సాక్షి, ఒంగోలు: సచివాలయాల ఏర్పాటుతో ఉద్యోగుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. పని దినాల్లో పట్టణ ప్రాంతాల్లో సచివాలయాల సిబ్బంది రాకపోకలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సచివాలయాల్లో పనిచేసే వారిలో ఎక్కువ శాతం యువతే ఉన్నారు. ప్రజలతో నిత్యం సత్సంబంధాలు కలిగి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయాల్లో పనిచేసేవారు ప్రత్యేకంగా కనిపించాలన్న ఆలోచనను ప్రభుత్వం చేస్తోంది. అందుకుగాను వారికి కూడా డ్రస్ కోడ్ అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. పైలెట్ సచివాలయాల కింద కొన్నింటిని గుర్తించి ముందుగా అక్కడి సిబ్బందికి డ్రస్ కోడ్ అమలు చేయాలని నిర్ణయించింది.
అక్కడి సిబ్బంది నుంచి, ఆ సచివాలయాల పరిధిలోని ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను ఆధారం చేసుకొని మిగిలిన సచివాలయాల్లో కూడా అమలుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసి పెద్ద సంఖ్యలో సిబ్బందిని నియమించింది. ఒక్కో సచివాలయంలో పదిమందికి తగ్గకుండా సిబ్బందిని నియమించారు. జనాభాను ఆధారం చేసుకొని సచివాలయాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 179 వార్డు సచివాలయాలు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 884 గ్రామ సచివాలయాలున్నాయి.
వీటిలో దాదాపు 8535 మంది పనిచేస్తున్నారు. వేలాది మంది పనిచేస్తుండటంతో వారందరినీ యూనిఫామ్‌గా ఉంచాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పురుష ఉద్యోగులకు స్కై బ్లూ షర్ట్, బిస్కెట్ కలర్ ప్యాంట్, మహిళా ఉద్యోగులకు స్కై› బ్లూ టాప్, బిస్కెట్ కలర్ లెగిన్ డ్రస్ కోడ్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు కింద ఒకటి రెండు జిల్లాలను ఎంపికచేసి, అక్కడి ఒకటి రెండు సచివాలయాలకు డ్రస్ కోడ్ అమలు చేస్తోంది. డ్రస్ కోడ్ పట్ల సానుకూల స్పందన లభిస్తే రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. (అగ్రిగోల్డ్ డిపాజిట్ల చెల్లింపులకు లైన్ క్లియర్)
ట్యాగ్ కలర్‌తో క్యాడర్ గుర్తింపు:
సచివాలయాల్లో డ్రస్ కోడ్‌ను అమలు చేయనున్న నేపథ్యంలో ఏ క్యాడర్‌కు చెందిన సిబ్బంది ఎవరన్న విషయాన్ని ప్రజలు సులువుగా తెలుసుకునేందుకు ఐడెంటిటీ కార్డుల ట్యాగ్ కలర్‌లను ప్రత్యేకంగా రూపొందిస్తోంది. వార్డు సచివాలయాల్లో దాదాపు పది విభాగాలకు చెందినవారు కార్యదర్శులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. సిబ్బందికి ఇప్పటికే ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. ఐడెంటిటీ కార్డులు ధరించేందుకు ట్యాగ్‌లను వినియోగిస్తారు. ఒక్కో కార్యదర్శికి ఒక్కో కలర్ ట్యాగ్ ఇచ్చే విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని అడ్మిన్ సెక్రటరీ, గ్రామ సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులకు ఎల్లో ట్యాగ్, డిజిటల్ అసిస్టెంట్‌కు రెడ్ ట్యాగ్, హెల్త్ సెక్రటరీకి వైట్ ట్యాగ్, మహిళా పోలీసుకు ఖాకి ట్యాగ్, వీఆర్‌ఓకు బ్రౌన్ ట్యాగ్, అగ్రికల్చరల్/ హార్టీ కల్చరల్ సెక్రటరీకి గ్రీన్ ట్యాగ్, ఎడ్యుకేషన్ సెక్రటరీకి ఆరంజ్ ట్యాగ్, ఇంజినీరింగ్ అసిస్టెంట్‌కు గ్రే ట్యాగ్ ఇవ్వనున్నారు.
వలంటీర్లకు కూడా..
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందించే విషయంలో వలంటీర్లు కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 18187 మంది వలంటీర్లు ఉన్నారు. వీరికి కూడా డ్రస్ కోడ్ అమలుచేసే విషయమై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వలంటీర్లకు ఎలాంటి డ్రస్ కోడ్ అమలు చేయాలనే విషయమై చర్చ నడుస్తోంది. వలంటీర్లు సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నారు. ఆ సమయంలో వలంటీర్లు డ్రస్ కోడ్ పాటించడం ద్వారా ఎవరైనా కొత్తవారు కూడా వారిని వెంటనే గుర్తించి తమ పింఛన్ల విషయమై మాట్లాడే వీలు కలగనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా పింఛన్లకు అర్హత సాధించినవారు కూడా తమ ప్రాంతంలో వలంటీర్ పింఛన్ల పంపిణీకి తిరుగుతున్న సమయంలో గుర్తించి వాటిని వెంటనే పొందే వెసులుబాటు కూడా కలగనుంది. మొత్తం మీద డ్రస్ కోడ్‌లతో సచివాలయాలు సరికొత్త శోభను సంతరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment