కట్టు..బొట్టు తీరు.. కాస్త డ్రస్‌ కోడ్‌గా మారింది!..ఆ విధంబెట్టిదనినా.. | Dress Codes From Casual To White Tie That BecomesTrendy And Fashion | Sakshi
Sakshi News home page

Dress Code: కట్టు..బొట్టు తీరు.. కాస్త డ్రస్‌ కోడ్‌గా మారింది!..ఆ విధంబెట్టిదనినా..

Published Sun, Aug 27 2023 2:19 PM | Last Updated on Sun, Aug 27 2023 4:04 PM

Dress Codes From Casual To White Tie That BecomesTrendy And Fashion - Sakshi

కట్టు..బొట్టు తీరు.. ఇదివరకైతే కేవలం సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నం! తర్వాత వ్యక్తిగత అభిరుచికి అద్దమైంది! అటు తర్వాత సమయ సందర్భాలకు సూచిక అయింది! ఇప్పుడు.. పార్టీలు.. ప్రత్యేక వేడుకలు.. అంతెందుకు సరదా కాలక్షేపాలలో ఆయా సందర్భాలకు  తగ్గట్టుగా ఈ కట్టు.. బొట్టు.. తీరు మార్చుకుంది! సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తూ! దాన్నే మోడర్న్‌గా ‘డ్రెస్‌ కోడ్‌’ అంటున్నారు! పలు రంగుల్లో.. భిన్నమైన డిజైన్లలో.. క్లాస్‌గా.. మాస్‌గా.. ఫన్‌గా.. వియర్డ్‌గా.. ట్రెడిషనల్‌గా.. ట్రెండీగా.. కనిపిస్తోంది! ఒకరకంగా ఇది.. దాన్ని ఫాలో అవుతున్న వాళ్ల అడ్రెస్‌ కోడ్‌గా మారింది!! ఆ విధంబెట్టిదనినా.. బార్బీ మూవీ ఫ్యాషన్‌..

మరిస్సా స్మిత్‌ అతి పెద్ద బార్బీ అభిమాని. గత సంవత్సరం బార్బీ సినిమా ట్రైలర్‌ విడదలైనప్పటి నుంచి ఆమె తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను మొత్తం బార్బీ ట్రెండ్‌ తోనే నింపేసింది. అచ్చం బార్బీలాగే రెడీ అయి వీడియోలు చేసింది. బార్బీ చిత్రం విడుదలైనప్పుడైతే అచ్చం బార్బీలాగే వెళ్లి ‘పింక్‌ ఫ్యాషన్‌ చాలెంజ్‌’ విసిరింది. అలా బార్బీ అభిమానులు మొత్తం ఆ సినిమాకు పింక్‌ డ్రెస్‌ కోడ్‌లోనే వెళ్లి చూశారు.

కొంతమంది ఆ చాలెంజ్‌ ఏమిటో తెలియకుండానే పింక్‌ డ్రెస్‌లో వెళ్లి చూశారు. ఇప్పుడు ఈ ట్రెండ్‌ మన దేశంలోనూ కొనసాగుతోంది. దశాబ్దాల నాటి బొమ్మ పట్ల ప్రజలు తమ ఇష్టాన్ని వ్యకం చేసే విధానాల్లో ఈ పింక్‌ ఫ్యాషనూ ఒకటైంది! ఇది ఎంతలా ట్రెండ్‌ అయిందంటే పలు ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ కూడా బార్బీ అభిమానుల కోసం స్పెషల్‌ డిజైన్స్‌ను, ఆఫర్స్‌ను ప్రకటించేంతగా! ఇదే తరహాలో.. ఆ తర్వాత విడుదలైన ‘ఓపన్‌ హైమర్‌’ సినిమాకూ చాలా మంది బ్లాక్‌ డ్రెస్‌ కోడ్‌లో వెళ్లారు.

దెయ్యాల డ్రెస్‌ కోడ్‌..
హాలోవీన్‌.. ఈ పండగ పేరు చెప్పగానే అరివీర భయంకరమైన వేషాధారణ గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ పండగ గ్లోబలైజేషన్‌లో భాగంగా మన దేశంలోకీ ప్రవేశించింది. హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాల్లోనూ యువత హాలోవీన్‌ థీమ్‌ పార్టీల్లో పాల్గొంటూ.. ఎంజాయ్‌ చేస్తోంది. నిజానికి ఈ ‘హాలోవీన్‌ డే’ రెండువేల సంవత్సరాలకు పూర్వమే ప్రారంభమైందని చరిత్ర చెబుతోంది. ప్రాచీనకాలంలో పేగన్లు (మధ్యయుగం నాటి ఓ మతానికి చెందినవారు) సమ్‌ హెయిన్‌’ అనే పండగను జరుపుకునేవాళ్లట.

అదే ఈ హాలోవీన్‌ పండగకు ప్రేరణ అని చరిత్రకారులు చెబుతారు. పేగన్ల సంవత్సరం అక్టోబర్‌తో పూర్తయ్యేది. అక్టోబర్‌ మాసం ఆఖరి రోజు రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ వేడుకలు జరిగేవి. అయితే అప్పట్లో మొదలైన ఓ నమ్మకం వింత ఆచారాలకు తెరతీసింది. కొత్త సంవత్సరాది సందర్భంగా అంతకుముందు చనిపోయిన పెద్దల ఆత్మలన్నీ భూమిపైకి తిరిగి వస్తాయని పేగన్లు నమ్మేవారు. ఆరోజు రాత్రి భూమికి, ఆత్మలు నివసించే ప్రపంచానికి మధ్యలో ఉండే తలుపు తెరుచుకుంటుందని, ఆత్మలు తమ బంధువులను చూసి వెళ్లడానికి భూమిపైకి వస్తాయని నమ్మేవారు.

వాటికి భయపడి అవి తమ జోలికి రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఆత్మలు తమ పొలాలపై పడి వాటిని నాశనం చేయకుండా వాటికి ఆహారాన్ని ఏర్పాటు చేసి ఆరుబయట పెట్టేవారు. నిప్పు అంటే ఆత్మలు భయపడతాయని ఇంటికి దగ్గరగా మంటలు వేసేవారు. ఆత్మలు తమ వద్దకు రాకుండా ఉండేందుకు తెల్ల దుస్తులు వేసుకొని ముఖానికి  నల్లని రంగు పూసుకునేవారు. అలా మొదలైన ఆ నమ్మకం తర్వాత సంప్రదాయంగా.. పదహారో శతాబ్దానికి ఓ పండగగా మారిపోయింది.

పెళ్లి డ్రెస్‌ కోడ్‌
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. ఆ పెళ్లి వేడుకను పదికాలాల పాటు గుర్తుండిపోయేలా చేసుకోవాలని భావిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు  చేసుకుంటారు. ఖర్చుకు వెనుకాడకుండా ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ పెళ్లిళ్లలోనూ డ్రెస్‌ కోడ్‌ మొదలైంది. మెహందీ, హల్దీ, పెళ్లి కూతురు ఫంక్షన్, సంగీత్, పెళ్లి. ఇలా ఒక్కో  వేడుకకు పెళ్ళికూతురు, పెళ్లి కొడుకుతో పాటు ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు, ఆత్మీయులు కూడా డ్రెస్‌ కోడ్‌లో కనిపిస్తున్నారు. అంతేకాదు మతాలకనుగుణంగా ఆయా పెళ్లిళ్లలో ఆయా సంప్రదాయాల రీతిలో దుస్తులు ధరిస్తున్నారు. ఉదాహరణకు క్రిస్టియన్లలో వధూవరులు తెల్ల గౌన్, బ్లాక్‌ సూట్‌ వేసుకుంటే, హిందువుల్లో వధూవరులు పసుపు చీర, తెల్ల పంచెలు ధరించడం! ఇలా మతాలు, పద్ధతులే కాకుండా పలు ప్రాంతాల్లోని ఆచారవ్యవహారాలూ ఆ డ్రెస్‌ కోడ్‌లో భాగమవుతున్నాయి.  

పెళ్లి ఆపేస్తున్నారు.. 
చైనాలో వివాహ వేడుకకు సంబంధించి ప్రజలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. గతంలో పెళ్లి కోసం రిజిస్ట్రారు ఆఫీస్‌కి.. తమ ఇష్టానుసారమైన వస్త్రధారణతో వచ్చేవారట. దీంతో ఆ క్రమశిక్షణ రాహిత్యానికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం.. ఓ డ్రెస్‌ కోడ్‌ను ప్రవేశ పెట్టింది. పెళ్లి చేసుకోవడానికి రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు వచ్చే దంపతులు సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించాలి. లేనిపక్షంలో మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ మంజూరు కాదు. కనీసం పెళ్లిరోజు అయినా దేశ సంప్రదాయాలను కాపాడాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట.  

ఓనం చీర.. 
దక్షిణాదిన ఘనంగా జరుపుకునే పండగల్లో కేరళకు చెందిన ఓనం ఒకటి. ఆ పండగనాడు మిగిలిన ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నా, బంగారు అంచుతో కూడిన తెల్లటి కాటన్‌ లేదా సిల్క్‌ చీరను కట్టుకుంటారు మలయాళ మహిళలు. ఆ చీరను కసవ్‌ అంటారు. ఇప్పుడు ఈ కట్టూ బొట్టూ ఓనం రోజున ఒక్క కేరళకే కాకుండా దేశమంతటికీ కోడ్‌గా మారింది. తమిళనాడులో అయితే  కళాశాలలు, కార్యాలయాల్లోని విద్యార్థులు, ఉద్యోగినులు ఓనం చీరలను ధరించి తరగతులకు, విధులకు హాజరవుతున్నారు.

అయితే కరోనా తర్వాత ఓనం చీర కోడ్‌ కేరళలో ఒకరకంగా యూనిఫామ్‌గా మారిందని చెప్పవచ్చు. కరోనా లాక్‌డౌన్‌తో అక్కడ నేత కార్మికులు ఘోరమైన నష్టాలను చవిచూశారు. వాళ్లను ఈ కష్టం నుంచి గట్టెక్కించడానికి ‘సేవ్‌ ది లూమ్‌’ సంస్థ ఆ రాష్ట్ర మహిళా న్యాయవాదుల కోసం ఓనం చీరలనే మోనోక్రోమ్‌ చీరలుగా మార్చేసింది. ఇంకో అడుగు ముందుకు వేసి ప్రత్యేక కాలర్‌ గల జాకెట్, ఫార్మల్‌ గౌన్‌నూ నేయించింది! ఈ డిజైన్‌ను ‘విధి’ అంటున్నారు. ఇప్పుడది అక్కడ చాలా ఫేమస్‌.

బ్లాక్‌ అండ్‌ వైట్‌..
నలుపు, తెలుపు.. న్యాయవాద వృత్తికి చిహ్నం.. ప్రపంచవ్యాప్తంగా! ప్రతి రంగుకున్నట్టే దీనికీ కొన్ని సానుకూల, ప్రతికూల అర్థాలున్నాయి. ఒక వైపు విషాదం.. నిరసనను సూచిస్తూనే ఇంకో వైపు బలం.. అధికారాన్నీ సూచిస్తుంది. న్యాయవాద వృత్తికి నలుపు రంగునే ఎంచుకోవడానికి మరో కారణం.. అప్పట్లో రంగులు అంతగా అందుబాటులో లేవు. విస్తారమైన ఫాబ్రిక్‌ నలుపు రంగులో మాత్రమే ఉండేది. అలాగే న్యాయవాది డ్రెస్‌లోని ఇంకో రంగు తెలుపు.. కాంతిని, స్వచ్ఛతను, మంచితనాన్ని సూచిస్తుంది. వాది, ప్రతివాది  రెండు పక్షాల న్యాయవాదులు ఒకే విధమైన డ్రెస్‌ కోడ్‌ను ధరిస్తారు.   

స్కూల్‌ యూనిఫాం స్టోరీ..
16 వ శతాబ్దంలో యూకేలో యూనిఫామ్‌లు ప్రారంభమయ్యేంత వరకు అవి పాఠశాల క్రమశిక్షణలో భాగం కాదు. పిల్లలు తమకు నచ్చిన దుస్తులను ధరించి బడికి వెళ్లేవారు. 16వ శతాబ్దంలో  మెజారిటీ పాఠశాలలు స్వచ్ఛంద పాఠశాలలు. మెజారిటీ విద్యార్థులు వెనుకబడినవారే. కాబట్టి నాటి స్వచ్ఛంద సంస్థలు ఒకే రంగు, ఒకే డిజైన్‌ కుట్టిన దుస్తులను విరాళంగా ఇచ్చేవి. ఇవే యూనిఫామ్‌ పుట్టుకకు నాంది అయ్యాయి. అలా నాటి నుంచి చాలా బడులు తమ విద్యార్థులు అందరికీ డ్రెస్‌ కోడ్‌ను తప్పనిసరి చేశాయి.

ఈ యూనిఫామ్‌లు పిల్లల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యత్యాసాలకు చెల్లుచీటీ పాడి బడిలో పిల్లలంతా సమానమనే భావనను పెంచాయి. క్రమశిక్షణలో భాగం చేశాయి. చాలా దేశాలు విద్యార్థుల డ్రెస్‌ కోడ్‌ అయిన ఈ యూనిఫామ్‌ను అమోదించినప్పటికీ, యూనిఫామ్‌ అనే ఆ పదానికి అభ్యంతరం చెబుతున్న దేశాలూ ఉన్నాయి. అలాంటి దేశాలు యూనిఫామ్‌ను సున్నితంగా ‘స్కూల్‌ డ్రెస్‌’ అంటున్నాయి. మన దేశంలో ముంబైలోని కొన్ని పాఠశాలల్లో బ్లేజర్‌లు, ప్యాంటు, స్కర్టులు లేదా ట్యూనిక్స్, బూట్లు, సాక్స్‌లు వాళ్ల యూనిఫామ్‌లో భాగం. 

బ్రిటిష్‌ పాలకులు భారతదేశంలో ఇంగ్లిష్‌  మీడియం బడులను  ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా బడి యూనిఫాం కలోనియల్‌ డ్రెస్సింగ్‌ స్టైల్‌లోనే ఉంది. అయితే కొన్ని పాఠశాలలు మాత్రం దానిని మార్చుకున్నాయి. జపాన్‌లో బాలికల పాఠశాల యూనిఫామ్‌లు బ్రిటిష్‌ నావికాదళ యూనిఫామ్‌ను పోలి ఉంటాయి. అక్కడి పిల్లలు తరగతి గదిలోకి ప్రవేశించే ముందు వారు తమ షూను తీసివేయాలి. తరగతి గదిలో వారు ప్రత్యేకమైన చెప్పులు వేసుకుంటారు.

యూని కోడ్‌..
కేరళలోని ఎర్నాకుళం జిల్లా  వలయాంచిరంగార గ్రామంలో వందేళ్ల చరిత్ర ఉన్న సర్కారు బడి ఒకటి ఉంది. అందులో టీచర్లతోపాటు బోధనేతర సిబ్బంది కూడా మహిళలే. ఈ ఆల్‌ విమెన్‌  స్కూల్‌లో ప్రధానోపాధ్యాయురాలు సి.రాజి.. పిల్లల యూనిఫామ్‌ విషయంలో ఇప్పటి వరకు కొనసాగిన ఒక సంప్రదాయ విభజన రేఖను చెరిపేశారు. అన్ని స్కూళ్లలాగే ఆ స్కూల్లో కూడా అబ్బాయిలకు షర్టు – నిక్కరు, అమ్మాయిలకు షర్టు– స్కర్టు యూనిఫామ్‌గా ఉండేది.

ప్రిన్సిపల్‌ నిర్ణయంతో ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ‘షర్టు – నిక్కరు’ వేసుకుంటున్నారు. ఆటలు ఆడేటప్పుడు బాలికలకు సౌకర్యంగా ఉండటం కోసమే ఇలా యూని (డ్రెస్‌) కోడ్‌ను తెచ్చారు. బాడ్మింటన్, షటిల్‌ ఆడాలన్నా.. హై జంప్‌ చేయాలన్నా స్కర్టు పైకి ఎగురుతుందేమోననే బిడియంతో ఆడపిల్లలు ఆటలు ఆడడానికి ముందుకు రావడంలేదట. మంచి క్రీడాకారులు కాగల సత్తా ఉన్న అమ్మాయిలను వస్త్రధారణ కారణంతో అలా రెక్కలు విరిచి కూర్చోబెట్టడం ఏమిటి అని ఆలోచించిన సి. రాజి.. ఆ స్కూల్‌ డ్రెస్‌ని అలా మార్చేశారు.  

ఫ్రెషీ చాయిస్‌
ట్రాన్స్‌జెండర్లకు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌ యూనివర్సిటీ డ్రెస్‌ కోడ్‌ను ప్రకటించింది. ఫ్రెషర్స్‌లో ఆడవారికి, మగవారికి ప్రతిఏటా డ్రెస్‌ కోడ్‌ను ప్రకటించే ఆనవాయితీగల ఈ యూనివర్సిటీ ఈసారి తొలిసారిగా ట్రాన్స్‌జెండర్లకు కూడా డ్రెస్‌ కోడ్‌ను ప్రకటించడం విశేషం. విద్యార్థినులకు బటన్లు కలిగిన షార్ట్‌ స్లీవ్స్, డార్క్‌ కలర్‌ లాంగ్‌ స్కర్ట్స్‌ను, విద్యార్థులకు వైట్‌ షర్ట్, నెక్‌ టై, బ్లాక్‌ ట్రౌజర్లను డ్రెస్‌ కోడ్‌గా నిర్ణయించింది. వీటిలో ఏ డ్రెస్‌నైనా ధరించే అవకాశాన్ని ‘ఫ్రెషీ చాయిస్‌’ పేరిట ట్రాన్స్‌జెండర్లకు కల్పించింది.

ఆధ్యాత్మిక డ్రెస్‌ కోడ్‌
పలు ప్రసిద్ధ దేవస్థానాల్లో ఎప్పటి నుంచో డ్రెస్‌ కోడ్‌ అమలవుతోంది. ఆలయ అధికారుల నిర్ణయానికి భక్తులు కూడా ఆమోద ముద్ర వేశారు. జీన్స్‌, టీ షర్టులను ధరించిన యువతులకే కాదు పంజాబీ డ్రెస్‌పై చున్నీ లేని యువతులకు సైతం ఆలయాల్లో అనుమతి దొరకడం కష్టం. సంప్రదాయ పద్ధతి తప్పనిసరి కావడంతో చాలామంది పంచె, చీరలను కొనుగోలు చేసి, సంప్రదాయ పద్ధతిలో దైవాన్ని దర్శించుకుంటున్నారు. ఈ తరహాలోనే అయ్యప్ప దీక్ష భక్తులు నలుపు రంగులోనూ, భవానీ భక్తులు ఎరుపు రంగు, హనుమాన్‌ భక్తులు కాషాయం.. ఇలా భక్తులు ఆయా దైవ దీక్షల నియమాసారం ఆయా  రంగుల డ్రెస్‌ కోడ్‌లో దీక్షలను కొనసాగిస్తున్నారు.

అలాగే పలు మతాలకు సంబంధించిన అధిపతులు, పూజారులు, సన్యాసులకూ పలు రంగుల డ్రెస్‌ కోడ్‌ ఉంది. పోప్స్‌ తెల్లని, నల్లని దుస్తులు ధరిస్తే.. హిందూ, బౌద్ధ మతాల్లోని  పూజారులు, సన్యాసులు, స్వామీజీలు, భిక్షువులు కాషాయ దుస్తుల ధరిస్తారు. జైనంలో శ్వేతాంబరులు పేరుకు తగ్గట్టు తెల్లటి డ్రెస్‌ కోడ్‌లో ఉంటారు. ముస్లిం మతంలో ప్రాంతాలను బట్టి ఆకు పచ్చ, తెలుపు, నలుపు వంటి రంగులు కనిపిస్తుంటాయి.  

లెక్కల్లో..
గణాంకాల ప్రకారం పదహారవ శతాబ్దంలోనే స్కూల్‌ యూనిఫామ్, సైనికుల యూనిఫామ్, బిజినెస్‌ యూనిఫామ్, ఉద్యోగుల యూనిఫామ్‌.. ఇలా రకరకాల డ్రెస్‌ కోడ్‌లను వారు చేస్తున్న పనికి అనుగుణంగా డిజైన్‌ చేశారు. ఇప్పుడు దాని పరిధి విస్తృతమైంది. అమెరికాలో ఒక యూనివర్సిటీ నిర్వహించిన సర్వే ప్రకారం 2022లో యూనిఫామ్‌ల రకాలు 80 వేల కంటే ఎక్కువే! 

చదువులు.. వృత్తులు.. విధులకు సంబంధించిన యూనిఫామ్స్‌ని పక్కనబెడితే.. విందు వినోదాలు.. వేడుకలు.. సరదా కాలక్షేపాలు వంటి వాటన్నిటికీ డ్రెస్‌ కోడ్‌ ఓ ట్రెండ్‌ అయింది. పార్టీలు, పబ్బులు సరే.. పాప్‌ స్టార్స్‌ కన్సర్ట్స్‌కీ.. ఆ పాప్‌ స్టార్స్‌ స్టయిల్స్‌ను ప్రతిబింబించే డ్రెస్‌ కోడ్‌లో హాజరవుతున్న అభిమానులూ ఉన్నారు. ఇలా డ్రెస్‌ కోడ్‌ కూడా ఫ్యాషన్‌లో చేరి.. ఎక్స్‌ప్రెషన్‌కి.. కమ్యూనికేషన్‌కీ ఓ టూల్‌గా మారింది!  

(చదవండి: ఆ చిన్న పింగాణి పాత్ర ధర తెలిస్తే..నోరెళ్లబెట్టాల్సిందే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement