
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కులాల వారీగా అధికారిక సర్వే(కుల గణన)కు ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 15 తర్వాత రాష్ట్రమంతటా ఈ సర్వే మొదలుపెట్టేందుకు అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. వలంటీర్లతో సంబంధం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ద్వారా ఈ సర్వే చేపడతారు. సచివాలయాల ఉద్యోగులు ఆయా సచివాలయాల పరిధిలో ఉండే ఇంటింటి వివరాలు సేకరిస్తారు.
పారదర్శకత కోసం.. సచివాలయాల వారీగా జరిగిన సర్వేపై మండల స్థాయిలో శాంపిల్‌గా అక్కడక్కడా పది శాతం ఇళ్లకు సంబంధించి సంబంధిత మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్(ఆర్‌ఐ)ఆధ్వర్యంలో పునః పరిశీలన జరుపుతారు. మూ డో స్థాయిలోనూ.. కింది స్థాయిలో జరిగిన సర్వేపై రెవెన్యూ డివిజన్ స్థాయిలో అక్కడి స్థానిక ఆర్‌డీవో ఆధ్వర్యంలోనూ శాంపిల్ పునఃపరిశీలన చేపడతారు.
రాష్ట్ర ప్రణాళిక శాఖతో పాటు బీసీ, సాంఘిక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఈ కుల గణనకు సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాలపై రూపకల్పన జరుగుతోంది. మరో పక్క క్షేత్ర స్థాయిలో సమర్థంగా సర్వే చేపట్టేందుకు వీలుగా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందుకోసం మొబైల్ యాప్‌ను సిద్ధం చేస్తోంది.
కులగణన ప్రత్యేక మొబైల్ యాప్ తయారీపై ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో కీలక అధికారుల స్థాయిలో రెండు విడతల సమావేశాలు కూడా ముగిశాయి. జనాభా ప్రాతిపదికన సమాన అవకాశాలు పొందేలా దేశ వ్యాప్తంగా కులగణన జరపాలంటూ బీసీ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ ప్రక్రియలో భాగంగా..ఏపీలో ప్రత్యేకంగా కుల గణన చేపట్టేందుకు సీఎం జగన్ గతంలోనే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఇదిలా ఉంటే, నవంబర్ 15కు ముందే రాష్ట్రంలోని వివిధ కుల సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment