Kerala CM Pinayari Vijayan
-
ఒకదానికి ఒకటి గుద్దుకున్న సీఎం కాన్వాయ్ కార్లు
-
మీడియాకు థ్యాంక్స్ చెప్పిన కేరళ గవర్నర్.. ఎందుకంటే?
కొచ్చి: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మూడు వారాల పాటు విదేశీ పర్యటనకు బయలుదేరినట్లు మీడియా ద్వారా తనకు తెలిసిందని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. సీఎం పర్యటన గురించి తనకు తెలియజేయకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.సీఎం పినరయి విజయన్.. ఆయన కుటుంబసభ్యుల విదేశీ పర్యటనపై గవర్నర్ స్పందన ఏంటని అడిగినప్పుడు నాకు తెలియదు, తెలియజేసినందుకు మీడియాకు చాలా ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి పర్యటల గురించి తనకు గతం నుంచి వెల్లడించడం లేదని రాష్ట్రపతికి ఇదివరకే లేఖ రాశానని ఖాన్ చెప్పారు. అయితే పినరయి విజయన్ పర్యటన గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు.సీఎం.. ఆయన కుటుంబసభ్యులు మే 6న విదేశాలకు వెళ్లారు. కేరళలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం తర్వాత విజయన్ విరామం తీసుకోవాలనున్నారు. అందుకే తన కుటుంబంతో విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ తెలిపారు. -
గోల్డ్ కేసులో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది
తిరువనంతపురం/న్యూఢిల్లీ : కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్, ఎల్డీఎఫ్ ప్రభుత్వం మధ్య మరోసారి దుమారం చెలరేగింది. గవర్నర్ ఖాన్ ఈసారి గోల్డ్ స్మగ్లింగ్ వివాదాన్ని లేవనెత్తారు. ముఖ్యమంత్రి విజయన్ రాష్ట్రంలో ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంలో తాను జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గవర్నర్ ఖాన్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, యూనివర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ ఎజెండాని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆరోపించిన మర్నాడు గురువారం గవర్నర్ ఖాన్ న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. యూనివర్సిటీల్లో ఆరెస్సెస్ అజెండాపై సీఎం ఒక్క ఉదాహరణ అయినా చూపగలరాని ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో ఆరెస్సెస్‌కి చెందిన వారిని నియమించడానికే ప్రస్తుతమున్న వైస్ ఛాన్సలర్లపై చర్యలు తీసుకుంటున్నానని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దానిని రుజువు చేస్తే గవర్నర్ పదవికి తాను రాజీనామా చేస్తానని, అలా రుజువు చెయ్యలేకపోతే సీఎం రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ‘‘కేరళ ప్రజలు ప్రస్తుతం గోల్డ్ స్మగ్లంగ్ గురించి, అందులో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం గురించి చర్చించుకుంటున్నారు. ఈ కేసులో శివశంకర్ పాత్ర ఏంటి ? ఎందుకు ఆయనని తొలగించారు ? ఈ కేసులో సీఎంఒ ప్రమేయం ఉందని తేలితే నేను ఇందులో జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది’’ అని గవర్నర్ హెచ్చరికలు జారీ చేశారు. -
‘ముందు రాజ్యాంగం చదువుకోండి’
తిరువనంతపురం : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించే ముందు పినరయి విజయన్ సర్కార్ తనను సంప్రదించలేదన్న కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ వ్యాఖ్యలను సీఎం తోసిపుచ్చారు. అసెంబ్లీ కంటే ఏ పౌరుడు ఎక్కువ కాదని స్పష్టం చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్నవారంతా ప్రతి ఒక్క అంశాన్ని పొందుపరిచిన రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివేందుకు సమయం వెచ్చిస్తే బాగుంటుందని కేరళ సీఎం పినరయి విజయన్ గవర్నర్ అభ్యంతరాలపై స్పందించారు. ఇది ప్రజాస్వామ్యం వర్ధిల్లే దేశమని, ఆయా ప్రాంతాల్లో పెత్తనం చెలాయించే రాజుల కాలం కాదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడూ రాజ్యాంగానికి అతీతం కాదని వ్యాఖ్యానించారు. కేరళలో తమ ప్రభుత్వం సీఏఏ, ఎన్ఆర్సీలను అమలు చేయబోదని విజయన్ పునరుద్ఘాటించారు. మరోవైపు సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేయడం వంటి అంశాల్లో కేరళ ప్రభుత్వం తనను సంప్రదించకుండా, నిబంధనలను ఉల్లంఘించిందని గవర్నర్ ఖాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. చదవండి : సీఏఏకు వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ తీర్మానం -
పినరయి విజయన్ (కేరళ సీఎం) రాయని డైరీ
మాధవ్ శింగరాజు స్టేట్‌లో ఉన్నది ఒకటే సీటైనా, స్టేటంతా తమదే అన్నట్లు కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు బీజేపీ భక్తులు. ‘బీజేపీని ఆపగలుగుతున్నాం కానీ, బీజేపీలోని భక్తిని ఆపలేకపోతున్నాం సర్..’ అన్నాడు లోక్‌నాథ్ బెహెరా ఫోన్ చేసి! ఒక డీజీపీ అనవలసిన మాట కాదు. ‘‘బీజేపీ, భక్తి రెండూ ఒకటే అయినప్పుడు బీజేపీని ఆపితే ఆటోమేటిగ్గా బీజేపీలోని భక్తి కూడా ఆర్డర్‌లోకి రావాలి కదా లోక్‌నాథ్’’ అని అడిగాను. ‘‘కానీ సర్, బీజేపీ కన్నా, బీజేపీలోని భక్తే ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉంది. పట్టలేకపోతున్నాం. దాన్నే పట్టగలిగితే బీజేపీని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. అందుకోసమే ట్రయ్ చేస్తున్నాం సర్’’ అన్నాడు. ‘‘ఎందుకోసం?’’ అన్నాను. ‘‘అదే సర్, బీజేపీలోని భక్తిని పట్టుకోవడం కోసం’’ అన్నాడు. భక్తినెలా పట్టుకుంటాడో అర్థం కాలేదు! ‘‘లోక్‌నాథ్, మీరు భక్తిని పట్టుకునే ప్రయత్నంలో మిమ్మల్ని భక్తి పట్టుకోకుండా జాగ్రత్త పడండి’’ అని చెప్పాను. ‘‘సర్, శబరిమల నుంచి ఫోన్’’ అంటూ గాభరాగా వచ్చాడు టామ్ జోస్. ‘‘ఎవరికొచ్చింది? ఎవరు చేశారు?’’ అని అడిగాను. ‘‘కనుక్కుంటాను సర్’ అని, నాకివ్వబోయిన ఫోన్‌ని మళ్లీ తన చెవి దగ్గర పెట్టుకున్నాడు! టామ్ జోస్ కొత్తగా వచ్చిన చీఫ్ సెక్రటరీ. పాల్ ఆంటోని ప్లేస్‌లో వచ్చాడు. పాల్ ఆంటోని రిటైర్ అయ్యాడని టామ్ జోస్‌ని తెచ్చుకుంటే, టామ్ జోస్ రిటైర్ కాకుండానే ‘ఆషా థామస్‌ని తెప్పించుకోండి నేను పోతున్నా..’ అనేసేలా ఉన్నాడు. ఆషా థామస్.. అతడి తర్వాత లైన్లో ఉన్న చీఫ్ సెక్రటరీ. శబరిమల నుంచి ఫోన్ వచ్చిన ప్రతిసారీ, శబరిమల ఇంకే స్టేట్‌లోనైనా ఎందుకు లేకపోయిందా అన్నట్లు ఫీలింగ్ పెట్టేస్తున్నాడు టామ్ జోస్. రెండు వేల ఇరవై వరకు ఉంది అతడి టెన్యూర్. ఈ మకరజ్యోతి కాకుండా, ఇంకో మకరజ్యోతిని కూడా చూడాలి అతడు. ఇద్దరు మహిళలు గుడిలోకి ఎంటర్ అవడంతో గుడిని శుద్ధి చేశారనే వార్త వచ్చిన వెంటనే అతడికో ఆలోచన వచ్చింది. ‘‘ఈసారి మకరజ్యోతి కనిపించదేమో సర్’’ అన్నాడు సడన్‌గా! ‘‘ఎందుకని?’’ అన్నాను. ‘‘గుడిని అపవిత్రం చేస్తుంటే సీపీఎం చూస్తూ కూర్చున్నందుకు అయ్యప్పకు కోపం వచ్చిందని ప్రచారం చేయడానికి బీజేపీ వాళ్లు మకరజ్యోతిని కనిపించనీయకుండా చెయ్యొచ్చు కదా సర్’’ అన్నాడు!! షాక్ తిన్నాను. సీపీఎంకి ఐడియాలు ఇచ్చేందుకు చీఫ్ సెక్రెటరీగా పెట్టుకుంటే బీజేపీవాళ్లకు ఐడియాలు ఇచ్చేలా ఉన్నాడు టామ్ జోస్. మకరజ్యోతికి ఇంకో వారమే ఉంది. ఈలోపు ఏవైతే జరగకూడదో వాటన్నిటినీ గొప్ప భక్తి పారవశ్యంతో దగ్గరుండి మరీ జరిపించేలా ఉంది బీజేపీ. మోదీకి ఫోన్ చేశాను. ‘‘బోలియే.. విజయన్‌జీ.. ఎప్పుడో వరదల్లో కలిశారు, మళ్లీ ఇన్నాళ్లకు!’’ అన్నాడు. ‘‘ఇప్పుడూ వరదలే మోదీజీ. భక్తి వరద’’ అన్నాను. ‘‘నేనేం చేయగలను విజయన్‌జీ.. పేద భక్తుడిని’’ అన్నాడు! ‘‘భక్తిని, పేదరికాన్ని దాచిపెట్టుకోవాలి మోదీజీ. ప్రదర్శనకు పెట్టకూడదు. భక్తిని ప్రదర్శిస్తే భక్తిలోని లేమి మాత్రమే బయటికి కనిపిస్తుంది. పేదరికాన్ని ప్రదర్శిస్తే ‘లేని సంపన్నత’పై భక్తిగా మాత్రమే లోకం దాన్ని చూస్తుంది. లోపల ఉంచుకోవడమే నిజమైన భక్తి. లేమిని దాచుకోవడమే నిజమైన సంపన్నత’’ అన్నాను. అన్నానే కానీ, లైన్ ఎప్పుడు కట్ అయిందో చూసుకోలేదు. -
‘శబరిమలను ఘర్షణ జోన్‌గా మార్చారు’
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి బుధవారం ప్రవేశించిన ఇద్దరు మహిళలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యతని కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆలయంలోకి వచ్చిన మహిళలకు రక్షణ కల్పించడం ప్రభుత్వం బాధ్యతని, రాజ్యాంగ బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించిందని చెప్పారు. శబరిమలను ఘర్షణ జోన్‌గా మలిచేందుకు బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రేరేపించే హింసను కఠినంగా ఎదుర్కొంటామని స్పష్టంచేశారు. శబరిమలలోకి ఇద్దరు మహిళల ప్రవేశం నేపథ్యంలో సెక్రటేరియట్ ఎదుట బీజేపీ, సీపీఎం కార్యకర్తలు బాహాబాహీకి తలపడటంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు భాష్పవాయు గోళాలు ప్రయోగించిన క్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఘటన నేపథ్యంలో ఆందోళనకారులు ఏడు పోలీస్ వాహనాలు, 79 కేఎస్ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారని, 39 మంది పోలీసులపై దాడులకు తెగబడ్డారని సీఎం వెల్లడించారు. అల్లరి మూకలు మహిళలపై దాడులకు పాల్పడ్డాయని, మహిళా మీడియా ప్రతినిధులపైనా దాడికి దిగారని చెప్పారు, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి నిరసనగా బంద్ చేయడమంటే సుప్రీం కోర్టు ఉత్తర్వులను వ్యతిరేకించడమేనని వ్యాఖ్యానించారు. కాగా కేరళలో శబరిమల కర్మ సమితి పేరుతో హిందూ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా 12 గంటల హర్తాళ్‌కు పిలుపు ఇచ్చాయి. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు మూడు నెలల కిందట ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కనకదుర్గ (44), బిందు (42) అనే ఇద్దరు మహిళలు అన్ని అడ్డంకులు, కట్టుబాట్లను అధిగమిస్తూ ఆలయంలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించారు. వీరి ఆలయ ప్రవేశంపై హిందూ సంఘాలు, బీజేపీ, ఆరెస్సెస్ భగ్గుమంటున్నాయి. -
ఆరెస్సెస్ అండతోనే రెచ్చిపోయారు..
తిరువనంతపురం : శబరిమల ఆలయం వద్ద బుధవారం జరిగిన హింసకు ఆరెస్సెస్‌దే బాధ్యతని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. శబరిమల ఆలయం తెరుచుకున్న క్రమంలో నిన్న (బుధవారం) జరిగిన ఘటనల్లో దాడులకు తెగబడిన నిరసనకారులు ఆరెస్సెస్ మద్దతుతోనే చెలరేగారని ఆరోపించారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడంపై కేరళలో పలు చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. మహిళా భక్తులతో పాటు జర్నలిస్టులపైనా నిరసనకారులు విరుచుకుపడ్డారు. శబరిమల ఇతర ఆలయాలకు భిన్నంగా అన్ని విశ్వాసాలకు చెందిన ప్రజలను ఆలయంలోకి అనుమతిస్తుందని, ఈ విషయంలో సంఘ్ పరివార్, ఆరెస్సెస్‌లు ఎప్పుడూ అసహనంతో ఉంటారని, శబరిమలలోని ఈ ప్రత్యేకతను దెబ్బతీసేందుకు వారు చేయని ప్రయత్నం లేదని పినరయి విజయన్ ట్వీట్ చేశారు. ఆదివాసీ మలయారన్ వర్గీయులు శబరిమలలో పూజలు చేసే సంప్రదాయాన్ని వమ్ము చేయడంలో వారు కీలక పాత్ర పోషించారన్నారు. ప్రస్తుత సమస్యలను సైతం ఈ కోణంలో చూడాలన్నారు. ఆరెస్సెస్ అండతో కులతత్వ, ఫ్యూడల్ శక్తులు భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారని, దాడులతో భయోత్పాతం సృష్టించారని ఆందోళన వ్యక్తం చేశారు. -
కేరళ సీఎంకు బాబా రాందేవ్ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్తకర్తలు, నేతలపై కేరళ సీఎం చేసిన ఆరోపణల్ని ఖండించారు. ఆరెస్సెస్‌కు చెందిన ఎంతో మందిని తాను దగ్గరి చూశానని, వారిలో ఉగ్రవాదులు ఎవరూ లేరని రాందేవ్ బాబా పేర్కొన్నారు. ఆరెస్సెస్ నాయకులు, కార్తకర్తలు ఎంతో మంది తనకు తెలుసునని, కానీ వారిలో ఏ ఒక్కరూ ఉగ్రవాదులు గానీ, నక్సలైట్స్ వర్గాలకు చెందిన వాళ్లు లేరని జాతీయ మీడియా ఏఎన్ఐతో మాట్లాడుతూ తెలిపారు. దేశానికి చెందిన ఓ జాతీయ గ్రూపు లాంటిది ఆరెస్సెస్ అని చెప్పారు. దేశానికి హాని కలిగించే పనులు వారు చేయరంటూ పినరయి విజయన్ వ్యాఖ్యలను యోగా గురువు తిప్పికొట్టారు. అసలు వివాదం ఏంటంటే.. 'పీఎఫ్ఐ, ఆరెస్సెస్ గ్రూపులు ఆయుధాల వాడకంపై శిక్షణ ఇస్తున్నాయి. చట్ట వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని దేవాలయాల్లోనూ కర్రలతో దాడి చేయడంపై యువకులకు శిక్షణ ఇస్తున్నారు. అవసరమైతే కొత్త చట్టాలను తీసుకొచ్చి ఆరెస్సెస్ చర్యలను నిషేధించాలంటూ' కేరళ సీఎం పినరయి విజయన్ అసెంబ్లీలో బుధవారం వ్యాఖ్యానించడం దూమారం రేపిన విషయం తెలిసిందే. -
ఆ హత్యలకు నైతిక బాధ్యత వహిస్తారా?
తిరువనంతపురం: కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికారంలోకి రాగానే బీజేపీ–ఆరెస్సెస్ కార్యకర్తలపై దాడులు పెరుగుతున్నాయని బీజేపీ చీఫ్ అమిత్ షా పేర్కొన్నారు. 15 రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘జనరక్షా యాత్ర’ల ముగింపు సందర్భంగా తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ పాలనతో ప్రజలపై అకృత్యాలు పెరిగిపోయాయన్నారు. ‘రాష్ట్రంలో ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చాక (మే 2016 నుంచి) 13 మంది ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలను హత్యచేశారు. దీనికి ఆయన బాధ్యత వహిస్తారా? మీరు మాతో పోరాటం చేయదలచుకుంటే అభివృద్ధి, సిద్ధాంతం ప్రాతిపదికన కొట్లాడండి. అమాయక బీజేపీ–ఆరెస్సెస్ కార్యకర్తలను చంపేందుకే మీకు ప్రజలు అధికారమిచ్చారా? ఇలాంటి హింసాత్మక రాజకీయాలు చేస్తున్నందుకు తక్కువ సమయంలోనే కేరళ ప్రజలు రాష్ట్రం నుంచి సీపీఎంను విసిరిపారేస్తారు’ అని అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజశేఖరన్, ఇతర నేతలు, భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తలతోకలిసి రెండు కిలోమీటర్లపాటు షా పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పైనా అమిత్ షా విమర్శలు చేశారు. కుటుంబపాలన, అవినీతి కారణంగానే కాంగ్రెస్ ఉనికి కోల్పోతోందన్నారు. -
ఆర్ఎస్ఎస్పై కేరళ సీఎం ఫైర్
సాక్షి,తిరువనంతపురం: తమ ప్రభుత్వం దేశ వ్యతిరేక శక్తులకు ఊతం ఇస్తోందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను కేరళ సీఎం పినరయి విజయన్ తోసిపుచ్చారు. ప్రజలను ఒకరిపై మరొకరిని రెచ్చగొట్టేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేరళ ప్రజలను మతపరంగా, వ్యక్తిగతంగా ఏ ఒక్కరూ లేదా సంస్థ రెచ్చగొట్టలేరని వారి ప్రయత్నాలు ఫలించబోవని అన్నారు. సంఘ్ పరివార్ సంస్థలను కేరళ ప్రజలు పూర్తిగా తిరస్కరించారని పేర్కొన్నారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం కేరళ ప్రభుత్వం దేశవ్యతిరేక శక్తులకు మద్దతిస్తోందన్న వ్యాఖ్యలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ వివరణ ఇవ్వాలన్నారు.కేరళ ప్రజల హృదయాలను కలుషితం చేసేందుకు ఆర్ఎస్ఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం వల్లే ఇలాంటి ప్రేలాపనలకు దిగుతున్నారని విజయన్ మండిపడ్డారు. భారత రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఆర్ఎస్ఎస్ జాతీయ వాదం, వారి కార్యకలాపలు సాగుతాయన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. బ్రిటిష్ పాలకులకు ఊడిగం చేసిన ఇలాంటి సంస్థల అధిపతుల హితబోధలు కేరళ ప్రజలకు అవసరం లేదని ఆయన తన ఫేస్బుక్ పోస్ట్‌లో స్పష్టం చేశారు. -
'త్వరలోనే జయమ్మ పగ్గాలందుకుంటుంది'
-
'త్వరలోనే జయమ్మ పగ్గాలందుకుంటుంది'
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారని, త్వరలోనే ఆమె డిశ్చార్జ్ అవుతారని కేరళ గవర్నర్ పీ సదాశివం అన్నారు. వైద్య చికిత్సలకు జయ స్పందిస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో జయలలితను చూసేందుకు ప్రముఖులు ఆస్పత్రికి తరలి వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆమెను చూసేందుకు లోపలికి అనుమతించని వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని మాత్రం విజిటర్లు వివరించి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ఆ రాష్ట్ర గవర్నర్ సదాశివం ఆస్పత్రికి జయలలితను పరామర్శించేందుకు వచ్చారు. 'వైద్య చికిత్సలకు జయలలిత స్పందిస్తున్నారని మాకు వైద్యులంతా తెలిపారు. ఆమె త్వరలోనే డిశ్చార్జి అవుతుంది కూడా. అంతేకాదు.. అతి త్వరలోనే ఆమె పాలనా పగ్గాలు కూడా చేపడుతుంది' అని గవర్నర్ సదాశివం చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలని మొత్తం కేరళ ప్రజలంతా కోరుకుంటున్నారని, తాము ఆశించినట్లే ఆస్పత్రికి వచ్చి వైద్యుల నుంచి శుభవార్త విన్నందుకు చాలా సంతోషంగా ఉందని, వైద్యులు చాలా ఆత్మవిశ్వాసంతో ఆమె త్వరలోనే కోలుకుంటుందని చెప్పారని వివరించారు.