
కేరళ సీఎం పినరయి విజయన్ (ఫైల్‌ఫోటో)
తిరువనంతపురం : శబరిమల ఆలయం వద్ద బుధవారం జరిగిన హింసకు ఆరెస్సెస్‌దే బాధ్యతని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. శబరిమల ఆలయం తెరుచుకున్న క్రమంలో నిన్న (బుధవారం) జరిగిన ఘటనల్లో దాడులకు తెగబడిన నిరసనకారులు ఆరెస్సెస్ మద్దతుతోనే చెలరేగారని ఆరోపించారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడంపై కేరళలో పలు చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.
మహిళా భక్తులతో పాటు జర్నలిస్టులపైనా నిరసనకారులు విరుచుకుపడ్డారు. శబరిమల ఇతర ఆలయాలకు భిన్నంగా అన్ని విశ్వాసాలకు చెందిన ప్రజలను ఆలయంలోకి అనుమతిస్తుందని, ఈ విషయంలో సంఘ్ పరివార్, ఆరెస్సెస్‌లు ఎప్పుడూ అసహనంతో ఉంటారని, శబరిమలలోని ఈ ప్రత్యేకతను దెబ్బతీసేందుకు వారు చేయని ప్రయత్నం లేదని పినరయి విజయన్ ట్వీట్ చేశారు.
ఆదివాసీ మలయారన్ వర్గీయులు శబరిమలలో పూజలు చేసే సంప్రదాయాన్ని వమ్ము చేయడంలో వారు కీలక పాత్ర పోషించారన్నారు. ప్రస్తుత సమస్యలను సైతం ఈ కోణంలో చూడాలన్నారు. ఆరెస్సెస్ అండతో కులతత్వ, ఫ్యూడల్ శక్తులు భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారని, దాడులతో భయోత్పాతం సృష్టించారని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment