'పొట్టి దుస్తులు వేసుకున్నదని నో ఎంట్రీ'
న్యూఢిల్లీ: ఓ మహిళా ప్రయాణికురాలికి ఇండిగో విమానంలో చేదు అనుభవం ఎదురైంది. సరైన దుస్తులు వేసుకోలేదంటూ ఆమెను సిబ్బంది విమానాన్ని ఎక్కనివ్వలేదు. ఫ్రాక్ ధరించిన ఆమె ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో దోహా నుంచి ముంబై వచ్చింది. అక్కడి నుంచి ఢిల్లీకి కనెక్టడ్ విమానం ఎక్కాల్సి ఉంది. అయితే ముంబైలో ఆమెను విమానం ఎక్కనివ్వకుండా ఇండిగో సిబ్బంది అడ్డుకున్నారు.
ఈ ఘటన గురించి సహచర ప్రయాణికురాలైన పురబి దాస్ తన ఫేస్‌బుక్ పేజీలో వివరించారు. ఇండిగో పురుష సిబ్బంది ఆ యువతిని ఈ విధంగా వేధించడం తనను ఆందోళనకు గురిచేసిందని తెలిపారు. 'మోకాళ్ల వరకు ఉన్న ఫ్రాక్‌ను ధరించినప్పటికీ ఆమెను విమానంలో ఎక్కనివ్వలేదు. ఆమె దుస్తులు వారికి అభ్యంతరకరంగా కనిపించాయి. కానీ ఆ సంస్థ ఎయిర్‌హోస్టెస్ మాత్రం అదే తరహా ఫ్రాక్‌లు ధరిస్తారు' అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ ఘటనతో ఆమె ఎక్కాల్సిన విమానం మిస్సయింది. అనంతరం వేరే వస్త్రాలు ధరించిన తర్వాత ఆమె మరో విమానంలో వెళ్లేందుకు అనుమతించారని తెలిసింది. నిజానికి ఆ ప్రయాణికురాలు ఇండిగో సంస్థకు చెందిన ఉద్యోగి సోదరి. అయితే తమ డ్రెస్ కోడ్ నిబంధనల్లో భాగంగానే ఆమెను అడ్డుకోవాల్సి వచ్చిందని ఇండిగో సంస్థ తెలిపింది. ఈ విషయమై పురబి దాస్ ఇండిగో కస్టమర్ కేర్‌ను సంప్రదించగా.. ఫ్రాక్ వేసుకొని విమానంలో ప్రయాణించడం అనుమతించరని వారు పేర్కొన్నారు.