రోజర్ ఫెడరర్
లండన్: సంచలన ఫలితాలతో మొదలైన వింబుల్డన్ రెండో రోజు కూడా అలానే కొనసాగుతుందా అనే రీతిలో సాగింది. 9వ టైటిల్‌పై కన్నేసిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మ్యాచే దీనికి కారణం. తన కెరీర్‌లోనే మొదటిసారి వింబుల్డన్ ఆడుతోన్న దక్షిణాఫ్రికాకు చెందిన 22 ఏళ్ల లాయిడ్ హారీస్ చేతిలో కేవలం 28 నిమిషాల్లోనే మొదటి సెట్‌ను ఫెడరర్ కోల్పోయాడు. దీంతో రెండో రోజు కూడా అతి పెద్ద సంచలనం నమోదవుతుందేమోనని అందరూ అనుకున్నారు. అయితే రెండో సెట్ నుంచి తన అసలైన గ్రాస్ కోర్టు ఆటను హారీస్‌కు చూపిస్తూ వరుసగా మూడు సెట్లను గెలిచిన ఫెడరర్ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 6–3, 1–6, 2–6, 2–6తో హారిస్‌ను ఓడించాడు.
నాదల్ విజయం
రెండు సార్లు వింబుల్డన్ విజేత స్పెయిన్ బుల్ నాదల్ 6–3, 6–1, 6–3తో సుగిటా(జపాన్)పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకోగా...సెరెనా విలియమ్స్ 6–2, 7–5తో గులియా గుట్టో(ఇటలీ)ను ఓడించి ముందంజ వేసింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్, ఐదో సీడ్ ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్ తొలి రౌండ్‌తోనే తన కథను ముగించాడు. అమెరికా అన్‌సీడెడ్ ఆటగాడు కొరి చేతిలో 7–6, 6–7, 3–6, 0–6 చేతిలో ఓటమి చెందాడు. మహిళల మొదటి రౌండ్ మ్యాచ్‌లో షరపోవా(రష్యా) గాయం కారణంగా ఆట మధ్యలోనే వైదొలిగింది. పౌలిన్ పరమెన్‌టైర్(ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్‌లో ఇరువురు చెరో సెట్‌ను గెలిచారు. నిర్ణయాత్మక మూడో సెట్‌లో 0–5తో వెనుకబడిన సమయంలో షరపోవా మణికట్టు గాయంతో తప్పుకుంది.
బార్టీ అలవోకగా..
ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేత ప్రస్తుత నంబర్ 1 క్రీడాకారిణి యాష్లే బార్టీ తొలి రౌండ్‌లో 6–4, 6–2తో జెంగ్(చైనా)పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. ఇతర మ్యాచ్‌లలో డిఫెండింగ్ చాంపియన్ కెర్బర్(జర్మనీ) 6–4, 6–3తో తన దేశానికే చెందిన మరియాపై, 2017 యూఎస్ ఓపెన్ విన్నర్ స్లోన్ స్టీఫెన్(అమెరికా) 6–2, 6–4తో టిమియా బాసిన్‌స్కీపై గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment