
సాక్షి,తిరువనంతపురం: తమ ప్రభుత్వం దేశ వ్యతిరేక శక్తులకు ఊతం ఇస్తోందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను కేరళ సీఎం పినరయి విజయన్ తోసిపుచ్చారు. ప్రజలను ఒకరిపై మరొకరిని రెచ్చగొట్టేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేరళ ప్రజలను మతపరంగా, వ్యక్తిగతంగా ఏ ఒక్కరూ లేదా సంస్థ రెచ్చగొట్టలేరని వారి ప్రయత్నాలు ఫలించబోవని అన్నారు. సంఘ్ పరివార్ సంస్థలను కేరళ ప్రజలు పూర్తిగా తిరస్కరించారని పేర్కొన్నారు.
సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం కేరళ ప్రభుత్వం దేశవ్యతిరేక శక్తులకు మద్దతిస్తోందన్న వ్యాఖ్యలకు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ వివరణ ఇవ్వాలన్నారు.కేరళ ప్రజల హృదయాలను కలుషితం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం వల్లే ఇలాంటి ప్రేలాపనలకు దిగుతున్నారని విజయన్ మండిపడ్డారు. భారత రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ వాదం, వారి కార్యకలాపలు సాగుతాయన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. బ్రిటిష్ పాలకులకు ఊడిగం చేసిన ఇలాంటి సంస్థల అధిపతుల హితబోధలు కేరళ ప్రజలకు అవసరం లేదని ఆయన తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో స్పష్టం చేశారు.