ఉజ్జయిని: రామాయణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పనిచేసే వెయిటర్ల డ్రెస్‌కోడ్‌ను రైల్వే శాఖ సోమవారం ఉపసంహరించుకుంది. వారి యూనిఫామ్‌ను మార్చేసింది. వారి డ్రెస్‌కోడ్ పట్ల మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మత గురువులు, సాధువులు అభ్యంతరం వ్యక్తం చేయడమే ఇందుకు కారణం. వెయిటర్లు సాధువుల తరహాలో కాషాయ రంగు దుస్తులు, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి, రైలులో విధులు నిర్వర్తిస్తున్నారని, ఇది హిందూ మతాన్ని అవమానించడమే అవుతుందని వారు ఆక్షేపించారు.
డ్రెస్‌కోడ్‌ను మార్చకపోతే ఢిల్లీలో ఈ రైలును అడ్డుకుంటామన్నారు. రెండు రోజుల క్రితం రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశారు. దీంతో రైల్వే శాఖ వెంటనే స్పందించింది. సిబ్బంది దుస్తులను మార్చింది. సాధారణ చొక్కా, ప్యాంట్, సంప్రదాయ తలపాగా ధరించి, యాత్రికులకు సేవలందిస్తారని తెలిపింది. కాషాయ రంగు మాస్కులు, చేతి గ్లౌజ్‌ల్లో మార్పులు చేయలేదు. రామాయణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇటీవలే ఢిల్లీలో ప్రారంభమయ్యింది. 7,500 కి.మీ.ల మేర దేశంలోని వివిధ ప్రాంతాలను చుట్టేసి మళ్లీ ఢిల్లీకి చేరుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment