ముసుగులో గుద్దులాట కొనసాగేనా?
ఒకవైపు ఇజ్రాయెల్... మరోవైపు ఇరాన్, దాని భాగస్వాములు, ప్రచ్ఛన్న ప్రతినిధుల మధ్య సాగుతున్న ముసుగులో గుద్దులాటను ఒక స్థాయి వరకే కొనసాగించవచ్చు. ఏప్రిల్ 13 రాత్రి ఇజ్రాయెల్ వైపుగా కమికేజ్ డ్రోన్లు, క్షిపణులను ఇరాన్ ప్రయోగించడంతో ఆ తెర తొలగింది. తన ‘జియోనిస్ట్ శత్రువు’కు వ్యతిరేకంగా నాలుగున్నర దశాబ్దాల ఆవేశపూరిత వాగాడంబరం సాగించిన ఇరాన్ నిజానికి ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేయడం ఇదే మొదటిసారి. దీంతో లక్ష్మణరేఖను దాటినట్లయింది. ఇజ్రాయెల్ ప్రతీకారదాడి ఈ ప్రాంతాన్ని అగాథంలోకి తోస్తుంది. కానీ నిజంగా పరిస్థితి అలా ఉందా? మనం చాలా కాలంగా చూస్తున్న ముసుగులో గుద్దులాట నాటకంలో సరికొత్త అంకాన్ని చూస్తున్నామా అనేది ప్రశ్న.
ప్రస్తుతం ఏడవ నెలలో అడుగుపెట్టిన గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం, ఏ సమయంలో అయినా విస్తృతమైన ప్రాంతీయ పెనుమంటగా మారే ప్రమాదాన్ని కలిగివుంది. అయితే, పాలస్తీనా సమస్య పరిష్కారానికి మద్దతుగా ఇరాన్ తరచుగా చేసే తీవ్రమైన బెదిరింపుతో కూడిన ఆగ్రహ ప్రకటనలు, ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్న ఒక అంతర్లీన వాస్తవాన్ని దాచిపెడుతున్నాయి. దాని అత్యున్నత నాయకుడైన అయతొల్లా అలీ ఖొమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం వాస్తవానికి చాలా జాగ్రత్తగానూ, ప్రమాదాన్ని కోరి ఆహ్వానించని తత్వంతోనూ సాగుతోంది.
పైగా ముఖాముఖి ఘర్షణకు అది పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దాడి నిరోధం దిశగా ఇరాన్ ఇష్టపడే విధానం ఏమిటంటే, స్నేహపూర్వకంగా లేని దేశాలకు హెచ్చరికలను పంపడానికి తన ప్రతినిధుల (ప్రాక్సీలు) ద్వారా అసమాన యుద్ధంలో దాని అధునా తన సామర్థ్యాలను అమలు చేయడమే. ఒక పాత హిందీ పాటలోలా ‘అర్థమయ్యేవాళ్లకు అర్థమైంది’ అనేది దాని కార్యచరణ సూత్రం.
తెహ్రాన్ లేదా దాని ఖుద్స్ బలగాలను హమాస్ దాడులతో అనుసంధానించడానికి తగిన నిర్ధారిత సాక్ష్యాధారం లేనప్పటికీ, అక్టోబరు 7న హమాస్ చేసిన దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని చాలామంది ఊహించారు. గాజాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తన విధ్వంసక దాడిని ప్రారంభించినప్పుడు, లెబనాన్ నుండి ఇజ్రాయెల్ భూభాగాలను లక్ష్యంగా చేసుకోవడానికి హెజ్బొల్లాకు చెందిన యుద్ధంలో రాటుదేలిపోయిన క్యాడర్లను ఇరాన్ పంపుతుందనే ఆందోళన వాస్తవంగానే ఉండింది. అలాగే, గాజాలోని తన హమాస్ మిత్రపక్షానికి మద్దతు ఇవ్వడానికి ఇరాన్ రెండవ ఫ్రంట్‌ను ప్రారంభించవచ్చని కూడా భావించారు.
ఏమైనప్పటికీ, ఆరు నెలల తరువాత కూడా, ఇరాన్, హెజ్బొల్లా రెండూ ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులోని లెబనాన్‌లో తమ హద్దులలోనే కొనసాగుతూ అసౌకర్యమైన సమ తౌల్యాన్ని కొనసాగించాయి. హెజ్బొల్లా వద్ద ఉన్న మారణాయుధాలు ప్రధానంగా ఉత్తర ఇజ్రాయెల్‌లో ఇప్పుడు జనాభా లేని గ్రామాలు, స్థావరాలకు వ్యతిరేకంగా ఉపయోగించబడ్డాయి. దక్షిణాన కొన్ని మైళ్ల దూరంలో ఉన్న సైనిక, పౌర లక్ష్యాలు హెజ్బొల్లా క్షిపణుల పరిధిలో ఉన్నప్పటికీ వాటిని తాకలేదు. వివాదాన్ని హెజ్బొల్లా తీవ్రతరం చేస్తే లెబనాన్ పై భయంకరంగా స్పందిస్తానని ఇజ్రాయెల్ హెచ్చరించింది. లెబనాన్, సిరియాలోని అగ్రశ్రేణి హెజ్బొల్లా సముదాయం, సైనిక సంపత్తి లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. అయితే హెజ్బొల్లాపై నేరుగా దాడి చేయడానికి ఇజ్రాయెల్ సైతం దూరంగానే ఉంది.
సంవత్సరాల తరబడి ఇరాన్ చే జాగ్రత్తగా పోషించబడిన మరొక ప్రచ్ఛన్న శక్తి యెమెన్‌లోని హౌతీలు. ఎర్ర సముద్రంలోని సముద్ర మార్గాలలో వాణిజ్య నౌకలతో విధ్వంస క్రీడ ఆడటానికి తమ డ్రోన్ లను, క్షిపణులను హౌతీలు సానబెట్టారు. హౌతీల ఆయుధ నిల్వలు, శిక్షణ, వ్యూహాల మూలాల గురించి పెద్ద సందేహమేం లేదు. అయితే రింగ్‌మాస్టర్‌గా ఉండటంలోనే ఇరాన్ సంతృప్తి చెందుతూ, పశ్చిమ దేశాలు తనపట్ల శత్రు వైఖరితో కొనసాగితే విఘాతం కలిగించగలిగే ప్రభావాన్ని నిశ్శబ్దంగా నొక్కిచెప్పింది.
అయితే, ఏప్రిల్ 1న డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యా లయానికి చెందిన కాన్సులర్ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపి... సిరియా, లెబనాన్ లలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్కు చెందిన ఖుద్స్ బలగాల అధిపతి హసన్ మహ్దవీని చంపినప్పుడు ఆ పెళుసైన సమతుల్యత దెబ్బతింది. అత్యంత కచ్చితంగా తలపెట్టిన ఈ దాడి మహ్దవీతో పాటు ఆరుగురు స్వదేశీయులను కూడా మట్టు బెట్టడం, ఇరాన్ ప్రభుత్వాన్ని మండించింది. 2023 డిసెంబర్లో కూడా సిరియాలో ఇరాన్ సీనియర్ కమాండర్ అయిన సయ్యద్ రజీ మౌసావీని ఇజ్రాయెల్ హతమార్చింది. తెహ్రాన్ లోని అతివాదుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరిగింది కాబట్టే నాయకత్వం చేసే తీవ్రమైన ప్రతీకార బెదిరింపులు ఇప్పుడు గట్టి చర్యతో సరిపోలాల్సి ఉంది మరి.
చివరికి ఏప్రిల్ 13న తాను తలపెట్టదలచిన సైనిక చర్య గురించి దాదాపు రెండు వారాల పాటు టెలిగ్రాఫ్ ద్వారా ఇరాన్ ప్రభుత్వం సూచిస్తూనే వచ్చింది. ఈద్–ఉల్–ఫితర్ ఉత్సవాలు ముగిసిన వెంటనే దాడి జరుగనున్నట్లు విçస్తృతమైన అంచనాలు వెలువడ్డాయి. అలాగే జరిగింది కూడా. ఈ ప్రాంతంలోని దేశాలకు 72 గంటల నోటీసు ఇచ్చామనీ, విమానాలను నిలిపివేయడానికీ, వారి పౌరులకు హెచ్చరి కలు జారీ చేయడానికీ భారత్ సహా ఇతర దేశాలకు తగినంత సమయం ఇచ్చామనీ ఇరాన్ ధ్రువీకరించింది.
ఇరాన్ ప్రయోగించిన ‘99 శాతం’ డ్రోన్లు, క్షిపణులను... బలీయమైన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, ఇతర వైమానిక రక్షణ వ్యవస్థలు, అలాగే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్ ్స, ఆఖరికి జోర్డాన్ తో సహా అనేక మిత్రదేశాలు విజయవంతంగా అడ్డుకోవడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. 80కి పైగా డ్రోన్లు, ఆరు బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన ప్రకటన ధ్రువీకరించింది. నెగెవ్ ఎడారిలోని ఒక ఇజ్రాయెలీ వైమానిక స్థావరంలో స్వల్పంగా నష్టం వాటిల్లింది. ప్రస్తుతానికి, ఈ దాడి ఇరాన్ సామర్థ్యాలకు నిజమైన ప్రతిబింబం కాదు లేదా ఇజ్రాయెల్ వైమానిక రక్షణకు నిజమైన పరీక్ష కాదు.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు ఇంతకంటే మంచి సమయం ఉండదు. గత వారాంతం వరకు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి మిత్రదేశాలు గాజాలో జరుగుతున్న అనాలోచిత విధ్వంసం గురించీ, అక్కడి ప్రజల బాధల గురించీ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కానీ ఇరాన్ దాడి జరిగిన కొన్ని గంటల్లోనే, అమెరికా యంత్రాంగం ఇజ్రాయెల్‌కు తన ‘గట్టి మద్దతు’ను పునరుద్ఘాటించింది. భవిష్యత్ ప్రమాదాలను నిరోధించడానికి బ్రిటన్, ఫ్రాన్స్ తమ నావికా సంపత్తిని మోహరించాయి.
శత్రుదుర్భేద్యమైనదని పేరొందిన ఇజ్రాయెల్ రక్షణ శక్తుల ఖ్యాతి అక్టోబరు 7న హమాస్ దాడితో కాస్త దెబ్బ తిన్నప్పటికీ, తాజాగా ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ లను, క్షిపణులను అధిక సంఖ్యలో తటస్థీకరించడంలో విజయం సాధించడం ద్వారా మళ్లీ తన్ను తాను నిలబెట్టుకోగలిగింది. గాజా ప్రస్తుతానికి మీడి యాలో పతాక శీర్షికలకు దూరంగా ఉంది. అంతేకదా! అమెరికా, భారత్, ఇతర దేశాలు తిరుగుదాడి పట్ల సంయమనం పాటించాలనీ, లేకుంటే అది మరింతగా పెరుగుతుందనీ హెచ్చరించడంతో నెత న్యాహు మళ్లీ కేంద్ర స్థానంలోకి చేరుకున్నారు.
తన షాడో–బాక్సర్లు బలంగా పంచ్‌లు విసిరినందున, దాడుల నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నాననీ, అయితే ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగినట్లయితే తాను గట్టిగా ప్రతిస్పందిస్తాననీ ఇరాన్ సూచించింది. ఇక, ఇజ్రాయెల్‌లో రాజకీయ పార్టీలు నిలువునా చీలిపోయాయి. ప్రమాదకరమైన గీతను దాటినందుకు ఇరాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని రైట్ వింగ్ నాయకులు కోరుతున్నారు. ఇజ్రాయెల్ ప్రతిఘటనను ప్రారంభించడానికి ‘వెంటనే కదలాలి’ అని జాతీయ భద్రతా మంత్రి బెన్–గ్విర్ సూచించారు.
మధ్యప్రాచ్యంలో భావితరాలు కూడా గుర్తుంచుకునేలా ఇజ్రాయెల్ గట్టిగా ప్రతిస్పందించాలని ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోత్రిచ్ పిలుపునిచ్చారు. బెన్నీ గాంట్జ్, రక్షణ మంత్రి యోవ్ గాలంట్ వంటి మితవాదులు తీవ్రమైన ప్రతి చర్యకు వ్యతిరేకంగా సలహా ఇచ్చారు. బదులుగా ఇరాన్‌కు వ్యతిరేకంగా వ్యూహాత్మక భాగస్వామ్యం పెంచుకోవాలని సూచించారు. దేశ రాజకీయాలకు వ్యతిరేకంగా అమెరికా పెడుతున్న ఒత్తిడిని బేరీజు వేసుకుని, తీవ్ర పర్యవసానాలు కలిగివుండే ఒక ప్రతిస్పందనను నెతన్యాహు రూపొందించనున్నందున రాబోయే కొద్ది రోజులు కీలకం కానున్నాయి.
నవదీప్ సూరి
వ్యాసకర్త ఈజిప్ట్, యూఏఈల్లో భారత మాజీ రాయబారి
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)