
సాక్షి, హైదరాబాద్: ఏ అంతర్జాతీయ విమానం ఎక్కినా ఎయిర్‌హోస్టెస్ ఆంగ్లంలో ‘వెల్‌కం’ అని పలకరిస్తూ ఆహ్వానిస్తుంది. కానీ చక్కటి తెలుగులో ‘స్వాగతం.. రండి కూర్చోండి. ప్రయాణ సమయం లో మీకు ఎలాంటి సహాయం కావలసినా మమ్మల్ని సంప్రదించండి’...అంటూ ఆత్మీయంగా పలకరిస్తే ఎలా ఉంటుంది. విమానాల్లో తెలుగుదనం ఉట్టిపడితే ఎంత బావుంటుందో కదా. అలాంటి అద్భుతమైన తెలుగు క్యాబిన్ క్రూ సేవలను అందుబాటులోకి తెచ్చింది బ్రిటిష్ ఎయిర్‌వేస్.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇకనుంచి తెలుగులో మాట్లాడే క్యాబిన్ క్రూ అందుబాటులో ఉంటారు. ప్రయాణికులు తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ మాట్లాడవచ్చు. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిచ్చేందుకు గతంలోనే ప్రతిపాదనలను సిద్ధంచేసిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ తాజాగా హైదరాబాద్ ప్రయాణికులకు తెలుగు క్యాబిన్ క్రూను పరిచయం చేసింది.
ఇందుకోసం 25 మంది సిబ్బందికి 6 వారాలు శిక్షణనిచ్చి వారి సేవలను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే బీఏ 276, బీఏ 277 విమానాలలో ప్రయాణికులు ఇక నుంచి మాతృభాషలో పలకరింపులను ఆస్వాదించవచ్చు. 95 ఏళ్లు గా బ్రిటిష్ ఎయిర్‌వేస్ దేశంలోని వివిధ నగరాల నుంచి విమానాలను నడుపుతోంది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైల నుంచి ప్రస్తుతం 28 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment