వింతైన కఫ్ఫులు...
మారుతున్న ఫ్యాషన్, ట్రెండ్‌ను బట్టి మనమూ మారుతుండాలి. ఒకప్పుడు చెవికి ఎన్ని రంధ్రాలు, కమ్మలు ఉంటే అంత అందం అనుకునేవారు. తర్వాత ఒకే చోట దుద్దులు పెట్టుకోవడమే ఫ్యాషన్. కానీ ఇప్పుడో... ఇయర్ కఫ్స్ అని కొత్తగా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. రెండు మూడు ఎక్స్‌ట్రాగా కుట్టించుకొని మరీ రింగ్స్, స్టడ్స్ పెట్టుకుంటున్నారు. అంతేకాదు... భారీ సైజులో ఉండే రెడీమేడ్ కఫ్స్ కూడా ఇప్పుడు ఫ్యాషన్. అంటే, వీటిని పెట్టుకోవడానికి చెవికి రంధ్రాలు ఉండాల్సిన పని లేదు.. ప్రెస్ చేస్తే సరి. అమాంతం చెవికి అతుక్కుపోతాయి. వీటిని షాపుల్లో కాకుండా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే..? ఇలా...
కావలసినవి: కాపర్ లేదా స్టీల్ వైర్ (సన్నది, దృఢమైనది), కటింగ్ ప్లయర్, గ్లూ, పూసలు, చిన్న సైజు రాళ్లు
తయారీ: ముందుగా ఇయర్ కఫ్స్ ఏ ఆకారంలో కావాలో నిర్ణయించు కోవాలి. తర్వాత దానికి తగ్గట్టు వైర్‌ను కటింగ్ ప్లయర్ సాయంతో మెలితిప్పు కుంటూ కట్ చేసుకోవాలి. ఎలాంటి ఆకారాన్ని తయారు చేసినా.. చివర్లను మాత్రం మెలితిప్పుకోవాలి. లేదంటే అవి చెవులకు గుచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే, ఈ తీగలకు కావలసిన చోట, డిజైన్‌ను బట్టి పూసలు ఎక్కించొచ్చు లేదా రాళ్లను గ్లూ సాయంతో అతికించొచ్చు. ఈ ఇయర్ కఫ్స్‌లో హ్యాంగింగ్స్ కూడా ఉంటాయి. ఒక్కో డిజైన్‌లో దళసరి తీగకు సన్నని తీగ చుట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఆ డిజైన్ మరింత అందంగా ఉంటుంది. అయినా ఓసారి పక్కనున్న ఫొటోలను చూడండి. తయారీ, డిజైన్ సెలక్షన్ అంతా మీకే అర్థమవుతుంది.