గోండా రైలు ప్రమాదం.. ‘పేలుడు శబ్దం విన్నా’: లోకోపైలట్‌ | Dibrugarh Express loco pilot claims hearing loud sound before derailment | Sakshi
Sakshi News home page

గోండా రైలు ప్రమాదం.. ‘పేలుడు శబ్దం విన్నా’: లోకోపైలట్‌

Published Thu, Jul 18 2024 7:55 PM | Last Updated on Thu, Jul 18 2024 8:18 PM

Dibrugarh Express loco pilot claims hearing loud sound before derailment

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో దిబ్రూఘఢ్‌ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి నలుగురు చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా, గాయపడిన 17 మందికి ప్రయాణికులకు చికిత్స అందుతోంది. అయితే ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈలోపు లోకోపైలట్‌ (డ్రైవర్‌) మీడియాతో చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.

‘రైలు పట్టాలు తప్పడానికి ముందు భారీ పేలుడు శబ్ధం విన్నా’అని అన్నారాయన. అయితే ఇందులో కుట్ర కోణాన్ని ఇప్పుడే నిర్ధారించలేమని రైల్వే అధికారులు అంటున్నారు. ప్రమాదంపై ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభమైందని అధికారులు చెబుతున్నారు.  

బుధవారం రాత్రి  రైలు నెంబర్‌ 15904 చండీగఢ్ రైల్వే స్టేషన్‌ నుంచి దిబ్రూఘఢ్‌(అసోం)కు బయల్దేరింది. గురువారం మధ్యాహ్న సమయంలో గోండా-మంకాపూర్‌ సెక్షన్‌లో మోతిఘడ్‌ స్టేషన్‌ దాటాక.. పికౌరా వద్ద ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్రగాయాలైన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున రైల్వే మంత్రిత్వ శాఖ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement