మా ఆవిడ వల్లే ఆరెస్సెస్ డ్రెస్ మార్చుకుంది!
పట్నా: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఇటీవల డ్రెస్ కోడ్ మార్చుకోవడం తన భార్య, బిహార్ మాజీ సీఎం రబ్రీదేవి ఘనతేనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఆరెస్సెస్ తాజాగా తన డ్రెస్ కోడ్ ను మార్చిన సంగతి తెలిసిందే. మామూలుగా ధరించే ఖాకీ నిక్కర్ల స్థానంలో ప్యాంట్లను ప్రవేశపెట్టింది. దీని గురించి లాలూ స్పందిస్తూ 'ఆరెస్సెస్ డ్రెస్ మార్చుకునేలా రబ్రీదేవి చేయగలిగారు' అని ట్వీట్ చేశారు. వారిని ప్యాంట్ల నుంచి మళ్లీ నెక్కర్లలోకి మారుస్తామంటూ ఆరెస్సెస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.
దాదాపు రెండు నెలల కిందట ఆరెస్సెస్ డ్రెస్ కోడ్‌ను తన భార్య తప్పుబట్టిందని, దీంతో ఇబ్బందిగా ఫీలైన ఆరెస్సెస్ నాయకత్వం నిక్కర్ల స్థానంలో ప్యాంట్లను ప్రవేశపెట్టిందని లాలూ తెలిపారు. 'నిక్కర్లు వేసుకొని బహిరంగంగా తిరగడానికి ఆరెస్సెస్ వృద్ధ నేతలు సిగ్గుపడటం లేదా?' అంటూ గత జనవరిలో రబ్రిదేవీ ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలను బిహార్ బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. రబ్రిదేవి 19వ శతాబ్దంనాటి పాతకాలపు మహిళలా మాట్లాడుతున్నారని సుశీల్‌మోదీ విమర్శించారు. కాగా, గత ఆదివారం నుంచి డ్రెస్‌కోడ్ మారుస్తున్నట్టు ఆరెస్సెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.