టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద మహిళల ఆందోళన దృశ్యం
ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. వారం రోజుల క్రితం 22 ఏళ్ల యువతి మోరల్ పోలీసుల కస్టడీలోనే ప్రాణాలు కోల్పోవడంతో యువతరం భగ్గుమంది. లక్షలాది మంది అమ్మాయిలు రోడ్డెక్కి జుట్టు కత్తిరించుకుంటూ, హిజాబ్‌లను ఇక ధరించే ప్రసక్తే లేదని తగులబెడుతున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. కర్ణాటకలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడం మతపరంగా తమ హక్కు అని, వాటిని ధరించే విద్యాసంస్థలకు వస్తామని డిమాండ్ చేస్తూ ఉంటే, ఇరాన్‌లో పూర్తిగా భిన్నమైన వాతావరణం నెలకొంది.
పోలీసు కస్టడీలో ఏం జరిగింది ?
కుర్దిష్ ప్రాంతంలోని సాకేజ్ నగరానికి చెందిన 22 ఏళ్ల వయసున్న మహస అమిని టెహ్రాన్‌కు వచ్చింది. హిజాబ్ సరిగా ధరించలేదన్న కారణంతో సెప్టెంబర్ 13న మోరల్ పోలీసులు మెట్రోస్టేషన్ బయట ఆమెని అదుపులోనికి తీసుకున్నారు. పోలీసులు కొట్టే దెబ్బలకు తాళలేక నిర్బంధ కేంద్రంలో కోమాలోకి వెళ్లిపోయిన అమిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 15వ తేదీన ప్రాణాలు కోల్పోయింది. వ్యాన్‌లోకి ఎక్కించేటప్పుడే మహిళా పోలీసులు ఆమెను చితకబాదుతూ కనిపించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అయితే అమిని అప్పటికే అనారోగ్యంతో ఉందని గుండె పోటుతో మరణించిందని పోలీసుల వాదనగా ఉంది. పోలీసుల వాదనను ఆమె కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. తమ అమ్మాయికి ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేవని వారు చెబుతున్నారు. ఇటీవల కాలంలో జరిగిన అరెస్ట్‌ల్లో అమ్మాయిల ముఖం మీద గట్టిగా కొడుతూ, లాఠీలు ఝుళిపిస్తూ, వారిని వ్యాన్‌లలోకి తోసేస్తున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయంటూ ఐక్యరాజ్యసమితి హక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అమిని మరణానికి గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేసింది.
మహిళల్ని ఎలా చూస్తారు ?
ఇరాన్‌లో మహిళలు చదువుకోవడానికి, ఉద్యోగాలు చెయ్యడానికి ఎన్నో అవకాశాలున్నాయి. ప్రభుత్వ అధికారులుగా కూడా మహిళలున్నారు. కానీ ఇల్లు దాటి బయటకు వచ్చినప్పుడు వస్త్రధారణపై కఠినమైన షరియా చట్టాలను అమలు చేస్తారు. జుట్టు కనిపించకుండా హిజాబ్ ధరించడం, శరీరం కనిపించకుండా పొడవైన వదులుగా ఉండే వస్త్రాలను ధరించాలన్న నిబంధనలున్నాయి. పెళ్లికాని అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరితో ఒకరు కలిసిమెలిసి తిరగకూడదు. 1979లో ఇస్లామిక్ రివల్యూషన్ వచ్చి మత ఛాందసవాదులు అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలపై ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అంతకు ముందు మహిళలు స్వేచ్ఛగా తమకిష్టమైన దుస్తులు ధరించేవారు.
ఇరాన్‌లో అమ్మాయిల వస్త్రధారణపై ఫిర్యాదుల్ని పరిశీలించడానికి 2005లో మోరల్ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇటీవల మోరల్ పోలీసులు అత్యంత దారుణంగా అమ్మాయిల పట్ల వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. 2017లో హసన్ రౌహని అధ్యక్షుడయ్యాక మోరల్ పోలీసుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేశారు. డ్రెస్‌కోడ్ నిబంధనల్ని అమ్మాయిలు ఉల్లంఘించినా వారిని అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది మత ఛాందసవాది అయిన ఇబ్రహీం రైజి అధ్యక్ష పగ్గాలు చేపట్టాక మోరలిటీ పోలీసులు చెలరేగిపోతున్నారు. షరియా చట్టాలపై అవగాహన పెంచాల్సిన పోలీసులు అమ్మాయిలపై జులుం ప్రదర్శిస్తున్నారు.
గతంలోనూ నిరసనలు
ఇరాన్‌లో మహిళలు హిజాబ్ చట్టాలను వ్యతిరేకిస్తూ 2014లో పెద్ద ఎత్తున ఆన్‌లైన్ ఉద్యమం నడిపించారు. మై స్టెల్తీ ఫ్రీడమ్ పేరుతో పెద్ద సంఖ్యలో నెటిజన్ల హిజాబ్‌ను ధరించబోమంటూ ఫోటోలు , వీడియోలు చేశారు. వైట్ వెడ్నస్‌డేస్, గర్ల్సŠ ఆప్ రివల్యూషన్ స్ట్రీట్ అన్న పేరుతో కూడా షరియా చట్టాలకు వ్యతిరేకంగా అమ్మాయిలు ఉద్యమాలు నిర్వహించారు.
నిరసనల్లో ఏడుగురు మృతి
హిజాబ్ వ్యతిరేక నిరసనలతో ఇరాన్‌లో టెహ్రాన్‌తో దాదాపు 15 నగరాలు దద్దరిల్లుతున్నాయి. అమ్మాయిలు, వారికి మద్దతుగా యువకులు కూడా రోడ్లపైకి వస్తున్నారు. పలుచోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసుల కాల్పుల్లో గత ఐదారు రోజుల్లో ఇద్దరు యువకులు సహా ఏడుగురు మరణించారు. నిరసనలు కుర్దిష్ వేర్పాటువాదుల పనేనని ప్రభుత్వం అంటోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment