
‘తెలుపు’ అతి అవుతోంది!
డ్రెస్ కోడ్‌పై ఫెడరర్ విమర్శ
లండన్: వింబుల్డన్ నిర్వాహకులు సంప్రదాయం అంటూ ఘనంగా చెప్పుకోవచ్చు గాక... కానీ పైనుంచి కింది వరకు అన్నింటా తెలుపు రంగు మాత్రమే కనిపించాలనే డ్రెస్ నిబంధన ఆటగాళ్లలో అసహనం రేపుతోంది. ఈ విషయంపై గత ఏడాదే విమర్శలు చేసిన స్టార్ ఆటగాడు రోజర్ ఫెడరర్ మరోసారి తన అసంతృప్తిని వెలిబుచ్చాడు. తనకు వింబుల్డన్ అంటే చాలా ఇష్టమని, అయితే ఇప్పుడంతా ‘అతి’గా మారిపోయిందని అతను అన్నాడు. ‘నిబంధనలు అవసరానికి మించి కఠినంగా ఉన్నాయి. మేమంతా తెలుపులోకి మారిపోయాం. ఇంకా తెలుపు, తెలుపు అంటూ ఒకటే నస’ అంటూ కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించాడు.
పాత రోజుల్లో ఎడ్‌బర్గ్, బెకర్ ఫోటోలు చూస్తే రంగులు కనిపిస్తాయని, ఇప్పుడైతే మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారని ఫెడెక్స్ అభిప్రాయ పడ్డాడు. తాజాగా బుధవారం కెనడా ప్లేయర్ బౌచర్డ్ నలుపు ‘బ్రా’ విషయంలో హెచ్చరిక అందుకుంది. రంగుల ఫ్యాషన్‌లను ఇష్టపడే మరో క్రీడాకారిణి బెథానీ మాతెక్... ఫెడరర్ వ్యాఖ్యలకు మద్దతు పలుకుతూనే మోకాళ్ల వరకు తెలుపు సాక్స్ వేసుకొచ్చి మరీ తన నిరసనను ప్రదర్శించింది!
వింబుల్డన్ వద్ద అగ్ని ప్రమాదం!
వింబుల్డన్‌లో బుధవారం మ్యాచ్‌లు ముగిసిన కొద్ది సేపటికి సెంటర్ కోర్టు వద్ద స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో అప్రమత్తమైన అధికారులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను బయటికి పంపించారు. మ్యాచ్‌లు ముగిసినా... మరి కొంత సేపు అక్కడే ఉన్న అభిమానులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరాలో సమస్య కారణంగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలను తరలిస్తున్న సమయంలో పక్కనే ఉన్న మరో హాల్‌లో సెరెనా విలియమ్స్ మీడియా సమావేశం జరుగుతోంది. దీనిని కూడా హడావిడిగా ముగించి అందరినీ ఆల్‌ఇంగ్లండ్ క్లబ్ పరిసరాలనుంచి తరలించారు.