ఇక పొట్టి దుస్తుల నుంచి విముక్తి
లండన్: ఎట్టకేలకు బ్రిటన్ విమానాల్లో పనిచేసే మహిళా సిబ్బంది పైచేయి సాధించింది. బ్రిటన్ ఎయిర్ వేస్ విమానాల్లో పనిచేసే సిబ్బందికి పొట్టి దుస్తులు ధరించడం నుంచి విముక్తి లభించింది. మహిళా, పురుష సిబ్బంది ఇకపై తమ కాళ్లను కప్పి ఉంచేలా దుస్తులు ధరించేందుకు అనుమతి లభించింది. దీంతో కొన్నేళ్లుగా ఈ ఎయిర్ వేస్ సంస్థకు సిబ్బందికి మధ్య జరుగుతున్న ఘర్షణలాంటి చర్చకు చివరకు తెరపడింది.
సాధారణంగా బ్రిటన్ ఎయిర్ వేస్ లో విమాన కేబిన్ సిబ్బంది స్కర్ట్స్ ధరించడం డ్రెస్ కోడ్ గా ఉంది. అయితే, అది తమ మత సాంప్రదాయాలను గౌరవించేలా, కొన్ని వైద్య సంబంధమైన కారణాల దృష్ట్యా తమకు కాళ్లనిండా దుస్తులు వేసుకునేందుకు అనుమతించాలంటూ విమానంలో పనిచేసే సిబ్బంది డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే, అంతకుముందు వారు కావాలనుకుంటే అలా దుస్తులు ధరించే అవకాశం ఉండేది.
కానీ, 2010లో కొత్త నిబంధనలు వచ్చి సిబ్బందికి అలా వస్త్రాలంకరణ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కాగా, ఇటీవల వారిడిమాండ్ ను పరిగణించిన విమాన సంస్థ అందుకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి బ్రిటీష్ ఎయిర్ వేస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ'సాధారణంగా మా విమానాల్లో పనిచేసే సిబ్బంది అంబాసిడర్ బ్రిటిష్ ఎయిర్ వేస్ యూనిఫాం ధరిస్తారు. పైజామాలకు అనుమతి ఉండదు. అయితే, ఇక నుంచి వారికి ఆ సౌకర్యం ఉంటుంది' అని చెప్పారు.