
తిరువనంతపురం: కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ అధికారంలోకి రాగానే బీజేపీ–ఆరెస్సెస్ కార్యకర్తలపై దాడులు పెరుగుతున్నాయని బీజేపీ చీఫ్ అమిత్ షా పేర్కొన్నారు. 15 రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘జనరక్షా యాత్ర’ల ముగింపు సందర్భంగా తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ పాలనతో ప్రజలపై అకృత్యాలు పెరిగిపోయాయన్నారు. ‘రాష్ట్రంలో ఎల్‌డీఎఫ్ అధికారంలోకి వచ్చాక (మే 2016 నుంచి) 13 మంది ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలను హత్యచేశారు. దీనికి ఆయన బాధ్యత వహిస్తారా? మీరు మాతో పోరాటం చేయదలచుకుంటే అభివృద్ధి, సిద్ధాంతం ప్రాతిపదికన కొట్లాడండి. అమాయక బీజేపీ–ఆరెస్సెస్ కార్యకర్తలను చంపేందుకే మీకు ప్రజలు అధికారమిచ్చారా?
ఇలాంటి హింసాత్మక రాజకీయాలు చేస్తున్నందుకు తక్కువ సమయంలోనే కేరళ ప్రజలు రాష్ట్రం నుంచి సీపీఎంను విసిరిపారేస్తారు’ అని అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజశేఖరన్, ఇతర నేతలు, భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తలతోకలిసి రెండు కిలోమీటర్లపాటు షా పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పైనా అమిత్ షా విమర్శలు చేశారు. కుటుంబపాలన, అవినీతి కారణంగానే కాంగ్రెస్ ఉనికి కోల్పోతోందన్నారు.