దాచేది లేదని ఇరాన్ మహిళలు ఇప్పుడు తేల్చి చెబుతున్నారు. సోమవారం ఇరాన్‌లో పలువురు హిజాబ్‌లను తొలగించి స్వేచ్ఛగా వీధుల్లో సంచరించారు.
ఇస్లామిక్ డ్రెస్‌కోడ్‌ను ధిక్కరించారనే కారణంతో 2022లో కుర్దిష్ మహిళ అయిన మహసా అమీనీని ఇరాన్ పోలీసులు అరెస్టు చేయడం, తరువాత ఆమె పోలీస్ కస్టడీలో మరణించడం తెలిసిందే. అయితే మహసా అమీనీ రెండో వర్ధంతి సందర్భంగా స్మారక సభను నిర్వహించాలని తల్లిదండ్రులు భావించగా.. పోలీసులు అందుకు అనుమతిని నిరాకరించారు. అంతేకాదు ఆమె తల్లిదండ్రులను బలవంతంగా గృహ నిర్బంధం చేశారు.
అమీనీని ఖననం చేసిన సఖెజ్ నగరంలోని స్మశాన వాటికను సైతం మూసేశారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఇరాన్ మహిళలు మాత్రం ఆమెను స్మరించుకున్నారు. దేశ రాజధాని టెహ్రాన్ వీధుల్లో ‘జిన్.. జియాన్.. ఆజాదీ’(స్త్రీ.. జీవితం.. స్వేచ్ఛ) నినాదాలు చేశారు.
ఇక టెహ్రాన్‌లోని ఏవీఎన్ జైలులోని పలువురు మహిళా ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మహిళలతోనే తామూ ఉన్నామని చెబుతూ 34 మంది జైలు ఖైదీలునిరాహార దీక్ష చేశారు. వీరిలో ఇరాన్ ఉద్యమకారులు నర్గీస్ మొహమ్మదీ, వెరిషెహ్ మొరాది, మహబూబ్ రెజాయ్, పరివాష్ ముస్లి కూడా ఉన్నారు.
తీవ్రమైన అణచివేత..
1979లో కొత్త ప్రభుత్వం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పాటయ్యాక ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖొమేనీ ఆవిర్భవించారు. ఇస్లాం మత విలువలను తిరిగి అమల్లోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా మహిళలకు హక్కులను కల్పించిన కుటుంబ రక్షణ చట్టాన్ని రద్దు చేశారు. నాటి నుంచి ఇస్లాం డ్రెస్‌కోడ్ పాటించని మహిళలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ధిక్కరించిన మహిళలను గాయపరిచిన, జరిమానాలు విధించిన ఘటనలు అనేకం.
మహిళలపై నిరంతరం కెమెరాల నిఘా కొనసాగుతోంది. 2024 టెహ్రాన్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో మహిళలను పర్యవేక్షించడానికి ఏరియల్ డ్రోన్లను కూడా ఉపయోగించారంటే ఎంతటి నిఘా ఉందో అర్థం చేసుకోవచ్చు. హిజాబ్‌ను తిరస్కరిస్తున్న మహిళల సంఖ్య పెరగడాన్ని ప్రభుత్వం గుర్తించకపోగా.. అణచివేత చర్యలకు పాల్పడుతోంది.
ఎవరీ మహసా అమీనీ ?
2022లో ఇరాన్‌లో హిజాబ్ నియమాలను ఉల్లంఘించారనే నెపంతో సకెజ్ నగరానికి చెందిన కుర్దిష్ మహిళ 22 ఏళ్ల మహసా అమీనీని ఇరాన్ మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉన్న ఆమెను తీవ్రంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయి, కొద్దిసేపటికే కోమాలోకి వెళ్లిపోయారు. మూడు రోజుల తరువాత ఆమె ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. కూతురును చూడటానికి అమీనీ తల్లిదండ్రులను కూడా అనుమతించలేదు.
శవ పంచనామా నివేదిక అడిగినా నిరాకరించారు. మహసా అమీనీకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అరెస్టు తరువాత ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని పోలీసులు చెప్పారు. డాక్టర్ కావాలని కలలు కన్న యువతి.. మరో వారం రోజుల్లో యూనివర్సిటీకి వెళ్లే ముందు వారం రోజులు తల్లిదండ్రులతో ఉందామని టెహ్రాన్‌కు వచ్చిన అమీనీ.. పోలీసుల చిత్రహింసలతో ప్రాణాలొదిలింది.
Comments
Please login to add a commentAdd a comment