Kurdish Woman
-
Mahsa Amini: హిజాబ్‌ను ధిక్కరించి తలెత్తుకుని...
‘‘గుమ్మానికి పరదా కట్టినట్టే అమ్మ ముఖానికి ‘నఖాబ్’ కట్టారు’’ అంటూ ముస్లిం మహిళల జీవితాల్లోని దుఃఖాన్ని వినిపించారో కవయిత్రి. దుఃఖమో.. సంతోషమో.. హిజాబ్ చాటున దాచేది లేదని ఇరాన్ మహిళలు ఇప్పుడు తేల్చి చెబుతున్నారు. సోమవారం ఇరాన్లో పలువురు హిజాబ్‌లను తొలగించి స్వేచ్ఛగా వీధుల్లో సంచరించారు. ఇస్లామిక్ డ్రెస్‌కోడ్‌ను ధిక్కరించారనే కారణంతో 2022లో కుర్దిష్ మహిళ అయిన మహసా అమీనీని ఇరాన్ పోలీసులు అరెస్టు చేయడం, తరువాత ఆమె పోలీస్ కస్టడీలో మరణించడం తెలిసిందే. అయితే మహసా అమీనీ రెండో వర్ధంతి సందర్భంగా స్మారక సభను నిర్వహించాలని తల్లిదండ్రులు భావించగా.. పోలీసులు అందుకు అనుమతిని నిరాకరించారు. అంతేకాదు ఆమె తల్లిదండ్రులను బలవంతంగా గృహ నిర్బంధం చేశారు. అమీనీని ఖననం చేసిన సఖెజ్ నగరంలోని స్మశాన వాటికను సైతం మూసేశారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఇరాన్ మహిళలు మాత్రం ఆమెను స్మరించుకున్నారు. దేశ రాజధాని టెహ్రాన్ వీధుల్లో ‘జిన్.. జియాన్.. ఆజాదీ’(స్త్రీ.. జీవితం.. స్వేచ్ఛ) నినాదాలు చేశారు. ఇక టెహ్రాన్‌లోని ఏవీఎన్ జైలులోని పలువురు మహిళా ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మహిళలతోనే తామూ ఉన్నామని చెబుతూ 34 మంది జైలు ఖైదీలునిరాహార దీక్ష చేశారు. వీరిలో ఇరాన్ ఉద్యమకారులు నర్గీస్ మొహమ్మదీ, వెరిషెహ్ మొరాది, మహబూబ్ రెజాయ్, పరివాష్ ముస్లి కూడా ఉన్నారు. తీవ్రమైన అణచివేత.. 1979లో కొత్త ప్రభుత్వం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పాటయ్యాక ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖొమేనీ ఆవిర్భవించారు. ఇస్లాం మత విలువలను తిరిగి అమల్లోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా మహిళలకు హక్కులను కల్పించిన కుటుంబ రక్షణ చట్టాన్ని రద్దు చేశారు. నాటి నుంచి ఇస్లాం డ్రెస్‌కోడ్ పాటించని మహిళలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ధిక్కరించిన మహిళలను గాయపరిచిన, జరిమానాలు విధించిన ఘటనలు అనేకం. మహిళలపై నిరంతరం కెమెరాల నిఘా కొనసాగుతోంది. 2024 టెహ్రాన్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో మహిళలను పర్యవేక్షించడానికి ఏరియల్ డ్రోన్లను కూడా ఉపయోగించారంటే ఎంతటి నిఘా ఉందో అర్థం చేసుకోవచ్చు. హిజాబ్‌ను తిరస్కరిస్తున్న మహిళల సంఖ్య పెరగడాన్ని ప్రభుత్వం గుర్తించకపోగా.. అణచివేత చర్యలకు పాల్పడుతోంది.ఎవరీ మహసా అమీనీ ?2022లో ఇరాన్లో హిజాబ్ నియమాలను ఉల్లంఘించారనే నెపంతో సకెజ్ నగరానికి చెందిన కుర్దిష్ మహిళ 22 ఏళ్ల మహసా అమీనీని ఇరాన్ మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉన్న ఆమెను తీవ్రంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయి, కొద్దిసేపటికే కోమాలోకి వెళ్లిపోయారు. మూడు రోజుల తరువాత ఆమె ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. కూతురును చూడటానికి అమీనీ తల్లిదండ్రులను కూడా అనుమతించలేదు. శవ పంచనామా నివేదిక అడిగినా నిరాకరించారు. మహసా అమీనీకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అరెస్టు తరువాత ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని పోలీసులు చెప్పారు. డాక్టర్ కావాలని కలలు కన్న యువతి.. మరో వారం రోజుల్లో యూనివర్సిటీకి వెళ్లే ముందు వారం రోజులు తల్లిదండ్రులతో ఉందామని టెహ్రాన్‌కు వచ్చిన అమీనీ.. పోలీసుల చిత్రహింసలతో ప్రాణాలొదిలింది. -
మహ్సా అమినికి
స్ట్రాస్‌బర్గ్(ఫ్రాన్సు): గత ఏడాది ఇరాన్ పోలీస్ కస్టడీలో మృతి చెందిన కుర్దిష్–ఇరాన్ మహిళ మహ్సా అమిని(22)కి యూరోపియన్ యూనియన్ అత్యున్నత మానవ హక్కుల పురస్కారం ప్రకటించింది. మానవహక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ కోసం పోరాడే వారికి సఖరోవ్ పురస్కారాన్ని యూరోపియన్ యూనియన్ ఏటా ప్రకటిస్తోంది. డిసెంబర్ 13న జరిగే కార్యక్రమంలో మహ్సా అమిని కుటుంబీకులకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. హిజాబ్ ధరించలేదనే కారణంతో మహ్సా అమినిని నైతిక విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉండగానే ఆమె గత ఏడాది సెప్టెంబర్ 16న మృతి చెందారు. ఇది ప్రభుత్వ హత్యేనంటూ దేశవ్యాప్తంగా కొన్ని నెలలపాటు తీవ్ర ఆందోళనలు కొనసాగాయి. ప్రభుత్వం వాటిని బలప్రయోగంతో అణచివేసింది. గత ఏడాది సఖరోవ్ పురస్కారాన్ని రష్యా దురాక్రమ ణను ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్ పౌరులకు ప్రకటించారు. ఈ అవార్డును ఒకప్పటి సోవియెట్ యూనియన్ అసమ్మతి వాది ఆండ్రీ సఖరోవ్ పేరిట 1988లో నెలకొల్పారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సఖరోవ్ 1989లో మరణించారు -
ఇరాన్లో ‘నైతిక పోలీస్’ రద్దు
టెహ్రాన్: మహ్సా అమినీ (22) అనే కుర్దిష్ యువతి మరణంతో ఇరాన్ నెలలుగా కొనసాగుతున్న హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గింది. న్యాయవ్యవస్థతో సంబంధం లేని నైతిక పోలీస్ వ్యవస్థను రద్దు చేసింది. ఒక మత కార్యక్రమంలో ఓ వ్యక్తి ప్రశ్నకు బదులుగా ఇరాన్ అటార్నీ జనరల్ ఈ మేరకు తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇరాన్ గణతంత్ర, ఇస్లామిక్ పునాదులు రాజ్యాంగబద్ధంగా స్థిరంగా ఉన్నాయని, అయితే అమలు విధానాలు సరళంగా ఉంటాయని అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ శనివారం వ్యాఖ్యానించారు. హిజాబ్ సరిగా ధరించలేదని అమినిని నైతిక పోలీసులు సెప్టెంబర్ 16న అరెస్ట్ చేయడం, మూడు రోజుల తర్వాత ఆమె కస్టడీలోనే మరణించడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేగాయి. మహిళలకు కఠినమైన డ్రెస్ కోడ్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు రాజుకున్నాయి. బలగాలు కాల్పుల్లో వందలాదిగా చనిపోయారు. అమిని పేరు, ఫొటో ప్రదర్శిస్తూ ఇరాన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనల్లో పాల్గొన్న మహిళలు హిజాబ్‌ను కాల్చివేయడం, బహిరంగంగా జుత్తును కత్తిరించుకోవడం చేశారు. నైతిక పోలీసింగ్ ఇలా మొదలైంది... అతివాద అధ్యక్షుడు అహ్మదీ నెజాది హయాంలో 2006లో గష్త్–ఇ–ఇర్షాద్ (మార్గదర్శక పహారా) పేరుతో ఈ వ్యవస్థ ఏర్పాటైంది. ఇందులో భాగంగా మహిళలకు హిజాబ్ ధారణ తప్పనిసరి చేశారు. 15 ఏళ్ల క్రితం దాకా నైతిక పోలీసులు ముందుగా హెచ్చరించి, అయినా ఖాతరు చేయని మహిళలను అరెస్ట్ చేసేవారు. ఈ ప్రత్యేక బలగాల పాత్రపై మొదట్నుంచీ వివాదాలు నడుస్తున్నాయి. ఇరాన్ అధ్యక్షులుగా చేసిన వారిలోనే దీనిపై భిన్నాభిప్రాయాలుండేవి. మహిళల దుస్తుల నిబంధనలు కూడా మారుతూ వచ్చాయి. ఆధునిక భావాలున్న అధ్యక్షుడు రౌహానీ హయాంలో మహిళలు బిగుతైన జీన్స్, రంగురంగుల హిజాబ్ ధరించే వీలు కల్పించారు. కానీ సంప్రదాయ భావాలున్న రైసి ఈ ఏడాది జూలైలో పగ్గాలు చేపట్టాక నిబంధనలు కఠినతరమయ్యాయి. అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి చేశారు. -
‘ఆమెను చంపేసినవారికి మిలియన్ డాలర్లిస్తాం’
లండన్: కుర్దీష్-దానిష్ మహిళను చంపేసే వారికి తాము మిలియన్ డాలర్లు ఇస్తామంటూ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. కనీసం ఆమె జాడ అయినా తమకు తెలియజేయాలంటూ కోరింది. యూనివర్సిటీ విద్యను వదిలేసిన జోనా పలానీ (23) అనే కుర్దీష్ మహిళ.. 2014లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నడుంకట్టింది. సిరియా, ఇరాక్‌లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పోరాటానికి దిగి పలువురిని హతం చేసి వార్తల్లోకెక్కింది. ఇది చూసి జీర్ణించుకోలేకపోతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆమెను ఎలాగైనా హత్య చేయాలని కుట్రలు చేస్తున్నారు. అయితే, ఆమె ప్రస్తుతం కోపెన్ హాగన్ జైలులో ఉంది. 2015 జూన్‌లో ఆమెపై ఎక్కడికి వెళ్లొద్దంటూ డెన్మార్క్ విధించిన నిషేధాన్ని అతిక్రమించిందని జైలులో పెట్టారు. రేపటి నుంచి విచారణ మొదలుకానుంది. నిజంగానే ఆమె నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే దాదాపు రెండేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. పలానీకి బెదిరింపులు రావడం ఇది తొలిసారేం కాదు. ‘నేను సైనికురాలిగా పనిచేస్తే డెన్మార్క్, ఇతర దేశాలకు ఎందుకు ప్రమాదమో నాకు అర్దం కావడం లేదు. ఇస్లామిక్ స్టేట్ ను డెన్మార్క్ కూడా అంతమొందించాలని అనుకుంటుంది కదా’ అంటూ ఆమె తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. పాలిటిక్స్ లో డిగ్రీ చదువుతున్న జోనా మధ్యలోనే చదువు మానేసి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు కుర్దీష్ సేనల్లో చేరింది.