తెలంగాణకు మొండిచేయి
సాక్షి, హన్మకొండ: పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వందల కోట్లతో పుష్కరఘాట్ల నిర్మాణం.. రక్షణ ఏర్పాట్లలో ద్రోణ్‌ల సాయం వంటి చర్యలతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతోంది. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది. అయితే, దక్షిణ మధ్య రైల్వే మాత్రం తెలంగాణ పుష్కరాలను ఏమాత్రం పట్టించుకోలేదు.
కొత్తగా పుష్కరాల కోసం 58 ప్రత్యేక రైళ్లను ప్రకటించగా, తెలంగాణకు ఒక్క ప్రత్యేక రైలునూ ప్రకటించలేదు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బాసర, కరీంనగర్ జిల్లా ధర్మపురి, కాళేశ్వరం, ఖమ్మం జిల్లా భద్రాచలం, పర్ణశాల వంటి పుణ్యక్షేత్రాలతో పాటు మొత్తం 67 చోట్ల పుష్కరఘాట్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ పుష్కరఘాట్లకు భక్తులు రోడ్డు, రైలు మార్గాల ద్వారానే చేరుకోవాల్సి ఉంది.
అయితే, పుష్కరాల కోసం 58 ప్రత్యేక రైళ్లతో పాటు, ప్రస్తుతమున్న 16 రెగ్యులర్ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్వేశాఖ ఆర్భాటంగా ప్రకటించిన 58 రైళ్లలో ఒక్కరైలు కూడా తెలంగాణలో పుష్కరఘాట్లకు వె ళ్లే భక్తులకు ఉపయోగ కరంగా లేవు. దానితో పుష్కర ప్రయాణంలో భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు.
భద్రాచలం, బాసరకు...
తెలుగురాష్ట్రాల్లో గోదావరి నది ఏడు జిల్లాల గుండా ప్రవహిస్తే అందులో ఐదు జిల్లాలు తెలంగాణలోనే ఉన్నాయి. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాల సందర్భంగా అత్యధిక మంది భక్తులు హాజరయ్యే పుణ్యక్షేత్రాలుగా ఏపీలోని రాజమండ్రి, కొవ్వూరు, తెలంగాణలోని భద్రాచలం, బాసర, కాళేశ్వరం, ధర్మపురిలను గుర్తించారు. రాజమండ్రి, కొవ్వూరుల మీదుగా ఇరవైకి పైగా ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు అదేస్థాయిలో భక్తులు వచ్చే భద్రాచలం, బాసర క్షేత్రాలను పూర్తిగా విస్మరించారు.
కంటితుడుపు చర్యగా సికింద్రాబాద్-మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలుకు ఒక స్లీపర్‌క్లాస్, ఒక జనరల్‌బోగీని అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. పుణ్యక్షేత్రాలను మినహాయిస్తే ప్రధాన రైలు మార్గాలు ఉండి గోదావరి ఒడ్డునే ఉన్న నిజామాబాద్, రామగుండం, మంచిర్యాల వంటి నగరాలకు సైతం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడిపించాలనే ప్రతిపాదనలను రైల్వేశాఖ అధికారులు బుట్టదాఖలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణాలో ఉన్న పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైళ్లు నడిపించేలా రైల్వేశాఖపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.