యూపీలో రైలు ప్రమాదం.. నలుగురు మృతి | Uttar Pradesh Chandigarh-Dibrugarh Express Train Accident Telugu Details, Videos Inside | Sakshi
Sakshi News home page

Dibrugarh Train Accident: యూపీలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన దిబ్రూఘఢ్‌ ఎక్స్ ప్రెస్

Published Thu, Jul 18 2024 3:49 PM | Last Updated on Thu, Jul 18 2024 6:39 PM

Uttar Pradesh Chandigarh Dibrugarh Express Train Accident Telugu Details

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో రైలు ప్రమాదం సంభవించింది. గోండా జిల్లాలో దిబ్రూఘఢ్‌ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 20 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బ్రజేశ్‌ పాథక్‌ తెలిపారు. 

బుధవారం రాత్రి  రైలు నెంబర్‌ 15904 చండీగఢ్ రైల్వే స్టేషన్‌ నుంచి దిబ్రూఘఢ్‌(అసోం)కు బయల్దేరింది. గురువారం మధ్యాహ్న సమయంలో గోండా-మంకాపూర్‌ సెక్షన్‌లో మోతిఘడ్‌ స్టేషన్‌ దాటాక.. పికౌరా వద్ద ప్రమాదానికి గురైంది. కాసేపట్లో జిలాహి స్టేషన్‌కు రైలు చేరుకోవాల్సి ఉండగా.. రైలు పట్టాలు తప్పింది. ఒక్కసారిగా 12 బోగీలు పక్కకు ఒరిగిపోయాయి.  దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారమందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 15 అంబులెన్స్‌లు, మెడికల్‌ బృందాన్ని సిద్ధంగా ఉంచారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాలుగు ఏసీ బోగీలు బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. బోగీల నుంచి గాయాలపాలైన ప్రయాణికులు కొందరు.. లగేజీతో కొందరు బయటకు వస్తున్న దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. 

మరోవైపు.. ప్రమాదం గురించి తెలియగానే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌.. అధికారుల్ని సహాయక చర్యల్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. మరోవైపు అసోం సీఎం హిమంత బిస్వా శర్మ కూడా ప్రమాదం గురించి ఆరా తీశారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారాయన. 

ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రమాదం కారణంగా ఈ మార్గంలో ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కనీసం 13 రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని రైళ్లను రద్దు చేశారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement