
పవర్ డ్రెస్సింగ్ అనేది ఫ్యాషన్ ఎంపికలను అధిగమిస్తుంది. ఇది స్వీయ అవగాహన, వృత్తిపరంగా తమను తాము చూపాలనుకునే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. సరైన దుస్తులు మానసిక కవచంగా పనిచేస్తాయి. మహిళలు కార్పొరేట్ రంగంలోకి ప్రవేశించడం, వృత్తినైపుణ్యాలను ప్రదర్శించడం, గౌరవాన్ని పొందడం లక్ష్యంగా పవర్ డ్రెస్సింగ్ ఉద్భవించింది.
1920లలో జాకెట్, స్కర్ట్‌తో మహిళల పవర్ డ్రెస్సింగ్ వెలుగులోకి వచ్చింది. ఇది మహిళల దుస్తులు ధరించే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. సౌకర్యం విషయంలో రాజీపడకుండా ఆధునికంగా కనిపించడానికి వీలు కల్పించింది. పనిలో లింగసమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. ‘విజయం కోసం డ్రెస్సింగ్’ అనడానికి నిదర్శనంగా ఇంటర్నేషనల్ ఉమెన్ డ్రెస్సింగ్ బ్రాండ్ ‘క్వా’ ఒక ఆన్‌లైన్ పోల్ నిర్వహించింది. ఇందులో 100 మంది మహిళల్లో 99 మంది పవర్ డ్రెస్సింగ్ వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు.
వృత్తికి తగిన డ్రెస్సింగ్
ఉపాధ్యాయులు, వైద్యులు, రాజకీయ నాయకులు, ఐఎఎస్ అధికారులు, ఆర్కిటెక్ట్‌లు, కార్పొరేట్ లీడర్లు, వ్యాపార మహిళలు, ఆర్థిక నిపుణులు వంటి విభిన్న స్థాయిలలో పనిచేసే మహిళలకు పనిజీవితంలో సౌకర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చే వర్క్‌వేర్ అవసరం. ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ శక్తిని వెలికితీసేందుకు ప్యాంటుతో పాటు డిజైనర్ బ్లేజర్‌ను ధరిస్తారు. ఒక రాజకీయ వ్యక్తి పరిపూర్ణతకు అనుగుణంగా చీర లేదా కుర్తాను ధరించవచ్చు. టీచర్ లేదా డాక్టర్ తమ వృత్తినైపుణ్యానికి రాజీ పడకుండా తమ పనిని నిర్వహించడానికి సౌకర్యవంతమైన కుర్తా లేదా ఇండో–వెస్ట్రన్‌ను ఎంచుకోవచ్చు. విధి నిర్వహణలోని మహిళలు భారతీయ ప్రింట్‌లను ఆధునిక కట్‌లతో కలిపే దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు. ఈ కాంబినేషన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది.
పవర్ డ్రెస్సింగ్‌కి ప్రేరణ కోసం...
→ వృత్తికి అనుగుణమైన దుస్తులు ధరించాలి. అప్పుడు పనితీరులో కూడా మెరుగుదల ఉంటుంది
→ పర్యావరణ స్పృహతో కూడిన ఫ్యాషన్‌ని అనుసరించడం మేలు. కాలర్ బ్లౌజ్‌లు, ఫంక్షనల్ పాకెట్స్, తక్కువ జ్యువెలరీ... వీటిలో ప్రధానమైనవి
→ డ్రెస్ నాణ్యత, ఫిటింగ్ మీరు హుందాగా, శక్తిమంతంగా ఉన్నారని తెలియజేస్తుంది
→ ఎవరికి వారు ఓన్ స్టైల్‌ను అభివృద్ధి చేసుకోవాలి. తమ డ్రెస్సింగ్ ద్వారా తమని తాము వ్యక్తీకరించుకోవడమూ అవసరమే. రంగులతో ప్రయోగాలు, ఫిట్‌గా ఉండే దుస్తుల ద్వారా మీరేమిటనేది చాటవచ్చు
→ ప్యాంట్ సూట్స్, కో–ఆర్డ్ సెట్స్, మిడీస్, జాకెట్స్.. ఇలా ఏ డ్రెస్ ఎంపిక అయినా ఇస్త్రీ చేసిన దుస్తులను ధరించండి. లేత రంగులు, తక్కువ ఆభరణాలతో సింపుల్‌గా ఉండేలా చూసుకోండి.
సందర్భానికి తగిన ఎంపికలు
భారతీయ వనిత హుందాతనానికి, మనదైన సంస్కృతికి, చక్కదనానికీ బహుముఖాల డ్రెస్సింగ్ శైలులను ఎంచుకుంటోంది. సందర్భానికి తగిన ఎంపిక ఇప్పుడు సాధారణంగా ఉంటోంది..
డ్రేపింగ్ శైలులతో ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తూ మహిళను పవర్ ఫుల్‌గా చూపుతోంది చీర. మన దేశీయ చేనేతలైన కంచి, బనారసి, చందేరీ, పోచంపల్లి, నారాయణపేట్, ధర్మవరం, ... ఇలా మనదేశంలో ఒక్కో ప్రాంత ప్రత్యేకతను, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి ఘనంగా చూపుతున్నాయి. ఈ చేనేతల కట్టుతో మన మహిళలు తమ హుందాతనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు.
సల్వార్ కమీజ్
భారతీయ మహిళల ఫార్మల్ దుస్తులలో మరొక ప్రధానమైనది సల్వార్ కమీజ్. సౌకర్యం, శైలి రెండింటినీ ఈ డ్రెస్ అందిస్తుంది. అధికారిక కార్యక్రమాలు, పార్టీలకు అనుకూలంగా ఉంటుంది. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ అలంకరణతో వెలిగే అనార్కలీ సూట్లు గొప్పగా వెలుగుతుంటే, మరోవైపు స్ట్రెయిట్‌కట్ సూట్స్ ్ర΄÷ఫెషనల్ లుక్‌ని అందిస్తున్నాయి. ఆఫీస్‌వేర్‌గానూ, సంప్రదాయం, అధునిక మినిమలిజం మధ్య సమతుల్యతను అందిస్తున్నాయి.
ఇండో– వెస్ట్రన్ ఫ్యూజన్
భారతీయ దుస్తులలో అంశాలను పాశ్చాత్య సిల్హౌట్‌లతో మిళితం చేయడం దీని ప్రత్యేకత. ఆధునిక అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకమైన, స్టైలిష్ దుస్తులను సృష్టిస్తాయి. కుర్తా, పలాజో సెట్ అందుకు ఒక ఉదాహరణ. సాంస్కృతిక కార్యక్రమాలకు ఉల్లాసభరితంగానూ, అనువైనదిగానూ నిలిచింది ధోతీ ప్యాంట్‌ను కుర్తాతో జత చేయడం.
వెస్ట్రన్ గౌన్లు
పాశ్చాత్య శైలి దుస్తులలో ప్రధానంగా చెప్పుకునేవి గౌన్లు. అధికారిక కార్యక్రమాలలో గణనీయమైన ప్రజాదరణ పొందాయి. ఎ–లైన్ గౌన్లు, ఫ్యూజన్ టచ్ కోసం భారతీయ మోటిఫ్స్, ఎంబ్రాయిడరీతో ఇవి పార్టీలు, అధికారక విందులు, సమావేశాలలో ఈవెనింగ్ గౌన్లు అద్భుతమైన ఎంపికను అందిస్తున్నాయి. సిల్క్, శాటిన్ లేదా వెల్వెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన గౌన్లపై బీడ్‌వర్క్, స్వీక్వెన్లు కలిగి మహిళ చక్కదనానికి, ఆధునికతకు అద్దం పడుతూ రిచ్ లుక్‌ను ఇస్తున్నాయి.
ఫార్మల్ వేర్
మన దేశం ఉష్ణమండలం అవడం వల్ల సౌకర్యం కోసం ఖాదీ, కోటా డోరియా వంటి కాటన్స్‌ను ఎంచుకుంటున్నారు. వీటిమీద ఎంబ్రాయిడరీలు, టై అండ్ డైలు, పెయింటింగ్‌లా ఉన్నవాటితో తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు.
ఇతర అలంకారాలకూ...
మ్యాచింగ్, ఎంబ్రాయిడరీ, సందర్భానికి తగిన విధంగా దుస్తుల ఎంపిక ఎలా ఉంటుందో, అలాగే ఫుట్‌వేర్ ఎంపిక కూడా ముఖ్యమైన జాబితాలో ఉంది. బంగారు, వజ్రాలు, కుందన్, పోల్కీ.. ఆభరణాలు సంప్రదాయ దుస్తులకు, ఆక్సిడైజ్డ్ ఆధునిక దుస్తులకు ఎంపికగా మారాయి. ఇండో–వెస్ట్రన్ శైలులు ఆభరణాల జాబితాలోనూ ప్రథమంగా ఉంటోంది.
రీసైక్లింగ్
బెస్ట్ ఛాయిస్‌టెక్స్‌టైల్ ఇండస్ట్రీలో సస్టెయినబుల్, ఇండియన్ ఆర్ట్, ఇండియన్ టెక్స్‌టైల్, కెమికల్ ఫ్రీగా ఉండే హ్యాండ్లూమ్స్‌ని మహిళలు ఇష్టపడుతున్నారు. పవర్‌లూమ్స్, సింథటిక్స్‌ని దూరం పెడుతున్నారు. అంతర్జాతీయంగానూ ఎక్స్‌పరిమెంటల్ ప్యాషన్‌లోనూ రీ సైక్లింగ్ మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. పాత కాలం నాటి బామ్మల పట్టుచీరలను కూడా తిరిగి ఉపయోగిస్తున్నారు. కట్ సిల్టౌట్స్, ఎంబ్రాయిడరీలో థ్రెడ్ వర్క్.. వంటి పాత కాలం స్టైల్స్ ఎంచుకుంటున్నారు. ఉదాహరణకు.. పాత బనారసి, పాత కంచి శారీస్‌ను తీసుకొని ప్యాచ్‌వర్క్‌తో మరో కొత్త డిజైనర్ శారీని తయారుచేస్తున్నారు. ఇండో–వెస్ట్రన్స్ విషయంలో చూస్తే రీ సైక్లింగ్‌కి బాగా డిమాండ్ ఉంది. ఉన్న వాటినే రీ క్రియేట్ చేస్తున్నారు.
అమ్మమ్మ, అమ్మల చీరలను ఇన్నోవేషన్‌గా రీ సైక్లింగ్ చేయించుకొని తమ పెళ్లిళ్లకు ధరిస్తున్నారు. ఒక డ్రెస్‌ను పది మోడల్ డ్రెస్సులుగా ధరిస్తున్నారు. ప్రకృతి పట్ల బాధ్యతగా ఉండేది మహిళలే కాబట్టి. ఈ అవగాహన మహిళల నుండి వచ్చిందే. నార్త్ ఇండియన్స్ కూడా పాత చీరలు, వస్త్రాలతో ప్యాచ్‌వర్క్ చేసి బ్యాగ్స్, ఫుట్‌వేర్, క్విల్ట్‌లను సృష్టిస్తున్నారు. ఇది ఇంకా విస్తృతం అవుతుంది. మా దగ్గర పాతికమంది మహిళలు మేం ఉపయోగించగా మిగిలిన వేస్ట్ ఫ్యాబ్రిక్స్‌తో టాజిల్స్, రిబ్బన్స్, పౌచ్‌లు, జ్యువెలరీ, బ్యాంగిల్స్ తయారు చేసి అమ్ముతున్నారు. ఇవి ఇండోవెస్ట్రన్ ఔట్‌ఫిట్స్‌కు స్టైలిష్ లుక్‌నిస్తాయి. యువతరం, మహిళల ఆలోచనలకు తగినట్టుగా కెమికల్ ఫ్రీగా ఫ్యాషన్ ఇండస్ట్రీ తయారు కావడం ముదావహం.
‘పవర్ డ్రెస్’నుచూపినవారిలో...∙
భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫొటోజర్నలిస్ట్ హోమై వ్యారవల్లా. బ్రిటిష్ కాలం నుండి కొత్తగా స్వతంత్రదేశంగా మారడాన్ని డాక్యుమెంట్ చేయడంలో ప్రసిద్ధి చెందారు. గుజరాత్ రాష్ట్రంలో పుట్టిన ఆమె పార్సీ సమాజానికి చెందింది. తన వృత్తికి తగినట్టుగా హై రౌండ్ నెక్ బ్లౌజ్, లేతరంగు కాటన్ చీరలను ధరించేవారు. గౌన్లు, పలాజో ప్యాంట్లు ధరించి ఆమె తనదైన స్టైల్ స్టేట్‌మెంట్‌ను సృష్టించారు
→ నేతలలో తలమానికమైన ఇందిరాగాంధీ నేత చీరల కట్టు ఇప్పటికీ ఆమె ఆహార్యాన్ని కళ్లకు కడుతుంది. పాలిటిక్స్‌లో తన చీరకట్టు, హెయిర్ స్టైల్‌తో పవర్‌ఫుల్ ఐకాన్‌గా నిలిచారు. ఒక నిర్దిష్ట సందేశాన్ని ఇవ్వడానికి డ్రెస్సింగ్‌ని ఒక శక్తిమంతమైన మాధ్యమంగా ఉపయోగించారు. ఆమె చూపిన మార్గంలో చాలామంది మహిళా రాజకీయ వేత్తలు నేత చీరలను ధరించడం చూస్తున్నాం
→ సినీతారలు సందడి చేసే ఈవెంట్లను చూస్తే తమదైన స్టైలింగ్ డ్రెస్సులతో ఆకట్టుకునే తారలు ఎందరో. వారిలో ఎవర్‌గ్రీన్‌గా నిలిచే బాలీవుడ్ నటి రేఖతోపాటు దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, కరీనా, సోనమ్ .. వంటి తారలు ఏ ఈవెంట్‌లోనైనా తమ స్టైల్‌స్టేట్‌మెంట్‌ను చూపుతుంటారు. ఇటీవల నీతాఅంబానీప్రాచీన కళకు, రిచ్‌లుక్‌కి ఐకాన్‌గా మారడం గమనిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment