బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : పిల్లాడు ఏడ్చాడని ఓ ఇండియన్ ఫ్యామిలీని విమానం నుంచి బలవంతంగా దించేశారు. ఈ దారుణమైన సంఘటన బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ లండన్-బెర్లిన్ విమానం(బీఏ 8495)లో జూలై 23న చోటు చేసుకుంది. ఈ విషయంపై ఈ పిల్లాడి తండ్రి ఏవియేషన్ మంత్రిత్వ శాఖ సురేష్ ప్రభుకు లేఖ రాశాడు. బ్రిటీష్ విమానయాన సంస్థ తమతో వ్యవహరించిన అవమానకరమైన చర్యపై మంత్రికి వివరించాడు. విమానం టేకాఫ్ అవుతుండగా తమ పిల్లాడు బెదిరిపోయి ఏడ్వడం ప్రారంభించాడు. దీంతో తల్లి అతడ్ని ఒళ్లోకి తీసుకుంది. ఇంతలో అక్కడకు చేరుకున్న క్రూ సిబ్బంది ఒకరు.. తమపై గట్టిగా అరవడం ప్రారంభించాడు. చిన్నారిని తన సీట్లోకి వెళ్లాలని గద్దించాడు. దీంతో పసిపిల్లాడు మరింత బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టాడు.
ఆ దంపతుల పక్కన సీట్లలో కూర్చున్న ఇతర భారతీయ కుటుంబాలు, పిల్లాడి ఏడుపు ఆపడానికి శతవిథాలా ప్రయత్నించారని, బిస్కెట్లు ఇస్తూ ఏడుపు ఆపేలా ప్రయత్నించారు. అయితే మళ్లీ వచ్చిన ఆ క్యాబిన్ సిబ్బంది.. యూ బ్లడీ.. ఏడుపు ఆపుతావా? లేదా? అంటూ మండిపడ్డాడు. లేకపోతే విండోలో నుంచి బయటకు పడేస్తా అంటూ హెచ్చరించాడు. దీంతో తమ చిన్నారి మరింత దడుచుకున్నాడని మంత్రికి రాసిన లేఖలో ఆ ప్రయాణికుడు పేర్కొన్నాడు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే ఆ కేబిన్ సిబ్బంది భారతీయులపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని, బ్లడీ ఇండియన్స్ అంటూ వ్యాఖ్యానించాడని లేఖలో తెలిపాడు. విమానాన్ని టెర్మినల్‌కు తీసుకెళ్లి, తమల్ని బలవంతంగా కిందకి దించేశారని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణలోకి తీసుకుని విచారించాలని ప్రయాణికుడు కోరాడు. ప్రయాణికుడు చేసిన ఈ ఫిర్యాదును, తాము చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని, ఇలాంటి వివక్షపూరిత విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదంటూ బ్రిటీష్ ఎయిర్‌వేస్ అధికార ప్రతినిధి చెప్పారు. కస్టమర్‌తో ప్రత్యక్షంగా సంప్రదించి, దీనిపై పూర్తి విచారణ ప్రారంభిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment